యెంకి చిలుక మనసె మనసు

  • 51 Views
  • 0Likes
  • Like
  • Article Share

    ఎ.ఎన్‌.ఎస్‌.శంకరరావు

  • హైదరాబాదు
  • 9848685179

‘‘నాకూ బసవరాజు అప్పారావుకూ నెయ్యిమేర్పడింది యెంకిపాటల కవి ద్వారా. సుబ్బారావూ నేనూ కాలేజీలో చదువుకునే వాళ్ళం... ‘ప్రేమకుంగల్గు కారణం బేమనగల?’ అంటూ అప్పారావు అలా పాడుతుండగానే అందుకునేవాడు సుబ్బారావు; రివ్వుమని తారాజువ్వలాగా గొంతు విసిరేవాడు. అప్పుడు నండూరి గొంతు కొండవాగు. గలగలలూ గంతులూ, సుడులూ వడులూ- ఒకచోట పుట్టి, ఒకదారిన ప్రవహించి, ఒకచోట కలిసిపోయేది. సుబ్బారావు పాట నిభృతసుందరం’’   

- దేవులపల్లి కృష్ణశాస్త్రి

గుఱ్ఱం జాషువా చెప్పిన ‘‘రాజు మరణించెనొక తార రాలిపోయె కవియు మరణించెనొక తార గగనమెక్కె’’ అనే మాటలు నండూరి వెంకట సుబ్బారావుకు చక్కగా సరిపోతాయి. ఎప్పుడో వందేళ్ల కిందట (1917-1918 ప్రాంతంలో) నండూరి ట్రాం బండిలో ప్రయాణిస్తుండగా హఠాత్తుగా గుండెలోంచి పొంగి గొంతులోకి ఉవ్వెత్తున ఎగిసి పడిన ‘గుండె గొంతుకలోని’ రాగం తెలుగు తెలిసిన, తెలియని ప్రతి గుండెనూ ప్రేమ పారవశ్యంలో పడేసి ఆనంద సాగరంలో ఓలలాడించింది.
      నండూరి యెంకి పాటలకు పారుపల్లి రామకృష్ణయ్య రాగ, తాళాలతో స్వరప్రాణం పోశారు. నటరాజ రామకృష్ణ నాట్యం చేశారు. కాశీనాథుని నాగేశ్వరరావు ఈ పాటల్ని స్వయంగా వినిపించడంతో పాటుగా తమ మూడు పత్రికల్లో రెండు నెలల పాటు ఉచిత ప్రకటనలు ఇప్పించారు. రాజా వేంకటాద్రి అప్పారావు బహదూర్, మంచాళ జగన్నాథరావు, కట్టమంచి  రామలింగారెడ్డి, పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రి, గిడుగు రామమూర్తి, మల్లంపల్లి సోమశేఖర శర్మ, బూర్గుల రామకృష్ణారావు, కోలవెన్ను రామకోటేశ్వరరావు, విస్సా అప్పారావు, విశ్వనాథ, కృష్ణశాస్త్రి, చలం, శ్రీశ్రీ వరకు అందరూ యెంకి పాటల మాధుర్యాన్ని తామాస్వాదించి, రసజ్ఞులకు అందించారు. ఆకాశవాణి మద్రాసు, విజయవాడ, హైదరాబాదు కేంద్రాలు ఈ పాటల్ని అనేకమార్లు శ్రోతలకు వినిపించాయి.
ప్రేమ దేవత
నండూరి అందమైన యెంకిని సృష్టించారు. ఆ యెంకికి మెళ్లో పూసల పేరు, తల్లో పూవుల సేరు, సెక్కిట సిన్ని మచ్చ పెట్టి ఆమెను అంసల్లె, అందాల బరిణల్లె, సుక్కల్లె, బొమ్మల్లె నడిపించారు. కళ్లెత్తితేసాలు కనకాబిసేకాలు చేయించి, కలలో సైతం సిగపూలు సదిరారు, కనుబొమలు కరవుదీరా చూసి అక్షరాల్లో ఆమె సౌందర్యాన్ని సాక్షాత్కరింపజేశారు. ఆమె కపట రహిత ప్రేమను గత జన్మ నుంచి ఈ జన్మలోకి లాగి, రాబోయే జన్మవరకూ పొడిగించారు. యెంకి, నాయుడు బావల జన్మ జన్మల పవిత్ర ప్రేమానుబంధాన్ని సహజ సిద్ధంగా, సంస్కార వంతంగా, రసభరితం చేశారు. వాళ్ల మధ్య ఉన్న పవిత్రత, పారవశ్యం, అమాయకత్వం, ఆరాధనాతత్వం, ఒకరి క్షేమాన్ని ఒకరు ఆకాంక్షించటం, చిత్తశుద్ధి, సంస్కారవంతమైన ఆలోచనలు, సరస సల్లాపాలు, గిల్లికజ్జాలు, మనో నైర్మల్యం, హృదయావేదన, మన్నన, మర్యాద, వయ్యారాలు, వొంపు సొంపులు, పలుకు, కులుకు, భక్తి, రక్తి, సిగ్గు, చిరునవ్వులు, వూసులు, బాసలు, అవ్యక్త ఆనందం, విరహం, ప్రశంసలను అనిర్వచనీయంగా వర్ణించారు.
      యెంకి ఎవరైతేనేమి, నండూరి మనోపుత్రిక, తెలుగుతల్లి పుత్రిక.. ఒక ప్రేమ దేవత. ఆమె అందాల్ని తెలపటానికి నాయుడు బావ కంటి పాపలు అద్దాలవుతాయి. కునకల్లె, సినుకల్లె కూకున్న యెంకిని చిన్న ముత్తెంలో ఇమిడ్చిన నాయుడు బావ ‘‘నా గుండెలో ఇమడలేవా?’’ అని ప్రశ్నిస్తాడు. ఎంకిని ఆమె కనుబొమ్మతో నవ్వించి నాయుడి మనసును కరిగించుకోమంటాడు. యెంకి సూపుల్లో అంతరార్థం, సోద్దెం ఒక్క నాయుడికే అవగతమవుతాయి. నాయుడు బావ యెంకి కోసం పరితపించటం అటుంచి ‘‘నన్ను తలుసుకు యెంకి కన్నుమూయాలి, కనుబొమ్మ సూడాలి, కరిగిపోవాలి... నన్ను కలలో సూసి నవ్వుకోవాలి’’ అంటూ తన రూపాన్ని ఎంకి అందంతో సమ ఉజ్జీ కట్టబోయాడు. యెంకిని సూత్తా ఏతాముతో ఎన్ని మళ్లయినా అలసట మరచి తడిపేసి, నిబ్బరంగా రాతిరి నిదురపోతాడంట నాయుడు!  
రాజూ రాణీ
యెంకి అందం దీపం వెలుగుని మించింది. ‘‘దీపం ఆర్పేస్తే సీకట్లో తళుకుతో నీరూపు తలుసుకొని నాకళ్లు సిల్లులడ సూడాలి’’  అనుకుంటాడు నాయుడు. తీరా దీపం ఆర్పి సూపులు ఆపేసి, రూపు వూసే మరసి నిద్రపోయాడు. ‘‘కలలోనూ యెంకి, రెక్కలతో పైకెగిరి సుక్కల్లె దిగుతాది... కొత్త నవ్వులతో... కొంగొత్త మెరుపులతో తళుక్కుమంటాది... అందుకే నా యెంకి నువ్‌ లేవకే నిదర.. నన్ను నిదర లేపకే!.. కలలోని సుఖాన్ని అనుభవించనీ’ అంటాడు. ‘ఆమె కాసీ దేవుని యెదుట గరవాన నిలిస్తే... తలతడుముకొని సాక్షాత్తు సాంబశివుడే తబ్బిబ్బులైనాడట... రవల వెలుగుల గంగ రమ్మందిరా! యెంకి శివమెత్తి తానాలు సేసిందిరా...’ అంటూ పాడతాడు. యెంకి అందం ముందు సముద్రాలు, హిమాలయాలు, దేవుళ్లు చిన్న చిన్న పరమాణువుల్లా.. నలకంతగా అనిపించాయి నాయుడుకు. అందుకే ఆ అందాల రాణిని పూలతో పూజిస్తానంటాడు, ఏ తపస్సుకైనా సిద్ధమంటాడు. ఇంకా ‘‘నీవు నేనైతే? నిను నీలోనె కందు! నేను నేనుగ నుంటె నీలోనె యుందు... ఏది నే పాడినా ఎంకి పాటెయనేరు... ఏ పదములోనైన ఎంకి కళనె కనేరు...’’ అని చెప్పుకున్నాడు.
నాయుడు బావ ‘‘యెంకితో కూకుండి యింత సెబుతుంటే యెంకి సరసాలాడ జంకుతూ వుంటే, కోరి కూకుని నేను పోరు పెడుతూ ఉంటే... రతనాల వేదికను రవల చాందిని కింద ముత్తెపు తలంబ్రాలు ముసిముసుల పెళ్లంట... దీప సుందరి తోటి సాపత్యమా నాకు, దీప సుకుమార దరిదాపు చనగలనా?’’ అంటూనే ‘‘రంగు కోక ధరించి రాజు (తన) రాక తపించు’’నంటాడు. ‘‘ఎకసెక మెవరికి తెలుసు? యెంకి చిలుక మనసు గడుసు.. ఎగతాళియు ఎంతో సొగసు, -యెంకి చిలుక మనసె మనసు’’ అంటూ ప్రేమ సామ్రాజ్యానికి తమను రాజు, రాణిగా ఊహించుకుంటాడు.
కాంక్ష.. ఆకాంక్ష
‘‘యెంకి వూగెను కొమ్మ వుయ్యాలా! చంద్ర వంక వూగెను బొమ్మ వుయ్యాలా! సిగపూలు, ముంగురులు, చిరుమువల మొలనూలు... ఒకచే సదురుకొనుచు ఒయ్యారమే వూగె! దీపమై, తిలకమై, పీఠమై ఎంకికి కిరీటమై నెలవంక’’.. యెంకిని ఎంత వర్ణించినా తక్కువే! నాయుడుకు యెంకి కనిపించని క్షణాలు యుగాలవుతాయి. ఆమె అంటే అంత ప్రాణం కాబట్టే ప్రాణాలు అరచేతబట్టుకుని ‘‘అద్దరేతిరి లోను అడివంతా వెతికాను, గట్టెక్కి సూసాను, పుట్టెక్కి సూసాను, జొన్న చేలు, మామిడి తోటలు వెదికాను, నిన్నొదిలి క్షణమైన ఉండలేని వాణ్ని. నీ కోసం ఎక్కడున్నావోనని యేళ్లన్నీ యీదాను... యేటిసేస్తుండావోనని యీశ్శరుణ్నడిగాను..’’ అంటాడు. ‘‘నా పక్క రావొద్దె యెంకీ! ఆ పొద్దె మన పొత్తులయిపోయి నెంకి! నీ కోసం నేనేటో కొట్లాడుతుంటే.. వెదుకుతూ ఉంటే.. నువ్‌ మాత్రం వొన్నె సీరలు గట్టి వోసుగా తిరుగుతున్నావా! అమ్మలక్కలతోటి సెమ్మసెక్కాడుతున్నావా!... సీకు చింతా లేక పోకల్లె పొండుకున్నావా!’’ అని అలకపాన్పు ఎక్కుతాడు.  ‘‘ఉత్తమా యిల్లాలినోయీ! నన్నుసురు పెడితే దోసమోయీ! నిదురలో నినుసూసి సెదిరెనేమో మనసు!... ఈ రేయి నన్నొల్ల నేరవా? రాజా! ఎన్నెలల సొగసంత యేటిపాలే నటర! యెలుతురంతా మేసి యేరు నెమరేసింది, కలవరపు నా బతుకు కలత నిదరయిందీ... ఆటపాటలలోనే మరచినావా నారాజ! మాట కోటలలోనె మసలుమన్నావా! కలలోన నీవూ నా కంటి కవుపడకున్న మెలకువయ్యేదాక కలవరించే నన్ను... తనువంతా నా రాజు తపెసె, బతుకంతా నారాజు పాటెయని, నిదురంత నారాజు నీడెయని, జగమంత నా రాజు సొగసెయని’’ అని ఎదలో మెదిలింది చెబుతుంది యెంకి.
      పెళ్లయ్యాక బిడ్డతో పుణ్యక్షేత్రాలుకని బయల్దేరినప్పుడు ‘‘ఎక్కవే కొండనెక్కవే! నా పక్క నెంకీ యెక్కవే! కొండనెక్కవే!’’ అంటాడు నాయుడు. ‘‘పక్క సూపులు మాని పయికెళ్లి పోదాము.. ముందు నువ్వుంటే నీడనే తొక్కుకుని సులువగ రాగలనెక్కవే కొండనెక్కవే! నాలుగడుగులేసి నవ్వుతో పిలువెంకి! పిలుపు నవ్వే నాకు ములుగర్ర కాగలదు. రేతిరి పగటేల రెప్పెయ్యకుండా ఎంకిని సల్లంగ సూడమని సామితో జెప్పాలి. ఆసామి మీదేటో వూసులాడుకొంటూ కొండ మెట్లన్నీ నీ కొంగట్టుకెళ్లాలి.. యెంకి, నా తోటి రాయే! మన వెంకటేశరుణ్ని యెల్లి సూసొద్దాము! ఈడ నీ సుక్కాని.. ఆడనే గెడయేసి పడవెక్కి భద్రాద్రి పోదామా! గోదారి గంగలో కొంగు కొంగూ గట్టి కరువుతీరా బుటకలేదామా! సరిగెంగ తానాలు సేదామా! సంకలో పిల్లోడు సంబ్రాలు పడుతుంటె యెంకితో తీర్తాని కెళ్లాలి. బరువు మారుసుకొంట పక్కన నవ్వాలి, దారి పొడుగున కీసులాడాలి...’’ అనే నాయుడి బావ కాంక్ష.. తెలుగు భాష బతికున్నంత కాలం యెంకి పాటలు చిరంజీవిగా వర్ధిల్లాలనే ఆకాంక్ష!


125వ జయంతి
‘‘తెలుగుతల్లి యొక్క నిజస్వరూపము చూడవలెనని.. తెలుగు పస, తెలుగు నుడి, తెలుగు నాదం, తెలుగు రుచి తెలుసుకొని మానవ జాతి సంప్రదాయాల్లో గల సొగసు, జీవనమూ పదిమందికిన్నీ మనసుకెక్కించవలెనని’’ ఆశించిన నండూరి వెంకట సుబ్బారావు, 1895 డిసెంబరు 16న జన్మించారు. స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా వసంతవాడ. కాకినాడ, మద్రాసుల్లో చదువుకున్నారు. ఏలూరులో న్యాయవాద వృత్తిలో కొనసాగారు. గురజాడ ముత్యాలసరాలు, లవణరాజు కల స్ఫూర్తితో యెంకి పాటలను సృజించారు. ‘చిత్రనళినీయం’ పేరిట రేడియో నాటికల సంకలనమూ వెలువరించారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి, బసవరాజు అప్పారావు, నండూరి సుబ్బారావు ప్రాణస్నేహితులు. నండూరికి బసవరాజు కవిత్వ కళా రహస్యాలు చెప్పి ప్రొత్సహించారు.  యెంకి పాటలతో తెలుగు సాహిత్యంలో స్వచ్ఛమైన ప్రేమకు పట్టం కట్టిన నండూరి.. 1957 మే 29న కీర్తిశేషులయ్యారు. ఈ ఏడాది (2020) ఆయన 125వ జయంతి సంవత్సరం.


 


వెనక్కి ...

మీ అభిప్రాయం