హురుముంజి

  • 191 Views
  • 0Likes
  • Like
  • Article Share

సామెత చెప్పినట్టు...
‘నమ్మి నానవోస్తే పుచ్చి బుర్రలైనట్టు’ అని ఓ సామెత. నమ్మినవాళ్లే మోసం చేసినప్పుడు, ఆప్తుల నుంచి చెడు ఎదురైనప్పుడు దీన్ని ప్రయోగిస్తారు. రైతులు విత్తనాల కోసం కొన్ని రకాల ధాన్యాల్లో బూడిద, వేపాకు కలిపి నిల్వచేసుకుంటారు. దీనివల్ల విత్తనాలు పాడవ్వవని నమ్మకం. ఎంత జాగ్రత్త చేసినా ఏదో లోపం వల్ల కొన్ని విత్తనాలు పాడైపోతుంటాయి. అలాంటప్పుడు నమ్ముకున్న గింజలే నట్టేట ముంచాయని రైతులు అనుభవంలో నుంచి చెప్పిన సామెత ఇది.


బొబ్బిలి వారి కథలో అన్యదేశ్యాలు
బొబ్బిలి పదంలో కూడా అన్యదేశ్యాలు చాలా ఉన్నాయి. సర్దార్, తరఫు, హుకుం, లడాయి, తాలూకా, పెళుతా (ఫలీతా శబ్దభవం), వరదీ, వర్దీ, జమాబందీ, షామీర్, దికావు, లష్కర్, హర్కారు, మొహర్జా (మోర్చా శబ్దభవం. మొహరం అనే తెలుగుశబ్దం కూడా ఉంది) లాంటి ఉర్దూ పదాలున్నాయి. ప్రాంసీ బూచి ‘కంబైటో కంబైటో విజయరామరాజా!’ అన్నాడు. కం అనేది ఇంగ్లీషు పదం. బైఠో అనేది ఉర్దూ మాట. ఈ రెండింటి కూడిక కంబైటో. అంటే వచ్చి కూర్చోండి అని అర్థం. ‘బంగారపు తీని పీటలు చేయించినాడు’ అనే పదంలో తీన్‌ అంటే మూడు. తీనిపీట అంటే ముక్కాలిపీట. ‘‘వంగి మూడు కూల్మీనులు చేసే ప్రాంచీ దొరగారు’’ అనే పదంలో.. కూల్మీనులును సలాం, నమస్కారం అనే అర్థంలో ప్రయోగించారు. - బిరుదురాజు రామరాజు, ‘తెలుగు జానపద గేయసాహిత్యం’ నుంచి


హురుముంజి
పారశీక జలసంధి సమీపంలోని (ప్రస్తుత ఇరాన్‌) పెద్ద రేవు పట్టణం. క్రీస్తు పూర్వం నాలుగో శతాబ్ది నుంచి గుర్రాలు, ముత్యాల ఎగుమతికి పేరు పొందిన ప్రాంతం. వాణిజ్య పరంగా ప్రాచీన కాలంలో ప్రాచ్యపాశ్చాత్య ప్రపంచాలకు కూడలి. ‘‘హురుముంజి బలుతేజి హరులు దెచ్చె, ముక్కున హురుముంజి ముత్యాల ముంగర’’ అని శ్రీనాథుడి ప్రయోగాలు కనిపిస్తున్నాయి. ఇది హుర్ముజ్‌ అనే పారశీ పదం నుంచి పుట్టింది. అంటే ఒక రేవు పట్టణం అని అర్థం.


పూతిక
చీకురు అని వ్యవహరిస్తారు. రాతినేలల్లో ఎక్కువగా దొరికే పొడవాటి కాడలు కలిగిన తృణవిశేషం. పూరిళ్ల కప్పులమీద పరుస్తారు. కొన్ని ప్రాంతాల్లో వీటితో తడికలు అల్లుతారు. తడిపిన చీకురు తడికల వల్ల ఉష్ణోగ్రత పది డిగ్రీల ఫారన్‌హీట్‌ కన్నా తగ్గుతుంది. కాగితం తయారీలోనూ చీకురు పుల్లలను వాడతారు. పూచి, పూచిక, సిరితాన అని కొన్ని ప్రాంతాల్లో వ్యవహరిస్తారు.


వడంబకం
తాపీ పనివాళ్లు గోడల మట్టం సరిచూడటానికి వాడే పరికరం. తూకం బల్లకి బదులుగా దీన్ని ఉపయోగిస్తారు. గుండ్రంగానో, శంఖువు లాగానో ఉండే లోహపు ముద్దను చదరంగా ఉన్న రేకు మధ్యనున్న బెజ్జంలోంచి వేలాడదీసిన దారానికి దీన్ని కట్టి తయారుచేస్తారు. తూకంబిళ్ల, తూగుచెక్క, తూగుపలక అని వ్యవహరిస్తారు.


 

సన్నాయి
నాగస్వరం, నాదస్వరం లాంటి అర్థాలున్నాయి. ‘‘శంఖ సమూహంబు సన్నాయి జోళ్లు’’ అని పల్నాటి వీర చరిత్రలో కనిపిస్తుంది. దీనికి శహ్‌నాయ్‌ అనే ప్రాచీన పదం మూలం కావచ్చు. జయకాహళా, యుద్ధకాహళా అని ఒక విధమైన సంగీత సాధనానికి సన్నాయి అని పేరు.


చావడి
కొలువుకూటం, కార్యస్థానం రచ్చసావిడి అని వ్యవహరించే ఈ పదానికి ప్రాచీన కావ్యాల్లో ప్రయోగాలు కనిపిస్తున్నాయి. లోపల చావడీ అని వరాహ పురాణంలో, అద్దంకి చావడి అని 1448నాటి శాసనంలోనూ కొన్ని నామాంతరాలున్నాయి. సంస్కృతంలోని చౌహాట పదమే మరాఠిలో చావడీ పదానికి మూలం. దీన్నుంచే చావడీ, కొత్వాలు చావడీ, రచ్చబండ అనేవి వాడుకలోకొచ్చాయి.


కంచె
‘కంచెలు మేసి పాటిమీదనే నిమ్మళించినాది’ అని జనోక్తి. చేను చుట్టూ వేసే కంపకోటను సర్కారు ప్రాంతాల్లో కంచె అంటారు. తెలంగాణలో గడ్డి బీళ్లను కంచెగా పిలుస్తారు. ‘కంచె వేసిందే కమతం, కంచే చేను మేసినట్టు, కంచె మంచిది కాకపోతే కయ్య కొల్లబోతుంది’ లాంటి సామెతలు కూడా వాడుకలో ఉన్నాయి. 


చెప్పుకోండి చూద్దాం! 
రాజు నల్లన
పతాని పచ్చన
కనుగుడ్డు తెల్లన
కలి పుల్లన

ఈ పొడుపుకి విడుపు ‘తాడిచెట్టు’. తాటి మాను చూడ్డానికి నల్లగా ఉంటుంది. పత్రాలేమో పచ్చగా ఉంటాయి. తాటి ముంజలేమో కనుగుడ్ల మాదిరి తెల్లగా ఉంటాయి. కల్లు పుల్లగా ఉంటుంది కదా మరి. 


చెక్కర్‌
ఏం గొనేటట్టులేదు 
ఏం దినేటట్టులేదు
శెక్కర దరజూడంగనే
శెక్కరొచ్చిపడితి 
ఈ జానపద గేయంలోని నాలుగో పాదంలోని శెక్కర పదానికి మూలం చెక్కర్‌ అనే హిందీ మాట. మొదటి శెక్కరకి అర్థం చక్కెర. అంటే, పంచదార ధర చూడగానే బిత్తరపోయి స్పృహ తప్పి పడిపోయినంత పనైందని అర్థం.


నూనెపోసి యెత్తవచ్చు
‘‘నూనెపోసి యెత్తవచ్చు మా రంగసాని మేడ/ పాలుబోసి యెత్తవచ్చునూ రంగసాని మేడ’’  అని బంగారు తిమ్మరాజు జానపద గేయంలో మేడ వర్ణన ఉంటుంది. పాలు పోసి ఎత్తవచ్చు అంటే నున్నగా, చాలా పరిశుభ్రంగా ఆ మేడ ఉందని అర్థం. తెలంగాణలో మంచి ఎద్దుల గురించి చెప్పేటప్పుడు ఆ ఎద్దుపై నూనె పోసి ఎత్తుకోవచ్చు అంటారు.


తుమ్మ
అటవి, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా పెరిగే చెట్టు ఇది. అడవితుమ్మ, కట్టతుమ్మ, గబ్బుతుమ్మ, చీమతుమ్మ, నల్ల తుమ్మ, నాగతుమ్మ అని ఇందులో చాలా రకాలున్నాయి. మురికి తుమ్మ అని ఎక్కువ ముళ్లుండేది కూడా ఉంది. ఇన్ని రకాల తుమ్మల సాధారణ ఉపయోగం ఒకటే. తుమ్మచెట్టు పూలను సంస్కృతంలో స్వర్ణపుష్ప అంటారు. తుమ్మచెట్టును పంజాబీలో కికార్, తమిళంలో కరువేళం, కన్నడంలో గొబ్లి, బాల్‌ అని రెండు పేర్లతో పిలుస్తారు.


బందోబస్తు
బందోబస్త్‌ అనే హిందీపదం దీనికి మాతృక. ఏర్పాటు, నిర్ణయం, పరిష్కారం, భద్రం అనే అర్థాలున్నాయి. పొలం సరిహద్దులను ప్రభుత్వం సర్వేచేసి నిర్ణయించడం అనే వ్యవహారిక అర్థం ఉంది. హద్దురాయి అంటారు. పొలానికి హద్దులు నిర్ణయించి గుర్తుగా నాటే రాయి ఇది. ఇటీవల కాలంలో భద్రత కల్పించడం అనే అర్థంలో ఎక్కువగా వాడుతున్నారు.


పొరంబోకు
పొరుంబోకు, పొరంబాక, పొరంబోకు అనే రూపాంతరాలున్నాయి. ప్రభుత్వాధీనంలో ఉన్న భూమి అని సామాన్యార్థం. గ్రామస్థులందరూ ఉమ్మడిగా వినియోగించుకునే రోడ్లు, కాల్వలు, శ్మశానం లాంటి వాటి కోసం వదిలిన నేల అని అర్థం. కొన్ని చోట్ల పంటలకు వీలైన పొరంబోకు సాగుకోసం రైతులకు పట్టాలిస్తారు.


 


వెనక్కి ...

మీ అభిప్రాయం