అమ్మభాషకు ఆలంబన

  • 69 Views
  • 0Likes
  • Like
  • Article Share

మాతృభాషలో విద్యాబోధన సాగినప్పుడే విద్యార్థి సమగ్ర అభివృద్ధికి అవకాశం ఉంటుందన్న నిపుణుల మాటలకు గట్టి ఊతం లభించింది. ఇక నుంచి అయిదో తరగతి వరకు అమ్మభాషలో విద్య ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. కొత్త జాతీయ విద్యావిధానానికి కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేయడంతో ప్రస్తుత చదువుల విధానంలో భారీ మార్పులు జరగనున్నాయి. 
ప్రాథమిక
విద్య మాతృభాషలోనే ఉండటంతో పాటు వీలైతే ఎనిమిదో తరగతి వరకు లేదంటే ఆ పై తరగతుల్లోనూ అమ్మభాషలోనే విద్యను బోధించడం మేలన్నది కొత్త జాతీయ విద్యావిధానం సూచన. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మాజీ అధిపతి కె.కస్తూరి రంగన్‌ నేతృత్వంలో కేంద్రం నియమించిన కమిటీ ప్రస్తుత విద్యా విధానాన్ని క్షుణ్నంగా పరిశీలించి, పిల్లలు అన్ని అంశాల్లో రాణించేలా గుణాత్మక మార్పులు సూచించింది. ఈ నూతన విద్యా విధానం భారతీయ, మాతృభాషలకు పెద్దపీట వేసింది. విద్యార్థుల మీద ఏ భాషనూ బలవంతంగా రుద్దవద్దని స్పష్టంగా చెబుతూ భారతీయ భాషలను విద్యార్థులు ఆనందంగా నేర్చుకునే వాతావరణం కల్పించాలని పేర్కొంది. త్రిభాషా సూత్రంతో సహా పాఠశాల నుంచి ఉన్నత విద్య వరకు అన్ని స్థాయిల్లో సంస్కృతం ఒక ఐచ్ఛికాంశంగా ఉంటుంది. దాన్ని ఎంచుకునే స్వేచ్ఛ విద్యార్థులకే వదిలిపెట్టారు. ఇతర ప్రాచీన భారతీయ భాషలను ఎంచుకునే, విదేశీ భాషలు నేర్చుకునే వీలూ కల్పించారు.
      కేవలం ప్రాథమిక స్థాయిలోనే కాకుండా ఉన్నత విద్యలో కూడా మాతృ, భారతీయ భాషలను ప్రోత్సహించాలని ఈ విద్యా విధానం పేర్కొంది. ఇందులో భాగంగా ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రాన్స్‌లేషన్, ఇంటర్‌ప్రెటేషన్‌ (ఐఐటీఐ)తో పాటు పాళి, పర్షియన్, ప్రాకృతం, సంస్కృతాలకు జాతీయ స్థాయి సంస్థలు ఏర్పాటు చేస్తారు. ఉన్నత విద్యలో చాలా కోర్సులు మాతృ, స్థానిక భాషల్లో నిర్వహించేలా ప్రోత్సహిస్తారు. ఇంగ్లిష్, హిందీలకే పరిమితమైన ఈ-కంటెంట్‌ ఇక మీదట తెలుగుతో పాటు ఎనిమిది భారతీయ భాషల్లో అందుబాటులోకి తెస్తారు. అలాగే నూతన విద్యావిధానం చిన్నపిల్లలు ఆడుతూ పాడుతూ నేర్చుకునే అవకాశం కల్పించింది. ఇప్పటి వరకూ పిల్లలు ఆరో ఏట ఒకటో తరగతిలో చేరుతున్నారు. కొత్త విధానంలో మూడో ఏటే ‘చిన్నారుల సంరక్షణ విద్య’ (ఈసీసీఈ) ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగా పిల్లల్ని ‘సంసిద్ధత తరగతులు’లో చేర్చాలి. ఈ బాలవాటికలో పిల్లలు కథలు, కవితలు వింటూ, ఆయా కళలు నేర్చుకుంటూ చదువుకునేలా పాఠ్యప్రణాళిక సిద్ధం చేస్తారు. ఈ విధానం మీద ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షులు మండలి బుద్ధప్రసాద్, ‘మాతృభాషా మాధ్యమ వేదిక’ సారథ్య సంఘ సభ్యులు ఏమంటున్నారంటే.. 


తప్పనిసరిగా అమలు చేయాలి
పిల్లల సమగ్ర అభివృద్ధికి మాతృభాషలో విద్యాబోధన ఆవశ్యకతను గుర్తిస్తూ నూతన విద్యా విధానం తెచ్చారు. ఇది భారతీయ భాషలు, సంస్కృతులను కాపాడేలా ఉంది. ముఖ్యంగా అయిదో తరగతి వరకు తప్పకుండా మాతృభాషలో విద్యా బోధన ఉండాలన్న నిర్ణయం భారత రాజ్యాంగ సూత్రాలకు, యునెస్కో లాంటి అంతర్జాతీయ సంస్థల అభిప్రాయాలకి అనుగుణంగా ఉంది. ప్రాచీన భాషా కేంద్రాలను కూడా బలోపేతం చేస్తామన్నారు. నెల్లూరులో మన ప్రాచీన భాషా కేంద్రానికి స్వయం ప్రతిపత్తి వస్తుందని ఆశిస్తున్నాం. మహాత్మా గాంధీ ప్రాథమిక విద్యా విధానాన్ని ఇందులో ప్రవేశపెట్టారు. కళలను కాపాడటమే కాకుండా సృజనాత్మక శక్తులకు ప్రాధాన్యం ఇచ్చినట్టుగా గమనించవచ్చు. తెలుగు రాష్ట్రాలు తప్పనిసరిగా దీన్ని అమలు చేయాలి.  - మండలి బుద్ధప్రసాద్, ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషా సంఘం పూర్వ అధ్యక్షులు


వారిలోనూ ఉత్తమ నైపుణ్యాలు
పాతికేళ్లుగా మేం వినిపిస్తున్న వాదానికి నూతన విద్యా విధానం బలం చేకూర్చేలా ఉంది. ప్రపంచీకరణ వల్ల మాతృభాషలకి పెద్ద విఘాతం కలిగింది. భాష పట్ల మౌలికమైన అవగాహనని ప్రజలకి అందించడంలో మా ప్రయత్నం మేం చేశాం. ‘తెలుగువెలుగు’ మాస పత్రిక అమ్మభాషలో విద్యాబోధన ప్రాధాన్యాన్ని మొదటి నుంచీ వివరిస్తూ వస్తోంది. ఇప్పుడున్న విద్యా విధానం వల్ల సరైన నైపుణ్యం కలిగిన యువత తయారు కావడం లేదని పారిశ్రామికవేత్తల అభిప్రాయం. తెలుగు మాధ్యమంగా చదువుకున్న వారిలో కూడా నైపుణ్యాలు అధికంగా ఉన్నాయని పలు అధ్యయనాలు నిరూపించాయి.  - దివి కుమార్, జనసాహితి సంపాదకులు


మొండి వైఖరి కూడదు
నూతన విద్యా విధానంలోని కీలకాంశాలు సంతోషం కలిగిస్తున్నాయి. వైద్య విద్య కూడా మాతృభాషలో ఉండటం వాంఛనీయం. ఇదీ గొప్ప విషయం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసుకోవాలి. ప్రస్తుతం పాఠ్యపుస్తకాలు తెలుగు, ఇంగ్లిష్‌ రెండు మాధ్యమాల్లోనూ అచ్చయ్యాయి. తెలుగులో పుస్తకాలు ఉన్నాయి కాబట్టి అమ్మభాషలోనే చదువు చెప్పవచ్చు. అవసరమైతే తర్వాత మళ్లీ పుస్తకాలు ముద్రించవచ్చు. అవకాశం వచ్చింది కాబట్టి అమ్మభాషలో బోధన విషయంగా కీలక నిర్ణయాలు తీసుకోవడం మంచిది. మొండి వైఖరి కూడదు. నూతన విద్యా విధానానికి అనుగుణంగా ప్రైవేటు పాఠశాలల్లోనూ తెలుగు మీడియం ప్రవేశ పెట్టడానికి పూనుకోవాలి.   - విఠపు బాలసుబ్రహ్మణ్యం, అధ్యక్షులు, మాతృభాష మాధ్యమ వేదిక


ప్రతి మాతృభాషా బలమైందే
కేంద్రానికి గానీ, రాష్ట్రానికి గానీ భాషా విధానమంటూ ఇప్పటి వరకూ స్పష్టంగా లేదు. విద్యావిధానం పేరుతో ఇప్పటికి ఏడు కమిషన్లు వేశారు. అన్నీ మాతృ భాషా మాధ్యమం ఉండాలని చెప్పాయి. మాతృభాషలో ఏడాది కాలంలో నేర్చుకున్నది పరాయి భాషలో నేర్చుకోడానికి ఆరేడేళ్లు పడుతుందన్నది నిపుణుల మాట. నూతన విద్యా విధానంలో ఆటలు, పాటలు, వృత్తి విద్యను కూడా ప్రవేశపెట్టారు. మంచిదే. అమ్మభాషలో ప్రాథమిక విద్య తప్పనిసరి. ఎనిమిదో తరగతి వరకూ దాన్ని కొనసాగిస్తే మంచిది. కొఠారి కమిషన్‌ అయితే ఉన్నత విద్యను కూడా మాతృభాషలోనే బోధించాలని చెప్పింది. పీవీ నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పీజీ దాకా మాతృభాషలో విద్యా బోధన సాగాలని అన్నారు. దానికోసం తెలుగు అకాడమీ కూడా ఏర్పాటు చేశారు. వాడుకుంటే ఏ భాష అయినా శక్తిమంతమైందే. ఇంగ్లిష్‌ ఒకప్పుడు చిన్న భాష. రాజ్య విస్తరణ వల్ల అది బాగా వ్యాప్తిచెందింది. తెలుగుకి సమర్థత లేదని అంటారు కొంతమంది. ప్రతి మాతృభాషకి తనదైన సమర్థత ఉంటుందనేది కాదనలేని సత్యం.  - సామల రమేశ్‌బాబు, తెలుగు భాషోద్యమ సమాఖ్య జాతీయ అధ్యక్షులు


అందరికీ వర్తింపజేయాలి
పిల్లలకు నచ్చిన మాధ్యమంలో చదువు చెప్పకుండా బలవంతంగా ఇతర భాషలను రుద్దడమంటే వారి మానసిక వికాసాన్ని కుంటుపరచడమే. నూతన విద్యా విధానాన్ని అన్ని పాఠశాలలకు, అన్ని వర్గాల పిల్లలకు అమలు చేయాలి. పరభాష పట్ల తల్లిదండ్రులకున్న భ్రమల్ని కూడా తొలగించే బాధ్యత ప్రభుత్వాలదే. నూతన విద్యా విధానంలో పిల్లల సమగ్ర వికాసానికి ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపిస్తుంది. బట్టీ చదువులు కాకుండా సమాజంతో అనుసంధానించేలా బోధన సాగాలని చెప్పడం బాగుంది.  - పరిమి, విద్యావేత్త


చట్టరూపం దాల్చాలి
విద్యా హక్కు చట్టం ప్రకారం ఎనిమిదో తరగతి వరకూ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో మాతృభాష మాధ్యమాన్నే అమలు చేయాలి. కానీ, దాన్ని ఎవరూ పట్టించుకోవడంలేదు. నూతన విద్యా విధానంలో కూడా ఎనిమిదో తరగతి వరకూ అమ్మభాషలోనే బోధనని తప్పనిసరి చేస్తే బాగుండేది. దాన్ని అయిదో తరగతికి కుదించారు. విద్యా వ్యాపారాన్ని నివారిస్తూ రాజ్యాంగ విలువలకు అనుకూలంగా ఉన్న ఈ విధానం చట్టరూపం దాల్చితేనే అందరికీ ఉపయోగం. దీన్ని చట్టంగా చేసేందుకు ప్రభుత్వాలు ముందుకు రావాలి.  - రమేష్‌ పట్నాయక్, విద్యాపరిరక్షణ వేదిక


 


వెనక్కి ...

మీ అభిప్రాయం