బలరామ రాజ్యం

  • 32 Views
  • 0Likes
  • Like
  • Article Share

    శంకరనారాయణ

  • హైదరాబాదు
  • 8008333227
శంకరనారాయణ

గాంధీ పుట్టిన దేశమా ఇది! నెహ్రూ కోరిన సంఘమా ఇది! సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా అని జనాదరణ పొందిన సినిమా పాట ఉంది. ఇప్పటికీ ఈ పాట ఆగలేదు. ఆ బాట రాలేదు.
      రామరాజ్యం కావాలని అందరం కలలు కంటుంటాం. ఇంతకీ రామరాజ్యం అంటే మొదట గుర్తొచ్చేది ఏంటి?
      నెలకు మూడు వానలు కురుస్తాయని! మరి రోజూ ఎడ తెరిపిలేకుండా వానలు పడే చిరపుంజిలో ఏ రాజ్యం ఉందని అడగకూడదు. ఎటొచ్చీ నెలకు ఎన్ని వానలు కురిసినా, పంటలు పండించే రైతన్నలు బతికి బట్ట కట్టినప్పుడే కదా సమాజం బాగుండేది! అన్నదాతలే డీలా పడిపోయి ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఇక దిక్కేది? కర్షక జీవుల కన్నులనిండా ఆనందాశ్రువులు కనిపించాలంటే మార్గం ఏంటి? రామరాజ్యంతో పాటు బలరామరాజ్యం కూడా అవసరం. ‘ఓ రామ నీనామమెంతొ రుచిరా! ఎంతొ రుచిరా’ అనడంతో పాటు అవసరార్థం ‘బలరామ నీనామ మెంతొ రుచిరా’ అనీ పాడుకుంటే రైతు సమాజానికి మంచిది. రాముడికి, బలరాముడికి ఎంత తేడా! కృష్ణుడికి, బలరాముడికి ఎంత తేడా! రాముడూ నలుపే. కృష్ణుడూ నలుపే కానీ బలరాముడు తెల్లటి తెలుపు! ‘నల్లటివాడు పద్మనయనమ్ములవాడు’ అని కృష్ణుడి గురించి భాగవతాన్ని ప్రసాదించిన బమ్మెర పోతనామాత్యుడు కళ్లకు కట్టేట్టు వర్ణించాడు. మరి బలరాముడి సంగతో..!
హల ముసల ధరునిఁ గరుణా/ నిలయ హృదయు రాము రౌహిణేయు సితాంగున్‌/ 
జలద నిభాంబరుని శుచిం/ దలతును గోవిందు శౌర్యధను భోగాత్మున్‌

      ఇది భారతం శాంతిపర్వంలోని పద్యం. బలరాముడు ‘సితాంగుడు’. అంటే తెల్లని శరీరం కలవాడు అనేగా అర్థం! పేరుతో పని ఏముంది? అని ఎవరన్నా సరే, తీరులోనూ బలరాముడు విశిష్ట లక్షణాలు కలవాడే! బలరాముడు రైతులాంటి వాడే! తన ఆయుధం నాగలి. అందుకే ఆయన్ను ‘హలాయుధుడు’ అంటారు. రైతు ఆయుధం కూడా నాగలే. బలరాముడు నాగలితో చేసిన సాహసం అనన్య సామాన్యం. హస్తినాపురాన్ని (ఇప్పటి దిల్లీని) ఏకంగా తన హలంతో లాగేసి నదిలో పడేయడానికి ప్రయత్నించాడు. దీని వెనకాల ఓ కథ ఉంది. అది ప్రేమకథ. కృష్ణుడి కొడుకు సాంబుడు దుర్యోధనుడి కుమార్తె లక్షణను పెళ్లి చేసుకోవడానికి, ఎత్తుకు పోతాడు. కౌరవసైన్యం సాంబుడితో పోరాడి చివరికి అతణ్ని జయించి, లక్షణతో సహా దుర్యోధనుడి దగ్గరికి తీసుకువెళతారు. ఈ విషయం తెలిసి యాదవ వీరులు రక్తం మరిగి దుర్యోధనుణ్ని దెబ్బతీసి సాంబుణ్ని విడిపించడానికి బయల్దేరతారు. బంధు ప్రియుడైన బలరాముడికి ఇవన్నీ తెలిసి రంగంలోకి దిగుతాడు. దుర్యోధనుడికి నచ్చచెప్పడానికి ప్రయత్నించి విఫలుడవుతాడు. దాంతో హస్తినాపురాన్ని నాగలితో పెకలించి నదిలో పారేయ బోతాడు. హస్తినాపురం ఇప్పటికీ దక్షిణం వైపు కొద్దిగా లేచి, ఉత్తరం వైపు కొద్దిగా కుంగిపోయి ఉంటుందని అంటారు. ఇదంతా బలరాముడి ప్రతిభకు గుర్తు. మరి రైతులు తలచుకున్నా దేశంలో అధికార పీఠాలే కదిలిపోతాయి కదా!  
      బలరాముడు నిజమైన బంధుప్రియుడు. నిష్పక్షపాతంగా ఉండేవాడు. కౌరవ పాండవుల మధ్య కలహం ఆయనకు ససేమిరా ఇష్టంలేదు. ఆయనకు భీముడూ శిష్యుడే. దుర్యోధనుడూ శిష్యుడే. వాళ్లిద్దరి మధ్య యుద్ధం జరుగుతుంటే తట్టుకోలేకపోయాడు. కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్న రోజుల్లో ఆయన కలతచెంది మహావీరుడైనప్పటికీ యుద్ధంలో పాల్గొనకుండా తీర్థయాత్రలకు వెళ్లిపోయాడు. ఎవరు దగ్గరి బంధువులైనా ఎవరు కాకపోయినా తాను ధర్మం అనుకున్న దానికి బాసటగా నిలిచాడు. ఆ బలరాముడి రాజ్యమే వస్తే రైతులకు ఎంత భరోసా ఉంటుంది? అందుకే బలరామ రాజ్యం రావాలి... రైతుల కష్టాలు పోవాలి అని కోరుకోవడంలో తప్పేముంది?


వెనక్కి ...

మీ అభిప్రాయం