వెండితెర కల్పవృక్షాలు.. పద్యనాటకాలు

  • 147 Views
  • 0Likes
  • Like
  • Article Share

    సూరికుచ్చి బదిరీనాథ్‌

  • తెలుగు ఉపాధ్యాయుడు
  • తెనాలి, గుంటూరు
  • 9848781469
సూరికుచ్చి బదిరీనాథ్‌

పద్యనాటకాలు తెలుగు చలనచిత్రాలకు పునాదులు వేశాయి. పద్య ఆలాపనలో ఆరితేరిన దిగ్గజాలు బళ్లారి రాఘవ, వేమూరి గగ్గయ్య, బందా కనకలింగేశ్వరరావు, గోవిందరాజుల సుబ్బారావు, ధూళిపాళ, మిక్కిలినేని లాంటి వారంతా సినీరంగంలోకి అడుగుపెట్టి, దాన్ని సుసంపన్నం చేశారు. పద్యనాటకాల ప్రేరణతో విరివిగా తెరకెక్కిన పౌరాణిక, చారిత్రక చిత్రాలు  ప్రేక్షకులకు రసానందాన్ని చవిచూపించాయి.
‘‘అదిగో
ద్వారక ఆలమందలవిగో’’ అంటూ పద్యం ఆలాపిస్తూ అర్జున పాత్రధారి రంగప్రవేశం చేయడం ‘పాండవోద్యోగం’ నాటకంలో మొదటి సన్నివేశం. అప్పుడు మొదలయ్యే ప్రేక్షకుల కరతాళ ధ్వనులు ప్రదర్శన ఆసాంతం కొనసాగేవి. ‘పాండవోద్యోగం, రాయబారం, సత్య హరిశ్చంద్ర, గయోపాఖ్యానం, కురుక్షేత్రం’ లాంటి పౌరాణికాలూ.. ‘బొబ్బిలియుద్ధం, పల్నాటియుద్ధం’ తదితర చారిత్రికాలూ.. ‘చింతామణి, వరవిక్రయం, కన్యాశుల్కం’ మొదలైన సాంఘిక నాటకాలూ తెలుగువారిని ఉర్రూతలూపుతున్న రోజులవి. ఆ సమయంలోనే చలనచిత్ర పరిశ్రమ బుడిబుడి అడుగులు వేయడం మొదలుపెట్టింది. ‘భక్తప్రహ్లాద’ నుంచి ‘ద్రౌపదీ మాన సంరక్షణ’ తదితరాల వరకూ తొలితరం సినిమాల్లో అత్యధికం పురాణేతిహాసాల కథలతోనే తెరకెక్కాయి. వీటిమీద పద్యనాటకాల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది.
      సినిమాలు జనజీవనంలోకి విస్తృతంగా రాకముందు రంగస్థల నాటకాలు, అందులోనూ పద్యనాటకాలు ఊరూరా ప్రదర్శితమయ్యేవి. పద్యపఠనం, రాగాలాపనల్లో దిట్టలైన నటీనటులు ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేవారు. దుర్యోధనుడు, హిరణ్యకశిపుడు లాంటి దుష్టపాత్రలను ధరించినా.. కృష్ణుడు, అర్జునుడు వంటి సౌమ్యలలిత పాత్రలు పోషించినా తమదైన అభినయకౌశలంతో అందరినీ మెప్పించేవారు. నాటక ఇతివృత్తాన్ని బట్టి, సన్నివేశాన్ని అనుసరించి రంగస్థల అలంకరణ చేసుకుని నాటక ప్రదర్శన చేసేవారు. ఈ పద్యనాటకాలే తొలితరం చలనచిత్రాలకు మాతృకలయ్యాయి. నటనలో, పద్య రాగాలాపనలో అనుభవం ఉన్నవారికి సినిమా రంగంలోకి తేలిగ్గా ప్రవేశం దొరికేది. చలనచిత్రాల్లో కనిపించే సెట్టింగులు కూడా రంగస్థల అలంకరణను పోలి ఉండేవి. నటీనటుల ఆహార్యం, హావభావాలు, రాగాలాపనలు మక్కీకిమక్కీ నాటకాల్లో మాదిరిగానే ఉండేవి. అయితే.. సుదీర్ఘ రాగాలాపనలు, విపరీత వికటాట్టహాసాలు, ప్రేక్షకుల ప్రత్యక్ష జయజయధ్వానాలు- ‘వన్స్‌మోర్లు’ అలవాటైన నాటకరంగ కళాకారులకు సినిమా చిత్రీకరణ వాతావరణం కొత్తగా తోచేది. 
ప్రభావం సుస్పష్టం
ఘంటసాల రంగంలోకి వచ్చాక చలనచిత్రాల్లో పద్య ఆలాపనకు కొత్త ఒరవడి దిద్దారు. సుదీర్ఘ రాగాలాపనలను తగ్గించి- భావప్రకటనకు, పద్యంలో విరుపులకు ప్రాధాన్యమిచ్చారు. ఆనాటి సినిమాల్లో పురాణేతిహాసాలు, కావ్యాలు, ఇతర ప్రబంధాల్లోని పద్యాలు తరచూ వినిపించేవి. కంకంటి పాపరాజు రచించిన ‘సీతాపరిత్యాగం’ కావ్యంలోని పద్యాలను లలితా శివజ్యోతి వారు తీసిన ‘లవకుశ’లో వాడారు. ‘‘ఇంతకు బూని వచ్చి’’, ‘‘ప్రతిదిన మేను తొలుదొల్తి పాదములంటి’’, ‘‘రంగారు బంగారు చెంగావులు ధరించు’’ తదితర పద్యాలను ఆ చిత్రంలో వినియోగించుకున్నారు. ఇలా పాతపద్యాలను ఉపయోగించుకోవడంతో పాటు సందర్భానుసారం సముద్రాల సీనియర్, జూనియర్, సదాశివ బ్రహ్మం, పింగళి నాగేంద్రరావు, ఆరుద్ర లాంటి వారు చలనచిత్రాల కోసం కొత్త పద్యాలు రాసేవారు. ‘లవకుశ’ ప్రారంభంలో వచ్చే ‘‘నవరత్నో జ్వాలకాంతివంతమిది’’ పద్యాన్ని సదాశివబ్రహ్మం రాశారు, చిత్రం ద్వితీయార్ధంలో వచ్చే లవకుశుల సంవాద పద్యాలు, ‘‘దక్కెను బాలకుడని’’ ఇత్యాది పద్యాలను సముద్రాల అందించారు. స్వరసారథ్యం వహిస్తూనే లీల, సుశీలలతో కలిసి ఘంటసాల ఈ పద్యాలను ఆలపించారు. శ్రోతలకు చప్పున భావార్థాలను స్ఫురింపజేసే శైలిలో పాడటంతో నేటికీ అవి మార్మోగుతున్నాయి. ఇక పద్యనాటక ప్రభావాన్ని ప్రస్ఫుటంగా చూపే సన్నివేశాలు ‘లవకుశ’లో చాలా కనిపిస్తాయి. సీతాదేవిని లక్ష్మణుడు అడవిలో విడిచి వెళ్లడం, లవకుశులను రామలక్ష్మణులు కలవడం, వాల్మీకి ఆశ్రమ వాతావరణం తదితర సన్నివేశాలు, సెట్టింగులు రంగస్థల ప్రదర్శనలను పోలి ఉంటాయి. 
      ‘మాయాబజార్‌’ చిత్రంగా రాక ముందే ‘సురభి’ కళాకారులు ప్రదర్శించే నాటకంగా జనాదరణ పొందింది. వివిధ ప్రాంతాల్లో అనేక వేదికల మీద వందల ప్రదర్శనలు జరిగాయి. ‘సురభి’ కళాకారులు వైర్‌వర్క్‌తో రంగస్థలం మీద ‘స్పెషల్‌ఎఫెక్ట్స్‌’ను చూపేవారు. అవి ప్రేక్షకుల్ని మరో లోకంలోకి తీసుకెళ్లేవి. అవే ఎఫెక్ట్స్‌ను వెండితెర మీద ఆవిష్కరించేసరికి మరీ అద్భుతంగా వచ్చాయి. మార్కస్‌బార్‌ట్లే ‘మాయాబజార్‌’ చిత్రాన్ని సాంకేతిక నిఘంటువులా మలచడం వెనక ‘సురభి’ స్ఫూర్తి, ప్రభావం చెప్పుకోదగినవి. ఇక పద్యాల్లో ఘటోత్కచుని ప్రవేశపద్యం ‘అష్టదిక్కుంభి కుంభాగ్రాలపై’ను మాధవపెద్ది పాడారు. అభిమన్యుడు, ఘటోత్కచుల యుద్ధ సన్నివేశంలో సుభద్ర పాడే ‘అఖిల మహిమల తేజరిల్లు’ పద్యాన్ని ఋష్యేంద్రమణి ఆలపించారు. 
అప్పటికే ప్రసిద్ధం
భారత, రామాయణ ఇతివృత్తాలతో వచ్చిన చలనచిత్రాల మీద పద్యనాటక ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ‘పాండవ వనవాసం, నర్తనశాల, శ్రీకృష్ణావతారం, వీరాభిమన్యు, శ్రీకృష్ణ తులాభారం, శ్రీకృష్ణార్జున యుద్ధం’ లాంటి చిత్రాల్లో ప్రసిద్ధ నాటకపద్యాలను వినియోగించుకున్నారు. తిరుపతి వేంకట కవుల ‘పాండవోద్యోగ విజయాల్లో’ని పద్యాలు రంగస్థలం మీద బహుళ జనాదరణ పొందాయి. వీటిలోని ‘‘బావా ఎప్పుడు వచ్చితీవు’’, ‘‘ఆయుధమున్‌ ధరియింప’’ పద్యాలను- అలాగే, ‘రాయబారం’లోని ‘‘చెల్లియో చెల్లకో’’, ‘‘జెండాపై కపిరాజు’’, ‘‘సంతోషంబున సంధి సేయుదురే’’ తదితరాదులను ‘శ్రీకృష్ణావతారం’ నుంచి ‘దానవీర శూరకర్ణ’ వరకు అనేకసార్లు వాడారు. బయట రంగస్థలం మీద విన్న పద్యాలనే తెరమీద తిరిగి ఆలకించి పరవశించి పోయారు తెలుగువాళ్లు.
      పురాణ ఘట్టాలను తెరకెక్కించడంలో కమలాకర కామేశ్వరరావుది అందెవేసిన చెయ్యి. ఈయన ‘నర్తనశాల’ చిత్రం కోసం తిక్కన భారతం విరాటపర్వంలోని పద్యాలను యథాతథంగా తీసుకున్నారు. ‘‘దుర్వారోద్యమ బాహువిక్రమ’’, ‘‘వచ్చెడివాడు ఫల్గుణుడు’’, ‘‘సింగం బాకటితో’’, ‘‘ఎవ్వాని వాకిట’’, ‘‘కాంచన మాయవేది’’ లాంటి పద్యాలు ఈ చిత్రంలో వినిపిస్తాయి. అలాగే, సభాపర్వంలోని ‘‘ధారుణి రాజ్యసంపద’’, ‘‘కురువృద్ధుల్‌ గురువృద్ధ బాంధవుల నేకుల్‌’’ పద్యాలు ‘పాండవ వనవాసం, కురుక్షేత్రం, దానవీరశూరకర్ణ’ చిత్రాలకు బలమయ్యాయి. 
యథాతథంగా..
పౌరాణికాలే కాదు అరవయ్యో దశకంలో తీసిన ‘బొబ్బిలియుద్ధం, పల్నాటియుద్ధం’ చిత్రాల్లో కూడా నాటకాల ద్వారా తెలుగువారికి సుపరిచితమైన పద్యాలనే వాడారు. ఏవీఏం వారి ‘భక్తప్రహ్లాద’ చిత్రంలో భాగవతంలోని ప్రసిద్ధ పద్యాలు ‘కలడంబోధిని కలండు గాలిన్‌’, ‘మందార మాధుర్య మకరందమున దేలు’ లాంటి వాటిని వినియోగించుకున్నారు. బాపు, రమణలు తీసిన ‘సంపూర్ణ రామాయణం’లో సినీ పరిశ్రమకు సంబంధించని కవులు పానుగంటి లక్ష్మీనరసింహారావు, గబ్బిట వెంకట్రావు రచించిన పద్యాలను తీసుకున్నారు. ‘శ్రీకృష్ణ తులాభారం’ మొదట నాటకంగా ప్రజాదరణ పొందింది. దాన్నే చిత్రంగా నిర్మించినప్పుడు స్థానం నరసింహారావు ప్రఖ్యాత నాటక గీతం ‘మీరజాలగలడా నాయానతి’, చందాల కేశవదాసు ‘భలే మంచి చౌకబేరము’ పాటలను తీసుకున్నారు. వెండితెరకు అనుగుణంగా వాటిని చిత్రీకరించడంతో ప్రేక్షకులకు చాలా నచ్చాయి.  
      చిలకమర్తి ‘గయోపాఖ్యానం’ నాటకాన్ని కె.వి.రెడ్డి తీసిన ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’ చిత్రం ద్వితీయార్ధంలో యథాతథంగా చిత్రీకరించారు. చేమకూర వేంకటకవి ‘విజయవిలాస’ ప్రబంధం ఇతివృత్తాన్ని ప్రథమార్ధంలో చూపించారు. ఈ చిత్రం  విజయవంతమైంది. ఇందులోని పద్యాలను పింగళి నాగేంద్రరావు రాశారు. నాటకరంగ దిగ్గజాలైన పి.సూరిబాబు, కల్యాణం రఘురామయ్య లాంటివారు ‘దక్షయజ్ఞం, శ్రీరామాంజనేయ యుద్ధం’ చిత్రాల్లోని పాటలు, పద్యాలను చిరస్మరణీయంగా గానం చేశారు. బలిజేపల్లి లక్ష్మీకాంతకవి ‘సత్య హరిశ్చంద్ర’ జనాదరణ పొందిన నాటకం. చలనచిత్రంగా కూడా అది మంచి విజయం సాధించింది. కొత్త వినోద మాధ్యమంగా ముందుకు వచ్చిన సినిమాని ప్రజలకు చేరువ చేయడంలో పద్యనాటకాల పాత్ర విశేషం.  రంగస్థలం ద్వారా అప్పటికే తమకు చిరపరిచితమైన కథలను వెండితెర మీద చూసి ప్రేక్షకులు కొత్త అనుభూతికి లోనయ్యారు. నాటకపద్యాలు, వాటి ప్రభావంతో పురుడుపోసుకున్న కొత్త పద్యాలను ఘంటసాల లాంటి వారి సుమధుర గళాల్లో ఆస్వాదించారు. చలనచిత్రాలకు అఖండ విజయాలు అందించారు. అలా భావి సినీ వెలుగులకు పద్యనాటకాలు బంగారు బాటలుపరిచాయి. వెండితెర యవనక మీద తమదైన ముద్రను మిగిల్చాయి.


వెనక్కి ...

మీ అభిప్రాయం