వైవిధ్య కథా ముద్ర

  • 67 Views
  • 0Likes
  • Like
  • Article Share

తెలుగు కథా సాహిత్యంలో చిన్న కథని పోషించి, పటిష్టమైన నిర్మాణంతో జవసత్వాలు అందించిన విశిష్ట కథా రచయిత బండారు ప్రసాద్‌ కరుణాకర్‌. బి.పి.కరుణాకర్‌గా ప్రసిద్ధులైన ఆయన కథాకథనం, ఎత్తుగడ, ముక్తాయింపు, ముఖ్యంగా శీర్షిక నిర్దేశం వినూత్నం. గైడి మపాసా, ఓ హెన్రీ, మార్క్‌ ట్వైన్, సోమర్‌సెట్‌ మామ్‌ లాంటి కథా రచయితల్లో కనిపించే క్లుప్తత, గోప్యత, కొసమెరుపు ఆయన కథలను మేటిగా నిలుపుతాయి. గుంటూరులో పుట్టి పెరిగిన కరుణాకర్‌ హైదరాబాదులోని భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (భెల్‌) ఉన్నతాధికారిగా ఉద్యోగ విరమణ చేశారు. ఒకపక్క ఉద్యోగ బాధ్యతల్లో ఉంటూనే కథా రచనను ఉత్సాహంగా, అత్యంత ఇష్టంగా కొనసాగించారు. 
      1962లో చిత్రగుప్తలో ఆయన మొదటి కథ అచ్చయ్యింది. దేశి కథలను నిశితంగా పరిశీలిస్తూనే చైనీస్, మెక్సికన్, ఇటాలియన్‌ కథల గమనం మీద అవగాహన పెంచుకున్నారు. అలా తన సృజన పరిధిని విస్తృతం చేసుకుని వైవిధ్యమైన కథా రచన చేశారు. ‘అంబాలిస్, నిర్నిమిత్తం, రాజితం’ తదితర కథా సంపుటాలు వెలువరించారు. ఆయన కథలు చాలా వరకు ఆంగ్లం, హిందీల్లోకి అనువాదమయ్యాయి. పలు విశ్వవిద్యాలయాల్లో ఆయన కథల మీద పరిశోధనలు జరిగాయి. ‘కోచెరగు, మమ్మూర్తి, తూనిక, నీళ్లు, నీటిబీట, ఇరుకు పదను’ ఇలా శీర్షికల్లో కథకు సంబంధించిన సూచన చేయకుండా రాయడం ఆయన ప్రత్యేకత. కథను పూర్తిగా చెప్పకుండా ముగింపు పాఠకుడి ఊహకు వదిలిపెట్టడమే సడన్‌ ఫిక్షన్‌ అనేవారు కరుణాకర్‌. కథను నడపడంలోనూ చాలా నేర్పు ప్రదర్శించేవారు. చిన్న కథని సమున్నత స్థాయికి తీసుకెళ్లిన ఆయన జులై 18న హైదరాబాదులో ఆఖరి శ్వాస విడిచారు. కరుణాకర్‌కు ఇద్దరు కుమార్తెలు. భార్య హేమలత చాలా ఏళ్ల కిందటే కన్నుమూశారు. 


వెనక్కి ...

మీ అభిప్రాయం