బాలల కథా వింజామరం

 

  • 9 Views
  • 0Likes
  • Like
  • Article Share

కథా రచయితగా బాల సాహిత్య ఉన్నతికి కృషిచేసిన వేంపల్లి రెడ్డి నాగరాజు 1971 జూన్‌ 5న కడప జిల్లా సంబేపల్లిలో జన్మించారు. చిన్నకథల ద్వారా జీవన విలువలను ఆవిష్కరించారు. సమకాలీన సమాజ తీరుతెన్నులను విశ్లేషిస్తూ ఉదాత్తమైన కథలు రాస్తూనే పిల్లల భావనా ప్రపంచాన్ని ఆవిష్కరించే కథల మీద దృష్టి పెట్టారు. ‘గోరుముద్దలు, బహుమతి, నేను నా బాశాలి నా పిల్ల నా కొడుకు’ పేరిట పుస్తకాలను తీసుకొచ్చారు. ‘బొమ్మ- బొరుసు, పరిష్కారం’ కథల సంపుటాల్లో మానవ జీవన స్థితిగతులకు అక్షరరూపమిచ్చారు. ‘మట్టి వాసన, ప్రవచనం’ అనే కవితా సంపుటాలను తీసుకొచ్చారు. పిల్లల కోసం రాసిన మొత్తం 72 కథల్లో కొన్ని వివిధ భారతీయ భాషల్లోకి అనువాదమయ్యాయి. శ్రీవేంకటేశ్వర, ద్రవిడ(కుప్పం) విశ్వవిద్యాలయాల్లో వీరి కథల మీద పరిశోధనలు జరుగుతున్నాయి. పాత కథలని కొత్తగా చెప్పడం వీరి ప్రత్యేకత. ‘బాలభారతం’ పత్రికలో ప్రచురితమైన ‘కట్టెల కిట్టయ్య’ తన కథలన్నింటిలో ఉత్తమమైందని చెప్పేవారు. పర్యావరణం మీద అవగాహన కలిగించే ఈయన కథలన్నీ రెండు పుటలకు మించని సంక్షిప్తతతో ఆకట్టుకుంటాయి. ‘బామ్మలు చెప్పని కమ్మని కథలు’ కథా సంపుటితో గుర్తింపు పొందిన నాగరాజు, వివిధ దినపత్రికలకి విలేకరిగా పనిచేశారు. తర్వాత ఎల్‌ఐసీ ఉద్యోగిగా బాధ్యతలు నిర్వర్తించారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ 2019లో ఈయనను సాహిత్య పురస్కారంతో సత్కరించింది. ‘రూపాయికే నీతికథ’ అంటూ కథని పిల్లలకు చేరువ చేసిన నాగరాజు నవంబరు 16న స్వర్గస్థులయ్యారు.  

 


వెనక్కి ...

మీ అభిప్రాయం