యాత్రా చిత్రం

  • 163 Views
  • 0Likes
  • Like
  • Article Share

    తెలుగు వెలుగు బృందం

ఇతర భాషలతో పోలిస్తే తెలుగు సాహిత్య ప్రక్రియలలో వైవిధ్యం అపారం. యాత్రా స్మృతుల విషయంలో మాత్రం తెలుగు సాహితీ సంపద బలహీనమైందే. 1838లో ఏనుగుల వీరాస్వామయ్య ‘కాశీయాత్ర చరిత్ర’ వెలువడేదాకా తెలుగులో యాత్రా స్మృతి ప్రక్రియే లేదు. ఆ తరువాత 176 ఏళ్లలో వచ్చిన యాత్రా స్మృతులూ 150కి లోపే.
      1830 మే 18 నుంచి 1831 సెప్టెంబర్‌ 3 వరకు చేసిన తన కాశీయాత్ర అనుభవాలను ఏనుగుల వీరాస్వామయ్య ‘కాశీయాత్ర చరిత్ర’లో వివరించారు. ఆయనది వైవిధ్యభరితమైన జీవితం. పన్నెండేళ్లప్పుడే ఆంగ్లంపై పట్టు సంపాదించడమే కాక ‘బోర్డ్‌ ఆఫ్‌ ట్రేడ్‌’లో వలంటీరుగా ఉద్యోగంలో చేరారు. వీరాస్వామయ్య ప్రతిభను గమనించిన పై అధికారులు ఆయనను తమ దగ్గర పని చేయించుకోవడానికి పోటీపడే వారు. వీరాస్వామయ్య సంస్కృతం, తెలుగు, తమిళ భాషలలో కూడా దిట్ట. 13వ ఏట జిల్లా కలెక్టరేట్‌లో దుబాసీగా పని చేశారు. రెండేళ్ల తర్వాత చెన్నపట్నం చేరి అనేక వ్యాపార సంస్థలలో పనిచేసి, బుక్‌ కీపింగ్‌లాంటి రంగాల్లో నైపుణ్యం సంపాదించి బోర్డ్‌ ఆఫ్‌ ట్రేడ్‌లో అకౌంటెంట్‌ అయ్యారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన దుబాసీ స్థాయికి ఎదిగారు. 
      వీరాస్వామయ్య పాండిత్యంతో పాటు సేవానిరతి, దాతృత్వం దండిగా ఉన్నవారు. కృష్ణా, గోదావరి నదులపై ఆనకట్టలు కట్టక ముందు 19వ శతాబ్దిలో తీవ్రమైన కరవు కాటకాలు వచ్చాయి. ప్రజలను ఆదుకోవడానికి ‘గంజి దొడ్లు’ ఏర్పాటు చేసేవారు. వాటి దగ్గర వీరాస్వామయ్య తపస్విలా తన బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన ఆచరణలో అభ్యుదయవాది. తన కూతురి పెళ్లి సమయంలో సమస్త జాతుల వారికి భోజనాలు ఏర్పాటు చేశారు.
      ఆంగ్ల భాషా జ్ఞానం ఉంటేనే గాని పాశ్చాత్య విజ్ఞానం అలవడదని గుర్తించారాయన. తన పలుకుబడి ఉపయోగించి ‘హిందూ లిటరరీ సొసైటీ’ స్థాపించి ఆధునిక విద్యకు బాటలు వేశారు. మద్రాస్‌ విశ్వ విద్యాలయం నెలకొల్పాలన్న ఆలోచనకు ఆయన కృషే పునాది.
      వీరాస్వామయ్య కాశీయాత్రలో ఆయన కుటుంబంలోని మహిళలు, బంధువులు, ఇతర పరివారం కలిసి 100 మందికి పైగా పాల్గొన్నారు. పల్లకీలలో ప్రయాణించారు. అప్పటికి రైళ్లు లేవు. రోడ్లు కూడా అంతంత మాత్రమే. తారు రోడ్లు, కంకర రోడ్ల ప్రసక్తే లేదు. వీరాస్వామయ్య తన ప్రయాణం సాగిన మార్గం బాగుంటే ‘భాట సరాళం’ అని రాశారు. అంటే నునుపుదేరిన రోడ్లున్నాయని కాదు. బండ్లు నడవడానికి అనువుగా ఉన్న దారి అనే.
      కాశీయాత్ర చరిత్ర మొదటి వాక్యమే పాఠకుడిని పట్టి నిలబెట్టి చివరిదాకా చదవక తప్పని అనివార్య పరిస్థితి కల్పిస్తుంది. ‘‘జగదీశ్వరుండు నా చేత దేశాటనము జేయింప దలచి నన్ను నేలుచున్న సుప్రీంకోరటు (చెన్న పట్నంలో మద్రాస్‌ హైకోర్టు ఏర్పడడానికి ముందు 1800 నుంచి 1862 దాకా ఉన్న ఉన్నత న్యాయస్థానం) దొరలగుండా సెలవిప్పించినాడు గనక నేను కాశీయాత్రబోవలెనని 1830 సంవత్సరము మే నెల 18వ తేదీ కుజవారము రాత్రి 9 గంటలకు చెన్నపట్టణము విడిచి మాధవరము జేరినాను’’ అని ప్రారంభం అవుతుంది ఆ మొదటి వాక్యం. ‘‘అది తండయారు వీడులో నుండే నా తోటకు 3 గడియల దూరము. కీనీరు భూమి, మధురమైన జల సమృద్ధి గలది. ద్రావిడ వైష్ణవుల నివాసము. వారు సమిదెలు వగయిరాలు చెన్నపట్నంలో అమ్మి జీవింపుచున్నారు’’ అనడంలోనే మాధవరం నేల ఎలాంటిదో, అక్కడి జనావాసాల తీరు ఏమిటో, ప్రజల జీవనాధారం ఎలా ఉందో కళ్లకు కట్టించారు. యాత్ర పొడవునా తాను చూసిన ప్రాంతాలన్నింటి గురించిన సకల విశేషాలను ఇదే పద్ధతిలో వివరించారు. ఈ రచన చదివితే వీరాస్వామయ్య యాత్రా మార్గంలో 19వ శతాబ్ది ప్రథమార్ధంలోని సామాజిక ఆర్థిక స్థితిగతులు, జన జీవన విధానం ఆకళింపు చేసుకోగలుగుతాం. 
      వీరాస్వామయ్య 1830 జులై 29న హైదరాబాద్‌ చేరారు. ఆ సమయంలోనే మొహరం ఆరంభమైంది. మొహరం సమయంలో తాను హైదరాబాద్‌లో ఉండే అదృష్టం కలగడాన్ని ‘‘లోకుల ఇష్ట సిద్ధిని చేసే పరమాత్ముడు ఒక్కడే గనక ఆ యుత్సవకాలములో పరమాత్ముని చైతన్యము అక్కడ ప్రతిఫలించుట చేత ఆ స్థలము ఆ కాలమందు పుణ్యస్థలమని భావించి అక్కడనట్టి కాలమందు నన్ను ప్రవేశ పెట్టినందుకు నీశ్వరుని చాలా కొనియాడడమైనది’’ అని రాశారు. మక్కా మసీదును ‘తురకల జపశాల’ అనీ చార్మినార్‌ను ‘నాల్గుదోవలు చేరడానకు గాను కట్టిన యొక గొప్ప స్థూపీ గలిగి నాలుగు ద్వారాలు గలిగిన యొక చావిడిన్ని యున్నదీ అని వర్ణించారు. హైదరాబాద్‌లో స్థానికులు ముచుకుంద నదిని ‘ముసి’ అంటారనీ ‘ఆ షహరు చుట్టూ కొండలు మెండు’ అనీ, ‘అనేక తిప్పల కొనల యందు మశీదులు కట్టబడి యున్నవి’ అనీ, ‘హిందూ దేవాలయాలు లేవు. అవియున్నా వృద్ధికి రానియ్యరు’ అని చెప్పడం ద్వారా పాలకుల మతానికి ఎంతటి ప్రాబల్యం ఉండేదో నిష్కర్షగా చెప్పారు.
      ఆయన రాసిందాన్ని బట్టి మన ఊళ్ల పేర్లలో వచ్చిన వికృత మార్పులను గమనించవచ్చు. మనుషుల పేర ఊళ్లు వెలవడం అసాధారణమూ కాదు, అసహజమూ కాదు, కానీ మనిషి పేరే ఊరి పేరుగా ఉండదు. కామారెడ్డి పేట అని వీరాస్వామయ్య పేర్కొన్నారు. ఇప్పుడు అది కేవలం కామారెడ్డిగా మిగిలిపోయింది. పాత జిల్లా గజెట్లలో కూడా కామారెడ్డి పేట, యెల్లారెడ్డి పేట అనే ఉన్నాయి. ఆ పేట అన్న మాటలు కాలగమనంలో జారిపోయి కామారెడ్డి, యెల్లారెడ్డిగా బోసిగా మిగిలిపోయాయి. మేడిచెర్ల-మేడ్చెల్‌గా, నిర్మల-నిర్మల్‌గా, జలచెర్ల-జడ్చెర్లగా, చంద్రఘాట్‌-చాదర్ఘాట్‌గా ఎలా రూపాంతరం చెందాయో కాశీయాత్ర చరిత్ర చదివితే అర్థమవుతుంది. 
      కుంఫిణీ (ఈస్టిండియా కంపెనీ) పాలన ఉన్న ప్రాంతాల్లోనూ, సంస్థానాధీశుల అధీనంలో ఉన్న ప్రాంతాల్లోనూ పరిపాలనా పద్ధతుల్లో ఉన్న మోసం, అవినీతి, లంచగొండితనం ఎంత దారుణమో దాపరికం లేకుండా రాశారు.
      హైదరాబాద్‌లో కొందరు ‘ఆయుధపాణులై మెత్తని వారిని కొట్టి నరుకుచున్నారు గనక నున్ను, షహరులో ఇతర దేశస్థులు సవారీ మీద పోయి రావలసి యుంటే ఆయుధపాణులైన వాక్పారుష్యము కలవారిని కొందరిని కూడా పిలుచుకొని పోవలసియున్నది’ అని శాంతి భద్రతలు ఎంత దిగదుడుపుగా ఉండేవో చెప్పారు.
      ఈ యాత్రకు 20 ఏళ్లకు ముందే వీరాస్వామయ్య హైదరాబాద్‌ ప్రాంతం సందర్శించారు. ఈ ఇరవయ్యేళ్ల కాలంలో సికిందరబాద్‌ హైదరాబాద్‌ కన్నా వేగంగా నగరీకరణ చెందుతున్న క్రమం ఆశ్చర్యంగా ఉందంటారు. ఇప్పటి హైదరాబాద్‌ అభివృద్ధిని చూస్తే ఆయన ఏమనేవారో!
      రెండు యాత్రల మధ్య కాలంలో వచ్చిన మార్పులనూ పట్టి చూపించారు. దూరప్రాంతాల సందర్శనకు సపరివారంగా వెళ్లే వారు దారిలో అనారోగ్యం పాలైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో కూడా వివరించారు. తాను రోజుకు మూడు ఆమడల దూరం (దాదాపు 30 మైళ్లు) ఏకబిగిన నడవగలిగిన గుర్రాన్ని, అయిదుగురు బోయీలను, డోలీని ఏర్పాటు చేసుకున్నానని చెప్పారు. ఆ రోజుల్లో అంబులెన్స్‌లు లేవు గదా! అజీర్తి, జ్వరం, వ్రణాలకు, గాయాలకు మందులు తీసుకుని పోవాలని సలహా ఇచ్చారు.
      కాశీయాత్ర చరిత్ర చదివితే మనం ఇప్పుడు వాడడం మానేసిన తెలుగు పదాల నిధి కనిపిస్తుంది. కీనీరుభూమి (పల్లపు భూమి లేదా చిత్తడి నేల), పాలరేగడ భూమి, తిప్పలు (చిన్న కొండలు, గుట్టలు), పట్టం (మారకం రేటు) లాంటి మాటలు కనిపిస్తాయి. షహరు (నగరం), సడక్కు (రోడ్డు), కొఠీలు (భవనాలు), పూరా (పూర్తిగా), ఖుల్లాసాగా (వివరంగా)లాంటి ఉర్దూ మాటలు కూడా విస్తారంగానే వాడారు. వర్ణక్రమం అప్పటికీ ఇప్పటికీ ఎలా మారిందో ‘ర’ వత్తుకు బదులు వలపల గిలక వాడడం, బ్రాహ్మణులు అనడానికి బదులు బ్రాం హ్మణులు అనడం, బాటను ‘భాట’ అని రాయడం గమనించవచ్చు.
      యాత్రా స్మృతి రచనలో వీరాస్వామయ్య వేసిన బాటలో నడిచి కోలా శేషాచలం ‘నీలగిరి యాత్ర’ రాశారు. ఇది తెలుగులో రెండో యాత్రా చరిత్ర.
      వీరాస్వామయ్య కాశీ యాత్రకు బయలుదేరుతున్నప్పుడు ఆయన మిత్రుడు కోమలేశ్వరం శ్రీనివాస పిళ్లై యాత్రా విశేషాలను జర్నల్‌గా రాసి పంపుతూ ఉండమని కోరారు. అలా రాసిన విషయాలను పిళ్లై 1838లో మొట్టమొదట కాశీయాత్ర చరిత్ర అచ్చువేశారు. ఆ తర్వాత ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం 1869లో ద్వితీయ ముద్రణ వెలువడింది. 1941లో దిగవల్లి వెంకట శివరావు పరిశోధన చేసి వివరణలతో సహా అచ్చు వేశారు. ఆయన సమకూర్చిన పాద పీఠికలు ఈ రచనను అర్థం చేసుకోవడానికి బాగా ఉపకరిస్తాయి. 1992లో ముక్తేవి లక్ష్మణ రావు సంక్షిప్తీకరించిన ప్రతిని తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురించింది. ఆ దశలోనే తెలుగు అంకెలకు బదులు ఇంగ్లీషు అంకెలు వాడారు.
      యాత్రా స్మృతి అంటే యాత్ర చేసే వారి భావ యాత్ర. యాత్రలు చేసే వారు అనేకమందే ఉంటారు. అందులో చాలా మంది వ్యవహారం తిప్పడు తిరుపతికెళ్లికి వెళ్లి దేవుణ్ని చూడకుండా తిరిగొచ్చినట్టే ఉంటుంది. నిశితంగా పరిశీలించే శక్తి పరిమితంగానే ఉంటుంది. ఉన్నవారైనా ఇలాంటి రచనలు అందివ్వగలిగితే ఎంత బాగుంటుంది.


వెనక్కి ...

మీ అభిప్రాయం