స్వాప్నికా భావనా విరించి

 

  • 24 Views
  • 0Likes
  • Like
  • Article Share

‘‘నాకు రెండు నిధులున్నాయి. నాలుక మీద కవిత్వం, తలమీద దారిద్య్రం. నాకు రెండు విధులున్నాయి. కవిత్వ నిత్య నిబద్దం, దారిద్య్ర విముక్తి యుద్ధం’’ అని జీవితాన్ని విలక్షణంగా చూసిన దేవీప్రియ అసలు పేరు ఖ్వాజా హుస్సేన్‌. దేశానికి పరదేశ పీడన నుంచి విముక్తి లభించిన నాలుగేళ్లకు స్వాతంత్య్ర దినోత్సవం రోజున గుంటూరులో జన్మించిన దేవీప్రియ, ప్రజావాహిని పత్రికతో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. పైగంబర కవిగా సాహిత్యలోకానికి పరిచయమై ‘గాలిరంగు’ ద్వారా నిత్యచైతన్య కవిగా ఎదిగారు. సాహిత్యజీవిగా ఆలస్యంగా ప్రవేశించి నప్పటికీ పాటల్లోనూ, పద్యాల్లోనూ, వచనకవితా గమనంలోనూ విలక్షణ ప్రయోగాలు చేశారు. ‘అమ్మచెట్టు, నీటిపుట్ట, తుఫాను తుమ్మెద, గాలిరంగు, పిట్టకూడా ఎగిరిపోవాల్సిందే!’ అనేవి ఈయన కవితా సంకలనాలు. దేవీప్రియ ‘గాలిరంగు’ కవితా సంకలనానికి 2017లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.
‘‘ఝుమ్‌ ఝుమ్మల్‌ మర్రి.. వెయ్యి కాళ్ల జెర్రి, గుర్తుందా నీకు’’ లాంటి గీతాలు దేవీప్రియను నిబద్ధమైన కవుల సరసన నిలబెడతాయి. సమకాలీన సమస్యలపై స్పందనగా, రాజకీయ కల్లోలాలకు ప్రతిఘటనగా శక్తివంతమైన కవిత్వం రాశారు. ‘‘బాబ్రీమసీదు/ ఇప్పుడొక రెక్కలు విరిచిన ప్రాంతం/ కుప్పకూలినచోటే కునారిల్లుతున్న/ శతాబ్దాల శిథిల శకలాలు/ రాజకీయ చరిత్రగా మారిన/ ఆధ్యాత్మిక పరంపర’’ అంటూ.. చైతన్యస్పోరకమైన రాజకీయ కవిత్వాన్ని సృజించారు. కాలంలో ఎన్ని పరిణామాలు రానీ, ప్రపంచం శిథిలమవ్వనీ మనిషి ముఖ్యమనీ, సామాన్యుని జీవిత గమనం అత్యావశ్యకమని భావించారు. ‘‘అక్కడైనా, ఇక్కడైనా/ మనిషిని బతికి ఉంచేది/ నిత్యరాజకీయ, దైనందిన/ జీవన యుద్ధమే..’’ అంటూ.. సకల జనుల శాంతి కోసం నిరంతర యుద్ధ ప్రయత్నం తప్పదంటారు. ప్రముఖ దర్శకలు, నిర్మాత బి.నర్సింగరావుతో కలిసి ‘మా భూమి, రంగుల కల, దాసి’ లాంటి చిత్రాలకు పనిచేశారు. ‘ప్రజాయుద్ధ నౌక’ పేరుతో ప్రజా వాగ్గేయకారులు గద్దర్‌ మీద డాక్యుమెంటరీ రూపొందించారు. శ్రీశ్రీతో ఆత్మకథ రాయించి ‘ప్రజాతంత్ర’ పత్రికలో ప్రచురించారు.
అక్షరాల్లో పలికిస్తూ.. పలవరిస్తూ..
ఆరుద్ర కూనలమ్మ పదాల తరహాలో నాయనమ్మపదాలు, కందపద్య ఛందస్సులో గరీబు గీతాలు రాసి కందపద్యాల అమీరుగా పేరుతెచ్చుకున్నారు దేవీప్రియ. కాలమిస్టుగా ‘రన్నింగ్‌ కామెంట్రీ’ పేరుతో ఈయన రాసిన వ్యాసాలు, చిన్న కవితలు చైతన్య దివిటీలై పాఠకులను అలరించాయి. ‘‘ప్రవక్తలు పారిపోతారు/ స్వాప్నికులు సిలువలెత్తుకుంటారు/ నియంతలు త్యాగ పురుషుల వెనుక శరణు తీసుకుంటారు/ జాతి ఆకాంక్షను కొందరు సముద్రాల కావల మర్రిచెట్టు తొర్రల్లో దాచిపెడతార’’ని నినదించి సత్యాన్వేషణ సాధనలో ఆహుతైన త్యాగధనులను స్మరిస్తారు. ప్రపంచ బాధనంత తనలో పలికిస్తూ, పలవరిస్తూ.. వైయుక్తిక జీవితంలో కవిత్వాన్ని అదిమిపట్టుకున్న తన్మయత్వం దేవీప్రియది. ‘‘ఎడమపాదం మీద/ ఎంతో అమాయకంగా/ ఉదయించిన కొనగోరంతటి/ చిట్టిచంద్రవంక/ ఇటుసాగి అటుసాగి/ అటు ఎగిరి ఇటు ఎగిరి/ అటు పొరలి ఇటు పొరలి/ అటు లేచి ఇటు లేచి/ పాదపదపత్రతతినొక/ భయదకాననహేళ చేసి/ దష్టదహనపు కీల చేసి/ కాలినిండా కణకణానా/ ఢమరుకాలై త్రిశూలాలై/ జివ్వు జివ్వున/ రివ్వు రివ్వున/ నొప్పి కణికలు చిందుతుంటే’’ అంటూ.. బాధాతప్తనదిలో చివరిరోజులు గడిపిన ఆయన నవంబరు 21న హైదరాబాదులో కీర్తిశేషులయ్యారు.

 


వెనక్కి ...

మీ అభిప్రాయం