తెలుగు వంటలు.. కరోనాకి కళ్లాలు

  • 128 Views
  • 0Likes
  • Like
  • Article Share

    డాక్టర్‌ జి.వి.పూర్ణచందు

  • విజయవాడ
  • 9440172642
డాక్టర్‌ జి.వి.పూర్ణచందు

చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమెందుకు? అలాగే, జబ్బులొచ్చాక ఆస్పత్రుల చుట్టూ తిరగడం కంటే అసలు ఏ వ్యాధులూ దరిజేరకుండా చూసుకోవడం ఉత్తమం కదా! ప్రపంచం మొత్తాన్ని కలవరపాటుకు గురిచేస్తున్న కొవిడ్‌-19నూ కొన్ని ముందుజాగ్రత్తలతో అడ్డుకోవచ్చు. ముఖ్యంగా బలవర్ధకమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. ప్రాచీన తెలుగు సాహిత్యం, ఆయుర్వేద గ్రంథాల్లో ఉట్టంకించిన కొన్ని వంటకాలతో రుచికి రుచే కాదు, బోల్డంత శక్తినీ అందిపుచ్చుకోవచ్చు. 
ఒక కొన్ని వడియంబులొక కొన్ని వరుగులు
నొకకొన్ని తెఱఁగుల యొలుపుఁ పప్పు
లొక కొన్ని ద్రబ్బెడ లొకకొన్ని తాలింపు
లొకకొన్ని విధముల యొఱ్ఱచేరు
లొకకొన్ని కలకల్పు లొకకొన్ని బజ్జులు
నొకకొన్ని రీతుల యూర్పువగలు
నొకకొన్ని సిగరులు నొకకొన్ని యంబళ్లు
నొకకొన్ని బహులపూపోత్కరములు
వివిధ ఫలకందమూలంబు లవియుఁ గొన్ని
యూరుఁబిండులు నొకకొన్ని యొక్కకొన్ని
యూరుఁ గాయలు బచ్చళ్లు నొక్కకొన్ని
పెరుగు పాల్‌ తేనె నేఁతులు పెచ్చుపెరుగ

      పాండురంగ మహాత్మ్యంలో తెనాలి రామకృష్ణుడి పద్యమిది. సుశీల అనే ఆవిడ ఈ వంటకాలన్నీ వండిందట! ఇవన్నీ కరోనాను నిరోధించే ఆహార పదార్థాలే! 
అల్లం, మిర్చి వేసిన మినప ‘వడియాలు’ కఫాన్ని తగ్గిస్తాయి. బలకరాలు. కాకర, ఆగాకర, ఆదొండ, వీటి ముక్కల్ని ఉప్పు రాసి నీరుపిండి ఎండించిన ‘వరుగులూ’ కఫాన్ని హరిస్తాయి. ‘ఒలుపు పప్పు’ అంటే పొట్టు తీసిన కంది లేదా పెసరపప్పుతో వండిన సూపం (పప్పు). కఫాన్ని తగ్గించి రోగనిరోధకశక్తి పెంచుతుంది. కూరగాయలు వేసి వండిన ఫ్రైడ్‌రైస్‌.. ‘ద్రబ్బెడ’. జీర్ణశక్తిని, రోగనిరోధక శక్తినీ పెంచుతుంది. బిరియానీ, పలావుల కన్నా మేలైంది. చింతపండు, మసాలాలు దట్టించకుండా వండిన ఇగురు కూరలే ‘తాలింపులు’. వీటిలో పీచుపదార్థం ఉంటుంది. కూరగాయల ముక్కలు కలిపి వండిన పప్పు లేదా పప్పు చారే ‘కలగలుపు’. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇక ‘ఒర్రచేరు’ అంటేనేమో ఘాటైన మిరియాల చారు. కఫాన్ని తక్షణం తగ్గించి ఊపిరితిత్తుల్ని శుభ్రపరుస్తుంది. జీర్ణశక్తిని బలపరుస్తుంది. కూరగాయని కాల్చి నూరి చేసిన పచ్చడిని ‘బజ్జుపచ్చడి’ అంటారు. బజ్జుని కలిపి తయారు చేసిన పచ్చిపులుసు ‘ఊర్పు’. ఇవి జీర్ణశక్తిని పెంచుతాయి. ‘సిగరి’- శిఖరిణి అంటే పెరుగులో పంచదార వేసిన పానీయం. చలవనిచ్చి, పేగులకు ప్రశాంతత కలిగిస్తుంది. జీర్ణశక్తినిస్తుంది. ‘అంబలి’ తెలిసిందే. రాగి, మజ్జిగ కలిపి తయారు చేసే ఈ పానీయం కఫహరం. పూపాలు అంటే అపూపాలు (అప్పచ్చులు లేదా అప్పాలు). రాగి అప్పాలు, సజ్జప్పాలు శ్రేష్టమైనవి. మినప్పప్పును రుబ్బి ఉప్పుకారాలు చేర్చి, తాలింపు పెట్టి, పచ్చడిలాగా తింటారు. అదే ‘ఊరుబిండి’. ఇది కఫహరం, శక్తిదాయకం. ఇంకా ఊరుగాయలు (ఉసిరికాయ తొక్కుపచ్చడి లాంటివి) చింతపండు వెయ్యని రోటి పచ్చళ్లు, పెరుగు, పాలు, తేనె, నెయ్యి వగైరా... ఇవన్నీ కరోనా రోగులకు నిర్భయంగా వండిపెట్టాల్సిన వంటకాలు. రోగనిరోధకశక్తిని పెంచుకోవడానికి ఉపకరించే మరిన్ని ప్రాచీన వంటకాలివి.. 


సంయావం (ఖజ్జికాయలు)
‘భావప్రకాశ’ అనే గ్రంథంలో కఫనాశకం, బలకరం, రోగనిరోధకశక్తిని పెంచే వంటకంగా దీన్ని పేర్కొన్నారు. పంచదార, ఏలకులు, లవంగాలు, మిరియాలు, కొబ్బరి, జీడిపప్పు, బాదంపప్పు, పిస్తాపప్పుల ముక్కలు, కొద్దిగా పచ్చ కర్పూరాలను తగుపాళ్లలో చేర్చి మిక్సీ పట్టి ఒక పక్కన ఉంచాలి. పలుచగా వత్తి, కరకరగా వేయించిన పూరీని ముక్కలుగా చేసి మిక్సీ పట్టి, ఆ పొడిని అందులో సమానంగా కలపాలి. గోధుమపిండితో అప్పడం వత్తి దాని మధ్య ఈ పొడిని కొద్దిగా ఉంచి మూసి, వేయించిన ఖజ్జికాయలు పిల్లలకు బలకరం. పుష్టినిస్తాయి. పైత్యాన్ని, కఫాన్ని తగ్గిస్తాయి.


కర్పూర నాళిక (స్ప్రింగ్‌ రోల్‌)
పంచదార, ఏలకులు, లవంగాలు, మిరియాలు, కొబ్బరి, జీడిపప్పు, బాదం- పిస్తాపప్పుల ముక్కలు, కొద్దిగా పచ్చకర్పూరాలను తగుపాళ్లలో చేర్చి మిక్సీ పట్టిన పొడిని గోధుమ అప్పడం మీద కొద్దిగా పరిచి, చాపలా చుట్టేయాలి. తర్వాత అంచులు నొక్కి మూసేసి నూనెలో వేయిస్తే అదే కర్పూరనాళిక. ఇది కఫాన్ని తగ్గిస్తుంది. చైనా వాళ్లు ‘చూన్‌ జువాన్‌’ పేరుతో కారపు స్ప్రింగ్‌ రోల్స్‌ చేస్తారు. కర్పూరనాళికలు తీపి స్ప్రింగ్‌ రోల్స్‌. కరోనా సమయంలో అందరూ తినదగిన భక్ష్యం. రోగనిరోధక, జీర్ణ శక్తులను పెంచి, కఫాన్ని, వేడినీ తగ్గిస్తుంది. 


 

కిచ్చడి (ఆవపెరుగు పచ్చడి)                                                              
‘‘సద్యోఃఘృతాలు, జక్కెరలు, పచ్చళ్లు, కిచ్చళ్లు...’’ అని ఉత్తర రామాయణంలో కంకంటి పాపరాజు, ‘‘చారులు దియ్యగూరలు బచ్చడులుం గిచ్చడులును బజ్జులును...’’ అంటూ ‘కాశీఖండం’లో శ్రీనాథుడు అనేక రకాల పచ్చళ్లు, కిచ్చళ్లను ప్రస్తావించారు.
పచ్చడి కిచ్చడి అనేవి జంటపదాలు. పెరుగులో కొద్దిగా ఆవపిండి కలిపి, కూరగాయ ముక్కలు చేర్చి తాలింపు పెట్టి, కొత్తిమీరతో అలంకరించిన ఆవ పెరుగుపచ్చడిని ‘కిచ్చడి’ అంటారు. సొరకాయ, బూడిదగుమ్మడి, గుమ్మడి, కేరట్, అరటికాయ, అరటి ఊచ, ఆలు, చిలకడ దుంపలతో దీన్ని చేస్తారు. పీచు కలిగిన కూరగాయల్ని ప్రీ-బయాటిక్‌ అనీ, పెరుగుని ప్రో-బయాటిక్‌ అనీ అంటారు. ఈ కిచ్చడికి ప్రీ-బయాటిక్, ప్రో-బయాటిక్‌ రెండు గుణాలూ ఉన్నాయి. కొద్దిగా ఆవపిండిని, ధనియాల పొడిని, జీలకర్రని తగుపాళ్లలో చేరిస్తే, ఈ కిచ్చడి కఫదోషాన్ని హరిస్తుంది. జీర్ణకోశాన్ని బలసంపన్నం చేస్తుంది. స్థూలకాయం, షుగరు వ్యాధులను తగ్గిస్తుంది. ఇరిటబుల్‌ బవుల్‌ సిండ్రోం, అమీబియాసిస్, గ్యాసు, పేగుపూతలకు ఇది ఔషధం. పిల్లలకు, వృద్ధులకు పౌష్టికాహారం. ఆవపిండి కఫాన్ని, వాతాన్ని, విషదోషాలను హరిస్తుంది. జలుబు, తుమ్ములూ తగ్గిస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది.


పకోడీ/ కోడిబడి
తన ముంగిటముత్యం బాలకృష్ణుడికి యశోదమ్మ ప్రేమమీర తినిపించిన వంటకాల్లో పకోడీలను సూరదాసు వర్ణించాడు. కోడి అంటే జొన్న. జొన్నపిండితో చేసిన వంటకాలను పకోడి అన్నారు. ‘హంసవింశతి’ కావ్యంలో ‘కోడిబడి’ గురించి ఉంది. కోడివడే (జొన్నవడ) జనవ్యవహారంలో ‘కోడిబడి’ అయ్యింది. కరోనా వ్యాధిని ఎదుర్కొనే శక్తి జొన్నలకుంది. వరికన్నా జొన్నలే మిన్న! శ్లేష్మాన్ని తగ్గిస్తాయి. దగ్గు, జలుబు, తుమ్ములు ఆపుతాయి.
ఉప్మా వండుకోవాలంటే జొన్నరవ్వతో చేసుకోవచ్చు. పకోడీలు, కారప్పూస, చక్రాలనూ (సకినాలు) జొన్నపిండితో ప్రయత్నించవచ్చు. దోశలు వేసుకునేప్పుడు బియ్యప్పిండికి బదులు జొన్నపిండి కలుపుకోవచ్చు. ఈ రుచికి కూడా అలవాటు పడటం మంచిది. నూనెలో వేయిస్తే కలిగే అపకారాలు జొన్నపిండితో కలగకుండా ఉంటాయి. 


జర్ఘరీ (పోషకాల కట్‌లెట్‌)
పొట్టు తీసిన మినప్పప్పుని మెత్తగా మిక్సీ పట్టాలి. అందులో జీడిపప్పు, బాదం- పిస్తాపప్పు, ఆక్రోటు ముక్కలు, అల్లం, వెల్లుల్లి, మిరియాలపొడి, జీలకర్ర కలిపి గట్టిగా ముద్దచేయాలి. దాన్ని పూరీలాగా వత్తి పెనం మీద కాల్చితే, అదే జర్ఘరీ. కట్‌లెట్‌ మాదిరి నేతితోనూ కాల్చవచ్చు. కఫాన్ని, వేడినీ పోగొట్టి, బలాన్ని, రోగనిరోధకశక్తిని పెంచే ఈ వంటకాన్ని పిల్లలకు తరచూ వండిపెట్టొచ్చు. కఫ వ్యాధుల్లోనూ బాగా ఉపయోగపడుతుంది. అలాగని అతిగా తింటే వాతం పెంచుతుంది.


అంబకళం (పారిజ్‌)
సాక్షాత్తూ వ్యాసుడి శిష్యులకు విశాలాక్షి వడ్డించిన వంటకంగా శ్రీనాథుడు వర్ణించిన ‘అంబకళం’ ఓ ఘనమైన పానీయం. రాగి లేదా జొన్నగంజి (పారిజ్‌) అని దీని అర్థం. ఒకటీ రెండు రోజులపాటు నిల్వ ఉంచి పులిసిన మజ్జిగని కలిపి తయారు చేస్తారు. పల్నాడులో శ్రీనాథుడు ‘చల్లాయంబలి ద్రావితి’ అని దీనంగా చెప్పుకున్నది ఈ అంబకళం గురించే! కమ్మగా తాలింపు పెట్టి ‘సూప్‌’ లాగా ఆస్వాదించవచ్చు. ఇది శరీరానికి పుష్టిని, సంతృప్తినీ, కాంతినీ ఇస్తుంది. శరీరంలో ఆమ్ల-క్షార సమతుల్యతను తెస్తుంది. వేడిని, కఫాన్ని, రక్తదోషాన్ని పోగొట్టి పాల ఉబ్బసాన్ని తగ్గిస్తుంది. మధుమేహం, స్థూలకాయం, కేన్సరు, పేగుపూత, ఎలర్జీవ్యాధుల మీద పనిచేస్తుంది. కాల్షియం, ఇనుము, డి విటమిన్, పీచు పదార్థం పుష్కలంగా ఉన్న ద్రవ్యమిది. మెనోపాజ్‌ వచ్చిన మహిళలకు, వృద్ధులకు, ఎదిగే పిల్లలకు మేలు చేస్తుంది. 
ఊపిరితిత్తుల్లో పేరిన కఫాన్ని తగ్గించి కరోనాని ఎదుర్కొనే శక్తి రాగులకు, జొన్నలకు, సజ్జలకు, ఆరికలకు ఇతర తృణధాన్యాలకూ ఉంది. రాగి పిండితో లడ్డూలు, చక్రాలు, జంతికలు, అప్పాలు, పాయసం, ఉప్మా, పకోడి వగైరా వండుకోవచ్చు. జీడిపప్పు, బాదం, పిస్తా, ఆక్రోటు వగైరా కలిపి చేసిన రాగిలడ్డూలు, రాగి అప్పాలు, సజ్జప్పాలు చాలా శక్తిమంతమైన కఫహరాలు. రోగనిరోధక శక్తినీ పెంచుతాయి. గారెల పిండిలో కొద్దిగా రాగిపిండి, అల్లం, మిర్చి, మిరియాలు కలిపి గారెలు వేసుకుంటే, అవి మరింత రుచికరంగా ఉంటాయి. రాగి సంకటిని ఉదయం అల్పాహారంగా తీసుకునే వారికీ కరోనా అంత తొందరగా దరిచేరదు.


వేసవారం
‘క్షేమకుతూహలం’ అనే గ్రంథంలో విషదోషాలను, కఫాన్ని హరించి జీర్ణశక్తిని పెంచే ఓ అద్భుత ఫార్ములా ఉంది. ఓ చెంచా ఇంగువ, 2 చెంచాలు తడి ఆరిన అల్లంముద్ద, 4 చెంచాలు మిరియాల పొడి, 8 చెంచాలు జీలకర్ర పొడి, 16 చెంచాలు కొట్టిన పసుపు, 32 చెంచాలు ధనియాలపొడి తీసుకుని, తగినంత ఉప్పు కలపాలి. ఈ పొడిని కూర కారంగా, రసం- సాంబారు పొడిగా, కారప్పొడిగా వాడుకోవచ్చు. మజ్జిగలో కలుపుకుని తాగవచ్చు. ఈ వేసవారాన్ని రోజు మొత్తం మీద 1-2 చెంచాలు తీసుకుంటే కరోనాని ఎదుర్కొనే శక్తి శరీరానికి కలుగుతుంది. అల్లం, వసకొమ్ము, తులసి ఆకులను ఏదో ఒక విధంగా రోజూ తీసుకున్నా కరోనాని శరీరం తట్టుకోగలుగుతుంది. వేడి పాలలో పసుపు కలిపి తాగితే కూడా మంచిదే. మంచి ఆహారంతో ఎన్నో అనారోగ్యాలను దూరంపెట్టవచ్చు. కరోనా కూడా వాటిలో ఒకటే!


వెనక్కి ...

మీ అభిప్రాయం