మాది దక్షిణ భారతం!

  • 1164 Views
  • 12Likes
  • Like
  • Article Share

    సేకరణ: చంద్రప్రతాప్

  • హైదరాబాదు

భారతదేశ జాతీయ భాష ‘హిందీ’ అని నమ్మేవారు ఇప్పటికీ చాలామంది ఉన్నారు! మన రాజ్యాంగంలో పేర్కొన్న 23 అధికార భాషల్లో అది కూడా ఒకటి మాత్రమేనన్న సంగతి ఎక్కువమందికి తెలియదు. ఇక గతంలోనైతే ఈ భావన మరింత బలంగా ఉండేది. ముఖ్యంగా విదేశీయులైతే భారతీయులంటే ‘హిందీ భాషీయులే' అనుకునేవారు. ప్రసిద్ధ రచయిత డా॥ ఉప్పల లక్ష్మణరావు రష్యా వెళ్తే, అక్కడివాళ్లు ఇలాగే మాట్లాడారు. ఆ చర్చ ఎలా మొదలైంది... దానికి లక్ష్మణరావు ఎలా బదులిచ్చారు తదితర విశేషాలు ఆయన మాటల్లోనే...

‘‘లెనిన్‌గ్రాడ్‌లోని స్కూల్‌ ఆఫ్‌ ఓరియంటల్‌ స్టడీస్‌’’ వారి ఆహ్వానంపై ఆ సంస్థని సందర్శించాం. మా ప్రతినిధివర్గంలో నేనొక్కడినే ఆంధ్రుణ్ణి. రామానుజం అని ఒక తమిళసోదరుడూ, ఆయన సతీమణి శ్రీమతి కేట్కారుగారూ మద్రాసు నుంచి ప్రతినిధులుగా వచ్చారు. ఆ సంస్థకు వెళ్లగానే అక్కడి పండిత బృందం ఫ్రొఫెసర్‌ కల్యానొవ్‌గారి (వీరు సంస్కృత పండితులు, మహాభారత, రామాయణాలను సంస్కృతం నుండి రష్యన్‌లోకి కొంత వరకూ అనువదించిన మహాపండితుడు) నాయకత్వాన మాకు స్వాగతం చెప్పారు. ఆ స్వాగతోపన్యాసాల కార్యక్రమం అంతా సంస్కృతంలోనే జరిగింది. తర్వాత యిష్టాగోష్ఠి జరిగింది. ఆ గోష్ఠి హిందీలో జరిగింది. మా ప్రతినిధివర్గంలో వారంతా ఉత్తరాదివారే కాబట్టి వారందరూ గోష్ఠిలో పాల్గొన్నారు. నేను నిశ్శబ్దంగా ఉండడం వొక సోవియట్‌ పండితుడు కనిపెట్టి..
‘‘ఏమండీ! మీరు యేమీ మాట్లాడడంలేదు?’’ అన్నారు.
‘‘నాకు తెలియని పరాయి భాషలో మీరు మాట్లాడుతున్నారు. నాకు యేమీ బోధపడడంలేదు అందుచేత గోష్ఠిలో మాట్లాడలేకపో తున్నాను’’ అన్నాను. అప్పుడాయన ఆశ్చర్యంతో ‘‘ఇదేమిటండీ మేము హిందీలోనే మాట్లాడుతున్నాఁవే! హిందీ మీకు రాదా? హిందీ మీ జాతీయభాషే!’’ అన్నారు.
‘‘హిందీ మా జాతీయభాష అని యెవరన్నారు?’’ అన్నాను. ‘‘అదేఁవిటి? మీ రాజ్యాంగంలోనే వుందే - హిందీ మా జాతీయ భాష అని’’ అన్నారు.
‘‘క్షమించండి. మీరు మా రాజ్యాంగ చట్టాన్ని సరిగా చదవలేదు. మళ్లీ మరొకసారి చదవమని కోరుతున్నాను. హిందీ కేవలం రాష్ట్రాలకీ, కేంద్రప్రభుత్వానికీ మధ్యన వుత్తర ప్రత్యుత్తరాలు మొదలైన వ్యవహార కాండను నడిపేందుకు వొక ‘లింకు’ సంధాన భాషగా వుంటుందని మా రాజ్యాంగంలో వుంది కానీ జాతీయభాష అని లేదు. 14 రాష్ట్రభాషలూ జాతీయభాషలుగానే పేర్కొన్నారు. అందుచేత మీరు తెనుగున గోష్ఠిజరిపితే నేను పాల్గొనగలుగుతాను. నేను యిప్పుడు చెప్పినదాన్నిబట్టి హిందీ వ్యతిరేకిననిగాని, హిందూ దేశానికి వొక జాతీయభాషగా వుండేందుకు వ్యతిరేకినని గాని, అనుకోవద్దు. రాజ్యాంగ ప్రణాళికలో హిందీ జాతీయభాషగా పేర్కొనలేదు. నేషనల్‌ అనలేదు. అఫీషియల్‌ భాష అనే అన్నారు అనే వాస్తవాన్ని గురించే చెబుతున్నాను. మీరు అన్యథా భావించకండి. మా ప్రతినిధివర్గం అధ్యక్షులు అనుమతిస్తే మరి రెండు ముక్కలు చెప్పదలచుకున్నాను.
మేం భారతీయులం యేఁవనుకుంటామంటే సోవియట్‌ దేశస్థులది విజ్ఞాన శాస్త్రీయ దృక్పథం అని. కానీ వుత్తర హిందూ దేశాన్నే అఖిల భారతదేశంగా మీరు గుర్తిస్తున్నారు. యీ దృక్పథంతో మీరు పంజాబీ, హిందీ, బెంగాలీ, భాషలపైనే దృష్టినీ, పరిశోధనలనీ కేంద్రీకరిస్తున్నారు. మీరు భారతదేశ పర్యటనకు వస్తే తొలుత ఢిల్లీ, తరువాత కాశీ, అలహాబాదు, లక్నో, కలకత్తాలను చూస్తారు. వీలూ వేళా వుంటే మద్రాసు, బెంగుళూరు పర్యటిస్తారు. యిక భారత్‌ అంతా చూసినట్టే భావిస్తారు. హిందూదేశానికి వలసవచ్చిన ఆర్యులు, దండకారణ్యం అంటూవొక ప్రదేశం వుందనీ, ఆ అరణ్యాన్ని, వింధ్యను దాటి దక్షిణాపథానికి వెళ్లి అక్కడ యేయే ప్రదేశాలు వున్నాయో తెలుసుకురమ్మని అగస్త్య మహామునిని పంపించారు. అతడు సముద్రాన్ని ఆపోశన పట్టి అనగా బహుశా సముద్ర తీరాన్నే ప్రయాణించి అక్కడ దక్షిణాన తమిళదేశం - ద్రవిడ దేశం - వుందని తెలుసుకున్నాడు. యీనాడు మీరు కూడా ఆ అగస్త్యుని కంటే దూరదృష్టిని ప్రదర్శించడంలేదు.
దక్షిణ భారత్‌లో పురాతనమైన, బ్రహ్మాండమైన తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం భాషలూ సంస్కృతులూ ఉన్నాయి. తమిళం యీ భాషలన్నింటికంటే ప్రాచీనమైనది. క్రీ.పూ. 5వ శతాబ్దం నుండీ క్రీస్తు శకం 2వ శతాబ్ది వరకూ ‘సంగం’ మహాయుగ సంస్కృతి సారస్వతం వెలిశాయి. ఆ నాటికే తిరువళ్లువార్‌ అనేవారు తిరుక్కురల్‌ అనే గ్రంథాన్ని రచించాడు. ఇది అతి జనరంజకమైన గ్రంథం. సత్తనార్‌ అనే రచయిత ‘మణిమేకలై’ అనే గ్రంథాన్ని యీ కాలంలోనే రచించాడు.
ఇంతకంటె మరికొన్ని సంవత్సరాల తర్వాత కన్నడ భాష వెలిసింది. కన్నడ భాషకి అత్యంత దగ్గర సంబంధం ఉన్న తెలుగు - నా మాతృభాష - ముక్కోటి ఆంధ్రుల మాతృభాష - క్రీ.శ. 5వ శతాబ్ది నాటికి శాసనాలలోకి యెక్కింది. క్రీ.శ. 9, 10 శతాబ్దాలకల్లా శాసనాల భాషగా పరిణామం చెందడమే కాకుండా వివిధ ఛందస్సుల పద్యాలలో - మహాభారతాన్ని నన్నయ తెలుగు భాషలోకి అనువదించడం మొదలు పెట్టాడు. మరి రెండు శతాబ్దుల తదుపరి తిక్కన, ఎర్రాప్రెగడలు భారత అనువాదాన్ని పూర్తి చేశారు. ఇక మళయాళం భాషకీ, సంస్కృతానికీ చాలా దగ్గర సంబంధం ఉంది. ఈ భాషపై తమిళ ప్రభావం హెచ్చు. మలయాళ సంస్కృతి మాతృస్వామిక సమాజపు సంస్కృతి. ఇన్ని విభిన్న పురాతన సంస్కృతులు దక్షిణాన వున్నా మీరు వీటిని పూర్తిగా విస్మరిస్తున్నారు.
హిందీ మొన్నమొన్నటిది. కబీర్‌, రామానందు, తులసీదాసు (15-17 శతాబ్దులవారు) - వీరికి ముందు హిందీభాషలో సారస్వతం ఉందో లేదో మీరు చెప్పాలి - జనానికి తెలీదు. బంగాళ భాషలో చండీదాసు, విద్యాపతి, బంకించంద్ర - వీరికి ముందు బంగాళీ భాషలో ప్రజానురంజకమైన రచనలు వున్నట్టు నాకు తెలీదు. రవీంద్రుడు ఒక్క బంగాళా దేశానికే చెందినవారు కారు. వారు యావత్తు హిందూ దేశానికీ చెందినవారు.
ఇక వుర్దూమాట. వుర్దూ నిజంగా వొక భాషేనా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అక్బరు సైనిక పరివారం అరబిక్‌ పర్ష్యను భాషలను మిశ్రమంచేసి, అపభ్రంశపు తద్భవ, తత్సమ, దేశ్యాలతో మిళితం చేస్తే ఏర్పడిన భాష వుర్దూ. రాను రాను యీ మిశ్రమమే కావ్యభాషగా పరిణమించి గాలిబ్‌, ప్రేమ్‌చంద్‌, యశ్‌పాల్‌, మైథిలీ శరణ్‌గుప్తా, జైశంకర్‌ప్రసాద్‌లను అవతరింపచేసింది. యశ్‌పాల్‌ తప్ప వీరందరూ - క్రీస్తుశకం 19వ శతాబ్దివారే. శరత్‌బాబు సారస్వతం బెంగాలీ భాషలో ఉన్నా ప్రేమ్‌చంద్‌ రచనలు వుర్దూ, హిందీ భాషలలో ఉన్నా - అవి అన్నీ యావత్‌ భారతదేశానికి చెందినవే. పంజాబీ అంటారా 15 - 16 శతాబ్దాలకు చెందినది ‘ఆదిగ్రంథం’. దీని ముందు పంజాబీలో ఎంత సారస్వతం వుందో నాకు తెలీదు.

"నా మనవి ఏఁమిటంటే మీరు యిహ నుండీ దక్షిణాది భాషల్నీ, సంస్కృతుల్నీ, చరిత్రనీ, సారస్వతాన్ని అధ్యయనం చెయ్యమని. అప్పుడే భారతీయ సంస్కృతిని గురించి మీకు సమ్యక్‌ దృక్పథం ఏర్పడుతుంది. ఇందుకు మీరు వెంటనే పూనుకోండి’’
ఉప్పలవారు ఇలా ఢంకా బజాయించి మాట్లాడేసరికి రష్యన్‌ పండితులు, ఉత్తరాది పండితులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఆ తర్వాతే సోవియట్‌ రేడియోలో తమిళవార్తలు ప్రసారం అయ్యాయి. అంతేకాకుండా ప్రగతి ప్రచురణాలయంలో తమిళ విభాగం కూడా తెరిచారు. 1967 నాటికి తెలుగు విభాగం కూడా అక్కడ తెరుచుకుంది.

సేకరణ: చంద్రప్రతాప్, హైదరాబాదు (లక్ష్మణరావు ఆత్మకథ ‘బతుకు పుస్తకం’ నుంచి)

 


వెనక్కి ...

మీ అభిప్రాయం