మునుముకో ముద్దు!

  • 148 Views
  • 0Likes
  • Like
  • Article Share

    డా।। కాలువ మల్లయ్య

  • సాహిత్య పరిశోధకుడు
  • హైదరాబాదు
  • 9182918567
డా।। కాలువ మల్లయ్య

ప్రతి భాషా సమాజంలోనూ ఆ భాషకే ప్రత్యేకమైన పలుకుబడులుంటాయి. వీటినే నుడికారాలనీ, జాతీయాలనీ అంటారు. వీటి వాడకంతో ఆయా రచనలకు అద్భుత అందాన్ని తీసుకురావచ్చు. భాషలకు ఇవి ప్రత్యేక సంపదలు. తెలుగు భాషా దినోత్సవం (ఆగస్టు 29- గిడుగు జయంతి) సందర్భంగా తెలంగాణ పలుకుబడుల్లోని సౌందర్యం, అర్థగాంభీర్యత, అల్పాక్షరాల్లో అనల్పార్థ భావనల పరిచయమిది!
ఆయా
సమాజాల ప్రజల నోళ్ల నుంచి వెలువడి, జనవ్యవహారంలో నాని సజీవంగా ఉండేదే జీవద్భాష. ఇందులో అనేక పలుకుబడులుంటాయి. ఒకే భాషా సమాజంలోనూ ప్రాంతాలను బట్టి, వాటి చారిత్రక, సామాజిక, సాంఘిక, రాజకీయ నేపథ్యాలను బట్టి వివిధ పలుకుబడులు వాడుకలోకొస్తాయి. తెలంగాణ సమాజంలోనూ అంతే. తెలంగాణ భాష, తెలుగు భాష వేరు కావు. ద్రవిడ జన్య తెలుగులోని యాస భేదాల రూపాలు మాత్రమే. రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర జీవద్భాషలన్నీ తెలుగులోని అంతర్భాగాలే. వీటి రూపం, సారం, లిపి అన్నీ ఒక్కటే. ఇవన్నీ కలిపితేనే తెలుగు భాషవుతుంది. 
      తెలంగాణ పలుకుబడుల్లో కొన్ని మిగిలిన ప్రాంతాల వ్యవహారంలోనూ ఉన్నాయి. మరికొన్ని ఈ ప్రాంతంలో మాత్రమే వినపడతాయి. నా‘నుడులు’గా (నా భాషా పదాలుగా) ప్రసిద్ధమైన ఈ పదాలు లోతైన అర్థం కలవి. సామెతతో అల్పాక్షరాల్లో అనల్పార్థ భావాన్ని రాబట్టుకున్నట్టే పలుకుబడులతోనూ పొందవచ్చు. ఇవి సామెతల్లా చిన్న వాక్యాలు కూడా కావు. రెండు మూడు పదాల కూర్పు మాత్రమే. పలుకుబడుల్లో ఉండే ఆ వేర్వేరు పదాలు ‘పలుకుబడి’గా మారిన తర్వాత తమకున్న విడివిడి అర్థాన్ని కోల్పోయి ప్రత్యేకార్థాన్నిస్తాయి. తెలంగాణ ప్రజల వ్యవహారంలో వేల సంఖ్యలో ఉన్న వీటిని కొన్ని విభాగాలుగా విభజించవచ్చు.
అనుభవాల సారంగా 
జానపదులు అనేక విషయాలకు తమ అనుభవాల సారంలోంచి వచ్చిన పదబంధాలను విస్తృతార్థం వచ్చే రీతిలో పదిల పరుచుకున్నారు. ఒక పేరాలో, పేజీలో వివరించలేనంత అర్థం ఓ పదబంధం ద్వారా చెప్పవచ్చు. వీటిని సృష్టించడానికి వారికి ఏ చదువూ అవసరం లేదు. జీవితానుభవాలే ఆయా సందర్భాల్లో పలుకుబడులుగా వాళ్ల నోళ్లలో నానుతూనే ఉన్నాయి. నీ జీవితం ఎలా సాగిపోతుందని అడిగితే- ఏముందే జీవితంల అంతా ‘ఆగమాగమై పోయింది’ అంటారు. తనలోని ఆగం పదానికి భిన్నంగా జీవితమంతా గందరగోళంగా ఉంది, స్థిరత్వం లేని బతుకైంది అనే అర్థం ఇస్తుందీ పదబంధం. ‘ఊళ్లకు పోలీసులచ్చిరి గద.. పడుసుపోరగాండ్లను తీసుకపెయిండ్రు గద. ఊరెట్లుంది?’ అనే ప్రశ్నకు జవాబుగా ఒకే ఒక పలుకుబడి ద్వారా సమాధానం చెబుతాడు గ్రామీణుడు. దీన్ని ఎక్కువగా గొర్లకాపరి వృత్తి చేసే వాళ్లు వాడతారు. ఏం చెప్పుమంటవే ‘మందమీద తోడేలు పడ్డట్టయింది’ అనేది సమాధానం. ఇందులో అనల్పార్థముంది. గొర్రెల మంద మీద తోడేలు పడితే జరిగేదేంటి? తోడేలు ఏ గొర్రెను మెడ కొరుకుతుందో తెలియదు. ఎన్ని ప్రాణాలు పోతాయో తెలియదు. మందలో తొక్కిసలాట.. భయంతో అరుపులు.. పరిగెత్తాలని చూడటం.. ఇవన్నీ జరుగుతాయి. నక్సలైట్‌ ఉద్యమం బాగా ఉన్న సమయంలో తెలంగాణ గ్రామాల్లో ఇలాంటి దృశ్యాలే కనిపించేవి! నిజాం పాలన కాలంలో తహసీల్‌ వసూలుకు అధికార్లు వచ్చినప్పుడూ ఈ పరిస్థితులే ఉండేవి. దీనికి సమానార్థకంగానే ‘మిన్నువిరిగి మీద పడ్డట్టు’ అనే పదబంధమూ వచ్చింది. ఏం రామయ్యా! బాగనే కష్టపడుతున్నవుగద.. జీవితం ఎలా సాగుతుందన్న ప్రశ్నకు- ఏముంది నా పని ‘గట్టుకు కట్టెలు మోసినట్టే’ ఉంది. ఎంతసేసినా ‘ఏడ్చేమాన్కలన్నట్టుంది’. ‘గడియరికా లేదు గవ్వరాకట్లేదు అన్నట్టుంది’ అనే సమాధానాలొస్తాయి. తాను చేసిన పనికి తగిన ప్రతిఫలం లభించనపుడు కలిగే విరక్తి భావం నుంచి ఇలాంటి నుడికారాలు పుట్టాయి.
వ్యవసాయ, వృత్తి పదబంధాలు
దేశంలో ఇప్పటికీ అత్యధికులు వ్యవసాయం, సాగు ఆధారిత పనులు, వృత్తి పనుల ద్వారానే జీవిస్తున్నారు. ఇప్పటికీ, ఎప్పటికైనా దేశానికి గ్రామాలే పట్టుగొమ్మలు. గ్రామాలే బతుకు పుస్తకాలు. అలాంటి గ్రామీణ, వ్యావసాయిక, వృత్తి పనుల్లోంచి అనేక పదబంధాలు పుట్టాయి. ఇందులో కష్టసుఖాల కలబోతలున్నాయి. వాడు ‘ఆసుగొట్టం లెక్క’ తిరుగుతనే ఉంటడు.. ‘మోటగారోలె’ కదుల్తనే ఉంటడు అంటారు. ఆసుగొట్టం చేనేత వృత్తిలో మగ్గం నేసేందుకు కండెల తయారీలో వాడే సాధనం. కదురు మగ్గంలోని భాగం. వీటికి విశ్రాంతి అనేది ఉండదు. అలాగే మోట ద్వారా బావి నుంచి నీళ్లు తోడేటప్పుడు దండెకు దెండె గారె మీది నుంచి వస్తుంది. మోట నడుస్తూ ఉంటే దండెడ పోవడానికి మోటగారె గుండ్రంగా తిరుగుతూనే ఉండాలి. బొక్కెన లోపలికెళ్లేప్పుడూ అంతే. విశ్రాంతి లేకుండా నిరంతరం తిరిగే లేదా పనిచేసే వారి గురించి ఇలా చెబుతారు.  
‘ఎద్దుకో నాగలి ఇగురం లేనెవుసం, ఒంటెద్దు బాయిగాడు’ లాంటి వ్యవసాయ వృత్తి సంబంధ పదబంధాలనేకం ఉన్నాయి. కాలాన్ని బట్టి, కార్తులను బట్టి సమయానుకూలంగా దుక్కిదున్నడం, నారుపోయడం, పంటవేయడం, కలుపుతీయడం, మడిని తడపడం, మందులు వేయడం, పంట నూర్చడం చేస్తేనే సరైన పంట వస్తుంది. వచ్చిన పంటను ధరున్నప్పుడు అమ్ముకోవాలి. ఇవేవీ చేయకుండా వ్యవసాయం ద్వారా నష్టాలు కొనితెచ్చుకునే వ్యవసాయాన్ని ‘ఇగురం లేనెవుసం’ అంటారు. నా అనే వాళ్లెవరూ లేక దిక్కుసక్కి లేక ఒంటరిగా జీవిస్తూ భూమి దున్నుతూ బతికే వాణ్ని ‘ఒంటెద్దు బాయిగాడు’గా పిలుస్తారు. తొలకరి వర్షాలు కురిశాక రైతుకు విపరీతమైన పనుంటుంది. తడారకముందే దుక్కి దున్నాలి. విత్తనం వేయాలి. ఇలాంటి సమయంలో ‘ఎద్దుకోనాగలి’ అన్నట్టు పని ఒత్తిడి గురించి చెబుతారు. కలుపు తీసేటప్పుడు గడ్డి మొక్కలను ఏరేస్తూ ముందుకు, నాట్లేసేటప్పుడు మొక్కలను నాటుతూ వెనుకకు నడుస్తారు. ఒక ఒడ్డు నుంచి పనిచేస్తూ మరో ఒడ్డు చివరకు చేరడాన్ని మునుము అంటారు. పనులు అలసట లేకుండా సాగడానికి పాటలు పాడుతుంటారు. ఈ పనిలో ఆడవాళ్లకు నారందిస్తూ మగవాళ్లు సాయం చేస్తారు. అందులో భార్యాభర్తలూ ఉండొచ్చు. పని వేగంగా కావడానికి ‘మునుముకో ముద్దు’ ఇస్తానని ప్రేమికులు, భార్యాభర్తలు పాడుకుంటారు. సంతోషంగా పనులు చేస్తారు. 
విశ్వాసాల్లోంచి..
ప్రతి సమాజంలోనూ కొన్ని నమ్మకాలుంటాయి. అవి మూఢవిశ్వాసాలు కావచ్చు. సరైనవే కావచ్చు. ఆయా కాలాల్లో వారివారి ఆలోచనా పరిధిని బట్టి వచ్చిన నమ్మకాలివి. వీటి ఆధారంగా అనేక పదబంధాలను సృష్టించుకున్నారు. ‘తుమ్ము తమ్ముడై సెప్పడం’ అని ఓ పదబంధం. బయటకెళ్లేప్పుడు తుమ్మితే ఆగాలని, లేకుంటే అరిష్టమని దీనర్థం. ‘ఉడుంజొచ్చినిల్లు’ అనేది మరో పదబంధం. ఆ ఇల్లు ఎలా ఉందంటే ఉడుంజొచ్చిన ఇల్లులా ఉందని, అందులోకి పోవద్దని అంటారు. ఉడుంజొచ్చిన ఇంటిని వదిలి పెట్టాలని లేదా శాంతిపెట్టి ఇంట్లోకెళ్లాలని అంటారు. ఇలా విశ్వాసాల మీద అనేక పదబంధాలున్నాయి.
పురాణ సంబంధితాలు  
రామాయణ, మహాభారత, భాగవతాది పురాణ కథల ఆధారంగానూ కొన్ని పదబంధాలు ఏర్పడ్డాయి. జానపదులు రామాయణ, మహాభారతాది కథలను ఆశువుగా, పాటలుగా, కథలుగా చెప్పుకుంటారు. బతుకమ్మ పాటల్లోనూ వాటిని నిక్షిప్తం చేశారు. ఈ కథల ఆధారంగా ‘సుగ్రీవాజ్ఞ, రామబాణం, లక్ష్మణరేఖ, భీమ బలుడు, సీతమ్మ కష్టాలు, హనుమంతుని తోక, భరతుని రాజ్యం’ లాంటి అనేక పలుకుబడులు తెలుగు సమాజంలో వాడుకలో ఉన్నాయి. హనుమంతుని తోకకు మొదలే తప్ప చివర ఉండదంటారు కదా. అలా కష్టాలు కూడా అంతకంతకూ పెరుగుతున్నాయని చెప్పడానికి ఈ పదబంధం వాడతారు. ఇక ‘భరతుని రాజ్యం’ అంటే రామరాజ్యంలా సుభిక్షమైంది కాదు. అన్న అడవికి పోయాడన్న బాధతో భరతుడు, పాలనను నిర్లక్ష్యం చేశాడు. దాంతో రాజ్యమంతా అరాచకమైపోయింది. ఏదైనా ప్రభుత్వ పనితీరు గురించి చెప్పేటప్పుడు ఈ పలుకుబడిని ప్రయోగిస్తారు.
ఉర్దూ ప్రభావిత నానుడులు 
తెలంగాణ సమాజం, భాషల మీద ఉర్దూ ప్రభావమెక్కువ. దీంతో ‘ఊదు గాలది పీరి లేవది, అరబ్బులోని బాకి, బాంచె బతుకులు, నీ బాంచెన్‌ కాల్మొక్తా’ తదితర అనేక నుడికారాలు తెలుగు భాషలో చేరాయి. జమీందారీ, ఖరారు నామా, జబర్దస్త్, బందోబస్తు లాంటి పదబంధాలూ చేరి తెలంగాణ వాడుకభాషలో భాగమయ్యాయి. పీరీలు లేవాలంటే ఊదు పొగవేయాలి. ఎవరి వల్లయినా ఏ పనీ కాదని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ నానుడి వాడతారు. ‘అరబ్బులోని బాకీ’ అంటే తప్పకుండా చెల్లించాల్సిన అప్పు. చెల్లించకుంటే ఇచ్చిన వాడు ఊరుకోడు. నవాబుల కాలంలో వచ్చిన పదబంధమిది. ‘బాంచె బతుకులు, బాంచెన్‌ కాల్మొక్తా’ లాంటివి భూస్వామ్య వ్యవస్థ తెలంగాణలో చాలాకాలం కొనసాగిందని చెప్పడానికి ఉదాహరణలు. 
ఆర్థిక సంబంధితాలు 
గ్రామాల్లో చాలా జీవితాలు ఇంటి ఆర్థిక పరిస్థితులను చక్కబెట్టుకోవడానికే సరిపోతాయి. పేదరికంతో జీవనపోరాటాలు తప్పవు. అలాంటి అనుభవాల్లోంచి అనేక పదబంధాలను రూపొందించుకున్నారు. భోజనం రుచిగా లేదన్న భర్తతో ‘అన్నం తినడం రుచికోసరమా?’ అంటుంది భార్య. ఇందులో ఎంతో లోతైన తాత్వికార్థముంది! అలాగే, ‘పండగనాడే మెతుకుల బువ్వ’ అనే పదబంధముంది. రోజూ జొన్న గడుకలాంటివి తినే వారికి, దళితులకు పండగ నాడు మాత్రమే మెతుకుల బువ్వ (వరి అన్నం) తినే అవకాశం దొరుకుతుంది. మెతుకులు కావాలన్న పిల్లలతో ‘మనకు రోజూ మెతుకులన్నమేడ దొరుకుతుంది బిడ్డా! పండగనాడు తప్ప’ అనే తల్లిదండ్రులెంతోమందున్నారు. ఈ పరిస్థితి ఇప్పటికీ గ్రామాల్లో ఉంది. ఆకలి తెలియకుండా ఉండటానికి పేద బ్రాహ్మణులు తినకుండానే తాంబూలం వేసుకుంటారు. దీన్నే ‘ఆకలి తాంబూలం’ అంటారు. ‘ఇంట్ల జ్యేష్ఠక్క కూసుంది’ అనే పదబంధం ద్వారా ఆ ఇంటి ఆర్థిక దుస్థితిని చెబుతారు. జ్యేష్ఠక్కను దరిద్రానికి ప్రతీకగా వాడతారు.  
పండగలు, అదృష్టం 
జానపదులు కానీ ఈనాటి విద్యావంతులు కానీ మన అదృష్టాన్ని బట్టే అంతా జరుగుతుందని నమ్మేవాళ్లున్నారు. దేవుడు రాసిన రాత తప్పదనే వాళ్లూ ఉన్నారు. ఇలాంటి అదృష్టం, గ్రామీణ పండగలు, పబ్బాలననుసరించి కూడా చాలా పదబంధాలేర్పడ్డాయి. ‘నొసటి రాత, అదృష్టవంతుడు, జాతక చక్రం, అష్టమి చంద్రుడు, అమాస చీకటి, ఉంటే ఉగాది లేకుంటే శివరాత్రి, పశువుల పండుగ, బోనాల పండుగ’ లాంటి అనేక జాతీయాలున్నాయి. ‘నొసటి రాత’లోని నొసలు, రాత పదాలకు ఈ పదబంధంలో అర్థం పోయి, నుదిటి మీది బ్రహ్మరాత తప్పించనిదనే అర్థం వస్తుంది. ఉగాది నాడు అన్ని రకాల వంటలు, భక్ష్యాలు చేసుకుని హాయిగా తింటారు. శివరాత్రి నాడు ఉపవాసమే. ఉన్నవాడికి రోజూ ఉగాదే. లేనివాడికి రోజూ శివరాత్రి ఉపవాసాలే అనే అర్థంలో ఈ పదబంధం వచ్చింది. ‘అష్టమి చంద్రుడ’ంటే అష్టమీ కాదు చంద్రుడూ కాదు. నిందలు మోసేవాడని అర్థం. అష్టమి నాడు చంద్రుణ్ని చూస్తే నీలాపనిందలు వస్తాయని కదా నమ్మకం. వాని ముఖంలో అమాస చీకటుంది అంటే అమావాస్య రోజున్నంత దట్టమైన చీకటి నీడలున్నాయని!  
 ప్రతి సమాజంలోనూ అనుకరణ శబ్దాలతో పదబంధాలున్నట్టే తెలంగాణ భాషలోనూ ఉన్నాయి. ‘లబలబ మొత్తుకునుడు, కవ్వర కవ్వర వదురుడు, ముసముస మాటలు’ లాంటివి ఈకోవలోవే. ‘కాకోలె కవ్వర కవ్వర జర్రకురా’ అనడంలో లోతైన అర్థముంది. అనవసరపు తన ఒర్రుడు చాలించమనే హెచ్చరిక ఉంది. నీ ఒర్రుడు కాకిగోల తప్పమరేం కాదన్న నిగూఢార్థమూ ఉంది. లబలబ మొత్తుకోవడమంటే ఇంకేమీ చేయడం చేతకాక నిస్సహాయంగా తీవ్ర ధ్వనితో ఏడ్వటం. ‘కంటికోధార’ అనే పదబంధముంది. ఇది ఏడ్చే సందర్భంలో వాడేది. కంటి నుంచి ధారాపాతంగా నీళ్లు కారడాన్ని, ఏడుపులో తీవ్రతను తెలిపే నానుడి ఇది. ఇవే కాకుండా శరీర అవయవాలు, మానసిక పరిస్థితులు తదితరాల ఆధారంగా వచ్చిన జాతీయాలూ అనేకమున్నాయి. వీటినన్నిటినీ గుమ్ముల్లో, గరిసెల్లో నింపి భద్రపరచాల్సిందే. జీవద్భాషా నిఘంటువులు వస్తే తప్ప ఈ లోటు తీరదు.


వెనక్కి ...

మీ అభిప్రాయం