ఆస్ట్రేలియాలో తెలుగు రెపరెపలు

  • 76 Views
  • 0Likes
  • Like
  • Article Share

ఆస్ట్రేలియాలో మన భాషకు అరుదైన గౌరవం లభించింది.  తెలుగును తమ దేశ సామాజిక భాష (కమ్యూనిటీ లాంగ్వేజ్‌)గా గుర్తిస్తూ అక్కడి ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులిచ్చింది. అలా భారతదేశం వెలుపల తెలుగును అధికారికంగా గుర్తించిన దేశంగా ఆస్ట్రేలియా నిలిచింది. ఆరేళ్లుగా అక్కడి తెలుగు సమాఖ్య చేసిన నిరంతర ప్రయత్నాలతోనే ఇది సాధ్యమైంది.
విభిన్న
సంస్కృతులు, సంప్రదాయాలకు నిలయమైన ఆస్ట్రేలియాలో దాదాపు మూడు వందలకు పైగా భాషలు మాట్లాడేవారున్నారు. వీటిలో 47 భాషల్లో అక్కడి నేషనల్‌ అక్రిడిటేషన్‌ అథారిటీ ఫర్‌ ట్రాన్స్‌లేటర్స్‌ అండ్‌ ఇంటర్‌ప్రెటర్స్‌ (నాటి) పరీక్షలు నిర్వహిస్తోంది. వీటిలో భారతీయ భాషలు హిందీ, పంజాబీ, తమిళం కూడా ఉన్నాయి. ప్రస్తుతం 48వ భాషగా తెలుగు ఆ జాబితాలో స్థానం సంపాదించింది. అయితే, ఈ గుర్తింపు కోసం ఆస్ట్రేలియా తెలుగు సమాఖ్య పెద్ద కృషే చేసింది.
      ఆస్ట్రేలియాలో దాదాపు ప్రతి రాష్ట్రంలో తెలుగు సంఘాలున్నాయి. పండగలు, ఇతర సందర్భాల్లో వాటి ఆధ్వర్యంలో సాహితీ, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. తెలుగుని సామాజిక భాషగా గుర్తించాలని కోరుతూ 2014లో ఆస్ట్రేలియా కేంద్ర ప్రభుత్వానికి తెలుగువారు వినతిపత్రం అందించారు. కానీ, 2011 గణాంకాల ప్రకారం దేశంలో తెలుగు ప్రజలు 7,400 మంది కంటే తక్కువగా ఉన్నట్టు తేలడంతో ఆ విజ్ఞాపనను తిరస్కరించారు. దీన్ని సవాలుగా తీసుకుని ఆయా రాష్ట్రాల్లోని తెలుగు సంఘాలన్నీ ‘ఆస్ట్రేలియా తెలుగు సమాఖ్య’గా ఏర్పాటై విస్తృత ప్రచారం నిర్వహించాయి. తర్వాతి గణాంకాల్లో తెలుగు వారంతా ‘మీకు తెలిసిన ఇతర భాషలు’ అంశం దగ్గర తప్పనిసరిగా మాతృభాషని పేర్కొనాలని అవగాహన కల్పించారు. దీంతో 2016 గణాంకాల నాటికి తెలుగు వారి సంఖ్య 34,435కు చేరింది. కానీ, వాస్తవానికి ఈ సంఖ్య లక్ష వరకు ఉంటుందని అంచనా! న్యూసౌత్‌వేల్స్, విక్టోరియా రాష్ట్రాల్లోనే ఎనభై వేల మంది తెలుగువారు ఉంటారు. వీటన్నింటినీ వివరిస్తూ ‘నాటి’తో ఎఫ్‌టీఏఏ ప్రతినిధులు రెండేళ్ల పాటు జరిపిన సుదీర్ఘ చర్చల ఫలితంగా ఇటీవల తెలుగుకు సామాజిక భాష హోదా దక్కింది. 
ఇవీ ప్రయోజనాలు
తెలుగుకు సామాజిక భాష గుర్తింపు దక్కడంతో ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంటున్న వారితో పాటు ఇక మీదట చదువులు, ఉద్యోగాల కోసం అక్కడికి వెళ్లేవారికి చాలా ప్రయోజనం కలగనుంది. ముఖ్యంగా అక్కడ శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకునే వారికి అయిదు పాయింట్లు దక్కుతాయి. ఒకటి నుంచి పన్నెండో తరగతి వరకు ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లో తెలుగును ఐచ్ఛికంగా ఎంచుకునే అవకాశాన్ని ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రస్తుతం కల్పించింది. ఇలా ఎంచుకున్న వారికి ఉత్తీర్ణతలో అయిదు పాయింట్లు దక్కుతాయి. ఆస్ట్రేలియాలోని బళ్లలో తెలుగును బోధనా భాషగా చేర్చే అవకాశమూ కలుగుతుంది. తెలుగు వారికి ఉద్యోగ అవకాశాలూ పెరుగుతాయి. విమానాశ్రయాలు, వైద్యశాలలు, న్యాయస్థానాలు తదితరాల్లో తెలుగు అనువాదకులు, భాష్యకారుల సేవలు అందుబాటులోకి వస్తాయి. తెలుగు అనువాదకులు, భాష్యకారులు కావాలని ‘నాటి’ తన అధికారిక వైబ్‌సైట్‌లో ఇప్పటికే ప్రకటించింది. ఈ కృషిలో డాక్టర్‌ కృష్ణ నడింపల్లి (కాన్‌బెర్రా), ఆదిరెడ్డి యారా (అడిలైడ్‌), శ్యాం అంబటి (పెర్త్‌), గోపాల్‌ తంగిరాల (మెల్‌బోర్న్‌), శివ శంకర్‌ పెద్దిభొట్ల, వాణి మోటమర్రి (సిడ్నీ) తదితరులు కీలకపాత్ర పోషించారు. 
      ఆస్ట్రేలియా క్రెడెన్షియల్‌ కమ్యూనిటీ లాంగ్వేజ్‌ (సీసీఎల్‌) జాబితాలో తెలుగు లేకపోవడం వల్ల మన విద్యార్థులు హిందీ, ఇతర భాషల్లో పరీక్షలు రాస్తున్నారు. ఇక మీదట ఈ ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా ఆ దేశానికి వెళ్లే తెలుగువారు తమ సంస్కృతి, భాషను పరిరక్షించుకునే అవకాశం కలుగుతుంది. 2021లో జరగనున్న జనగణనలో మనవాళ్లు తమ మాతృభాషను తప్పకుండా ప్రకటించి, తెలుగువారి బలాన్ని చాటాలని ఆస్ట్రేలియా తెలుగు సంఘం పిలుపునిచ్చింది.


వెనక్కి ...

మీ అభిప్రాయం