ఇనవమ్మ ఊర్మిళా నా ముద్దు చెల్లెలా!

  • 175 Views
  • 0Likes
  • Like
  • Article Share

జానపదం అంటేనే స్వచ్ఛమైన మనసులకి, అచ్చమైన భాషకు ప్రతిబింబం. ఇతిహాసాలు, పురాణాలు కూడా జానపదుల పలుకుల్లో కొత్త అందాలు సంతరించుకున్నాయి. సహజత్వాన్ని అద్దుకున్నాయి. రామాయణ, భారత, భాగవతాలకు సంబంధించి వారి కల్పనా చాతుర్యాన్ని, గుండెల్లోని ఆర్తిని ఒకసారి పరిశీలిద్దాం!
రావణాసురుడి
చెర నుంచి సీతమ్మను విడిపించాక అగ్నిప్రవేశం చెయ్యమన్నాడు రామయ్య. అన్ని రామాయణాలూ ఇదే చెప్పాయి. కానీ, జానపదుల రామాయణంలో అగ్ని పరీక్షతో పాటు ఇంకా ఎన్నో విచిత్రమైన పరీక్షలు కనిపిస్తాయి. వాటి గురించి తన చెల్లెలు ఊర్మిళతో ఇలా చెప్పుకుంటుంది సీతమ్మ... ఇనవమ్మ ఊర్మిళా నా ముద్దు చెల్లెలా/ ఇమర మొక్క వార్త తెలిపేదా/ హెచ్చుకను గొన్య రామలక్ష్మణులెల్ల ఎచ్చుగా చేసీరీసవాస/ ఏడు ఏండ్ల నాడు ఎండిన/ గజ నిమ్మపండ్లు తెమ్మన్నాడు మీ బావ/ ఆ యిష్ణు వాల్మీకి మునులెల్ల సూడాక/ పండ్లు తీసకొస్తీ నీ తోడ/ రాతి ఆవును చేసి మట్టి దూడను ఇడిసి/ పాలు దెమ్మన్నాడే మీ బావ/ ఆ యిష్ణు.../ పాలు తీసకొస్తి నీ తోడ/ ఏడు ఏండ్లనాడు ఎండిన పాడుబావి/ నీళ్లు తెమ్మన్నాడే మీ బావ/ ఆ యిష్ణు.../ ఆ నీళ్లు తీసకస్తీ నీ తోడా/ కట్టిందే సలవ సీరా పెట్టిందే సాదు సుక్క/ సెదరకుండా అగ్గి తెమ్మన్నాడే నీ బావ/ ఆ యిష్ణు.../ అగ్గి తీసకవస్తీ నీ తోడా/ ఏడు బండ్లా కట్టెగుండానికమర్చి/ ఎల్లి రమ్మన్నాడే మీ బావ/ ఆ యిష్ణు.../ అగ్గి దూకి వస్తి నీ తోడ... అగ్గి తీసకస్తీ నీ తోడ.. ఏడేళ్ల కిందట ఎండిపోయిన గజ నిమ్మపండ్లు తెమ్మనడం, ఏడేళ్ల నాడు ఎండిపోయిన పాడుబడిన బావి నీళ్లు తేవాలనడం, ఏడు బండ్ల కట్టెలతో అగ్ని గుండం ఏర్పాటు చేసి నడిచి రమ్మనడం.. ఇలా ఏడుకి పెద్దపీట వేశారు జానపదులు.. బహుశా ఏడడుగుల బంధాన్ని గుర్తుచేస్తూ కాబోలు! సీతమ్మ ఆవేదనకి సూక్ష్మంగా బొమ్మకట్టే పాటిది.
  మహాభారతంలో సుభద్ర తన కొడుకు అభిమన్యుడికి బలరాముడి కూతురు శశిరేఖను ఇమ్మంటుంది. కానీ, అడవుల పాలైన పాండవుల ఇంటికి తన బిడ్డని పంపడం అతనికి ఇష్టముండదు. ఈ నేపథ్యంలో జానపదులు అల్లిన పాట ఇది. ‘‘సుభద్ర: సిన్నాది శశిరేఖ చిన్నవాడు అభిమన్యు యిద్దరికీ డేరన్నా ఓ బలరామన్నా యిద్దరికీ డేరన్నా/ పుట్టింది శ్రీ పుత్రి పుట్టినప్పుడు వాశ పుట్టీనే నోస్తీరన్నా ఓ బలరామన్నా కన్నెనడగ వస్తిరన్నా/ బలరాముడు: ఉయ్యాల తొట్లల్లో ఊగేటి నా పుత్రి అడవుల కెటులంపుదూ ఓ సుభద్రమ్మా.../ పాలు హన్నము పెరుగు భుజియించే నా పుత్రి ఏపాకు తినపెడుదునా ఓ సుభద్రమ్మా.../ సుభద్ర: మేనత్త కొడుకని మెచ్చినన్నిచ్చినారూ హెచ్చు తక్కువ లెంచితీరా ఓ బలరామన్నా... పుట్టినప్పుడే శశిరేఖను నా ఇంటి కోడలిగా చేసుకోవాలనుకున్నాను అని సుభద్ర అంటే, ఉయ్యాల తొట్లలో ఊగుతూ పాలన్నం తినే నా బిడ్డని అడవులకు పంపి వేపాకు తిననిస్తానా అంటున్నాడు బలరాముడు. మరి మేనత్త కొడుకని ఆనాడు నన్ను అర్జునుడికి కట్టబెట్టారేం అని ప్రశ్నించిందామె. ఒకవైపు కూతురి మీద కన్నతండ్రి ప్రేమని, మరోవైపు చిన్ననాటి నుంచి అనుకున్న సంబంధం పట్ల ఓ మేనత్త ఆరాటాన్ని ఈ పాటలో ఆర్ద్రంగా చిత్రించారు జానపదులు.   
భాగవతం పరంగా చిన్ని కృష్ణుడి ఆగడాలు భరించలేక తల్లి యశోదతో మొరపెట్టుకున్నారు గోపికలు. వారి మధ్య వాదాలను జానపదులు ఎంత చక్కగా చిత్రించారో... గోపిక: పెరుగు చిలుకుచుండగా నా మరుగున నిలుచున్న క్రిష్ణుడు పెరుగు చారెడు వించుకోని జుర్రి పరుగిడి పోయినాడు/ యశోద: అడిగినంత వెన్న నీకు నే పెడుదేనే... పడుచులపై నీకు చలమేలనురా/ కృష్ణుడు: దేవరాకు పెట్టవలెనని యివరా కనుకొంటుయుంటిరి/ ఆ దేవుడేమొ జుర్రిపోతే తెలియకానా మీద పెట్టిరి! దేవుడికి పెట్టాలనుకున్న వెన్నను ఆ దేవుడే జుర్రిపోయాడని బుకాయిస్తున్నాడు కన్నయ్య. జానపదుల జీవన మాధుర్యానికి నిదర్శనాలు ఈ గీతాలు.


వెనక్కి ...

మీ అభిప్రాయం