ఈ శతాబ్దంలోనే ప్రపంచం కనీ వినీ ఎరుగని ఉపద్రవం... కరోనా. ఈ విపత్తు అందర్నీ నాలుగు గోడలకే పరిమితం చేసింది. మనిషికీ మనిషికీ మధ్య భౌతిక దూరం పెంచింది. ఫలితంగా తెలుగునాట నిత్యం మూడు సభలు, ఆరు సమావేశాలుగా సాగే సాహితీ కార్యక్రమాలకు కూడా ‘లాక్డౌన్’ తప్పలేదు. అయితే, అందివచ్చిన సాంకేతికత ఆలంబనగా తెలుగు భాషా సాహితీ పరిమళాలు ప్రపంచవ్యాప్తంగా గుబాళిస్తున్నాయి. అంతర్జాల వేదికగా ఆయా సభలు, సమావేశాలు నిరాఘాటంగా సాగుతున్నాయి!
ఇన్నాళ్లూ కలికాలం గురించి విన్నాం. కానీ ఇప్పుడు మనం జీవిస్తున్నది కరోనా కాలం. కంటికి కనిపించని వైరస్ ప్రపంచం మొత్తాన్ని అభద్రతలోకి నెట్టింది. ఇద్దరు మనుషులు దగ్గరగా మాట్లాడుకోలేని పరిస్థితుల్లో ఇక సభలు, సమావేశాలకు అవకాశం ఎక్కడా! దీంతో సాహితీ సభలు, సమావేశాలు, పుస్తకావిష్కరణలు, కవి సమ్మేళనాలకు తీవ్ర విఘాతం కలిగింది. అయితే, ఈ సమస్యకు సాంకేతికత చక్కని మార్గం చూపింది. ఈ కష్టకాలంలో మనుషులు దూరంగా ఉంటూనే భావాలు, అభిప్రాయాలను దగ్గరిగా వినిపించే అవకాశం కల్పించింది.
విపణిలో ఇప్పుడు జూమ్, గూగుల్ హ్యంగ్ అవుట్స్, గూగుల్ మీట్, గోటు మీటింగ్, స్కైప్ లాంటి వీడియో యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. ఎవరి ఇంట్లో వాళ్లుండి వీటిలో సభలు, సమావేశాలు నిర్వహించుకోవచ్చు. ఇవే ఇప్పుడు తెలుగు భాషా, సాహితీ సమావేశాలు, పుస్తకావిష్కరణలకు వేదికలుగా నిలుస్తున్నాయి. జూమ్ యాప్‌లో నలభై అయిదు నిమిషాల పాటు దాదాపు వంద మంది ఎలాంటి రుసుము లేకుండా సమావేశాలు నిర్వహించుకోవచ్చు. యూట్యూబ్, ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్ష ప్రసారం కూడా చేసుకోవచ్చు. దాంతో ప్రపంచ వ్యాప్తంగా సాహితీ ప్రేమికులు ఆన్లైన్ వేదికగా ఒక్కటవుతున్నారు.
చెరిగిన ఎల్లలు
తెలుగు శాఖ, మద్రాసు విశ్వవిద్యాలయం 2020 జూన్ 27న తొలిసారి అంతర్జాతీయ అష్టావధానాన్ని జూమ్ యాప్‌లో నిర్వహించింది. ప్రాంతాలకు అతీతంగా మూడువందల మందికి పైగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో డాక్టర్ మేడసాని మోహన్ అవధానం చేశారు. తెలుగు శాఖ అధ్యక్షులు మాడభూషి సంపత్ కుమార్ అధ్యక్షత వహించారు. అవధానంలో పృచ్ఛకులు వివిధ దేశాల నుంచి జూమ్ యాప్ ద్వారానే ప్రశ్నలు సంధించారు. నిషిద్ధాక్షరి టేకుమళ్ల వెంకటప్పయ్య, న్యస్తాక్షరి ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు, దత్తపది డాక్టర్ కోదండ లక్ష్మణ, సమస్య డాక్టర్ మన్నవ గంగాధర ప్రసాద్, ఆశువు పర్వతనేని సత్య తదితరులు నిర్వహించారు. దత్తపదిలో ‘కరోనా, సరేనా, నీవేనా, చైనానా’ పదాలతో మాహాభారతార్థంలో పద్యం చెప్పమంటే, ‘‘నరునిన్ గెల్వ అశక్యమౌ పలుకరో నానాజయ ప్రక్రియల్/ అరుదౌ పాండవ విక్రమంబగు సరేనా కౌరవేంద్ర అనిన్/ విరధుండైతివిగాదె గోగ్రహణ నీవేనా, యదార్థంబు సుం/ దరబుద్ధిన్ కనుగొంటమేలు పెనుచైనానా ఇటుల్ పల్కుచో’’ అంటూ రాయబారంలో శ్రీకృష్ణుడు దుర్యోధనుడికి హితబోధ చేస్తున్నట్లుగా పద్యం పూరించారు మోహన్. ఇక ‘సామాజిక దూరమందు సంసారమెలా’ అనే సమస్యను ‘‘రామాది పురుషార్థ సు/ ధామధురిమ జీవనముల తన్మయకేళీ/ స్థేమమున కరోనా ఇట/ సామాజిక దూరమందు సంసారమె‘లా’’’ అంటూ కరోనా కల్లోలంలో బయట తిరక్కుండా సంసార పక్షంగా ఉండటమే ‘లా’ (చట్టం) అని చమత్కరించారు అవధాని.
ఇతర రాష్ట్రాల్లోని తెలుగువారినందరినీ ఏకతాటి మీదకు తెచ్చేందుకు ఏర్పాటైన రాష్ట్రేతర తెలుగు సమాఖ్య అయిదో మహాసభలు జూన్ 28న జూమ్‌లోనే జరిగాయి. అమెరికా, న్యూజిలాండ్, మారిషస్, దక్షిణాఫ్రికా, సింగపూర్, ఆస్ట్రేలియా తదితర ఎనిమిది దేశాలు, దేశంలోని పన్నెండు రాష్ట్రాల నుంచి మూడు వందల మంది వీటిలో పాల్గొన్నారు. వందల సంఖ్యలో అభిమానులు వీక్షించారు. మహాసభల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు, కవి సమ్మేళనం కూడా నిర్వహించారు. అలాగే ‘శ్రీ సాంస్కృతిక కళా సారథి సంస్థ’ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జులై 5న సింగపూర్ నుంచి అంతర్జాల అంతర్జాతీయ సాహిత్య సమ్మేళనం నిర్వహించారు. యూట్యూబ్, ఫేస్‌బుక్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేసిన ఈ కార్యక్రమంలో 14 దేశాల నుంచి 50 మంది వక్తలు పాల్గొని వివిధ అంశాల మీద ప్రసంగించారు. కథా, పద్య, కవితా పఠనాలు, సినీ గీతాలాపనలు, ఏకపాత్రాభినయం లాంటి కార్యక్రమాలు అందరినీ అలరించాయి. భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ సంస్థ వ్యవస్థాపకుడు రత్నకుమార్ కవుటూరుకు లేఖ పంపారు. ముఖ్య అతిథి, అవధాని గరికపాటి నరసింహారావు నన్నయ పద్యాల్లోని గొప్ప తత్వాన్ని వివరించారు. ఈ కాలం యువత తెలుగు సాహిత్యాన్ని చదవాలని, అందులో జీవిత పాఠాలు ఉన్నాయని పేర్కొన్నారు. అమెరికా నుంచి గౌరవ అతిథిగా పాల్గొన్న రచయిత చిట్టెన్ రాజు ‘భారత చైనా యుద్ధం’ అనే హాస్యకథ చదివి వినిపించారు. మరో గౌరవ అతిథి మ్యూజికాలజిస్ట్ రాజా తెలుగు చిత్ర సీమలో ఆణిముత్యం ‘మాయాబజార్’ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ఆన్లైన్లో వేలమంది వీక్షించారు. వ్యాఖ్యాతగా రాధిక మంగిడి వ్యవహరించారు.
వాటి తర్వాత ఇదే!
సమాజంలో వచ్చే పరిణామాలకు ప్రతిబింబమే సాహిత్యం. ఒక రకంగా చూస్తే ఇక మీదట ప్రపంచం గతిని కరోనాకి ముందు, ఆ తర్వాతగా చూడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే కొవిడ్-19 నేపథ్యంగా ఇటీవల పెద్ద సంఖ్యలో కవిత్వం, కథలు వెలువడ్డాయి. ఇక మీదట కూడా సాహిత్యంలో ఇది ప్రతిఫలిస్తూనే ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని 2020 జూన్ 22న ‘తెలుగు సాహిత్యంలో కరోనా’ అంశం మీద పీలేరు సంజయ్ గాంధీ ప్రభుత్వ కళాశాల ఆధ్వర్యంలో జూమ్‌లో అంతర్జాతీయ అంతర్జాల సదస్సు నిర్వహించారు. ఇందులో ఆచార్యులు ఎండ్లూరి సుధాకర్, మేడిపల్లి రవికుమార్, రాచపాళెం చంద్రశేఖర రెడ్డి, ఆర్.రాజేశ్వరమ్మ వక్తలు. కరోనా వైరస్ తెలుగు సాహిత్యంలో ఒక కొత్త వస్తువును, కొత్త అభివ్యక్తిని తెచ్చిందని, కరోనా వల్ల వర్గసమాజం మనముందు స్పష్టంగా కనబడిందని, ఉత్పత్తి శక్తులైన శ్రమజీవుల వలస దుఖాన్ని, వారి జీవిత సంక్షోభాన్ని తెలుగు సాహిత్యం విస్పష్టంగా సమాజానికి చూపిందని ఎండ్లూరి చెప్పారు. మానవ జీవితం మీద కరోనా ప్రభావాన్ని పాట చాలా స్పష్టంగా, లోతుగా స్పృశించిందని, ప్రభుత్వాలు కూడా చూడని కొత్త కోణాలను పాట చూపించిందని రవికుమార్ పేర్కొన్నారు. కరోనా కల్లోలం ఆర్థిక, సామాజిక, వ్యవస్థలమీద బలంగా ప్రభావం చూపిస్తోందని, కరోనా వల్ల జీవితాల్లో వచ్చిన స్తబ్దతని తెలుగు కథ స్పష్టంగా అక్షరీకరించిందని రాజేశ్వరమ్మ వ్యాఖ్యానించారు.
‘‘1917 నాటి అక్టోబరు విప్లవం, రెండు ప్రపంచ యుద్ధాలు, 1929-34 ఆర్థిక మాంద్యం తర్వాత ప్రపంచ భాషల సాహిత్యాన్ని ప్రభావితం చేసినవి ప్రపంచీకరణ, కరోనాలే. తెలుగు కవులు ఈ మూడు నెలల్లో కరోనా నేపథ్యంగా ఒక ఏడాదిలో రాయగలిగినన్ని కవితలు రాశారు’’. అన్నారు చంద్రశేఖరరెడ్డి. ప్రపంచ సమస్యగా మారిన కరోనా గురించి, తెలుగు సాహిత్యంలో కరోనా మీద వస్తున్న రచనలు, తెలుగు సాహిత్యం మీద కరోనా ప్రభావం గురించి వక్తలు ప్రసంగించారు. పెదనందిపాడు ఆర్ట్స్, సైన్స్ కళాశాల తెలుగు శాఖ వారి ఆధ్వర్యంలో ‘ఆధునిక తెలుగు సాహిత్యం - సామాజిక జీవన చిత్రణ’ పేరిట జూమ్‌లో సదస్సు నిర్వహించారు. దీనికి విస్తాలి శంకరరావు అధ్యక్షత వహించారు. అతిథులుగా ఆచార్యులు జి.అరుణకుమారి, రాచపాళెం చంద్రశేఖర రెడ్డి, వెలుదండ నిత్యానందరావు పాల్గొన్నారు.
నాటక పోటీలూ!
తెలుగు రాష్ట్రాల్లో పుస్తకావిష్కరణలూ నిత్యం పెద్ద సంఖ్యలో జరుగుతుంటాయి. కరోనా వల్ల వీటికి కూడా అవరోధం ఏర్పడింది. ఇటీవల వీటినీ ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు. కవి విజయ్ కోగంటి ‘ఒక ఆదివారం సాయంత్రం... ఇంకా ఇతర కవితలు’ సంపుటిని జూన్ 28న జూమ్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సరస్వతీ సమ్మాన్ పురస్కార గ్రహీత కె.శివారెడ్డి, కేంద్రసాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత పాపినేని శివశంకర్, అరసం జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. కె.శివారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించారు. కవి, సాహితీ విమర్శకులు కొప్పర్తి వెంకట రమణమూర్తి కవితా పరిచయం చేశారు. యువ సాహితీ విశ్లేషకులు పుప్పాల శ్రీరామ్ పుస్తకాన్ని సమీక్షించారు. కవి అనిల్ డ్యానీ సభా సమన్వయం చేశారు. దీన్ని వందమందికి పైగా వీక్షించారు. తెలుగు సాహిత్యానికి వాట్సప్ గ్రూపులు కూడా ఇప్పుడు ఎనలేని సేవ చేస్తున్నాయి. ‘తెలుగు కవితా వైభవం’ వాట్సప్ గ్రూపునకు జులై 10తో అయిదేళ్లు నిండిన సందర్భంగా ఇందులోని సభ్యులందరూ జూమ్ యాప్‌లో సమావేశ మయ్యారు. గ్రూపునకు సంబంధించి తమ అనుభవాలు, అనుభూతులను తోటి సభ్యులతో పంచుకున్నారు. అయిదు గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో మూడు వందల మందికిపైగా సాహితీ అభిమానులు పాల్గొన్నారు.
భారతీయ గాన ప్రపంచంలో ఘంటసాలది చెరగని ముద్ర. ‘ఘంటసాల చైతన్య వేదిక’ తొమ్మిదో జాతీయ సభలు జూమ్ వేదికగా జరిగాయి. ఎమ్మెల్సీ కేఎస్.లక్షణరావు ప్రారంభించారు. రాచపాళెం చంద్రశేఖరరెడ్డి ప్రారంభోప న్యాసం చేశారు. అధ్యక్షులు కె.వి.రెడ్డి ఘంటసాల గానవైభవంపై ప్రసంగించారు. కేవలం సాహితీ సమావేశాలే కాకుండా నాటక పోటీల్ని సైతం ఆన్లైన్ భూమికగా నిర్వహించడం మరో విశేషం. గుంటూరు జిల్లా వరగానికి చెందిన లావు వెంకటేశ్వర్లు, కల్లూరి నాగేశ్వరరావు కళాపరిషత్ అయిదేళ్ల నుంచి ఏటా సాంఘిక నాటికల పోటీలు నిర్వహిస్తోంది. ఈ ఏడాది కరోనా ఆటంకంగా నిలవడంతో గత అయిదేళ్లలో ప్రదర్శితమైన నాటికల నుంచి తొమ్మిది ఎంపిక చేసి వాటి వీడియోలను యూట్యూబ్, ఫేస్బుక్ వేదికలుగా ప్రదర్శించారు. వేల సంఖ్యలో ప్రేక్షకులు వీటిని వీక్షించారు. దిల్లీ, జార్ఖండ్, హైదరాబాదు, గుంటూరు తదితర ప్రాంతాల్లో ఉన్న న్యాయనిర్ణేతలు జూమ్‌లో చర్చలు జరిపి విజేతలను ప్రకటించారు. అభినయ ఆర్ట్స్ గుంటూరు వారి ‘అతీతం’, జన శ్రేణి విజయవాడ వారి ‘గుర్తు తెలియని శవం’, యంగ్ థియేటర్ ఆర్గనైజేషన్ విజయవాడ వారి ‘అనగనగా’ నాటికలు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు గెలుచుకున్నాయి. అంతర్జాలంలో నాటక పోటీలు ప్రేక్షకుడికి సరైన అనుభూతి కలిగించని మాట నిజమే అయినా, కరోనా నేపథ్యంలో వాటిని పదిమంది ముందుకూ తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
భిన్నవాదనలు
ఒక సభ, సమావేశాన్ని భౌతికంగా నిర్వహిస్తే దేశం నలుమూలల నుంచి సాహితీప్రియులు హాజరయ్యే అవకాశం ఉంటుంది. అదే, అంతర్జాలం వేదికగా జరిగే కార్యక్రమాల్లో ప్రపంచ వ్యాప్తంగా ఔత్సాహికులు పాల్గొనవచ్చు. ఇటీవల జరిగిన ఆన్లైన్ కార్యక్రమాలు దీన్నే రుజువుచేశాయి. ఇలా పరిధి పెరిగేకొద్దీ సాహితీ కార్యక్రమాల ప్రయోజనం కూడా ఎక్కువమందికి చేరుతుందని, సాహిత్యం, భాషాభివృద్ధికి ఇవి చాలా సహకరిస్తాయని పలువురు అంటున్నారు. వీటిని రికార్డు చేసుకునే అవకాశం ఉండటంతో అప్పటికి హాజరు కాలేనివారు తీరిక సమయాల్లో చూసే వీలుంటుంది కూడా. అయితే, మరికొందరు మాత్రం అందరూ కలిసి ఓ చోట నిర్వహించుకునే సమావేశాలతోనే ప్రయోజనం ఎక్కువ ఉంటుందంటున్నారు. ఈ కరోనా పీడ తొలగాక మళ్లీ పూర్వ పరిస్థితి వస్తుందని ఆశిస్తున్నారు.
సాంకేతికతతో పరిచయం లేని పెద్దలకు ఈ యాప్‌ల వాడకం కాస్త ఇబ్బందే. అంతర్జాల సమస్యల కారణంగా కొన్నిసార్లు ఈ యాప్‌ల్లో సమావేశాలకు ఆటంకాలు వస్తుంటాయి. అయితే, ఈ ఆన్లైన్ సమావేశాల వల్ల నిర్వాహకులకు ఆర్థిక భారం ఉండదు. ఒక సాహితీ కార్యక్రమం జరపాలంటే వేదిక ఏర్పాటు చేసుకోవాలి. ఆ ప్రదేశానికి చెల్లించాల్సిన అద్దెతో పాటు, మైక్, భోజనాలు, వసతి లాంటి ఏర్పాట్లు చేసుకోవాలి. దీనికోసం నెలల ముందు నుంచే అందరితో సమన్వయం చేసుకోవాలి. ఈ వ్యయ ప్రయాసలన్నింటినీ ఆన్లైన్ సభలు, సమావేశాల ద్వారా అధిగమించవచ్చు. ఏది ఏమైనా సాహితీ చర్చలకు, సారస్వత విస్తృతికి ఆన్‌లైన్‌ను వేదికగా చేసుకోవడం తెలుగునాట ఓ కొత్త ఒరవడి. రాబోయే రోజుల్లో ఇది మరింత విస్తృతమవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు!