చూడచూడ మాణిక్యాలు..!

  • 146 Views
  • 2Likes
  • Like
  • Article Share

    చింతలపల్లి హర్షవర్ధన్‌

  • గట్టుఇప్పలపల్లి, మహబూబ్‌నగర్‌ జిల్లా
  • 9014897030
చింతలపల్లి హర్షవర్ధన్‌

కొండలలో నెలకొన్న కోనేటిరాయుడి సొగసు చూడతరమా! చూపుతిప్పుకోనివ్వనంత చక్కదనంతో మెరిసిపోయే ఆ మూర్తిని ఎందరో తనవితీరా వర్ణించారు. వారిలో పదకవితా పితామహుడు అన్నమయ్య బాణీనే వేరు. అలిమేలుమంగాపతిని ఆపాదమస్తకం వర్ణిస్తూ ఆయన గానం చేసిన కీర్తన వింటుంటే, ఆ దివ్యమంగళ స్వరూపం అలా సాక్షాత్కరించేస్తుంది.
సాధారణంగా
విష్ణుమూర్తి విగ్రహాలను స్థానక - నిల్చున్న, ఆసన - కూర్చున్న, శయన - పడుకున్నట్లుగా ఉండే మూడు భంగిమల్లో మలుస్తారు. తిరుమల వేంకటేశ్వరుడు స్థానక మూర్తిగా స్వయం వ్యక్తుడై భక్తుల పూజలందుకుంటున్నాడు. నిజరూప దర్శనం ఉండే ఒక్క గురువారం మినహా వారంలోని మిగిలిన రోజులల్లో వెంకన్న.. వజ్రాలు, పచ్చలు, మరకతాలు పొదిగిన బంగారు ఆభరణాలతో చూసేవారిని ఓ రకమైన అవ్యక్త ఆనందానుభూతికి లోనుచేస్తాడు. ఆ దివ్య మనోహర రూపాన్ని దర్శించి, అర్చించి తరించిన తాళ్లపాక అన్నమయ్య కూడా తాదాత్మ్యానికి లోనై స్వామిని చూడచూడ మాణిక్యాలు చుక్కల వలె నున్నవి / ఈడులేని కన్నులవె ఇనచంద్రులు అనే పల్లవితో పొగడుతూ సంకీర్తనా గానం చేశాడు.
      రుగ్వేదంలో భాగమైన పురుష సూక్తం ప్రకారం సమస్త విశ్వమూ పరాత్పరుడి శరీరమే. తిరుమలేశుడు సాక్షాత్తూ ఆ పరాత్పరుడే. కాబట్టి స్వామికి అలంకరించిన వజ్రాలు, మరకతాలు, పచ్చల లాంటివి అన్నమయ్యకు చుక్కల్లా కనిపించాయి. ఇక సాటిలేని స్వామివారి నేత్రాలు ఆయనకు సూర్యచంద్రుల్లా సాక్షాత్కరించాయి. సాధారణంగా భగవంతుడి కళ్లను (అమ్మవారివి కూడా) సూర్యచంద్రులతో పోలుస్తారు. కోనేటిరాయుడి నేత్రాలు శిల్పశాస్త్రాలు సూచించినట్లుగా ‘సమదృష్టి’తో ఉంటాయి. అంటే పైకీ, కిందికీ చూస్తున్నట్లుగా కాకుండా తన దృష్టి అంతా భక్తుల మీద ప్రసరింప చేస్తున్నట్లుగా ఉంటుంది శ్రీవారి మూర్తి.
      గురువారం మినహా మిగిలిన రోజులలో స్వామివారిని విలువైన వజ్రాలు, మణులు, మాణిక్యాలు పొదిగిన బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. అందుకే అన్నమయ్య ఇలా అంటున్నాడు.. 
కంటికంటి వాడెవాడె ఘనమైన ముత్యాల
కంఠమాలలవె పదకములును అవె
మింటి పొడవైనట్టి మించు కిరీటంబదె
జంటల వెలుగు శంఖచక్రాలవె

      వేంకటేశ్వరుడి మూర్తి శిల్పశాస్త్రం ప్రకారం కచ్చితమైన కొలతలను కలిగి ఉంటుంది. అందుకే అది భారతదేశంలోని విగ్రహాలన్నింటిలో అత్యంత సుందరమైందిగా అలరారుతూ, భక్తులను సూదంటురాయిలా విశేషంగా ఆకర్షిస్తోంది. స్వామి చెవులకు మకర కుండలాలు వేలాడుతుంటాయి. ఆయన మెడ శంఖంలా ఉంటుంది. ఛాతీ 36-40, నడుము 24- 27 అంగుళాల కొలతను కలిగి ఉంటాయి. నడుము సింహం నడుమును పోలి ఉంటుంది. అంతేకాదు, స్వామివారి ఉదరం అత్యంత అందంగా, ఎంతో నైపుణ్యంతో తీర్చిదిద్దినట్లుగా ఉంటుంది. ఆయన ఎగువ హస్తాల్లో కుడివైపు సుదర్శన చక్రం, ఎడమవైపు పాంచజన్య శంఖాలు అమరి ఉంటాయి. అయితే ఇవి మూల విగ్రహంలో భాగంగా కాకుండా విడిగా ఉంటాయి. దిగువ హస్తాల్లో కుడివైపున ఉన్నది తన పాదాలను శరణు వేడుకున్న వారికి వరాలను ప్రసాదిస్తానని సూచించే వరదహస్తం, కాగా ఎడమవైపుది మనిషి ఈదడానికి అత్యంత కష్టంగా భావించే సంసార సాగరం తన భక్తులకు మోకాలి లోతే ఉంటుందని సూచిస్తున్నట్లుగా కట్యావలంబిత ముద్రలో ఉంటుంది. అందుకే స్వామివారిని ‘కట్యావలంబిత మూర్తి’ అని పేర్కొంటారు.
      వేంకటేశ్వరుడి మెడకు నాలుగు ఆభరణాలు (కంఠమాలలు), యజ్ఞోపవీతం ఉంటాయి. కిరీటం 20 అంగుళాల ఎత్తుతో ఉంటుంది. కిరీటం నుంచి జటాజూటాలు స్వామి భుజాల మీదికి విస్తరించి కనిపిస్తాయి. భుజాల మీద ధనుర్బాణాలు ధరించిన గుర్తులుంటాయి.
మొక్కుమొక్కు వాడెవాడె ముందరనే ఉన్నాడు
చెక్కులవే నగవుతో జిగిమోమదె
పుక్కిట లోకంబులవె భుజకీర్తులను అవె
చక్కనమ్మ అలమేలు జవరాలదె

      సృష్టిలో ఉన్న అందాన్నంతా విగ్రహంలో వ్యక్తపరిస్తే అది శ్రీ వేంకటేశ్వరుడి విరాణ్మూర్తి అవుతుంది. బాగా అధ్యయనం చేస్తే పద్మావతీ నాథుడి మూర్తి అజంతా కొండల్లోని మొదటి గుహలో ఉన్న బోధిసత్వ పద్మపాణి రూపాన్ని ప్రతిఫలిస్తుందట! అయితే బోధిసత్వుడు రెండు చేతులతో, కిందికి చూస్తూ ‘అవనీత దృష్టి’లో ఉంటాడు. ఈ రెండు రూపాల్లో పోలికలు ఉండటం యాదృచ్ఛికం అని పరిశీలకులు పేర్కొంటారు. వేంకటేశ్వరుడి ముఖం చిరుమందహాసంతో ప్రసన్నంగా, మూర్తి చుట్టుతా ధ్యానం, ఎన్నటికీ తరగిపోని ప్రేమ పుంజాలను ప్రసరింపచేస్తున్నట్లుగా ప్రకాశవంతంగా ఉంటుంది. ఇక మూర్తి పదార్థం విషయానికి వస్తే తిరుమల కొండల్లో దొరికే ఎర్ర అగ్ని శిలా రూపంలో స్వామి వ్యక్తమైనట్లు తెలుస్తుంది. పునుగుపిల్లి తైలంతో అభిషేకించడం మూలంగా అది నీలవర్ణాన్ని సంతరించుకుంది. ఇక్కడ అన్నమయ్య వర్ణిస్తున్న స్వామి విశ్వాత్మకుడు. అంతేకాదు ఆయనకు, శ్రీకృష్ణుడికీ భేదం లేదు. అందుకే బాలకృష్ణుడి లీలా విలాసమైన తల్లికి లోకాలను తన పుక్కిటిలో చూపించడాన్ని అన్నమయ్య వేంకట కృష్ణుడికి ఆపాదిస్తున్నాడు. 
సమస్త విశ్వానికి మూలభూతం
స్వామివారి ఎదమీద శ్రీవత్సం అనే నల్లటి మచ్చ, పచ్చమేరుగా పిలిచే కౌస్తుభమణి ఉంటుంది. ప్రపంచంలో అతిపెద్ద పచ్చ ఇదేనంటారు. ఇవి కాకుండా స్వామి ఎద మీద వక్షస్థల లక్ష్మి ఉంటుంది. అందుకే స్వామికి శుక్రవార అభిషేకం జరుగుతుంది. ఇక అలంకారాలు చేసినప్పుడు స్వామి ఎదకు కుడివైపున శ్రీలక్ష్మి, ఎడమవైపున పద్మావతీ దేవి (అలమేలు మంగ) ఎగువన ఉన్న చేతుల్లో తామర మొగ్గలు, అభయ, వరద హస్తాలతో ఉన్న బంగారు రేకులను అమరుస్తారు. ఈ రెండు రూపాలు విశ్వంలోని స్థిర, చర సంపదలకు ప్రతిబింబాలు.
ముంగైమురాలును అవె మొల కటారును అదె
బంగరు నిగ్గుల వన్నె పచ్చబట్టదె
ఇంగితమెరిగి వేంకటేశుడిదె కన్నులకు
ముంగిటి నిధానమైన మూలభూతమదె

      స్వామి వారి చేతులకు నాగాభరణాలు (ముంగైమురాలు), కుడి చేయికి ఒక పాము చుట్టుకొని ఉంటుంది. నడుముకు రెండు అంగుళాల మందం ఉన్న కటిబంధం ఉంటుంది. దీని నుంచి ‘సూర్యకటారు’గా పిలిచే నందక ఖడ్గం వేలాడుతూ ఉంటుంది. నడుము పైభాగంలో ఎలాంటి ఆచ్ఛాదనా ఉండదు. కానీ కింది భాగంలో ధోవతి ఉంటుంది. అన్నమయ్య వర్ణిస్తున్న బంగారు నిగనిగల పట్టుపీతాంబరం అదే. నడుము కింది భాగం కొంచెం ఎడమ వైపు తిరిగినట్లుగా ఉండి, కాళ్లు కొంచెం బయటికి చొచ్చుకు వచ్చినట్లుగా ఉంటాయి. ఇక దండ కడియాలతో అలంకృతమైన స్వామి పాదాలను వర్ణించడానికి భాష సరిపోదు.
      మొత్తం మీద కిరీటం చివరి నుంచి నిల్చున్న పద్మపీఠం అడుగు వరకు బ్రహ్మాండ నాయకుడి విరాణ్మూర్తి 9 నుంచి 10 అడుగుల ఎత్తు ఉంటుంది. తిరుమల ఆలయ సంప్రదాయం ప్రకారం ‘ధృవబేరం’గా పిలిచే దివ్య మనోహర మూర్తి అయిన వేంకటాచలపతి తత్వాన్ని విచక్షణతో తెలుసుకోగలిగితే ఆయన మనముందు నిల్చున్న మూలభూతం- సమస్త విశ్వానికీ మూలకారకుడు అంటాడు అన్నమయ్య.


వెనక్కి ...

మీ అభిప్రాయం