కర్షక కవి.. అభ్యుదయ రవి

  • 35 Views
  • 0Likes
  • Like
  • Article Share

    అప‌ర్ణ‌శంక‌ర్‌

హలాన్ని పట్టి.. ధర్మఘర్మ జలాల చేరిక చేసి.. భువి ధాన్యపు మొలకలను ముంచెత్తడం మాత్రమే కాదు, అక్షరసేద్యం చేసి కవితార్తుల ఆకలి తీర్చగలిగినవారిలో దువ్వూరి రామిరెడ్డి ముఖ్యులు. కవికోకిలగా గుర్తింపు పొందినా, కర్షక పక్షపాతి అన్న మాటకు పొంగిపోయే మంచి మనిషి. సరళ పదజాలంతో, ఊహలకు తావు లేని వర్తమానాన్ని కన్నులకద్దినట్లు చూపించటంలో ఆయనది అందెవేసిన చేయి. ఇది ఆయన 125వ జయంతి సంవత్సరం. 
శ్రమజీవికి
మాత్రమే అనుభవైక వేద్యమైన శ్రమైకజీవన సౌందర్యాన్ని వర్ణించగల హృదయం ఉంటుందనటం దువ్వూరి రామిరెడ్డి విషయంలో అనపేక్షం. తెలుగు సాహిత్య వినీలాకాశంలో చల్లటి వెన్నెల లాంటి కవితలను పరిచిన దువ్వూరి, 1895 నవంబరు 9న నెల్లూరు జిల్లా గూడూరులో సుబ్బారెడ్డి, లక్ష్మీదేవమ్మ అనే రైతు దంపతులకు జన్మించారు. మూడో ఫారం వరకు గూడూరులోనే హర్వీ అనే ఆంగ్లేయుడి దగ్గర చదువుకున్నారు. అంతలోనే తండ్రి మరణించడంతో ఆయన ఆంగ్ల విద్యకు ముగింపు పలకాల్సి వచ్చింది. అయితే.. అంతఃప్రేరణ, పరిశీలన, కౌతుకతలు సగటు మనుషులను సైతం మనీషులుగా తీర్చిదిద్దగలవన్న మాటకు దువ్వూరి జీవితం మంచి ఉదాహరణ. 
      ప్రాథమిక విద్య చదువుతున్న కాలంలోనే విదేశీ కెమెరాతో పోటీపడగల కెమెరాను రూపొందించారు దువ్వూరి. అందుబాటులో ఉన్న దేశీయ ముడిసరుకుతోనే ఒక వైర్‌లెస్‌ రేడియోనూ తయారుచేశారు. అలా దువ్వూరి పరిశీలనా శక్తి ఆయనను మెకానికల్‌ ఇంజనీరింగ్‌ తదితర విజ్ఞానశాస్త్రాల వైపు ఆకర్షింపజేసినా, క్రమేపీ ఆ దృష్టి శిల్ప, చిత్రకళల మీదకు మళ్లింది. సహజ జ్ఞాన పిపాస ఆయనను కలకత్తాలోని రామకృష్ణ పరమహంస ఆశ్రమానికి చేర్చింది. ఆశ్రమ నివాసం దువ్వూరి మనసును సాహిత్యానికి చేరువ చేసింది. ఆ తృష్ణతో, తరగని పట్టుదలతో సంస్కృత, బెంగాలీ భాషలను క్షుణ్ణంగా నేర్చుకున్నారు. తర్వాత మాతా శారదా దేవి ఆదేశానుసారం స్వస్థలానికి చేరుకుని, పుస్తకపఠనాన్ని కొనసాగించారు. స్వయంకృషితో తమిళం, ఆంగ్లం, ఉర్దూ, పర్షియన్‌ భాషలను నేర్చుకున్నారు. పలు భాషల గ్రంథాలను విస్తారంగా చదివారు. వైష్ణవ మధుర భక్తి భావం, సంస్కృత కావ్యాల సంప్రదాయాలు, సమకాలిన ఐరోపా ప్రతీక వాదం, ఆంగ్ల కాల్పనిక కవుల భావ వైఖరి, పారసీక కవుల తాత్వికతను ఆకళింపు చేసుకున్నారు. ఎన్ని పుస్తకాలు ఎంతగా ప్రభావితం చేసినా కవితావస్తువును ఎన్నుకోవటంలో, సూటిగా సలలితంగా తన భావాన్ని వ్యక్తీకరించటంలో స్వతంత్రతను ప్రదర్శించారు దువ్వూరి. ఆయన కావ్యాలూ, ఆయనలానే నిరాడంబరమైనవి. ప్రాచీన, నవ్య సంప్రదాయాల్లో వేటిని అనుసరించాలో తేల్చుకోలేని తెలుగు యువతరానికి తన నూతన ఒరవడితో మార్గనిర్దేశం చేశారు దువ్వూరి. 
ఆ సంఘటనే మలుపు 
తల్లి కోరిక మేరకు పందొమ్మిదో ఏట శేషమ్మను రామిరెడ్డి వివాహం చేసుకున్నారు. ఆవిడ కూడా ఆయన గ్రంథ పఠనాభిలాషకు చేతనైనంత తోడ్పాటునందించారు. ఆ సమయంలో ఓ గ్రంథాలయంలో జరిగిన ఒక సంఘటన ఆయన జీవితాన్ని సాహిత్య రచనకు చేరువ చేసింది. కవిత్వం పూర్వజన్మ సంస్కార జనితమనీ, అభ్యసనం, ధారణల వల్ల అబ్బే విద్య కాదనీ, పుస్తకపఠనంతో పాండిత్యాన్ని పొందగలరేమో కవిత్వాన్ని చెప్పలేరంటూ సాగుతోన్న ఒక అవధాని వ్యాఖ్యానం.. అక్కడే ఉన్న యువ దువ్వూరి మనసును గాయపరచింది. దిగ్గున లేచి ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ లేదంటూ ఆ కవితో వాగ్వాదానికి దిగారు. ఆ క్షణంలో కవితారచనను సవాలుగా స్వీకరించిన దువ్వూరి కలం నుంచి, తెలుగుతల్లి ఒడలు పులకరించేంతగా కవితాఝరి ప్రవహించింది. ఖండకావ్యాలుగా, ప్రబంధాలుగా, నాటకాలుగా, అనువాదాలుగా, విమర్శనా వ్యాసాలుగా పెల్లుబికింది. గృహమే విద్యాలయంగా, తిక్కన లాంటి అపూర్వ కవుల ఏకలవ్య శిష్యరికంలో ఆయన రచనావ్యాసంగం కొనసాగింది.  
      కట్టమంచి రామలింగారెడ్డి రచించిన ‘ముసలమ్మ మరణం’తో ఎంతో ప్రభావితుడైన దువ్వూరి తన ఊరి సమీప ప్రజలు దేవతగా భావించే నలజారమ్మ కథ మీద పరిశోధన చేశారు. అలా ‘నలజారమ్మ అగ్నిప్రవేశం’ అనే కావ్యాన్ని రచించి చిన్ననాడే మరణించిన తన చెల్లెలికి అంకితమిచ్చారు. నలజారమ్మ ఇతివృత్తం దువ్వూరి తల్లి లక్ష్మీదేవమ్మ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చింది. నలజారమ్మ-  వెంకటరెడ్డి అనే రైతు దంపతుల కథ ఇది. ఎంతో అన్యోన్య దాంపత్యం వారిది. పెళ్లయిన చాన్నాళ్లకు నలజారమ్మ గర్భం ధరించింది. ఊచబియ్యం తినాలనిపించటం లేదనీ, తెల్ల జొన్న కంకులు తెమ్మని భర్తను కోరింది. అడవి పందులు, దున్నలు ఆవుల నుంచి రాత్రంతా పైరుకు కాపలా కాసి నిద్రమత్తులో తమ పొలమనుకుని పక్కవారి పొలంలో కంకులు కోసుకొస్తాడు భర్త. ఫలితంగా మరణదండన పొందుతాడు. నలజారమ్మ తండ్రి పెంచలరెడ్డి బాధ పడుతూ ఈ విషయాన్నంతా బాలింత అయిన కూతురికి చేరవేస్తాడు. తప్పునకు ధనిక పేద తారతమ్యాలు ఉండకూడదని హితవు చెప్పి ప్రభుత్వ శిక్షకు తలవంచిన నలజారమ్మ, భర్తతో పాటే తాను అంటూ అగ్నిప్రవేశం చేయటంతో కథ ముగుస్తుంది. 20 ఏళ్ల వయసులోనే పట్టుదలతో అచ్చమైన తెలుగు పల్లెల వర్ణన, పచ్చని పొలాలు, చెరుకు గానుగలు, చేదోడువాదోడుగా మెసలే భార్యాభర్తల దృశ్యాలతో కరుణరసాత్మక కావ్యాన్ని రచించి పెద్దల ప్రశంసలను పొందారు దువ్వూరి. అనంతరం ‘వనకుమారి’ కావ్యంతో ఆయన కీర్తి మరింత ప్రకాశించింది. 
తొలితరం అభ్యుదయవాది
అణచివేతకు గురవుతున్న రైతుల పీడిత బతుకు గాథలే ఇతివృత్తంగా ‘కృషీవలుడు’ అనే మహత్తర కావ్యానికి ప్రాణం పోశారు దువ్వూరి. ‘‘అన్నా! హాలిక! నీదు జీవితము నెయ్యంబార వర్ణింపగా/ ఇతరుల్భగ్నాశులై నన్నున్‌ కర్షక పక్షపాతియని నిన్దావాక్యముల్‌ పలకరే!’’ అంటూనే ‘‘సైరికా! నీవు భారత క్ష్మాతలాత్మ గౌరవ పవిత్రమూర్తి’’వంటూ తన హృదయాన్ని వెలిబుచ్చేందుకు తనకు భావస్వాతంత్య్రముందని, అళుకు అవసరం లేదని సమర్థించుకుంటారు. ‘కృషీవలుడు’ ద్వారా సగటు రైతు నిత్య విధులను, కుటుంబ బంధాలను, బాధ్యతలను, మనోస్థితిని ఉన్నది ఉన్నట్లుగా ఓ దృశ్య కావ్యంగా పాఠకలోకానికి అందించారు.   
      ‘‘సమయమమూల్యమొక్క నిమిషంబు వృథాచన గ్రమ్మరింపనే/ రము మన ఆయువా త్రుటి..’’ అంటూనే కాలం, జీవితం విలువ గురించి మరీ ముఖ్యంగా శ్రామిక జీవనానికి, వృథా కాలయాపనకు గల భేదాన్ని వివరించటంలో దువ్వూరి పద్యరచనా చతురత అవగతమవుతుంది. కవిత్వం రాయటానికి, ప్రజలకు సందేశం పంపటానికి ఏ సుందర హిమశిఖర ప్రాంతమో, మరే చినుకుదారి పెద్ద ప్రయాణమో లేదా ఏ భావుకుడి విరహగీతమో మాత్రమే అర్హమైనవనే భావనలో మునిగిన జనానీకం కళ్ల ముందుకు కర్షక సోదరుణ్ని స్వాగతించి సమ్మోహనపరచారు దువ్వూరి. వాస్తవిక జీవితాన్ని ప్రతిబింబించే కవిత్వం ఆయనది. అందుకే తొలితరం అభ్యుదయ వాదిగా ఎందరో కవులకు మార్గదర్శకుడైన దువ్వూరికి 1929లో ‘కవికోకిల’ బిరుదునిచ్చి సత్కరించి పులకించింది ఆంధ్రదేశం.
తనవితీర్చే ‘పానశాల’
జాతీయవాదిగా, స్వాతంత్య్ర సమర యువ కవికిశోరంగా ప్రజలను చైతన్యవంతులను చేస్తూ పలు కవితలను వెలువరించారు దువ్వూరి. ఆయన వెలువరించిన ‘నైవేద్యం’ భారతమాత చరణ పూజ కోసం తరలిన తనయుల శైలిని గొంతెత్తి పలికింది. ‘ద్రౌపదీ సందేశం’తో భారత జాతీయత గురించి వ్యంగ్యంగా ప్రబోధించినా, ‘మాతృశతకం’తో వేడి నెత్తురును ఉరకలెత్తించినా అది ఆయన కలానికే సాధ్యమైంది. ప్రజల్లో ఉద్యమాగ్నిని ప్రజ్వలింపజేసిన ‘మాతృ శతకం’ పుస్తకాన్ని ముద్రణా దశలోనే బ్రిటిష్‌ ప్రభుత్వం నిషేధిత గ్రంథాల్లో చేర్చింది. నరనరానా స్వతంత్రేచ్ఛను నింపుకున్న దువ్వూరి, 1920-25 సంవత్సరాల మధ్యలో మదరాసు నుంచి వెలువడిన సమదర్శిని అనే పత్రికకు తొమ్మిది నెలలు సంపాదకత్వం వహించారు. మరోవైపు తాను రాసిన కావ్య ఖండికల్లో కొన్నింటిని 1923లో ‘ది వాయిస్‌ ఆఫ్‌ ది రీడ్‌’ పేరిట ఆంగ్లంలోకి అనువదించారు. భారతీయుల ఆంగ్ల భాష మీద చులకనతో వారు రాసే ఆంగ్ల కావ్యాలకు పీఠికారచన చేయనన్న కజిన్స్‌.హెచ్‌.జేమ్స్‌ ఈ అనువాదానికి అద్భుతమైన ఉపోద్ఘాతం రాయడం విశేషం.   
      కూతురు పుట్టిందన్న సంతోషం మనసారా అనుభవించకముందే తల్లీకూతుళ్లు లోకాన్ని విడిచిపెట్టి దువ్వూరి జీవితాన్ని అంధకారంలోకి నెట్టేశారు. సతీవియోగ బాధతో వెలువరించిన ‘భగ్న హృదయం’ ఆయన సున్నిత మనస్తత్వాన్ని నిరూపిస్తుంది. తీవ్ర మానసిక వేదనను అనుభవిస్తున్న రామిరెడ్డికి ఉమర్‌ ఖయ్యాం రుబాయతులు కాస్త ఊరటనిచ్చాయి. అంతకు ముందే నేర్చుకున్న పర్షియన్‌ భాష ఆయనకు ఈ రకంగా సాయపడింది. పర్షియన్‌ రుబాయతులను ‘పానశాల’ పేరిట దువ్వూరి చేసిన తెలుగు సేత ఎందరో చదువరుల కవితా దాహం తీర్చింది.
గతము గతంబె ఎన్నటికి కన్నుల గట్టదు, సంశయాంధ సం
వృతము భవిష్యద్దర్శము, వివేకవతీ ఒక వర్తమానమే 
సతతమవశ్యభోగ్యమగు సంపద, రమ్ము విషాదపాత్రకీ 
మతమున తావు లేదు క్షణమాత్ర వహింపుము పానపాత్రికన్‌!

      వ్యధాభరితసంసారం గురించి దిగులు చెందక వర్తమానంలో జీవించటమే మేలని తోటివారికి ఇలా బోధించారు. ఉమర్‌ ఖయ్యాం రుబాయతుల్లో నిగూఢమైన ప్రకృతి తత్వ దర్శనం కనబడుతుంది. జనన మరణ చట్రంలో కోరికలకు బందీలైన మనుషులు ప్రబల విషయ వ్యసనాలకు చిక్కే క్రమంలో తలెత్తే సంఘర్షణలకు సమాధానాలు ఇందులో తారసపడతాయి. అందుకే ఆదిభట్ల నారాయణదాసు, చిలుకూరి నారాయణరావు, కాదూరి గోపాలరావు లాంటి ఎందరో ప్రముఖులు వీటిని ఆంధ్రీకరించటానికి ఆసక్తి చూపారు. అయితే అన్ని అనువాదాల కన్నా దువ్వూరి ‘పానశాల’ గొప్ప ప్రాచుర్యం పొందింది. ఈ భూలోకం ఒక చదరంగం. రేయింబవళ్ల గడుల్లో విధి అనే ఆటగాడు ఆడుకునే పావులమే మనం. ఆయన ఆడించిన ఆటల్లో రాజు బంటు తేడాల్లేవు. ఒక్కొక్కరినీ క్రమక్రమంగా సమాధి పెట్టెలో చేరేస్తాడన్న ఆలోచన ఎంత చిత్రమైనదో కదా! ఇదే కావ్యంలో మరోచోట ‘‘అంబరంబొక చిత్రగీతంబు;/ రవియు దీపపున్‌ శెమ్మె, లోకంబు తెరపటంబు; నీడబొమ్మలు మనుజులు;/ నిఖిలమునకు కాలచక్రంబు నిర్ణేత; గతి యనాది’’ అంటూ సాగిన పద్యం మానవ జీవన చిత్రాన్ని చూపిస్తుంది. ఒకే భావంతో విరచితమైన రుబాయతులను ఉన్నదున్నట్టుగా తర్జుమా చేయకుండా భావం చెడకుండా క్రోడీకరించి అనువదించారు దువ్వూరి. ‘‘నా ఆంధ్రీకరణము మూలమునకు టీకవలెనుండదు. తిక్కన, శ్రీనాథుడు, మున్నగు అనువక్తల స్వాతంత్య్రమును నేనును వహించితిని. అనుట వలన నా తర్జుమా మూలముకంటే భిన్నముగనుండునని చెప్పుటకాదు. పారశీక జాతీయములలో ప్రకటింపబడిన భావము తెలుగులో అట్లే స్ఫురించుటకు ఆవశ్యకములైన మార్పులను రసపోషణమునకు వలయు కూర్పులను కావించితిని’’ అని చెప్పుకున్నారు రామిరెడ్డి. ఆయన ఆశించినట్టు ఈ సేతను సహృదయులు ఆదరించారు. 
తెలుగుందోటల పచ్చబీళ్లననురక్తిం బానశాలా ప్రతి
ష్ఠలు గావించి ఖయాము కావ్యరస భాండంబుల్, గులాబీలు బు
ల్బులి పిట్టల్‌ మధుపాన పాత్రికలు సొంపుల్‌ గొల్కు సాఖీయు, భూ 
తల నాకంబొనరింప నిల్పి రసికాంధ్ర ప్రీతి గావించితిన్‌ 

అంటూ భార్యావియోగంతో అల్లల్లాడుతున్న తన మనసుకు స్వాంతన చేకూర్చిన రుబాయతులను రసికాంధ్రుల కోసం తెలుగు చేశానంటూ పానశాల గురించి ప్రకటన చేశారు దువ్వూరి. ఇదే కాదు, షేక్‌ సాదీ రుబాయతుల్లోంచి తెనుగులోకి వచ్చిన గులాబీ తోట, పండ్ల తోటలు కూడా తప్పక చూడాల్సినవే. 
దర్శకుడైన తొలి కవి
దువ్వూరి ప్రకృతి ప్రేమికుడు. కాబట్టే గరిక సైతం ఆయనకు కవితావస్తువయ్యింది. ‘‘దైవసృష్టివి నీకు తావెందుగలదు, నేను నీ పైన నెనరూనియుందు’’ అంటూ గరికను ఆదరించటం ఆయనకే సాధ్యమైంది. గోపకులం మీదకు మరలిన ఆయన దృష్టి ‘వనకుమారి’కి రూపునిచ్చింది. దువ్వూరి ‘జలదాంగన’ కావ్యం భూగోళ రహస్యాల ఖజానా. దువ్వూరి మీద కీట్స్, విశ్వకవి రవీంద్రుల ప్రభావం చాలా ఉంది. ‘ఫలితకేశం, పిచ్చిబికారి’ లాంటి ఆయన రచనల్లో తాత్వికత తొణికిసలాడటానికి వారే కారణం కావచ్చు. సాహిత్యమే శ్వాసగా సాగిన దువ్వూరి రచనల ప్రణాళిక, పాత్రలు, సన్నివేశాల రూపకల్పన, తనకెదురైన సంఘటనలు, చూసిన నాటకాలు, చదివిన పుస్తకాల మీద స్పందనను డైరీలో రాసుకునేవారు. ‘రసికజనానందం, స్వప్నాశ్లేషం, అహల్యానురాగం, కృష్ణరాయబారం’  అనే గ్రంథాలను రచించారు. ‘కుంభరాణా’ అనే ఆయన విషాదాంత నాటకం చాలా ప్రసిద్ధమైంది. ఇవే కాకుండా ‘మాధవ విజయం’ నాటకం, ‘ఋతు సంహారం, పుష్పబాణ విలాసం’ లాంటి ఎన్నో అనువాదాలు ఆయన కలం నుంచి జాలువారాయి.
రామిరెడ్డి మంచి విమర్శకులు కూడా. సహజంగా రచన లోతుపాతులు తెలిసినవారే మంచి విమర్శకులు కాగలరు. ‘అల్లసాని పెద్దన సమకాలీన భావ ప్రతినిధి’ తదితర దువ్వూరి సాహిత్య వ్యాసాలు చెప్పుకోదగినవి. ఈ బహుముఖ ప్రజ్ఞాశాలికి సినిమా రంగంలోనూ ప్రవేశం ఉంది. 1936 లో ‘సతీ తులసి’ చిత్రానికి కథ, మాటలు రాశారు. ‘చిత్రనళీయం’ చిత్రానికి దర్శకత్వం వహించారు. చలనచిత్ర దర్శకుడైన తొలి తెలుగు కవి దువ్వూరి. అక్కినేని తొలి తెలుగు చిత్రం ‘సీతారామ జననా’నికి సంభాషణలు అందించారు. ‘వేంకటేశ్వర మాహాత్మ్యం, పార్వతీ పరిణయం’ తదితర చిత్రాలలో ఆయన రాసిన పద్యాలు, పాటలు నేటికీ తెలుగు వారిని పులకితగాత్రులను చేస్తాయి.  
అముద్రితాలెన్నో!
అభ్యుదయ కవిత్వం గురించి శ్రీశ్రీ ఒక వ్యాసం రాస్తూ ఆధునిక కాలంలో మొట్టమొదటి వచనగేయం రాసిన ఘనత దువ్వూరిదేనని చెప్పారు. అయితే రైతు నిరాడంబర జీవితాన్ని, మితిమీరిన కాంక్షలు లేని సాధారణ జీవనశైలిని ప్రశంసిస్తూ ఆయన రాసిన ‘కర్షక విలాసం’ నాటకం ముద్రణకు నోచుకోకపోవటం దురదృష్టకరం. దువ్వూరి డైరీలో ఆయన చేతిరాతతో లభ్యమైన ఆ నాటకం నేటికీ గ్రంథస్థం కాలేదు. ధ్రువ అనే మరో నాటకం, ప్రాణస్నేహితుడు రేబాల లక్ష్మినరసారెడ్డి మరణించినపుడు రాసిన పద్యాలు, తన తెలుగు గురువుకు స్మృత్యంజలి ఘటిస్తూ వెలువరించిన పద్య సంపుటి, మరికొన్ని పద్యరచనలు, కథలు, ఆంగ్ల జాబులు.. ఇలా దువ్వూరి అముద్రిత రచనలు కోకొల్లలు. వాటి మీద సాహిత్యకారులు తగిన పరిశోధనలు జరిపి వెలుగులోకి తేవాలి. అమూల్యమైన ఆయన కవిత్వాన్ని ఇప్పటికైనా సంపుటీకరించలేకపోతే తెలుగు సాహిత్యానికే నష్టం!   
‘‘నీవూ నేనను తారతమ్యమిహమందే గాని...’’ అంటూ ఎంతటి వారైనా ఎవరూ ఇక్కడే ఉండిపోలేరనీ, ఎప్పుడో ఒకప్పుడు ఈ విశ్రాంతి గృహాన్ని కొత్తవారికి వదిలి వెళ్లిపోవాల్సిందేన్నారు రామిరెడ్డి. ఈ ‘కవికోకిల’ తన కవితాకూజితాలను తెలుగువారికి వదిలి 1947 సెప్టెంబర్‌ 11న తుదిశ్వాస విడిచారు. రైతు మనసును, గ్రామీణ జీవన సౌందర్యాన్ని, ప్రశాంతతను అర్థం చేసుకున్న ‘కర్షక కవి’ దువ్వూరి నిస్సందేహంగా 20వ శతాబ్ది అగ్రశ్రేణి కవుల్లో ఒకరు.


వెనక్కి ...

మీ అభిప్రాయం