పులకించని మది పులకించు

  • 184 Views
  • 2Likes
  • Like
  • Article Share

మనసుకు నచ్చింది చేసినప్పుడు.. అలాంటి  సందర్భాలు తారసపడినప్పుడు భావాలు ప్రఫుల్లమవుతాయి. ఎన్నాళ్ల నుంచో చెప్పాలనుకుని మనసు విప్పలేక అణచి పెట్టుకున్న ఊసులన్నీ పాటలోకి తర్జుమా అయిపోతాయి. ఆ గీతోద్యానవనంలో ఆనందవిహారిలా తిరుగాడుతూ గొంతెత్తి పాడే ప్రతి పల్లవీ, చరణమూ మనసు అనుభూతి చిత్రణకు ప్రతీకలవుతాయి. అలాంటి పాటలు వలపు భావనకు బావుటాగా రెపరెపలాడుతూ ఎల్లరిగొంతున పల్లవిస్తుంటాయి. అలాంటి పాటే ఇది.. లలితగీతపు ఛాయలున్న లక్షణమైన పాట. 
      పులకించని మది పులకించు/ వినిపించని కథ వినిపించు/ అనిపించని ఆశలనించు/ మనసునే మరపించు.. గానం/ మనసునే మరపించు..  ‘పెళ్లికానుక’ (1960) చిత్రానికి ‘మనసు కవి’ ఆత్రేయ రాసిన ఈ పాట చాలా సున్నితమైంది. పొందికగా అల్లిన సుతిమెత్తని భావాంశాలు ప్రతి చరణంలోనూ కనిపిస్తాయి. ఏఎం రాజా సంగీత సారథ్యంలో జిక్కీ ఆలపించిన ఆపాతమధుర గీతమిది.
      గది కోసమని ఇంటికొచ్చిన అబ్బాయిని ఇష్టపడుతుంది ఆ అమ్మాయి. అతణ్ని పదేపదే చూడాలని, మాట్లాడాలనిపిస్తుం టుంది. వీలుపడదు. విషజ్వరం బారినపడ్డ ఆ అబ్బాయికి విశ్రాంతి అవసరమని డాక్టర్‌ చెబితే, దగ్గరుండి సేవలు చేస్తుంది. కాస్త ఆరోగ్యం కుదుటపడిన తర్వాత, ‘ఎందుకో నిద్రరావడం లేదు పాటలేమైనా వచ్చా!’ అంటాడతను. అప్పుడు రాగానికి ఊసులపూసలను గుదిగుచ్చుతూ పాడుతుంది. మునుపెన్నడూ వలపుజడి తాలూకు అలజడి సవ్వడి ఎరుగని అమ్మాయికి పులకింత కలుగుతుంది. చెప్పుకోలేని వింత మోహం ముసిరినప్పుడు పాట ఆసరాగా వచ్చి బిడియాన్ని ఎగరగొట్టేస్తుంది.  
రాగమందనురాగమొలికి రక్తినొసగును గానం/ రేపు రేపను తీపికలలకు రూపు నిచ్చును గానం/ చెదరిపోయే భావములను చేర్చిగూర్చును గానం జీవమొసగును గానం/ మది చింతబాపును గానం 
      ప్రేమ సున్నితమైంది మాత్రమే కాదు, సంక్లిష్టమైంది కూడా. చెట్టు మీద పక్షి అన్ని కొమ్మల మీదకి ఎగురుతున్నట్టుగా.. చెదిరిపోతున్న భావాలను పట్టుకోవడం, వాటికున్న అర్థాన్ని వెతకడం కష్టం! కన్నకలలు రాబోయే రోజుల్లో ఎంత ఎర్రగా పండుతాయో ఉహించుకుంటూ మనసును లాలించుకుంటోందామె. మదిలోని తలపులను చెలికాడికి తెలియజేయడానికి ఆమె గానాన్ని ఆశ్రయించింది. క్షణం కుదురుండనీయని భావోద్రేకాలను కుదుటపరచేది గానం కాక మరేంటీ! అంటూ ఆమె అతనికోసం పాడే ఈ పాటలో లాలన ఉంది. పద లలిత్యమూ ఉంది. ఒంటరి నావకు దిక్సూచీలా తన జీవితంలోకి కలలూ కాంతులు తెచ్చిన శుభఘడియను స్మరించుకుంటూ ఆమె ఇంకా ఇలా పాడుతుంది...
వాడిపోయిన పైరులైన నీరుగని నర్తించును/ 
కూలిపోయిన తీగలైన కొమ్మనలనే పాకును/ 
కన్నె మనసు ఎన్నుకున్న తోడు దొరికిన ఒడిలో/ దోరవలపే కురియు మది దోచుకొమ్మని తెలుపు
 
      ప్రేమ మనసుకి జీవాయువు. కావాల్సి నంత అందకపోతే మనిషి రసహీనుడై పోతాడు. బతుకు నిస్సారమైపోతుంది. బతుకులో ఆశలు చిగురించేది.. అగాథ కూప జలరాశులు ఆకాశగంగలా పరుగు లెట్టేదీ.. ప్రేమపూర్వకమైన చిరుస్పర్శతోనే. మనసును చల్లబరిచే, మనిషిని కుదుట పరచే ప్రేమ అందినప్పుడు.. కన్నెమనసుకి తగిన తోడు దొరికినప్పుడు వలపు పుట్టడం ఎంతసేపూ! అంటారు మనసుకవి ప్రేమ స్పందనలు. వ్యక్తీకరణలూ భావ సంఘర్షణలూ ఎంత ఉన్నతంగా ఉంటాయో తెలిపేందుకు ఈ పాట ఓ ఆధారం. 
      గుండె గొంతుకలోన కొట్లాడే వేలాది భావాలకు ఒక రూపునిచ్చి, పాటతో గొంతుజారే భావావేశాలకు కాస్త ఉపశమనం కలిగించి... జీవితంలో ఓ మధుర భావనగా నిలిచిపోయే ఈ పాటలన్నీ ఆత్రేయ ప్రేమలేఖలే. తనకోసమే రాసుకుని... లోలోపలే దాచుకున్న పాటల దొంతరలే. అలాంటిదే ఈ పాట.. తేటతెలుగు విరిబాట.


వెనక్కి ...

మీ అభిప్రాయం