నాకొక డైరీ కావాలి

  • 1160 Views
  • 33Likes
  • Like
  • Article Share

    సురా

వచ్చేసింది మరో కొత్త సంవత్సరం! కొత్త ఆలోచనలు సరికొత్త లక్ష్యాలు అందరికీ ఒకటో తేదీన అప్పజెప్పాలి కదా..! మనకంటూ చరిత్రలో కొన్ని పేజీలుండాలి అన్నది పాత మాట. కొత్త మాటేమిటంటే.. ‘మనకంటూ గూగుల్‌లో కొన్ని పేజీలుండాలి..!’ అని. అయినా అనుకోడానికేముందీ.. అసలు గత ఏడాది ఏం సాధించామో చూసుకోవాలిగా. ఆ తర్వాత మనం అనుకున్నట్టు గూగుల్‌లోనో చరిత్రలోనో కాకపోయినా కనీసం డైరీలోనైనా రాసుకుని మురిసిపోవచ్చు.
      డైరీ అంటే గుర్తొచ్చింది..
      గత ఏడు కూడా అట్ట బాగుందని కొనుక్కున్న డైరీ అలమరలో ఆర్టుఫిలింలాగ ఓ మూల పడేశాను. అయితే అందులో ఏమీ రాయలేదు కనుక అవార్డులొచ్చే అవకాశం కానీ ప్రమాదం కానీ ఏమీ లేవు. అసలేం రాయాలో తెలీకనే అలా వదిలేశా. పిచ్చి డైరీ.. దాని కిందనే ఇంకో పాత డైరీ ఉందని దానికేం తెలుసు? రెండింటిలోనూ ‘నూతన సంవత్సర శుభాకాంక్షలు’ అని మాత్రం రాశాను అంతే..! ఏంచేస్తాం? యవ్వనం యమహా బండిమీదున్నపుడు ఏడాది పొడుగునా చిత్ర విచిత్ర వ్యాపకాలు ఉండేవి. రాయాలనుకున్నా అలాంటివి మనం రాయలేం...
      రాసేవాడి గురించి చెప్పాలంటే.. మా డైరీ దుర్యోధన గురించే చెప్పాలి. వాడు డిసెంబరు రాగానే డైరీ కొనేసేవాడు. ఆ నెలంతా నూతన సంవత్సర శుభాకాంక్షలు అని రాయించడానికి అందమైన చేతిరాత ఎవరిదా అని అన్వేషించడం. పేరు బాగా చెక్కించుకోవడం చేసేవాడు. జనవరి ఒకటో తేదీ శుభముహూర్తాన, వాడు ఎవరెవరికి శుభాకాంక్షలు చెప్పాడో రాసేవాడు. ఆ శుభం ఒకటో పేజీకే సరిపెట్టి రెండో పేజీలో రమ్యకృష్ణ గ్రీటింగ్‌ కార్డు తీసుకోలేదనో, ప్రియదర్శిని చెప్పుతో కొడతానని బెదిరించిందనో, తన పరాభవ సన్నివేశాలన్నీ మయసభ ఏకపాత్రాభినయ డైలాగులకి మించిన అక్షర తూకంతో రాసి పారేసేవాడు. మీకో విషయం చెప్పడం మరిచి పోయాను. డిసెంబరులో వాడు చేసే ఇంకో పని ఉంది. డైరీ పేరు రాశాక మయసభ డైలాగులు కంఠతా పెట్టాలన్న ఉద్దేశంతో అవన్నీ చివరి పేజీలో రాసి పెట్టుకోవడం వాడి ముచ్చట. పాపం ఇప్పటికీ ఎక్కడో బెక్కుతూ ఉంటాడు. కంఠతా రాక! దుర్యోధనుడు సన్నగా ఉండుంటే చిటికెలో ఇవన్నీ వచ్చేసేవి అనేవాడు. ఈ డైలాగుల సంగతి ఎలా ఉన్నా, వాడి డైరీ రెండోపేజీలో ‘పరాభవ సీన్లు’ చదివి నవ్వడానికి మాత్రం పొట్టలో బోలెడంత గాలి ఉండాలి.
      వీడికి ఒకాకు ఎక్కువ మా కండల కవికుమారుడు. వీడి డైరీ దానవ శకటం! లక్షమంది రాక్షసులను వీడు రాసిన కవితలో నాలుగు వరసలకు సర్ది కూర్చోబెట్టవచ్చు. గత ఏడాది ఆ వరసలు ఎలా ఉన్నాయంటే..
      ‘ఓ నూతన సంవత్సరమా నేనెక్కడ?
      రవిబింబం ఏడ్చింది
      దానికింద నేను లేను..
      రైలుబండి తుమ్మింది
      అందులోని నేను లేను..
      అరటిపండు అలిగింది
      తొక్కమీద నేను లేను..
      కొత్త కవిత రక్కింది
      కలంలోని నేను లేను..
      ఓ నూతన సంవత్సరమా నేనెక్కడ?
      నన్నెందుకు పిలుస్తావ్‌..
      సరే వస్తా.. అసలు నువ్వెక్కడ..!!?’
      ఈ కవనగునపం గుచ్చుకున్న పిచ్చి ప్రాణుల్లో నేనొకడిని. కవికుమారుడి కండల ముందు కపోతమై విలవిల్లాడాను. చొక్కా పట్టుకుని మనిషిని అమాంతం ఎడమ చేత్తో పైకెత్తి, కుడి చేత్తో డైరీలో ఓ పేజీ చదవడం వాడికి సరదా. కండలు గల కవికి వేయి దండలు గురువా అని వూరుకోవాలి మరి. మరో వరల్డ్‌ వార్‌ వచ్చేటట్లయితే మావాడి డైరీ ప్రపంచ భాషలన్నిట్లోకీ తర్జుమా ఖాయం!
      ఇలాంటివాడు కాదుగానీ.. డైరీలో నూతన సంవత్సర శుభాకాంక్షలు రాసి, దానిమీద పసుపు బొట్టు పెట్టి కళ్లకు అద్దుకునే క్లర్కు కనకాంబరం సంగతి చెబితే, జనవరినుంచి డిసెంబరు దాకా ఆదివారాలు లేని సంవత్సరాన్ని గడపాలన్నంత బాధను ఒక్క ఘడియలో చూపిస్తారు. ఒకటో తేదీ దగ్గర ‘గత ఏడాది అప్పు’ అనే వారసత్వ వాక్కును హక్కుగా రాసుకుంటాడు. పక్క అంకెలు మిగతా లంకెలు జనవరి ముప్ఫైదాకా సాగి, అక్కడ సరిపోక మరో రెండు మూడు తెల్ల కాగితాలు అంటించేదాకా పోతాయి. నెలలో ఆఖరి వరసలో ‘మిగిలిన జీతం’ అని రాసి కొట్టేస్తుంటాడు అమాయకుడు. ‘తీరిన బాకీలు’ అనే వాక్యం కోసం వాళ్లావిడ కనకధారాస్తోత్రం చదివిన ప్రతిసారీ తరచి చూస్తుంది.
      అచ్చు కనకాంబరం లాగే భిక్షపతి అని మరొకరు ఉన్నారండోయ్‌.. శుభాకాంక్షలు వరకూ ఇద్దరిదీ ఒకటే పంథా. తర్వాత వాక్యాలు కాస్తమారతాయి. బాకీదారుల పేర్లు, వసూలైన అప్పులు, లాభశాతాలు, లాకర్‌ నంబర్లు వంటి వాక్యాలు పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉంటుందా డైరీ!
అయినా డైరీలో దినచర్య మాత్రమే రాయాలనే నియమం లేదుగా. మా కోటేశ్వర్రావు నాయనమ్మ అయితే డైరీలో రామకోటి రాసింది. కోటి ఉండవేమోనే, మహా అయితే లక్ష ఉంటాయన్నాడు మనవడు. లేదు లేదు కూర్చుని లెక్కబెట్టు, రామకోటి పూర్తయితే ఈ కొత్త ఏడాది నీకో ఉంగరం ఇస్తాననుకున్నానే.. అని నిట్టూర్చింది. వీడో గుటక మింగి కాసేపు పుస్తకం అటూ ఇటూ తిప్పి, అదీ సంగతి.. 2012 డైరీ కదూ.. లీపు సంవత్సరమే నాయనమ్మా, అంటే ఓ పేజీ అదనంగా ఉంటుంది. లెక్క సరిపోదూ మరి.. అంటూ పళ్లికిలించాడు.
      ఈ మనవడి డైరీ మరీ విచిత్రం. జీవితానికి ఒకే డైరీ రాశాడు. అందులో జనవరి1న ‘పెళ్లి చూపులు అయ్యాయి’ అని ఉంది. జూన్‌1న ‘తిక్క కుదిరింది’ అని ఉంది. మళ్లీ డిసెంబరు31న ‘ఈ డైరీ నాది కాదు’ అని కనిపించింది. డైరీ అంతా ఖాళీగా ఉంది, జికె బిట్లు రాసుకుందాం అని తీసుకున్న మేనల్లుడు ఆ మూడు వాక్యాలు చూసి ఉత్కంఠకి లోనయ్యాడు. మధ్య వాక్యం చేతిరాత వాడి మావయ్యది కాదని శాంతపరిచాను.
      ఇంకో స్నేహితుడు దాసు కూడా అందర్లాగే హేపీ న్యూ ఇయర్‌ రాసేసి, ఒకటో తేదీ దగ్గర ‘అందరూ బాగుండాలి’ అని రాసేంతలో ఇంకు అయిపోయిందట. వేరే పెన్నులేవీ ఆ ఇంకు రంగుకు మేచింగ్‌ అవ్వలేదని వదిలేశాడు. వాళ్లావిడ ఎంచక్కా చుక్కల ముగ్గులు అందులో సాధన చేసింది. ఆ నైపుణ్యం ప్రభావం వల్ల సంక్రాంతికి రథం ముగ్గు వేసుకుంటూ పక్క వూళ్లొ పుట్టింటి వరకూ వెళిపోయిందట! ఆమె చెల్లి పిండివంటల ముచ్చట్లు, పచ్చళ్ల తయారీలు రాసుకోడానికి కూడా ఓ డైరీ అడిగితే, మా దాసు ప్రేమదాసుగా ఉన్న రోజులనాటి డైరీ ఒకటి తీసి ఇచ్చేసిందట!
      మీరు నమ్మరుగానీ.. అది చదివి ఆమె కలక్టరు అయిపోయింది. అందులో మొదటి నినాదం నాకు గుర్తుంది. ‘పుస్తకం ముందుంటే బాసింపట్టు వీడరాదు’. అందుకని వీడు పుస్తకాన్ని వెనక్కి విసిరేసి లేచేవాడు. పాపం ఆ పిల్ల తప్పుగా అర్థం చేసుకుంది. ఇది సరే, ఆ మూడో పేజీలో మాధురికి రాసిన ప్రేమలేఖ నమూనా ఈ పిల్ల ఎలా అర్థం చేసుకుందా అని తేలటం లేదు. ‘నా ఆశా శ్వాసా ధ్యాసా నీమీదే కేంద్రీకరిస్తాను. అనుకున్నది సాధించడానికి వెంటబడతాను.. ప్రాణాలను పణంగా పెడతాను..’ అంటూ బాగా రాశాడా లేఖ. ఏదైతేనేం అంతా శుభం.
      ఈ సెల్‌సంసారంలో పడ్డాక డైరీలు రాసేవాళ్లు కాస్త తగ్గినట్లే ఉంది. ప్రతి నూతన సంవత్సరాన ఏ పాలసీ ఏజెంటో, సంఘం ప్రెసిడెంటో డైరీలు పంచకమానరు. రాసేదేమున్నా అవి అందుకోడానికి మనలో ఉబలాటమూ తగ్గదు. ఈ లోలోపలి ఉబలాటాల గురించి చిత్రగుప్తుడే చెప్పాలి. ఎందుకంటే డైలీ డైరీ రాసే ఏకైక వ్యక్తి ఆయనే!
      ఆయన డైరీలో పేజీలు అనంతం..!!
      ప్రతి పేజీ ఒకరి డైరీ..!!!
      అరె.. డైరీలో రాయాలేగానీ బోలెడన్ని సంగతులున్నాయే..
      ఇప్పుడు నాకో డైరీ కావాలి...

*  *  *
 


వెనక్కి ...

మీ అభిప్రాయం