పద్యానికి స్వరాభిషేకం

  • 608 Views
  • 1Likes
  • Like
  • Article Share

    అమిర్నేని హరికృష్ణ

  • amirneni harikrishna
  • హైదరాబాదు
  • 9394450444
అమిర్నేని హరికృష్ణ

లలితమైన పదాలకు రాగాలు రంగరిస్తే... అది అందరూ పాడే సినీ గీతమవుతుంది! ప్రాచీన పద్యాలకు స్వరాలు కూర్చితే... తెలుగు కావ్యాలకు స్వరాభిషేకం అవుతుంది!! సాహిత్యం మీద మమకారంతో అదే పని చేస్తున్నారు పాలగుమ్మి రాజగోపాల్‌. పోతన, పెద్దన లాంటి కవిశేఖరుల పద్య రసగుళికలకు బాణీలు కట్టి, ఆడియో ఆల్బమ్‌లుగా విడుదల చేస్తున్నారాయన.
తెలుగు సారస్వత తీపి రుచులను ఆధునిక మాధ్యమం ద్వారా పదిమందికీ పంచుతున్న పాలగుమ్మి రాజగోపాల్‌ ఓ గాయకుడు, స్వరకర్త, అంతకుమించి తెలుగు భాషాభిమాని. సినిమాలకు నేపథ్యగానం అందించినా పదుగురికంటే భిన్నంగా ఉండాలన్న తన సంకల్పాన్ని మాత్రం వదులుకోలేదు. అలా పోతన భాగవతంలోని గజేంద్ర మోక్షం, రుక్మిణీ కళ్యాణం, ప్రహ్లాద చరిత్ర, వామనావతారం, ఇంకా.. అల్లసాని పెద్దన మనుచరిత్ర, పదిహేడో శతాబ్దానికి చెందిన ‘పంచరత్న కవి’ అనంతనారాయణ సృజించిన శివాష్టపదులు (గీతాశంకరం), ‘శ్రీహనుమ విజయం’ భక్తిపాటలు తదితర సీడీలను తీసుకొచ్చారు. 
      పశ్చిమగోదావరి జిల్లా మార్టేరులో 1948 జులై 7వ తేదీన సుబ్బలక్ష్మి, సత్యనారాయణమూర్తిలకు జన్మించారు రాజగోపాల్‌. తణుకులో పాఠశాల విద్యను, హైదరాబాదులో డిగ్రీ పూర్తి చేశారు. కేంద్ర ప్రభుత్వ గణాంకశాఖలో సుమారు 40 ఏళ్లు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. ‘మల్లీశ్వరి’ చిత్రానికి షహనాయి వాయించిన కాశిం అనే వ్యక్తి రాజగోపాల్‌ను ప్రముఖ సినీ సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావుకు పరిచయం చేశారు. ‘‘సంగీతం గురించి నీకేం తెలుసు’’ అని సాలూరి అడిగినప్పుడు... నేర్చుకోలేదంటూనే ఓ లలిత గీతం పాడి వినిపించారు రాజగోపాల్‌. ఆ స్వరాన్ని అభినందించిన సాలూరి, ‘‘బాగా పాడుతున్నావు.. నువ్వు సంగీతం కూడా నేర్చుకుంటే ఇంకా పైకి వస్తావు, అది పూర్తి చేసుకుని త్వరగా రా’’ అని చెప్పారు. దాంతో రాజగోపాల్‌ సికింద్రాబాదు సంగీత కళాశాలలో చేరి నాలుగేళ్లపాటు శిక్షణ పొందారు. 
అందమైన పాటలాగ..
ప్రఖ్యాత సంగీత గురువులు నూకల చిన సత్యనారాయణ, నేదునూరి కృష్ణమూర్తిలు ఆ కాలంలో కళాశాల ప్రధానాచార్యులుగా వ్యవహరించడం తన అదృష్టంగా భావిస్తారు రాజగోపాల్‌. అలా కర్నాటక, లలిత సంగీతాలను నేర్చుకుని 1976లో సాలూరి రాజేశ్వరరావు దగ్గర శిష్యులుగా చేరారు. నాటి నుంచి నేపథ్యగాయకుడిగా ఎన్నో చిత్రాలకు పాటలు పాడారు. 1983లో సాలూరి సంగీత దర్శకత్వంలో వెలుగు చూసిన ‘గీతారాధన’ ఆడియో రికార్డులో ఎస్‌.పి.శైలజతో కలిసి పాటలు పాడారు. ‘ఓంకార ప్రణవ స్వరూపుడై వెలసినాడు శివుడు, ఉమాపతీవరకుమార, శబరిమలై అయ్యప్ప, అడుగడుగో..’ లాంటి గీతాలు ఆకాశవాణి భక్తిరంజని ద్వారా ఎంతో ప్రజాద]రణ పొందాయి. సాలూరి, రాజ్‌కోటి, విద్యాసాగర్‌, ఇళయరాజా, శంకర్‌ గణేష్‌ తదితర సంగీత దర్శకుల దగ్గర పాలగుమ్మి మధురమైన గీతాలెన్నో ఆలపించారు. రాజ్‌కోటి సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘సాక్షి’ (1989) చిత్రంలో చంద్రమోహన్‌కు తన గళాన్ని ఇవ్వడం ద్వారా పాలగుమ్మి రాజగోపాల్‌ తొలిసారి సినీ గాయకుడిగా పరిచయమయ్యారు. ఆ పాట.. ‘అందమైన పాటలాగ మల్లెపూల మాటలాగ’! ఆ తర్వాత 14 చిత్రాల్లో ‘అలబ్రహ్మకు ధర్మమా..’ (అమ్మాయి మొగుడు), ‘రాగం పాడు రాచిలకా’ (ఇన్‌స్పెక్టర్‌ ప్రకాష్‌) తదితర పాటలు పాడారు. 
      తన మిత్రులకు ఇచ్చిన మాట మేరకు ప్రాచీన కావ్యాలనుంచి కమ్మనైన పద్యాలను స్వరపరచాలన్న లక్ష్యంతో ‘రాసి ఆధ్యాత్మిక, సాంస్కృతిక ట్రస్టు’ను స్థాపించారు రాజగోపాల్‌. తన గురువు సాలూరి రాజేశ్వరరావు సంగీత దర్శకత్వంలో తొలిసారి 1991లో ‘గజేంద్ర మోక్షం’ ఆడియో ఆల్బమ్‌ తీసుకొచ్చారు. బమ్మెర పోతన విరచిత భాగవత పద్యాలు తెలుగువారి హృదయాంతరాళాల్లో పరిమళించే నవ పారిజాతాలు. సర్వజనవిదితమైన గజేంద్ర మోక్షం ఘట్టాన్ని గానం చేయడమే ఓ గొప్ప ప్రయత్నం. ఆ లక్ష్యంలో సఫలీకృతులయ్యారు పాలగుమ్మి. సినిమా స్థాయి సంగీతంతో సాహిత్యానికి స్వరాల పరిమళాన్ని అద్దిన ఈ ప్రయోగం అందరి అభినందనలూ అందుకుంది. దాదాపు 27 పద్యాలను రాజగోపాల్‌ గానం చేసిన తీరు, దానికి కళా వాచస్పతి, పద్మభూషణ్‌ కొంగర జగ్గయ్య అందించిన వ్యాఖ్యానం వింటుంటే మైమరచిపోవాల్సిందే. ఇక ‘లావొక్కింతయు లేదు.., అలవైకుంఠపురంబులో.., సిరికింజెప్పడు.., అడిగెదనని కుడువడి.., పూరించెన్‌ హరి పాంచజన్యము.., శ్రీహరి కర సంస్పర్శను దేహము’ తదితర పద్యాలను సందర్భానికి తగ్గట్టు ఎలా పాడాలో పాలగుమ్మి ఆలపించిన విధానం చూస్తేనే తెలుస్తుంది. ఇప్పటివరకు మనం విన్న ఈ పద్యాలు హరిశ్చంద్ర కాటిసీను పద్యాల్లా ఆరోహణలో ఉంటాయి. కానీ రాజగోపాల్‌ మాత్రం మొసలి నోటచిక్కిన ఏనుగు బాధను తన స్వరంలో ఆర్ద్రంగా పలికించారు. 
హరిహరులకు స్వర నీరాజనం
సాహిత్యానికి అనుగుణమైన శాస్త్రీయ రాగాలతో రాజ్‌కోటితో కలిసి 2000 సంవత్సరంలో ‘గీతాశంకరా’నికి స్వరాలు పొదిగారు రాజగోపాల్‌. శివపార్వతుల ప్రణయం, విరహం, పాణిగ్రహణం, సతీ విరహంతో శంకరుడు తల్లడిల్లిన తీరు, శివతాండవం లాంటి ఘట్టాలు ఇందులో అద్భుతంగా ఉంటాయి. ‘కుమార సంభవం’ ఇతివృత్తంగా రూపుదిద్దుకున్న ఈ ‘గీతాశంకరం’లో ఆదిదంపతుల ప్రేమే ప్రధానాంశం. రాజగోపాల్‌, వాణీజయరాం, సుహాసినీ ఆనంద్‌ల గాత్రాల్లో ప్రాణం పోసుకున్న ఆ అష్టపదులు రసజ్ఞులను అలరించాయి. 
      పోతన భాగవతంలోని ఇంకో ప్రధాన ఘట్టమైన ‘రుక్మిణీ కల్యాణం’ మీద పాలగుమ్మి 2004లో చేసిన ప్రయోగం మరో మధుర కావ్యగానం. ఎంచుకున్న 34 పద్యాలకు ఉత్పల సత్యనారాయణాచార్య రాసిన కమ్మటి వ్యాఖ్యానాన్ని ప్రయాగ రామకృష్ణ గొంతులో వినిపిస్తూ రాజగోపాల్‌ ఈ ఆల్బమ్‌ను తీసుకొచ్చారు. ఆయనతో పాటు, కౌసల్య, సుహాసినీ ఆనంద్‌లు పాడిన ఈ పద్యాలను వింటున్న వారికి ఓ సంగీత రూపకాన్ని కళ్లారా చూస్తున్న అనుభూతి కలుగుతుంది. ఈ సీడీలు ఒక ఎత్తయితే వీటితో పాటు పద్యాల బుక్‌లెట్‌నూ ప్రచురించారు. దీంతో చదువుకుంటూ వినేందుకు సావకాశం కలుగుతుంది. పైగా దీనివల్ల పద్యాలు తేలికగా అర్థమవుతాయి. సహజకవి పోతనామాత్యుడి కవితా సామర్థ్యానికి పట్టం కడుతూ తెచ్చిన ఈ ఆల్బమ్‌కు రాజగోపాలే స్వరాలు అందించారు. అలాగే, పోతన భాగవతసుధే అయిన ‘ప్రహ్లాద చరిత్ర’ సీడీని 2008లో తీసుకొచ్చారు. దీనికి జె.వి.రమణమూర్తి వ్యాఖ్యానం అందించారు. తన కుమార్తె సుహాసినీ ఆనంద్‌తో కలిసి ఆ పద్యాలను ఆలపించారు పాలగుమ్మి. ఇక ఒక్క అడుగుతో బ్రహ్మాండాన్నే కొలిచి, దానవుడికి తన పద స్పర్శతో పరమపదాన్ని ప్రసాదించిన వామనుడి లీలావైభవాన్ని కూడా ఇదే సంవత్సరంలో రసరమ్యంగా ఆవిష్కరించారు రాజగోపాల్‌. దీనికి ప్రముఖ నటుడు రంగనాథ్‌ చేసిన వ్యాఖ్యానం ఆకట్టుకుంటుంది. 
దొరకునా ఇటువంటి సేవ..!
జొన్నవిత్తుల, రామజోగయ్యశాస్త్రి, గురుచరణ్‌, తుంబలి శివాజీ, వారణాసి వేంకటేశ్వరశాస్త్రి రచించిన తొమ్మిది ఆంజనేయ భక్తి గీతాలతో ‘శ్రీ హనుమ విజయం’ సీడీని వెలువరించారు రాజగోపాల్‌. పరాశరసంహిత ఆధారంగా ఆంజనేయ చరిత్రకు సంబంధించిన గొప్ప విషయాలన్నీ ఓ కథాక్రమంలా ఈ పాటల్లో చోటుచేసుకున్నాయి. ఖరహరప్రియ, హేమవతీ రాగాల మిశ్రమంలో వినిపించిన తొలి గీతాన్ని ఎస్‌.పి. బాలసుబ్రహ్మణ్యం, సుహాసినీ ఆనంద్‌ ఆలపించారు. మిగిలిన గీతాలను రాము, నిత్య సంతోషిణి, రాజగోపాల్‌ పాడారు. అలాగే, ప్రసిద్ధ హనుమశ్లోకాలనూ ఇందులో రాగయుక్తంగా పొందుపరిచారు పాలగుమ్మి. ఇవన్నీ ఒక ఎత్తయితే, పెద్దన ‘మనుచరిత్ర’లోని 70 పద్యాలకు రాజగోపాల్‌ చేసిన స్వరార్చన మరో విశిష్ట సాహితీసేవ. ఇందులో ఘంటసాల రత్నకుమార్‌ గళంలో వినిపించిన ఓలేటి పార్వతీశం వ్యాఖ్యానం వీనుల విందుగా సాగుతుంది. రాజగోపాల్‌, పద్మావతి, సుహాసినీ ఆనంద్‌, సింహా, శ్రీనగేష్‌లు ఈ కావ్యగానంలో పాలుపంచుకున్నారు. ‘‘అడపాదడపా కొన్ని రామాయణ పద్యాలో, భారత పద్యాలో, భాగవత పద్యాలో ఇలా శ్రవ్యరూపం సంతరించు కున్న సందర్భాలు ఉండవచ్చు. కానీ, ఘట్టాలకు ఘట్టాలే శ్రవ్యరూపం దిద్దుకున్న సందర్భాలు చాలా అరుదు. కేవలం ఇది రాజగోపాల్‌కు సొంతమైన ఘనత’’ అంటారు ఓలేటి పార్వతీశం. పాలగుమ్మి తెచ్చిన ఆల్పమ్‌లను ‘‘తెలుగు భాషా కావ్య పరిమళాన్ని మధురమైన సంగీతంతో మేళవించి రూపొందించిన శబ్దచిత్రాలు’’గా అభివర్ణించారు రాళ్లబండి కవితాప్రసాద్‌. తన అరుదైన కృషికి ఇలాంటి ప్రశంసలతో పాటు ఎన్నో పురస్కారాలనూ స్వీకరించారు రాజగోపాల్‌.   
‘‘కరుణశ్రీ ‘పుష్పవిలాపం’లోవి పద్యాలే. కానీ ఘంటసాల వాటిని తన గొంతుతో గేయాల్లా వినిపించారు. దాంతో ప్రతి ఒక్కరూ వాటిపట్ల ఆకర్షితులయ్యారు. పద్యాలను భావయుక్తమైన రాగంతో పాడితే ‘చెల్లియో చెల్లకో’ లాంటి వాటిలానే ప్రాచుర్యం పొందుతాయి. అందుకే ఘంటసాల ప్రేరణతోనే పద్యాలను ‘ఆర్కెస్ట్రా’ రూపంలో వినిపించడం ప్రారంభించాను. ఇలా సంగీతం తోడుగానే మన ప్రాచీన సాహితీసంపద పట్ల నవతరంలో ఆసక్తి పెంచవచ్చు’’ అంటారు రాజగోపాల్‌. అవును... నేడు ఏ కొద్దిమందికో పరిమితమైపోతున్న పద్యాన్ని తెలుగువాళ్లందరికీ మళ్లీ చేరువ చేయడానికి ఇలాంటి ప్రయత్నాలే దోహదపడతాయి. మరీ ముఖ్యంగా, ‘రాసి’ రజతోత్సవం వేళ గొల్లపూడి మారుతీరావు చెప్పినట్టు- గతాన్ని మరిచిపోతూ, ఆధునికతలోనే జీవన రహస్యం నిక్షిప్తమై ఉందని నమ్మే నేటి తరానికి పాలగుమ్మి రాజగోపాల్‌ చేస్తున్న పని గొప్ప ఉపకారం!


వెనక్కి ...

మీ అభిప్రాయం