ఓ రేలా రేరేలా రేలా

  • 42 Views
  • 0Likes
  • Like
  • Article Share

    ఆచార్య ననుమాస స్వామి

  • తెలుగు శాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయం
  • హైదరాబాదు
  • 7013763438
ఆచార్య ననుమాస స్వామి

ఆదివాసీలు ఈ దేశ మూలవాసులు. సమష్టి జీవనానికి, స్వచ్ఛతకు, స్వేచ్చకు నిలువెత్తు ప్రతిరూపాలు. కోయల జీవన విధానంలో ఎంత వైవిధ్యముంటుందో అంతకుమించిన వైదుష్యం వీరి కళా సృజనలో కనిపిస్తుంది. ప్రపంచీకరణ పెనుపోకడల ధాటిలో మరుగున పడిపోతున్న వీరి పటం, పగిడె కథల పరిచయమిది..  
కోయల సంస్కృతి విలక్షణమైనదే కాదు కళాత్మక జీవితానికి అది ప్రాణదీపం లాంటిది. వారి కళా సొబగు అంతా వారి సామూహిక జీవనంతోనే ముడిపడి ఉంటుంది. తమ సంస్కృతిని ద్విగుణీకృతం చేసుకునేందుకు ఆదిమవాసులు ఏర్పరచుకున్న సాంప్రదాయక సంగీత ప్రతిధ్వనినే ‘మూలధ్వని’గా అభివర్ణిస్తున్నారు. ప్రాచీన సంగీత వైభవాన్నీ, ఘనచరితను ఈ మూలధ్వని ప్రదర్శనల ద్వారా నేటి తరానికి పరిచయంచేసే ప్రయత్నం ఇటీవల మొదలైంది. డోలు, గండ్జ (డోలికొయ్య) తూటుకొమ్ము, డింకీ, అక్కుం, గుజ్జిడి మొగ్గ, గుల్లకట్ట, అందెలు లాంటి సంగీత పరికరాలతోనే కోయల జీవన సంస్కృతి పెనవేసుకుని ఉంది. పగిడె కథ, చిత్రపటం కథ అనేవి వీరి అపూర్వ కళా వైభవాలకు చిహ్నాలు.      
పగిడె కథ
కోయల చిత్రలేఖన అభిరుచి ‘పగిడె’లో మహోన్నతంగా కనిపిస్తుంది. నాలుగు గజాల పొడుగు, ఒకవైపు గజం వెడల్పు, మరోవైపు గజానికి తక్కువగా అంటే దీర్ఘ త్రికోణాకృతిలో సాధారణ జెండా ఆకారంలో ఉంటుందిది. కోయ జాతి పుట్టుక, గోత్రాలు, మూల పురుషుని చరిత్రను తెలిపేందుకు ఎత్తిన పతాకమిది. వివిధ ఆకారాలుగా చిత్రితమైన బొమ్మల్లో శక్తి దేవతలు, భౌగోళిక రూపాలతో పాటు, ప్రకృతి దృశ్యాలు ఉంటాయి. ఇవికాక కోయల ఉనికిని కాపాడుకోవడానికి జరిపిన యుద్ధాలు, దేవతలు, అద్భుత మహిమలు కూడా చిత్రితమవుతాయి. ఈ చిత్రపటాన్ని కోయలు ‘డాలుగుడ్డ’ లేదా ‘వేల్పుగుడ్డ’ అని పిలుస్తారు. కథా గానం చేసేవారికి చరిత్రపట్ల లోతైన అవగాహన ఉంటేనే ఈ పగిడె కథ రక్తికడుతుంది.     

      డోలి ‘పగిడె’ పటం ఆధారంగా రాచకోయ ఏడోగట్టు కోయల్లో గట్టు మూల పురుషుల చరిత్రను చెబుతారు. ఆశ్రితులైన కోయ డోలి కళాకారులు చెప్పే ఈ చిత్రపటం కథలో పురాణాల్లోని కోయజాతి ఆవిర్భావాన్ని అభివర్ణిస్తారు. డోలీ కళాకారులు మొదట కథా ప్రదేశానికి ఊరేగింపుగా ‘పగిడె’లను మోసుకుపోతారు. కోయ దేవతలని సంతృప్తి పరిచేందుకు తంతు నిర్వహిస్తారు. అలా చేస్తే డోలి కళాకారులపై కోయవీరులు ఆవహిస్తారని వీరి విశ్వాసం. ఈ తంతు తర్వాత పగిడె పటం కథా గానం మొదలవుతుంది. నిజానికి వీరు కాకతీయుల పూర్వీకులనీ, బస్తర్‌ ప్రాంతం నుంచి ఓరుగల్లుకు వచ్చి రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారనే గాథలున్నాయి. కాకతీయులు కోయతూర్‌ ఆదివాసీ తెగకు చెందినవారనీ అంటారు.
కోయ దేవత గాథ
డోలి కళాకారులు కోయ జాతి త్యాగనిధులతో కథా గానం మొదలుపెడతారు. ‘ఓ రేలా రేరేలా రేలా రేలా రేరేలా రేలా మహా చక్కని వారులే’ అంటూ.. కథకుడు కథ ఎత్తుకుంటాడు. ‘కన్నుమూస్తే యుగములే, కన్ను తెరిస్తే యుగములే’ అని పాడుతూ పురాతన కాల సూచనగా ఒక పాత్రను ప్రవేశపెడతారు. ‘అయ్యాలే, అమ్మాలే, రేలా రేరేలా రేలా’ కోయ రాగంలో సాగే ఈ కథంతా మానవతాతీత శక్తుల ప్రమేయంతో సాగిపోతుంది. కోయ వీర వనిత సమ్మక్క త్యాగాన్ని కీర్తిస్తూ గానం చేయడం ఆనవాయితీ. చందా వంశంలో సమ్మక్క ఎక్కడ పుట్టింది? పురాణ స్త్రీ ఎలా అయింది? అని, ప్రశ్నిస్తూ తానే సమాధానాలు చెబుతూ పాడతాడు కథకుడు. డోలి కథాగానం చేసేప్పుడు వారి శరీరమంతా లయాత్మకంగా కదులుతుంటుంది.
ఓ రేలా రేరేలా రేలా రేలా రేరేలాలయ్యో రేరేలా/ అది ఒక రోజు వేళన ఒక రోజు వేళన    ।।అయ్యాలే।।/ ఏమి తీరుగున్నదో    ।।అయ్యాలే।।/ తూరుపు దేశం సూడులే/ మా చక్కని రాజులే    ।।అయ్యాలే।।/ అది రాయబండని రాజులే,/ రాయబండని రాజులే    ।।అయ్యాలే।।/ ఆది కులంలో పుట్టినటువంటి ఏ శక్తి అది?/ ఆనాటి రోజులో దాని పేరేమిటి? / అది మహాంకాళీ శక్తులే/ సమ్మక్క ఎలా వచ్చింది?/ ఆది పర్వంలోకి ఎలా సొచ్చింది?  ఆఁ ఆఁ ఆఁ ..../ ఇదిగదా నాయనా సాంబశివ మహారాజు/  తండ్రి తూరుపు దేశాన/ వాయుబండ పట్టణంలో పుట్టాడు గదా!/  నాయనా. రాయబండ రాజుగదా నాయనా/  ఆ రాయబండ రాజు సంతానం నాయనా!/ వారి గర్భాన కలిగిరా/ అది పెద్దదైన సమ్మక్క        
      ఇలా.. సమ్మక్క పుట్టడం, పెళ్లి చేసుకోవడం, అమరురాలవ్వడం అనే వివిధ ఘట్టాలతో కథను గానం చేస్తారు.    
చిత్ర పటం కథ
కోయజాతి మూల పురుషుని చరిత్రను పారాయణం చేయడానికి ఎంచుకున్న ప్రచార మాధ్యమం పటంకథ. మూడున్నర అడుగుల వెడల్పు, 36 అడుగుల పొడవున్న గుడ్డమీద మొత్తం కథాంశాన్ని బొమ్మలతో చిత్రిస్తారు. కథకుడు ఆ బొమ్మలను చూపిస్తూ కథ గానం చేస్తాడు. డోలు, తాళాల సాయంతో తక్కిన కళాకారులు వంత పాడతారు. ఈ కళారూపం సంగీత సాహిత్య, నృత్య సమ్మిళితంగా సాగుతుంది.    
      కోయ కళాప్రదర్శన కోసం ఆవిర్భవించిన డోలి, పట్టెడ, వేల్పుల, నాగస్తంభ (ఎరిటోళ్ల) లాంటి ఆశ్రిత జాతులు కోయజాతి పురాణకథనే కాకుండా విభిన్న సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు. కోయ పురాణం పటం కథాగానంలో ‘రేలా రేలా రేరేలా రేలా’ గిరిజన గీతం పల్లవిలా ధ్వనిస్తుంది. దానితో మొదలయ్యే కథా గానమంతా కోయ, తెలుగు భాషా మిశ్రమంగా సాగిపోతుంది.
ఒరే రేనా రేరేనా రేరేరేనా రేరేనా/ ఆకాశాన తండ్రిలే భూదేవి తల్లిలే యమ్మాలే/ కింది భూదేవి ఇల్లెలే పైన ఆకాశం ఇల్లెలే/ యమ్మాలే/ భూ దేవి గర్భాతే యమ్మాలే అడ్డు భూలోకం గలరో యమ్మాలే అంటూ కథకుడు జీవరాశి ఆవిర్భావాన్ని వివరిస్తుంటాడు. పొన్నకర్ర సాయంతో పటం మీది బొమ్మలు చూపిస్తూ గానం చేస్తుంటే, వంతలు సహకరిస్తుంటారు.
      ఆది శక్తి ఇల్లెలే యమ్మాలే ఏడు ఏడూ సంద్రం ఇల్లెలే యమ్మాలే/ బారా కోడి ఊడారో/ యమ్మాలే అడ్డు ఒక గుడ్డు వాటా యమ్మాలే/ రెండో గుడ్డు వాటా యమ్మాలే మూడో గుడ్డు వాటా యమ్మాలే అంటూ తమ జాతి ఆవిర్భావాన్ని గురించి పాడుతూ శ్రోతలను మంత్రముగ్దులను చేస్తారు.
అద్దు ఒర్రం గుడ్డు ఓతారో యమ్మాలే/ కింద పెంకు, పైన ఆకాశం అయ్యాలే అద్దు ఒర్రం పెంకితే కలరో/ సూర్య చంద్ర రాజులు యావాలె అద్దు/ రెండో పెంకితే కలరో నీల, పాల సంద్రం యావాలే/ మూడో పెంకి ఆదారో బ్రహ్మ, విష్ణు, ఈశ్వర అందరూ అయ్యారో/ నూట ముప్పై మునులూ యమ్మాలే అద్దు భూలోకంలో గలరో యమ్మాలే/ కార్తీక రాజు అందురో కళింగ రాజు/ యాదవ రాజు అయ్యాలే ఒరే రేనా రేరేనా రేరేరేనా రేరేనా  అంటూ... ఈ కథాగానంలో చెట్టుచేమ, గొడ్డుగోదా, దోమ వంటి జీవరాశి పుట్టుకను ఏకరువు పెడుతుంటాడు కథకుడు.  
      చీమ దోమ ఇల్లెలే యమ్మాలే గొడ్డు గొంద ఇల్లెలే యమ్మాలే/ ఆదిన రోగం ఇల్లెలే నరుడు నంది ఇల్లెలే యమ్మాలే అంటూ సాగే ఈ పాటల్లో తెలుగు పదాలు తారసపడుతుంటాయి. కోయ గూడేలు మైదాన ప్రాంతాలకు ఆనుకుని ఉండటం, శ్రమజీవులతో కోయలకు సాంస్కృతిక సంబంధాలుండటంతో వారి భాషలో తెలుగు పదాలు కలిసిపోయాయి.
అందరి బాధ్యత
ఆదివాసీ సంగీత, సాహిత్య, నృత్య, కళా రూపాలమీద విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరుగుతున్నా ఫలితాలు మాత్రం ఆశాజనకంగా లేవు. దీనికి ప్రధాన కారణం ఆదివాసీల భాష నేర్చుకోవడం పట్ల తెలుగు పరిశోధకులు శ్రద్ధచూపకపోవడమే. ఆయా ప్రాంతాలలో పనిచేసే ఉపాధ్యాయులు ఈ దిశగా దృష్టిసారిస్తే సత్ఫలితాలు వస్తాయి. విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న ఆదివాసీ విద్యార్థులు వారి సాంస్కృతిక కళా సంపదను సంరక్షించుకోవడానికి ముందడుగేయాలి. సాంఘిక, ఆర్ధిక, రాజకీయ అంశాలతో పాటు సంగీత సాహిత్యాల అధ్యయనం మీదా దృష్టిపెడితే సారస్వత సంపద దక్కుతుంది. రాజేశ్వరరావు, భక్తవత్సలరెడ్డి, ననుమాస స్వామి, గూడూరు మనోజ, వేణుగోపాలరెడ్డి, ఆత్రం కిరణ్‌ తదితర పరిశోధకులు ఆదివాసీల సాహిత్య, సంస్కృతుల మీద పరిశోధనలు చేశారు. కోయ పటం కథ, డోలి, ఎరిటోళ్ల కథా గానాలు, వేల్పుల వారి కథనాలను ఎక్కువగా సేకరించారు. ఇలా ఇప్పటివరకూ అందివచ్చిన కోయ సాహిత్యమంతా తెలుగులోనే ఉండడం విశేషం. వర్తమాన పరిస్థితుల్లో ‘పగిడెె’, ‘చిత్రపటం’ లాంటి కళా రూపాలు కనుమరుగయ్యే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. ఆశ్రిత కళాకారులకు సైతం భుక్తి లేకుండా పోతోంది. తెలుగు రాష్ట్రాల ప్రాచీన కళావైభవాలను కాపాడుకోవడం తెలుగువారందరి బాధ్యత. ఈ విషయంలో ఆదివాసీలకు సహకరిస్తే ఈ గడ్డ సాంస్కృతిక వారసత్వం పదికాలాల పాటు పచ్చగా పరిఢవిల్లుతుంది.

 


వెనక్కి ...

మీ అభిప్రాయం