నన్నొదిలి ఆరేళ్లయిందానే..!

  • 199 Views
  • 0Likes
  • Like
  • Article Share

    పొట్టబత్తిని రాజ్యలక్ష్మి

  • హైదరాబాదు
  • 9542569299
పొట్టబత్తిని రాజ్యలక్ష్మి

ప్రియమైన నైనమ్మకు..
నేనపుడూ
ఆరో తరగతి సదువుతున్న.. ఓనాడు సిన్న తాతోళ్లతోని నువ్వు, తాత కలిసి యాదిగిరిగుట్ట సూడనికపోయిరు. గప్పుడు కూడా నీకు నాకోసం ఏమన్న తేవాలనే యాదికున్నాదే..! వస్తప్పుడు వనగుంటల పీట కొనుకొచ్చినవ్‌ ఎంతో ఇష్టంగా! దానికి తాత తెల్ల రంగేసిండు. అది ఇప్పటికీ నాకాడనే ఉంది. నువ్వు కుట్టిన పట్లంగ మనింట్ల బీర్వల భద్రగుంది. ఇవి నువ్వు నాకిచ్చిన వస్తువులే అయ్యుండొచ్చుగనీ నాకిలువైన బగుమతులవి.
      నా సినప్పుడనుకుంట.. కుచ్చుల కుచ్చుల గౌన్లు, నెత్తికి కుల్లలు తీరొక్కటి కుట్టి, నాకు తొడిగి ఎంతో మురిసి పోయేదానివని. మన సుట్టాలింట్ల ఏ దావత్‌ అన్న ఉండనియ్‌. నాకు ఏడి ఏడి నీళ్లతో సానం జేపిచ్చి, తువాలుతోని ఒళ్ళంత తుడిసి, పొడరు రాసి, కాటిక వెట్టి, ఓ సంచిల రెండు జతల గౌన్లు, ఓ పాలడబ్బా.. దానికి దిస్టి దగలకుండా దస్తీ సుట్టి, నన్ను సంకన ఎత్తుకుని నీ ఎంట తీస్కపోయేదానివంట సంటిబిడ్డ తల్లిలెక్క..! ఈయన్ని నాకు తెల్వనే తెల్వదు. అమ్మ గప్పుడప్పుడు సెబుతుంటే ఇనేదాన్ని.
      నాకోసం ఎదో జెయ్యాలని ఎప్పుడు ఆత్రపడతనే ఉంటవు. గట్లనె ఆరోజు కూడ ఇంట్ల ఎవ్వరు లేకున్న, సౌదలు లేకున్నగనీ.. సేమియా పొట్లంతోని పని లేకుండ నీకు జెయొచ్చినకాడికి ఓ గిన్నల నీళ్లు పోసి, గోధుంపిండేసి కలిపి పక్కకు వెట్టి, ఇంకో గిన్నె పొయ్యిమీద వెట్టి.. సాలినంత నీళ్లు బోసి, సెక్కరేసి, ముంగట కల్పిబెట్టిన పిండిని అందుల పోసి, ఒక ఇలాచి దంచి ఎసి, జేరంతసేపు ఉడికినంక, బంజేసి, నాకు గిన్నెల పోసి తిన్పించిన్నవు. నేను అమ్మ జేసిన షేమంగుల, సేమియా పాయసం గిప్పటిదాకా తిన్నగని, నువ్వు నాకోసం ఆరోజు ప్రేమగా జేసిన గోధుంపిండి పాయసాన్ని నేను మరవలే. ఆ రుసి నాకింక గుర్తే! నేను పదవ తరగతి సదువుతున్నపుడైతే, ఓరోజు సూడనిక పొద్దున్నే వచ్చిన్నవు. గప్పటికి నేను ఊస్కులుకెళ్లిపోయిన. పోద్దుమూకేదాక నాకోసం సూస్తనే ఉన్నవంట, రాంగనే అమ్మి ఒచ్చిందని దగ్గరికి తీసుకొని, నికు తెల్సినకాడికి మంచిగ సదువుకో అని ఎన్నో పైలం ముచ్చట్లు జెప్పినవ్‌.
      ఓ సెలవు దినాన మేము ఇంటి ముందు కుల్లజాగల పెరిగిన బొప్పాయ సెట్టుకి పండు గాక ముందుకె, కాయని దెంపినం. దాన్ని కోద్దామని నేను ఇలపిట మిద పెట్టి కోస్తుంటే నా ఏలు తెగింది. అమ్మ నన్ను శాన తిట్టింది, గట్లెందుకు జేసినవు. గట్లున్న కాయని కోయ్యొద్దని తెల్వదా? అంటే, పిల్లలు అడిగినరని చేసిన అని సెబుతుంటె, నువ్వేమో గేటుకాడ అరుగు మీద కూసోని ఎవళ్లకు కనపడకుండ ఎడుస్తున్నవు. ఏమైందనీ అమ్మ అడిగితే, నేను గాడనే ఉన్న, నేను కోసిచ్చిన అయిపోతుండే. నా వల్లనే గిట్లైందని, నీ మిదేసుకోని, సిన్నపిల్లలెక్క ఎడ్చినవ్‌. ఇదంత అయిపోయినంక నువ్వు ఊరెళ్లిపోతుంటే ఎన్నిమాట్లు ఎనక్కి తిరిగి సూసినవో.
      నిన్ను ఎప్పుడన్న దల్చుకుంటే.. నీ నిండైన, కళగల మొఖమే గుర్తొస్తది నాకు... నేత సిర కట్టుకొని, చెరో చేతికి డజనులెక గాజులేసి, నుదురుకి గుండ్రంగా కుంకుంబొట్టు వెట్టి, సవరంతో కొప్పు కట్టి, నవ్వుకుంట ఒస్తున్న నీ రూపం నన్నొదిలి ఆరేళ్లయిందానే.. నైనమ్మ...!      

ఇట్లు
నీ అమ్మి.


వెనక్కి ...

మీ అభిప్రాయం