నిత్య చైతన్య సాహిత్య వారధి

 

  • 19 Views
  • 0Likes
  • Like
  • Article Share

ప్రసిద్ధ కథా రచయిత కొడవటిగంటి కుమార్తె.. అనువాద రంగంలో తనదైన ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఆర్‌.శాంతసుందరి 1947లో మద్రాసులో జన్మించారు. తల్లి వరూధినికి ప్రముఖ రచయిత చలం స్వయాన పెదనాన్న. సాహితీ కుటుంబంలో మసలడం వల్ల చిన్నతనంలోనే చదవడం, రాయడం అనేవి ఆవిడకు నిత్యవ్యాపకాలయ్యాయి. అడయార్‌లో థియోసోఫికల్‌ సొసైటీ నడిపే బాలభారతిలోనూ, రామకృష్ణ మిషన్‌ వారి శారదా విద్యాలయంలోనూ ప్రాథమిక విద్య పూర్తిచేశారు. తండ్రి సూచనతో ఎమ్మేలో హిందీ భాషను ప్రత్యేకంగా అధ్యయనం చేశారు. హిందీ మాతృభాషీయులు కాని వారి కోసం మద్రాసు విశ్వవిద్యాలయం నిర్వహించిన పరీక్షలో ప్రథమ బహుమతి పొంది, తండ్రితో కలిసి ఉత్తరభారత యాత్ర చేశారు. దినకర్, జినేంద్రకుమార్, హరివంశరాయ్‌ బచ్చన్‌ లాంటి ప్రముఖ హిందీ కవులను కలుసుకున్నారు. హరివంశ రాయ్‌ బచ్చన్‌ రచనల స్ఫూర్తితో మేలైన హిందీ కవితలను అనువదించడం ప్రారంభించారు. భర్త గణేశ్వరరావు ప్రోత్సాహంతో ఆంగ్ల భాషలో కూడా సాధికారత సాధించారు.
      శివారెడ్డి, పాపినేని శివశంకర్, ఎన్‌.గోపి లాంటి అనుభవజ్ఞులైన తెలుగు కవుల రచనలను హిందీ పాఠకులకు పరిచయం చేశారు శాంతసుందరి. తమిళ కవి వైరముత్తు కవితలను తెలుగులోకి తెచ్చారు. ‘హౌ టు విన్‌ ఫ్రెండ్స్‌ అండ్‌ ఇన్‌ఫ్లుయెన్స్‌ పీపుల్‌’ లాంటి డేల్‌ కార్నెగీ వ్యక్తిత్వ వికాస రచనలతో పాటూ చేతన్‌ భగత్‌ పుస్తకాలనూ తెలుగు చేశారు. తమిళ యువ రచయిత ఆనంద నీలకంఠన్‌ ‘అసురుడు, అజేయుడు’ లాంటి విశేష పాఠకాదరణ పొందిన రచనలతో సమంగా యువల్‌ నోవా హరారీ ‘సేపియన్స్‌’ను తెలుగు పాఠకులకు అందించడంలో విస్తృతంగా శ్రమించారు. హిందీ రచయిత ప్రేమ్‌చంద్‌ సతీమణి శివరాణీదేవి రాసిన ‘ప్రేమ్‌చంద్‌ ఘర్‌ మే’ను ‘ఇంట్లో ప్రేమ్‌చంద్‌’గా తెలుగులోకి అనువదించి 2014లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. ‘కాలాన్ని నిద్రపోనివ్వను, కథా భారతి, కథకాని కథ’ లాంటి రచనలతో పాటూ ‘రెక్కల ఏనుగులు’ అనే బాలల కథలని హిందీ నుంచి తెలుగులోకి తెచ్చారు. ఎన్‌. గోపి ‘వృద్ధోపనిషత్‌’ హిందీలోకి ఈవిడ చివరి అనువాదం.
నుడికారం తెలియాలి
సార్వజనీనత, విలక్షణ శిల్ప సౌందర్యం, సామాజిక ప్రయోజనం కలిగిన పుస్తకాలనే అనువాదానికి ఎంచుకుంటానని చెప్పిన శాంతకుమారి దాదాపు డెబ్బై అయిదు పైగా అనువాదాలు చేశారు. అనువాదమంటే మాటకి మాట పదకోశం చూసి రాయడం కాదనీ, భావం, లయ, ఉద్వేగం, భాషా సౌందర్యం అనే విషయాలని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మూల రచనలోని నుడికారాన్ని పట్టుకోగలిగినప్పుడే మంచి అనువాద రచన రూపుదిద్దుకుంటుదని భావించిన ఆవిడ కబీర్‌ దోహాలను తెలుగులోకి తేవాలనుకున్నారు, శ్రీశ్రీ కవితలను హిందీలోకి తీసుకెళ్దామనుకున్నారు. కానీ, అవి కార్యరూపం దాల్చలేదు.   
      శాంతసుందరిని 2005లో దిల్లీలోని భారతీయ అనువాద్‌ పరిషత్‌ ‘డా।। గార్గీ గుప్త ద్వివాగీష్‌’ పురస్కారంతో సత్కరించింది. సలీం ‘కాలుతున్న పూలతోట’ హిందీ అనువాదానికి జాతీయ మానవ హక్కుల సంఘం ప్రథమ బహుమతిని అందుకున్నారు. 2011లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ అనువాద పురస్కారంతో శాంతసుందరిని గౌరవించింది. తెలుగు సాహిత్యం ఇతర భాషల్లోకి వెళ్లడం లేదనీ, అనువాద ప్రక్రియ ద్వారా తాను సాధ్యమైనంత వరకూ కృషి చేస్తున్నానని చెప్పిన ఈ అక్షర తపస్వి నవంబరు 11న హైదరాబాదులో కీర్తిశేషులయ్యారు.  

 


వెనక్కి ...

మీ అభిప్రాయం