వచ్చి వడపప్పె తిను వట్టి పిచ్చితండ్రి!

  • 138 Views
  • 0Likes
  • Like
  • Article Share

గణపతి స్తోత్రాలు, కీర్తనల్లో సంస్కృతమే ఎక్కువ. అయితే, అచ్చమైన తెలుగు పదాలతో, మనవైన నుడికారాలతో జంధ్యాల పాపయ్యశాస్త్రి ‘ఉదయశ్రీ’లో ప్రకటించిన ‘నమస్తే’ పద్యమాలిక గణేశుడి నిత్యస్తోత్రాలకు ఏమాత్రం తీసిపోనిది! జాతి వ్యవహారానికి సంబంధించిన సజీవ భాషాపదజాలం పుష్కలంగా ఉన్న పద్య మంజాష ఇది. 
విశాలనేత్రాలు,
నునుపైన తొండం, చిరుపొజ్జ, కెలిమువ్వల సవ్వడితో అల్లనల్లన తిరిగే గణపతి అంటే పిల్లలకి చాలా ఇష్టం. ఎందుకు అంత ఆకర్షణ అంటే ఏ దేవుడికీ లేని ఆ విలక్షణ రూపమే కారణం. గణేశుని నిండైన విగ్రహాన్ని చూపిస్తూ దంతాన్ని విరిచి భారతం రాయడానికి పూనుకోవడంతో ఏకదంతుడు అయ్యాడని చెబుతారు. పెద్దల మాటలు వినడంతో అలసత్వం కూడదనడానికి ఆయన పెద్దపెద్ద చెవులు ఓ ప్రతీక అంటారు. లంబోదరుడి బొజ్జలో ఉండేవి కుడుములు మాత్రమే కాదు, నాదోత్పత్తికి మూలబీజమైన అక్షర తునకలు. సకల కార్యాలను తెలివిడితో చేసి, ఫలితం సాధించగలిగే శక్తియుక్తులు అక్షర జ్ఞానంతోనే లభిస్తాయి. ఆ విషయాన్ని చాటిచెప్పి, చదువుల దేవుడయ్యాడు గణపతి. గణాధిపతి, సర్పలోకాధిపతిగా ఎంత ప్రసిద్ధి పొందినా.. మనిషిలో కార్యశీలత కీలకమైందని, చేసే పనిపట్ల అచంచల విశ్వాసమే కార్యసిద్ధికి మూలాధారమని తన చేతలతో విడమరిచాడు వినాయకుడు. అందుకే ఈనాటికీ ఆదిపూజలు ఆయనకే జరుగుతాయి. 
      ‘ఎలుకనెక్కే ఏనుగు కథ చిత్రం కదా!’ అంటూ సిరివెన్నెల పాడారు. ‘కరుణశ్రీ’ జంధ్యాల పాపయ్యశాస్త్రి కూడా ‘ఎలుక గుర్రం మీద నీరేడు భువనాలు పరువెత్తివచ్చిన పందెకాడు’ అంటూ గణపతయ్య రూపాన్ని ఇలా బొమ్మకట్టించారు..
తిలకమ్ముగా దిద్ది తీర్చిన పూప జా
బిలి రేక లేత వెన్నెలలు గాయ
చిరుబొజ్జ జీరాడు చికిలి కుచ్చుల చెంగు 
మురిపెంపు పాదాల ముద్దుగొనగ
జలతారు పూలకుచ్చుల వల్లెవాటుతో 
త్రాచు జందెముల దోబూచులాడ 
కొలుచు ముప్పదిమూడు కోట్ల దేవతలపై 
చల్లని చూపులు వెల్లివిరియ 
గౌరికొమరుడు కొలువు సింగారమయ్యె 
జాగు చేసినచో లేచి సాగునేమో 
తమ్ముడా! రమ్ము స్వామి పాదములు బట్ట;
చెల్లెలా! తెమ్ము పువ్వుల పళ్లెరమ్ము!

      గణాధిపతిగా కొలువుదీరిన వినాయకుణ్ని వర్ణిస్తూ చేస్తున్న ఈ ప్రార్థనలో బాలకృష్ణుడి పోలికలు కనిపిస్తాయి. ‘జలతారు పూలకుచ్చుల వల్లెవాటుతో త్రాచు జందెములు దోబూచులాడ’ అంటూ అనడంలోనే ‘ముక్కంటి ఇంటిలో పెత్తనం చేసే పెద్దకొడుకు’ అని అర్థస్ఫురణ కలుగుతుంది. ‘వడకుగుబ్బలి రాచవారిబిడ్డ’ అంటే హిమవంతుడి తనయ పార్వతీదేవి నోముల పంటగా అవతరించిన ఈ బిడ్డడు, ‘అమరులం దగ్రతాంబూల మందు మేటి’ అని చెబుతారు కరుణశ్రీ. అంటే, సకల దేవతాగణాల్లో.. అగ్రతాంబూలాలు అందుకునే వారిలో గణనాథుడికి సాటిలేదన్నది కవిభావం. ‘‘విఘ్నదేవుడు వ్యాహ్యాళి వెడలివచ్చె/ ఆంధ్రవిద్యార్థి! లెమ్ము జోహారు లిడగ!!’’ అంటూ ప్రస్తుతించే కరుణశ్రీ విఘ్నేశ్వరస్తుతి నిజానికి పిల్లలకి సంబంధించింది. వినాయకుడి పూజలో పాడే శ్లోకాల మాదిరిగానే పాడుకోదగిన లక్షణమైన సీసపద్యమాలిక ఇది.  
      గణపతి ఎవరెవరికి, ఏయే విధాలుగా సాయపడతాడో.. ఆ దేవుడందించే వరాల దీవెనలోని ప్రత్యేకత ఎలాంటిదో కరుణశ్రీ ఇలా చెబుతారు.. 
కొలుచువారలకు ముంగొంగు బంగారమ్ము 
పిలుచువారల కెల్ల ప్రియసఖుండు 
సేవించువారికి చేతి చింతామణి 
భావించువారికి పట్టుకొమ్మ 
‘దాసోహ’ మనువారి దగ్గర చుట్టమ్ము 
దోసి లొగ్గినవారి తోడునీడ 
ఆశ్రయించినవారి కానంద మందార 
మర్థించువారల కమృతలహరి 
జాలిపేగుల వాడు లోకాల కాది 
దేవుడే మన పార్వతీదేవి కొడుకు!

      ‘చిట్టెలుకనెక్కి విచ్చేసిన అంబాసుతుడి పాదాలను కడుగుదాం! అక్కా.. ఆ నీళ్ల పాత్ర ఇలా అందుకో’ అంటూ సాగే ఈ పద్యంలో అలతి అలతి తెలుగు పలుకుబడులు కనిపిస్తాయి. లోకాలకు ఆదిదేవుడైన గణపతి చల్లని నీడలో ఉన్నంత కాలం ఎవరికీ ఏ చింతా ఉండదని చెప్పడమే ‘కొంగుబంగారం, చేతి చింతామణి, పట్టుకొమ్మ, దగ్గర చుట్టం, తోడునీడ’ తదితర పదబంధాల అంతరార్థం. కొంగు బంగారమంటే.. స్వాధీనంలో ఉన్నది, సులభసాధ్యమైందనీ! ఈ జాతీయం ప్రయోగంలో కరుణశ్రీ ఉద్దేశం ఏంటంటే, వినాయకుడు భక్తసులభుడనడమే. 
నిరాడంబర వ్యక్తిత్వం
మనిషి లోకానికి చేసే మహోపకారం ఏదైనా ఉందంటే అది లోకాన్ని ఉన్నదున్నట్టుగా వదిలేయడమే అంటారు పెద్దలు. ప్రకృతి తన ధర్మపథంలో తను నడిచిపోతుంది. మనుషులే అంతులేని కోరికలతో దాన్ని నాశనం చేస్తుంటారు. వినాయకుడికి మాత్రం అలాంటి ఆర్భాటాలేవీ అక్కర్లేదు. ప్రకృతిసిద్ధమైన పత్రాలూ పువ్వులర్పిస్తే చాలు, ఆనందపడిపోయే ధన్యజీవి. ఏకదంతుడు జపతపాలూ, యాగాలు హోమాలూ, ముడుపు మూటలు అక్కర్లేదు, గరికపూజతో ఆయన తృప్తిపడి పోతాడంటారు కవి పాపయశాస్త్రి.  
లడ్డూ జిలేబి హల్వాలె యక్కరలేదు 
బియ్యపుండ్రాళ్లకే చెయ్యిచాచు 
వలిపంపు పట్టు దువ్వలువలే పనిలేదు
పసుపు గోచీకె సంబ్రాలుపడును 
ముడుపుమూటల పెట్టుబడి పట్టుదల లేదు 
పొట్టిగుంజిళ్లకే పొంగిపోవు 
కల్కి తురాయీలకై తగాదాలేదు 
గరిక పూజకె తలకాయ నొగ్గు... 

      ఇడుములు బాసిపోవాలంటే ముడుపులు కట్టక్కర్లేదు.. పంచభక్ష్య పరమాన్నాలు అసలే అవసరం లేదు.. బియ్యం ఉండ్రాళ్లతో సంతోషపడిపోతాడు గణపతి. కలికితురాయీ, పట్టుపావడాలు కాదు.. గరిక తెచ్చి పాదాల దగ్గర పెడితే పరవశించి పోతాడు. గరుడ విహారాలూ, పంచకల్యాణి మీద విలాసాలూ అనవసరమని ఎలకనే రథంగా మార్చుకున్న గజాననుణ్ని మించిన నిరాడంబరుడు ఎవరు? ‘‘పచ్చి వడపప్పె తిను వట్టి పిచ్చితండ్రి’’ అంటూ వినాయక తత్త్వాన్ని ఆత్మీయంగా ఆవిష్కరిస్తారు కరుణశ్రీ. తండ్రి పశుపతి, తల్లి సకల భువనాలను పోషించే అన్నపూర్ణేశ్వరి. తనేమో సర్వభూతాధిపతి. నాగాభరణాలతో విలసిల్లుతూ... ఏకదంతుడిగా గజముఖంతో శోభిల్లుతూ... మూషిక వాహనం మీద ముల్లోకాల్లో విహరిస్తుంటాడు. దేవతాగణాల్లో విలక్షణుడైన వినాయకుడు సర్వకాలాల్లోనూ స్మరణీయుడేనన్నది కవిభావన.
      అందమైన తెలుగు పదమందారాలతో గణపతి రూపవర్ణన, జీవన చిత్రణ చేసిన పాపయశాస్త్రి పద్యాలు ఒకనాడు తెలుగునాట విరివిగా వినిపించేవి. వినాయక చవితి రోజుల్లో పిల్లలు వీటిని శ్రావ్యంగా ఆలపించేవారు. కరుణశ్రీ కోరుకున్నట్టు- ‘‘పార్వతీబాయి ముద్దులబ్బాయి చేయి/ తెనుగు బిడ్డల భాగ్యాలు దిద్దుగాక’’!


వెనక్కి ...

మీ అభిప్రాయం