ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మ కొలువైన బెజవాడలో, జీవ వాహిని కృష్ణవేణీ నదీ తరంగ వెలుగుల్లో శతాబ్ద కాలంగా ప్రజల జ్ఞాన దాహార్తిని తీరుస్తోంది రామ మోహన్ గ్రంథాలయం. వందేమాతర ఉద్యమానికి ముందే ఎందరో కృషి, త్యాగ ఫలితంగా అవతరించిన ఈ పొత్తపు గుడి తరాలుగా విజ్ఞాన వెలుగులు విరజిమ్ముతూ బెజవాడలో తన ప్రత్యేకతను చాటుకుంటోంది.
విజయవాడ అంటే... కనకదుర్గ గుడి, ప్రకాశం ఆనకట్ట, గాంధీ పర్వతం... అలాగే రామ మోహన్ గ్రంథాలయం కూడా. స్వాతంత్య్ర సంగ్రామంలో ఎంతో మందిలో పోరాట స్ఫూర్తిని రగల్చడంతో పాటు గ్రంథాలయ ఉద్యమానికి, ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం ఏర్పాటుకు కేంద్ర బిందువుగా నిలిచిందిది. దీన్ని రామ మోహన్ ధర్మ పుస్తక భాండాగారంగా, రామ మోహన్ ఉచిత లైబ్రరీ, రీడింగ్ రూమ్‌గా వ్యవహరిస్తారు.
117 ఏళ్ల చరిత్ర కలిగిన రామ మోహన్ గ్రంథాలయంలో వివిధ విభాగాలకు సంబంధించి 20 వేలకు పైగా పుస్తకాలున్నాయి. ఆధ్యాత్మిక పుస్తకాలే ఏడు వేలకు పైగా ఇక్కడ కనిపిస్తాయి. దినపత్రికలు, వ్యక్తిత్వ వికాసం, తెలుగు, ఆంగ్ల నవలలు, వాణిజ్యం, అర్థశాస్త్రం, చరిత్ర, భౌగోళిక, జీవ, జంతు శాస్త్రాలు, మహిళలు, బాలల కోసం ప్రత్యేక విభాగాలు ఇక్కడ ఉన్నాయి. జ్యోతిష, ఆయుర్వేద శాస్త్ర గ్రంథాలకు కూడా ఇది నెలవు. ప్రముఖ రచయితలు, ప్రఖ్యాత పత్రికా సంపాదకులు, పరిశోధకులు ఇలా ఎందరో ఇక్కడి విజ్ఞాన వీచికల్లో ఓలలాడినవారే.
ఆయన పేరు మీదగానే
ఆంధ్రప్రదేశ్‌లో గ్రంథాలయ ఉద్యమం తొలి దశలో ఉన్నప్పుడు బెజవాడలోని కొందరు సాహిత్యాభిమానుల కృషితో తొలుత సత్యనారాయణపురంలో రామ మోహన్ గ్రంథాలయం ఆవిర్భవించింది. బ్రహ్మ సమాజ ప్రచారకులు, ఇప్పగుంట సుబ్బకృష్ణయ్య, కోల్‌కతాకు చెందిన బాబూ హేమచంద్ర సర్కార్, లండన్‌లోని బ్రిటిష్, ఫారిన్ యూనిటేరియన్ సంఘం ఉచితంగా ఇచ్చిన 200 పుస్తకాలతో ఆస్తిక పుస్తక భాండాగారం పేరుతో 1903 ఏప్రిల్ నెలలో ఇది వెలసింది. అప్పట్లో ఇది ఒక మారుమూల ప్రాంతంలో ఉండటం వల్ల ప్రజలకు ఎక్కువగా ఉపయోగపడలేదు. 1908లో బీసెంట్ రోడ్డులోని ఓ చిన్న పూరి పాకలోకి మార్చారు. గ్రంథాలయ భవనం అవసరాల మేరకు సరిపోకపోవడంతో వందేమాతర ఉద్యమంతో ప్రేరేపితులైన కొందరు యువకులు దీన్ని బకింగ్హాంపేటకి 1911లో తరలించారు. బందరు రోడ్డులోని లాకుల వద్ద ఇప్పుడున్న ప్రదేశాన్ని అప్పట్లో బకింగ్హాంపేటగా పిలిచేవారు.
తన ఉపన్యాసాలతో దేశాన్ని ప్రభావితం చేసిన రాజారామ మోహన్ రాయ్ గౌరవార్థం దీని పేరును రామ మోహన్ గ్రంథాలయంగా మార్చారు. యువకుల ఉత్సాహం, దీక్ష ఈ గ్రంథాలయ ప్రగతికి సోపానాలుగా నిలిచాయి. అయ్యంకి వెంకటరమణయ్య కార్యదర్శిగా ఎన్నిక కావడంతో దీని దశ పూర్తిగా మారిపోయింది. అప్పటికి దీనికో నిర్దిష్ట భవనం లేదు. పుస్తకాలు, పత్రికలు క్రమంగా వచ్చి చేరుతున్నాయి. 1912లో జరిగిన గ్రంథాలయ వార్షికోత్సవానికి భోగరాజు పట్టాభి సీతారామయ్య అధ్యక్షత వహించారు. ప్రస్తుతం గ్రంథాలయం ఉన్న బందరు రోడ్డులోని 2,197 చదరపు గజాల స్థలాన్ని బెజవాడ పురపాలక సంఘం వేలంలో రూ.3,324కి పాడారు. అయితే సొమ్ము చెల్లించడానికి కార్యకర్తల దగ్గర డబ్బు లేదు. ఆ సమయంలో యువకులుగా ఉన్న అయ్యంకి వెంకటరమణయ్య, సూరి వెంకటనరసింహ శాస్త్రి తదితరులు చందాలు పోగేసి, అప్పుచేసి స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. మునగాల రాజానాయిని వెంకటరావు, పాటిబండ సుబ్రహ్మణ్యం, బొడ్డపాటి వెంకటప్పయ్య తలో రూ.500 విరాళంగా ఇచ్చారు.
గాంధీ మహాత్ముడి విడిది!
గ్రంథాలయానికి శాశ్వత భవనం కోసం అయ్యదేవర కాళేశ్వరరావు కౌన్సిలర్‌గా పోటీ చేసి గెలిచే అవకాశం ఉన్నా తన ప్రత్యర్థికి అవకాశం ఇచ్చి రూ.500 విరాళంగా ఇప్పించారు. తిరువూరు జమిందారు రాజా వెల్లంకి చినవెంకట్రామారావు కూడా కొంత సాయం చేశారు. 1913లో భవనానికి శంకుస్థాన జరిగింది. అదే ఏట గ్రంథాలయ సంఘంలో నమోదై అధికారికంగా పని చేయడం మొదలుపెట్టింది. పద్మశ్రీ పురస్కార గ్రహీత అయ్యంకి వెంకట రమణయ్య, వెంకట నరసింహ శాస్త్రి తదితరులతో నిర్వహణ కమిటీ కూడా అప్పుడే ఏర్పడింది. ఇలా ఎందరో కృషి ఫలితంగా రూపుదిద్దుకున్న ఈ విజ్ఞాన భాండాగారాన్ని 1914లో పెద్ద భవంతిగా నిర్మించారు. 1916లో భవన ప్రవేశమహోత్సవం పింగళి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో వైభవోపతంగా నిర్వహించారు. అనంతరం కౌతా సూర్యనారాయణ భవనానికి పై అంతస్తు నిర్మించారు.
స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా విజయవాడలో పర్యటించిన మహాత్మా గాంధీ మూడు సార్లు రామ మోహన్ గ్రంథాలయాన్ని సందర్శించారు. తొలిసారి 1919 జనవరి 30న విజయవాడ వచ్చిన గాంధీ ఈ గ్రంథాలయంలో కాలుమోపారు. 1921 మార్చి 31న జాతిపిత అధ్యక్షతన విజయవాడలో జరిగిన జాతీయ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలో సంపూర్ణ స్వాతంత్య్రం కోసం క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నది ఈ చారిత్రక భవనంలోనే! 1929లో కూడా ఇదే భవనంలో స్వాతంత్య్రోద్యమకారుల్ని ఉద్దేశించి గాంధీజీ ప్రసంగించారు. జాతిపిత తన మొదటి రెండు పర్యటనల్లో ఈ భవనంలోనే బస చేశారు. టంగుటూరి ప్రకాశం పంతులు, నీలం సంజీవరెడ్డి, ఆచార్య ఎన్జీ రంగా, మాడపాటి హనుమంతరావు, అయ్యదేవర కాళేశ్వరరావు, పట్టాభి సీతారామయ్య, ముట్నూరి కృష్ణారావు, కాశీనాథుని నాగేశ్వరరావు, గాడిచర్ల హరిసర్వోత్తమరావు లాంటి వారెందరో ఈ గ్రంథాలయాన్ని సందర్శించారు.
విజయవాడలో వెలసిన అనేక సంస్థలు, సంఘాలు, సాగిన ఉద్యమాలకు ఈ గ్రంథాలయమే కేంద్ర స్థానంగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ భాండాగార ప్రతినిధుల తొలి సమావేశం చిలకమర్తి లక్ష్మీనరసింహం అధ్యక్షతన 1914 ఏప్రిల్ 10 నుంచి మూడు రోజుల పాటు ఇక్కడే జరిగింది. ఆ సందర్భంగా పురుడుపోసుకున్న దేశంలోనే మొదటిదైన ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం ఇప్పటికీ సేవలందిస్తోంది. 2013లో ఈ సంఘం వందేళ్ల వేడుకల్ని ఘనంగా నిర్వహించుకుంది. 1917లో రాయసం వెంకట శివుడు ఈ గ్రంథాలయంలో తొలిసారిగా బాలల విభాగాన్ని ప్రారంభించారు. ఈ గ్రంథాలయం కేంద్రంగా అయ్యంకి వెంకటరమణయ్య తన ప్రజా జీవితాన్ని దేశానికి అంకితం చేశారు.
వినూత్న కార్యక్రమాలు
సినిమాలు, టీవీలు, సామాజిక మాధ్యమాల ప్రభావంతో పుస్తక పఠనం మీద ప్రజల్లో క్రమంగా ఆదరణ తగ్గుతున్న నేపథ్యంలో రామ మోహన్ గ్రంథాలయం సరికొత్త కార్యక్రమాలతో ముందుకు సాగుతోంది. ప్రజల్లో పఠనాసక్తిని పెంపొందించేందుకు ఇంటి వద్ద చదువుకునేలా ఎలాంటి రుసుము లేకుండా పుస్తకాలు ఇస్తున్నారు. విద్యార్థులు, పోటీ పరీక్షల అభ్యర్థులు చదువుకునేందుకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. ముఖ్యంగా పదేళ్ల నుంచి విద్యార్థులు, యువకులకు ఉపయోగపడేలా కొత్త పుస్తకాలు సేకరించడంతో పాటు వారి కోసం సలహా కేంద్రం, అభ్యసన, పోటీ పరీక్షల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పోటీ పరీక్షల అభ్యర్థులకు ఆంగ్లం, రీజనింగ్, అర్థమెటిక్, జనరల్ అవేర్‌నెస్‌లలో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. ఇందుకోసం ఇద్దరు అధ్యాపకుల్ని నియమించి రోజూ సాయంత్రం, సెలవు దినాల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. యువతలో భావ వ్యక్తీకరణ, సామాజిక బాధ్యత, సాంకేతిక విజ్ఞానానికి సంబంధించి కార్యశాలలు నిర్వహిస్తున్నారు.
గ్రంథాలయం ఆధ్వర్యంలో పాఠశాల, కళాశాలల విద్యార్థులకు స్పెల్‌బీ, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, ‘తెలుగు సాహిత్యం, సంస్కృతి, జనరల్ నాలెడ్జ్ మీద క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నారు. యోగా, ఇండోర్ గేమ్స్‌లో కూడా యువతకు శిక్షణ ఇస్తున్నారు. గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఒక్కో సంవత్సరం ఒక్కో అంశంపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అపూర్వ, అరుదైన పుస్తకాల ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. వేసవి సెలవుల్లో వ్యక్తిత్వ వికాసం, ఆంగ్లం, బహుళ ప్రతిభాపాటవాలు, చేతిరాత తదితరాల తరగతులు నిర్వహిస్తున్నారు. పదో తరగతి విద్యార్థులకు భవిష్యత్తు చదువు మార్గాలు, ఉద్యోగావకాశాలు, జీవిత లక్ష్యాలు, ఒత్తిడి నియంత్రణ, మంచి అలవాట్లు, సమయ పాలన లాంటి వాటి మీద అవగాహన కల్పిస్తున్నారు. ఎనిమిది, తొమ్మిది తరగతుల విద్యార్థులకు సెప్టెంబరు నుంచి ఫిబ్రవరి వరకు, పదో తరగతి విద్యార్థులకు జూన్ నుంచి డిసెంబరు వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. రోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 7 గంటల వరకు గ్రంథాలయం తెరచి ఉంటుంది. నిరుద్యోగ యువతకు సాయంత్రం 5 నుంచి 6.30 వరకు శిక్షణ తరగతులుంటాయి. విరాళాలతో నిర్వహిస్తున్న ఈ గ్రంథాలయానికి పుస్తకాలతో పాటు అవసరమైన సామగ్రిని దాతల నుంచి స్వీకరిస్తున్నారు. ప్రపంచ విజ్ఞానాన్ని కరతలామలకం చేసే ఇలాంటి పుస్తకాలయాలే ఎవరికైనా వెలకట్టలేని ఆస్తి. వీటిని కాపాడుకుంటూ సమగ్రంగా వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యం.
చిత్రాలు: మరిడయ్య
రామ మోహన్ గ్రంథాలయాన్ని యువత సమగ్రంగా ఉపయోగించుకునేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలు, మహాత్ముల జయంతులు, అన్ని జాతీయ, అంతర్జాతీయ దినోత్సవాలు నిర్వహించి ప్రజల్లో సామాజిక బాధ్యతను పెంపొందించే ప్రయత్నం చేస్తున్నాం.
- చింతలపూడి కోటేశ్వరరావు, గ్రంథాలయ అధ్యక్షులు
- దమ్మాల రామచంద్రరావు, ఉపాధ్యక్షులు
గ్రంథాలయం ఆధ్వర్యంలో యువతకు వ్యక్తిత్వ వికాసం, పోటీ పరీక్షల గురించి నిపుణులతో శిక్షణ ఇప్పిస్తున్నాం. సార్వత్రిక విశ్వవిద్యాలయాల్లో చదివే విద్యార్థులకు ప్రత్యేకంగా మెటీరియల్ రూపొందించి ఇస్తున్నాం. ప్రాజెక్టుల తయారీలో అవగాహన కల్పిస్తున్నాం. పోటీ పరీక్షల అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్షల మీద ఉచితంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం.
- వేములపల్లి కేశవరావు, గ్రంథాలయ కార్యదర్శి