చారిత్రకం.. రసమయం

  • 91 Views
  • 0Likes
  • Like
  • Article Share

    సన్నిధానం నరసింహశర్మ

  • హైదరాబాదు
  • 9292055531
సన్నిధానం నరసింహశర్మ

అఖండ తెలుగు చరితకు రసాక్షర కావ్యం మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి ‘ఆంధ్రపురాణం’. అనేక శతాబ్దాల పాటు జాతి నడచివచ్చిన తోవల మీద సాహితీ వెలుగురేఖలు ప్రసరింపజేస్తూ మధునాపంతుల సృజించిన అనుపమాన కావ్యమిది. ‘‘ఇందులో శాస్త్రిగారు చిత్రించదలచిన ప్రతి ఘట్టాన్నీ చారిత్రక దృష్టితోనే చూశారు. ఆయా రాజుల జీవిత చరిత్రల కథనానికే ప్రథమ స్థానమిచ్చారు’’ అన్న ఇంద్రగంటి శ్రీకాంతశర్మ మాటలు అక్షరసత్యాలు.
ఆంధ్రపురాణ కవిత్వానికి వినోబాభావే, చిలకమర్తి, సి.వి.రామన్, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, భమిడిపాటి కామేశ్వరరావు, మల్లంపల్లి సోమశేఖరశర్మ, పుట్టపర్తి, పురిపండా, ఆచార్య ఎన్‌.జి.రంగా లాంటి విభిన్న రంగాల వారు ఆనందించారు. నిజానికి రెండు శతాబ్దాల పండిత కవి ప్రకాండుల దర్శనం- వారి ఆశీస్సులు పొందడం, కొందరితో మెలగడం లాంటివి మధునాపంతుల జీవనాదృష్ట సంకేతాలు. ప్రామాణిక విమర్శా వచనం, ఆంధ్రపురాణ చారిత్రక మహాకావ్య రచన..    ఈ రెండూ శాస్త్రి కీర్తికిరీటంలో కలికితురాయిలు. 
సంస్థానాధిపతుల
సాహిత్యాభిమానంతో కవులూ, గ్రంథాలు తలలెత్తుకునే రోజులవి. ఒకవైపు కావ్యసృజనలు జరుగుతున్నా అవధాన సాహిత్యం విజృంభించిన రోజులు. స్వాతంత్య్రోద్యమపు విత్తనాలు ఫలించి ప్రబోధ ఖండికలూ ఖండకావ్యాలూ రాసాగాయి. ఆ ఉద్యమంతో ఆంధ్రోద్యమం కలిసి సాగింది. అన్ని ప్రాంతాల తెలుగువారూ ‘నా చరిత, నా సంస్కృతి, నా కవిత’ అనే అంశాల భూమికల మీద ఆత్మగౌరవ జెండాలు ఎగరేస్తున్నారు. రాయప్రోలు, విశ్వనాథ, తుమ్మల, జాషువా ఇంకా మరికొందరు తమతమ ఖండ కావ్యాలతో ఆత్మగౌరవాన్ని కవితాత్మ గౌరవంగా ప్రబోధించారు. వాడివేడిగల ఉద్యమశీల కవిత్వాలు వచ్చాయి. అదే సమయంలో గోదావరీ తీరంలో పల్లెపాలెం గ్రామంలో ఒక పుంస్కోకిల మార్గ కవితా పద్ధతిలో దేశచరిత్ర గానానికి ఉపక్రమించిది - ఒక స్థిమిత వాతావరణంలో ఓ గుబురు మామిడి చెట్టుపై... ఒక తపస్సుగా! 
ఆ పుంస్కోకిలే మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి. ఆ తెలుగు చరితగాన కావ్యమే ఆంధ్రపురాణం. ఈ కావ్యనామం లోని ‘ఆంధ్ర’ పదం మరీ ప్రాంతీయం కాదు. ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ లాంటి గ్రంథాల్లోని విస్తృతాంధ్ర పదం. అందుకే కావ్యావతారికలో కవి ఇలా చెప్పుకున్నారు..  
పొలపముఁదప్పి పుర్వులకు భుక్తులు వెట్టెడి తాటియాకుఁ గ
ట్టలు- నెపుడెప్పుడో పుడమి డాఁగిన శాసనరాజి- వగ్గువా
రలబడి నివ్వటిల్లిన పురాణకథల్‌- ససిమాయు శిల్పముల్‌
తెలుఁగుచరిత్ర తొల్లిటిగతిన్‌ వచియించును గొంచియమ్ముగన్‌

      చరిత్రకారులు, పరిశోధకులు, పరిశీలకులు తడిమి రాశిపోసిన- తేరిన మధుఘట్ట చరిత్ర సారాన్ని రసాక్షర కావ్యంగా, ఆంధ్ర పురాణంగా సంతరించారు కవివతంసులు శాస్త్రి. ఆంధ్ర భారతంలానే ఇందులోనూ పర్వవిభజన చేశారు. మొత్తం తొమ్మిది- ఉదయ, శాత వాహన, చాళుక్య, కాకతీయ, పునః ప్రతిష్ఠా, విద్యానగర, శ్రీకృష్ణదేవరాయ, విజయ, నాయక రాజపర్వాలు. ‘పురా పి నవమ్‌ పురాణం’- అంటే పాతదైనా కొత్తగా ఉండేది. ఆ మాటకు భరోసా ఇస్తుందీ కావ్యం.
ప్రతి పర్వమూ అపూర్వమే! 
కొందరు ప్రాచీన కవులు కానీ, విశ్వనాథ తదితర ఆధునికులు కానీ భాషా విషయంగా సంస్కృతం, తెలుగుభాషా సౌందర్యాల్ని, సమయ సందర్భాలను బట్టి దట్టిస్తారు. మధునాపంతుల పథమూ ఇదే. ఏకచ్ఛత్రాధిపత్యం అనడానికి బదులుగా ‘ఒక్కగొడుగు నీడ’ అంటారు. లోతట్టు తెలుగు మాటల్ని వాడతారు. భాషా ప్రయోగంలో తెలుగుదనాన్ని పండిస్తారు. సృజనాత్మకత, భావుకత, రససృష్టుల మేళవింపు ‘ఆంధ్రపురాణం’. అందుకే జ్ఞానపీఠ కవి సినారె ‘‘కంకాళముల వంటి చారిత్రకాంశములకు కమనీయ రూపకల్పన’’ ఆంధ్రపురాణమన్నారు.
      కవుల దర్శనాలు, రాజదర్శనాలు, రసవద్ఘట్ట దర్శనాలు- ఇన్నిటితో నిండి ఉండటంతో మధునాపంతుల రాసినా- ఇది నా కావ్యం, ఇది నా చరిత్ర అని ప్రతి తెలుగువాడూ అనుకుంటాడు. శాతవాహన పర్వంలో కావ్య హోమ ఘట్టం గుండెల్ని పిండేస్తుంది. చాళుక్య పర్వంలో భారతావ తరణ ఘట్టం శాస్త్రి నన్నయాభిమానానికి, ఔచిత్య చిత్రీకరణలకు, కవితా శిల్పానికి మచ్చుతునక. కాకతీయ పర్వంలో తెలుగు రాణి రుద్రమాంబ వీరనారీ విశ్వరూపం కనబడుతుంది. పునఃప్రతిష్ఠా పర్వంలో రెడ్డిరాజుల దొడ్డ పాలనాస్మృతులు వెంటాడతాయి. విద్యానగర పర్వంలో విజయనగర సామ్రాజ్య స్థాపన, శ్రీనాథ డిండిమభట్టుల శాస్త్రచర్చలు, కవి సార్వభౌముడి కనకాభిషేకం లాంటివి తెలుగు చరిత్ర మధుస్మృతులుగా మిగులు తాయి. పిల్లలమర్రి పినవీరభద్రుడి కథా విశేషాలుంటాయి. శ్రీకృష్ణదేవరాయ, విజయ పర్వాల్లో సాహితీ సమరాంగణ సార్వభౌమ విజృంభణలుంటాయి. నాయక రాజ పర్వంలో విజయరాఘవుని నిరతాన్న దానం సంబంధిత కథ ‘చిత్రం’గా కనబడుతుంది. ఇందులోని ముత్యాల ముక్కర ఘట్టాన్ని చేబోలు శేషగిరిరావు ‘మోతీనాథ్‌’ పేర హిందీలోకి అనువదించారు.
అన్నీ రసగుళికలే!
ఆంధ్రుడంటే ఎవరు? ఆంధ్రదేశం అనే పేరు ఎందుకు వచ్చింది? అనే ప్రశ్నలు వేసి జవాబులు చెప్పుకుంటూ సాగే ఈ రచన, ఆంధ్రాభ్యుదయాన్ని కోరుతూ మంగళాంత పద్యాలతో అందగిస్తుంది. మధ్యలో ఎన్ని రసమయ సన్నివేశాలు! ఎన్ని అమృత గుళికల్లాంటి పద్యాలు- ఎలాంటి ఔచిత్య పరిరక్షణ కృషి- అన్నీ మురిపిస్తాయి.
      శాతవాహన పర్వంలో హాలుడు గుణాఢ్య గ్రంథాన్ని తిరస్కరిస్తాడు. బాధావివశుడై ఆ భూర్జరపత్ర కావ్యాన్ని హోమం చేస్తాడు కవి, శిష్యుల సహకారంతో..!
చిదుగుల నేర్చి పేరిచి రచించి రగిల్చిన యా చితాగ్ని బె
ట్టిదమగు నూర్పుగాడ్పుల వడిన్‌ వెడమంటల రాజుకొల్పుచున్‌
బొదిగిటఁ గప్పుకున్న వగపుం బొగచీకటి కన్నుసందులం
బ్రిదిలిచి తొంగిచూచి బెదరింప గూణాఢ్యుడు కంపితాకృతిన్

      ఈ పద్యం చదువుతుంటే ఆ చితాగ్నికి మనం దగ్గరున్నామేమో అనే అనుభూతి కలుగుతుంది. అదీకాక చిదుగుల నుంచి చితాగ్ని వరకు వేగంగా చదివితే అంటుకుంటున్న చితుకుల శబ్దాలు కూడా వినపడతాయి! గొప్ప కావ్యం రాసి దగ్ధం చేస్తుంటే ఆ కవి బాధ వర్ణనాతీతం. ‘‘చిమచిమారావ పావక శిఖలలోనఁ/ గబ్బ మొక్కొక్క యాకుగాఁ గాలుచుండఁ/ గవికి వేయిదళాల తమ్మి విరిఁబోని/ హృదయ మొక్కక్కరేకుగాఁ బ్రిదులు చుండె’’- ఒక్కొక్క ఆకుగా తాను రాసిన కావ్యం అంటుకుపోతుంటే... వేయి దళాల కవి హృదయపద్మ రేకులు ఒక్కొక్కటిగా విరిగిపడిపోతున్నాయట! 
చాళుక్య పర్వంలో నన్నయ ఆంధ్రభారత రచన ఆగిపోయిన సందర్భంలో- ఆగింది నన్నయ గంటం కాదంటూ మధునాపంతుల ఇలా చెబుతారు.. 
ఆఁగిన దల్ల నన్నయమహాఋషి గంటము కాదు; సాధువీ
చీగతి చాతురీ మధురుచి ప్రచురోత్తమ గౌతమీధునీ
వేగమె యాఁగిపోయె ననిపించి, రసజ్ఞుల డెందముల్‌ పిపా
సా గళితంబులై పరవశత్వము నందె నమందవేదనన్‌

      ఈ పద్యాన్ని తలచుకున్నప్పుడు రసజ్ఞు లైన వారికెవరికైనా కళ్లు చెమర్చుతాయి. కాకతీయ పర్వంలో రుద్రమ శత్రువులు ‘‘ఆఁడుదానికి రాజ్యపట్టాభిషేక/ వైభవ ప్రాభవములె; సెబాసు! మనకు/ నింక ముం దాంధ్రభూమిలో నింట నింటఁ/ గొదువలేదంట పసుపుఁ గుంకుమల పంట’’ అని వెటకారం చేస్తారు. ఈ పద్యంలోని అంత్యప్రాసల సౌందర్యం ‘ఆంధ్రపురాణం’ అంతటా కనిపిస్తుంది. ఇక విద్యానగర పర్వంలో శ్రీనాథుడి కనకాభిషేక సందర్భం ఓ స్వర్ణఘట్టం.
ఆంధ్రకవిసార్వభౌమ హేమాభిషేక
పరమసమ్మాన మంగళాచరణగాన
వాద్యనిస్వాన మదియొక్క స్వాతివాన
తనుపుగా మొగ్గ విచ్చె ముత్యాలశాల
 
      ఈ పద్యంలో మంగళవాద్య ధ్వని స్ఫురణలుంటాయి. వృత్తాల్లో సమాప ఘటనలు సహజం. కానీ, ఈ చిన్న తేటగీతిలో మూడో చరణం దాకా సమాస సౌందర్యం దృశ్యమానం చేయడం కవి ప్రతిభాంశం. శ్రీకృష్ణదేవరాయ పర్వంలో నగరాలంకరణ చేస్తుంటారు. ఆ వేడుకలో తెలుగు పద్యాల అలంకరణపు అందాలివి..
పొలపమునెత్తు ముత్తియపు మ్రుగ్గుల జగ్గులతో ననంటిబో
దెల రమణించు ద్వారముల దీప్తులతో నెఱిపూఁత జీడిపిం
దె లలరు మావిరెమ్మలఁ గుదించి వెలార్చిన తోరణాళితో
విలసితమై వసంతకృతివీధికిఁత్పురి తీర్చెఁ బీఠికన్‌

      సంస్కృత సమాసభూయిష్ట పద్యాలు విమాన ప్రయాణంగా భాసిస్తాయి. కానీ, తల్లిభాషలో చల్లగా ఎద మీటేలా రాసిన పద్యాలు తెలుగుగడ్డ మీద ఆ విమానాన్ని ఆపి మనల్ని సేదదీరుస్తాయి. 
      ఆంధ్రపురాణంతో చరిత్ర విశేషాలు, భాషావ్యాకరణాంశాలు తదితరాలే కాదు, కొన్ని సంప్రదాయాలూ తెలుస్తాయి. ఎవరైనా పొద్దున్నే నిద్ర నుంచి మేల్కొంటే ‘నిద్రలేచారు’ అంటారు కదా! కానీ, శ్రీకృష్ణదేవరాయలు నిద్ర నుంచి లేచారు అనకూడదట, ఆయన చక్రవర్తి కదా! కాబట్టి రాయల వారికి ‘పుష్పోదయం’ అయింది అనాలిట! చక్రవర్తికి పుష్పోదయం కాగానే మూడు మంగళకర వుస్తువుల్ని దర్శించాలట! అవి అద్దం, మణి, వీణ. ఇలాంటి ఆసక్తికర వివరాలు ఈ కావ్యంలో ఇంకా ఉంటాయి. భావుకత కలిగిన కవి చేతిలో చరిత్ర వస్తు స్వర్ణం ఎంతగా ప్రకాశిస్తుందనడానికి ఈ పద్యమే నిదర్శనం..   
పొలుపుల్‌ పొంగిన మంగళస్వనముతోఁ బుష్పోదయంబైన రా
య లొగిన్‌ దిర్మలదేవి నిర్మల కపోలాదర్శముం గాంచె; నం 
ఘ్రలకున్‌ మ్రొక్కెనఁ దచ్ఛిఖామణిహోరంగుల్‌ చూచె; నద్దేవి దీ
పిలఁగాఁ బల్కిన పల్కులందుఁ గనియెన్‌ వీణాస్వనత్తంత్రులన్‌

      తిరుమలాదేవి బుగ్గలో రాయలు అద్దాన్ని చూశాడు. రాణి తన కాళ్లకు వంగి నమస్కరించినప్పుడు తల మీద మణిని వీక్షించాడు; ఆమె మాట్లాడిన మాటల్లో వీణా స్వనత్తంత్రుల్ని దర్శించాడట. ఇలాంటివెన్నో మధురస బిందువులు తప్పక గ్రోలాలంటే ఈ కావ్యం చదవాలి.


వెనక్కి ...

మీ అభిప్రాయం