అక్షరపుష్పాల స్నేహలత

  • 465 Views
  • 0Likes
  • Like
  • Article Share

    హకీంకారి శివాజీ

  • ఎంఏ విద్యార్థి, తెలంగాణ విశ్వవిద్యాలయం
  • డిచ్‌పల్లి, నిజామాబాద్‌
  • 9642917321
హకీంకారి శివాజీ

తరాలు గడిచేకొద్దీ కొన్ని సందర్భాలు సమాజ స్మృతిపథంలోంచి చెరిగిపోతుంటాయి. జాతి ప్రస్థానంలో ఎప్పటికప్పుడు పునశ్చరణ చేసుకోదగిన స్ఫూర్తిదాయక విషయాలైనా సరే విస్మరణంగా ఉండిపోతాయి. కైత కట్టగలిగిన చేవ ఉన్న యువతరాన్ని సానబెట్టి, వాళ్లతో రచనలు చేయించిన ‘స్నేహలతా కవితా సంఘా’నిదీ ఇలాంటి విస్మృత చరిత్రే! నలభై ఏళ్ల నిర్విరామ పరిశ్రమతో రెండొందలకు పైగా పుస్తకాలు ప్రచురించిన ఘనత ఈ సంఘం సొంతం.
‘‘కవితా ప్రచారానికి స్థాపించిన చిన్న సాహితీ సంస్థ మా స్నేహలతా కవితా సంఘం’’ అని చెప్పుకున్నారు దాని వ్యవస్థాపకులు వాజపేయయాజుల రామసుబ్బరాయుడు. ‘రాసురాట్కవి’గా నాడు సుప్రసిద్ధమైన ఆయన వినయానికివి అద్దంపడతాయి. కానీ, ఆ సంఘం ప్రాముఖ్యాన్ని, అప్పటి కాలమాన పరిస్థితుల్లో అది పోషించిన చారిత్రక పాత్రను అర్థంచేసుకోవాలంటే మాడపాటి హనుమంతరావు మాటల్ని గుర్తుచేసుకోవాలి! ‘‘నిజామురాష్ట్రమునం దాంధ్రభాషా ప్రచారము చాలఁ బవిత్రమగు గర్తవ్యమని నాతలంపు. అట్టి మహోద్యమమున నవిశ్రాంతముగఁ బనిచేయుచున్న మీరు ధన్యులు. ఇట్టి ఘనకార్యమును పోషించుచున్న మన సంస్థానాధీశులు శాశ్వతమగు కీర్తికిఁ బాత్రులగుదురు. జటప్రోలుసంస్థానము మాతృభాషాపోషణమునకు ఖ్యాతివహించుట చారిత్రకవిషయము’’ అంటూ మాడపాటి కీర్తించిన సంఘమిది. ‘‘సంప్రదాయ సాహిత్యానికి ఒక దీపస్తంభంగా నిలిచి, తెలంగాణను ఆ దీపపు వెలుగుల్లో రంజింపజేసిన కవి’’ అని ఆచార్య మసన చెన్నప్ప శ్లాఘించిన వ్యక్తి ఆ ‘రాసురాట్కవి’. 
      ప్రస్తుత నాగర్‌కర్నూలు జిల్లా పరిధిలోని జటప్రోలు సంస్థానం తెలుగు భాషాసాహిత్యాలకు గొడుగుపట్టింది. ఆ సంస్థానాధీశులైన ‘సురభి’ వంశీయులు కవులను ఆదరించారు. కావ్యరచన చేయించారు. రామసుబ్బరాయకవి కూడా వాళ్ల ఆశ్రయంలోనే ఉండేవారు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు వాస్తవ్యులైనప్పటికీ 40 ఏళ్ల పాటు ఆయన తెలంగాణలోనే నివసించారు. పాలమూరు కవిగానే వాసికెక్కారు. జటప్రోలు సంస్థానాధీశులు రాజా వేంకట లక్ష్మారావు ఆహ్వానం మేరకు 1928లో ఆయన ఇక్కడికి వచ్చారు. కొల్లాపురం (సంస్థానం రాజధాని) మిడిల్‌స్కూల్‌ ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలు స్వీకరించారు. ఆస్థానకవిగానూ ఉన్నారు. 1929లో ‘స్నేహలతా కవితా సంఘాని’కి ప్రాణంపోశారు రామసుబ్బరాయకవి. తెలుగు భాష మీద తనకు గల అభిమానం, అభిరుచులే దీని స్థాపనకు తోడ్పడ్డాయని చెప్పేవారాయన. సంస్థాన మహారాణి సురభి వెంకటరత్నమాంబ అండదండలతో తెలుగు భాషాసరస్వతికి ఈ సంఘం అమూల్యసేవలందించింది. సాహితీ సువాసనల్ని దశదిశల్లో ప్రసరింపజేసింది.
గిడుగూ సభ్యులే
స్నేహలతా కవితా సంఘం అధ్యక్షులు రామసుబ్బరాయకవి, ఉపాధ్యక్షురాలు చేబ్రోలు సరస్వతీదేవి. గంధం నరసింహాచార్యులు, కప్పగంతుల లక్ష్మణశాస్త్రి, మాదిరాజు విశ్వనాథరావు, సరిపల్లె విశ్వనాథశాస్త్రి ఇతర ముఖ్య సభ్యులు. మొదట్లో పద్దెనిమిది మందే ఉన్నా గ్రంథప్రచురణల పరంపరతో సభ్యుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. గిడుగు రామమూర్తి పంతులు, ఆయన భార్య గిడుగు లక్ష్మీకాంతమ్మ, ఆమె సోదరి జొన్నలగడ్డ శారదాంబ కూడా సభ్యులయ్యారు. గుల్బర్గాలోని ఉస్మానియా ప్రభుత్వ కళాశాల సంస్కృత పండితులు జి.భానుమూర్తి, గుంటూరు పవర్‌అండ్‌ లైట్‌ కంపెనీ మేనేజర్‌ అచ్యుతుని వేంకటాచలపతిరావు, కొల్లాపురానికి చెందిన వలిపె వేంకటరావు, ‘కృష్ణకుమార మిత్రులు’ (కె.సంపత్కుమారాచార్యులు, ఎం.రామకృష్ణారావు) తదితరులెందరో దీన్లో భాగస్వాములయ్యారు. కొవ్వూరు, కైకలూరు, నూజివీడు, నెల్లూరు, కర్నూలు ప్రాంతాల వాళ్లూ చేరారు. అలా బిలాస్‌పూర్‌ (మధ్యప్రదేశ్‌) వరకూ విస్తరించిందీ ‘స్నేహలత’. సంఘ కార్యకలాపాలను చేబ్రోలు రాజగోపాలరావు చూసుకునేవారు. సభ్యుల్లో ముగ్గురు కలిసి నిరంతరం భాషావ్యాసంగం చేయాలన్నది నిబంధన. దీన్ని ‘బృంద అధ్యయనం’ అనేవారు.
పద్యలేఖా ఉద్యమం
రామసుబ్బరాయకవి కలకత్తాలో బి.ఏ చదివారు. అక్కడ ఆయన సాహితీమిత్రులతో పద్యరూపంలో ఉత్తరప్రత్యుత్తరాలు జరిపేవారు. కొల్లాపురానికి వచ్చేవరకూ ఆ అలవాటును అలాగే కొనసాగించారు. సంఘాన్ని ఏర్పాటుచేసిన తర్వాత ఆ ఉత్తరాలతోటే ‘పద్యలేఖా ఉద్యమాన్ని’ నిర్మించారు. ‘రెడ్‌లెటర్స్‌’ పేరిట ప్రఖ్యాతమైన ఆ లేఖలది సంఘం ప్రస్థానంలో కీలకపాత్ర. దూరప్రాంతాల్లో ఉన్న సంఘ సభ్యులు క్షేమ సమాచారాల్ని ఇచ్చిపుచ్చుకోవడానికే కాదు, సాహితీచర్చలు జరపడానికీ ఇవి అక్కరకొచ్చేవి. ఏం రాసినా పద్యాల్లోనే రాయాలన్నది రామసుబ్బరాయకవి నిబంధన. తన శిష్యులకు ఏదైనా అంశం ఇచ్చి పద్యాలు రాసి పంపమనడం ఆయనకు అలవాటు. వీరుభొట్ల సూర్యనారాయణ అనే శిష్యుడికి ‘పార్వతీపతి’ అనే మకుటం ఇచ్చి శతకం రాయమన్నారు. ఆయన రాశారు. దాన్ని సంఘం తరఫున ‘పార్వతీపతి శతకం’గా ప్రచురించారు. ‘‘మాకు ఉత్తర ప్రత్యుత్తరం మూలంగా కవిత వ్రాయడం నేర్పారు. మామూలు క్షేమ సమాచారమని వ్రాసే ఉత్తరంలోనైనా ఒక పద్యమైనా వ్రాయకపోతే వారు ఒప్పుకునేవారు కారు’’ అని మరో శిష్యుడు టి.వి.పార్థసారథి అయ్యంగార్‌ ఓ సందర్భంలో చెప్పారు. ‘శ్రీసుందర కాండం, వేంకటేశ్వర శతకం, సుధాలహరి’ లాంటి పార్థసారథి పొత్తాలూ ‘స్నేహలత’ తరఫున అచ్చయ్యాయి. పేరేశ్వర నారసింహ కవులు, ‘కవిచంద్ర’ వేదగిరి వెంకట నారసింహ రాయశర్మ, మియ్యాపురం రామకృష్ణారావు తదితర ఎందరో శిష్యుల్ని రామసుబ్బరాయకవి తీర్చిదిద్దారు.
      ‘‘నూతిలోని మండూకమ్ము భీతి, నిల్లు/ కదలకుండిన నేరీతి వదల గలుగు/ లోన వేళ్లతో నున్న యజ్ఞానమెల్ల/ సాధు సద్గోష్ఠి సకలార్థ సాధనంబు’’ అనేది రామసుబ్బరాయ కవివాక్కు. ఇలా విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఉత్తరాలు ఉపయోగపడేవి. పద్యలేఖల ద్వారా ఇచ్చిపుచ్చుకున్న జ్ఞానసంపదలను భద్రంగా పదిలపరచడం రామసుబ్బరాయకవి ప్రత్యేకత. ఆయన ఎవరికి ఏ ఉత్తరం రాసినా... దాని ప్రతిని తన దగ్గర పెట్టుకునేవారు. తనకు వచ్చిన ఉత్తరాలను స్వదస్తూరితో మళ్లీ ఎత్తిరాసిపెట్టుకునే వారు. అలాగే సంఘంలోని ఇతర సభ్యులు ఒకరికొకరు రాసుకునే లేఖలనూ ఆయన భద్రపరిచేవారు. వీటన్నింటినీ నెలకోసారి గుదిగుచ్చి ‘మిత్రలేఖలు’ పేరిట లిఖిత పత్రికగా వెలువరించేవారు. దీనికి ‘కృష్ణకుమార మిత్రులు’ సంపాదకులు. ఇలా 1916- 59 మధ్యలో రామసుబ్బరాయకవి భద్రపరిచిన ‘రెడ్‌లెటర్స్‌’కు సంబంధించిన 29 సంపుటాలు ఇప్పుడు లభిస్తున్నాయి. సాహితీ ప్రచారం కోసం 1933లో ‘వైజయంతి’ పేరిట అచ్చుపత్రికను కూడా సంఘం ప్రారంభించింది. చేబ్రోలు సరస్వతీదేవి సంపాదకత్వంలో వార్షిక పత్రికగా ఇది వెలువడేది. ‘‘మా కవితా సంఘమువారు చేయు భాషాసేవ మిత్రలేఖల ద్వారమున జరుగుచున్నది. ఆఱు సంవత్సరములనుంచి చేతివ్రాతతో నున్న మాసపత్రిక క్రమముతప్పక ప్రచురింపబడుచున్నది- మా సంఘాభివృద్ధికి మిత్రలేఖలే మూలాధారము. ఆయీ లేఖల ప్రోత్సాహమూలముననే కావ్యములుగూడ వెలువడుచున్నవి’’ అన్న ‘వైజయంతి’ వాక్యాల్లో (1936 సంచిక) ప్రతిఫలించేవి రామసుబ్బరాయకవి వెలిగించిన పద్యలేఖా స్ఫూర్తిదీప్తులే!
కావ్యాల నుంచి శతకాల వరకూ
ఓ కవి రచన ప్రచురితమైనప్పుడే మరికొంత సాహితీ సృజన దిశగా ఆయన కలం కదులుతుంది. రచన అచ్చయ్యే అవకాశం లేనప్పుడు వ్యక్తిలోని సృజనశీలి జావగారిపోతాడు. యువకవులు అలా నీరుగారిపోకుండా ఉండటానికి ‘స్నేహలతా కవితా సంఘం’ ఎంతో కృషిచేసింది. ముద్రణావకాశాలు అరకొరగా ఉన్న ఆ రోజుల్లోనే వరుసగా గ్రంథాలను ప్రచురించింది. దీనికి జటప్రోలు  సంస్థానాధీశుల ఆదరణ ఓ కారణమైతే... రామసుబ్బరాయకవి కృషి మరో హేతువు. సంఘాన్ని ప్రారంభించిన ఏడేళ్లలోనే యాభై పుస్తకాలను వెలువరించారు. వాటిలో కొన్ని పొత్తాలు మద్రాసు, మైసూరు, రంగూన్‌ విశ్వవిద్యాలయాల్లో పాఠ్యపుస్తకాలయ్యాయి. ‘స్నేహలత’ ప్రచురణల నాణ్యతకు ఇదే కొలమానం. ‘పోతన భక్తివైరాగ్యములు, జానకీపతి శతకం’ లాంటి రచనలతో పాటు ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకోసం ప్రత్యేకంగా ‘బోధనపద్ధతులు’ లాంటి పుస్తకాలనూ సంఘం తీసుకొచ్చింది. 1947 నాటికి ఈ ప్రచురణల సంఖ్య 105కు చేరింది. మొత్తమ్మీద నలభై సంవత్సరాల సంస్థ ప్రస్థానంలో 200కుపైగా గ్రంథాలను ప్రచురించారు. సాహిత్య పరిమళాలను వెదజల్లే వీటిని ‘స్నేహలత కవితా సంఘ పుష్పములు’ పేరిట ప్రకటించేవారు! 
      గంధం నరసింహాచార్యులు, జానపాటి పట్టాభిరామశాస్త్రి, పేరేశ్వర నారసింహ కవులు, పత్రి విశ్వేశ్వరరావు, ఆకుండి వేంకటశాస్త్రి, గొనుకొండ లక్ష్మీనారాయణ, లక్ష్మీవేంకటరమణమ్మ, వాజపేయయాజుల మహాలక్ష్మి, వేంకటేశ్వర్లు, మల్లెల శోభనాచలపతిరావు, సౌభాగ్య రాజేశ్వరి తదితరుల పుస్తకాలు ‘స్నేహలత’ తరఫున అచ్చయ్యాయి. గిడుగు లక్ష్మీకాంతమ్మ, జొన్నలగడ్డ శారదాంబ రాసిన ‘లక్ష్మీశారద గీతములు, శతకములు, సుభాషితములు’ కూడా ఈ సంఘ ‘కుసుమాలే’! చేబ్రోలు సరస్వతీదేవి ‘సరస్వతీ రామాయణం, ఆత్మోపదేశం’, సరిపల్లె విశ్వనాథశాస్త్రి ‘హంసతారావళి’, గండికోట భానుమూర్తి ‘వెంకటేశ్వర స్తవం’, మియ్యాపురం రామకృష్ణారావు ‘రాఘవ, పద్మాలయ’ శతకాలు, మద్దాలి ఉమామహేశ్వరరావు ‘మాధవ చరిత్రం’ తదితరాలనూ ‘స్నేహలతే’ వెలుగులోకి తెచ్చింది. వీటితో పాటు దాదాపు నలభై రామసుబ్బరాయకవి రచనలకూ పుస్తకరూపమిచ్చింది. 
స్ఫూర్తిప్రదాత
‘స్నేహలత’ ప్రచురణల్లో రామసుబ్బరాయకవి రచించిన ‘ప్రసన్న భారతం’ ముఖ్యమైంది. ఇది సంఘం 150వ ‘పుష్పం’. కవిత్రయ భారతం, శ్రీపాద కృష్ణమూర్తి ‘శ్రీకృష్ణ భారతం’ తర్వాత ఇది మూడో తెలుగు భారతం. తెలంగాణ గడ్డ మీది నుంచి వెలువడిన మొదటి భారత రచనగా ఇది ప్రసిద్ధికెక్కింది. విశేషం ఏంటంటే... శ్రీపాద, రామసుబ్బరాయకవి గురువు. ‘ప్రసన్న భారత’ రచన శ్రీపాదతో పాటు తిరుపతి వేంకట కవుల్లో ఒకరైన చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి ప్రశంసలనూ అందుకుంది. వేంకటశాస్త్రి అయితే ‘కవివీర’ బిరుదునూ ప్రదానం చేశారు. ఈయన్నూ రామసుబ్బరాయకవి తన గురువుగా కొలిచేవారు. ఈ భారత రచనను దృష్టిలో పెట్టుకునే కప్పగంతుల లక్ష్మణశాస్త్రి, ‘‘శ్రీనాథునిది ప్రౌఢకవిత్వం. రాసురాట్కవిది ప్రసన్న కవిత్వం’’ అన్నారు. ప్రసన్నభారతంతో పాటు రామసుబ్బరాయకవి మరో రచన ‘చిరకారి’ కూడా తెలుగు పాఠ్యపుస్తకాల్లో భాగమైంది. భారతంతో పాటు రామసుబ్బరాయకవి రామాయణ రచన కూడా చేశారు. సోదరకవి వేంకటనారాయణతో కలిసి ‘సీతాకళ్యాణం’ రచించారు. ‘సురభిలక్ష్మి, దేవిప్రసన్నం, లక్ష్మీశతకం, ఆరోగ్య వేంకటేశ్వర శతకం, రామకోటేశ్వర తారావళి, మదనగోపాలాష్టకం’ తదితర శతాధిక రచనలు ఆయన కలం నుంచి జాలువారాయి. ‘‘శ్రీ రాసురాట్కవి గారు తలపండిన కవుల్లో మొదటి పంక్తిలోని వారు’’ అంటూ రామసుబ్బరాయకవి ప్రతిభకు జోతలుపట్టారు డా।। సి.నారాయణరెడ్డి. ‘రామసుబ్బరాయకవి లఘుకావ్యాలు’ పేరిట పరిశోధన గ్రంథాన్ని వెలువరించారు డా।। గొట్టుముక్కల నరసింహశర్మ. 
      స్నేహలత కవితా సంఘం గ్రంథప్రచురణతో పాటుగా కవిత్వగోష్ఠులు, విద్వత్‌ పరీక్షలు నిర్వహించేది. ఈ సంస్థ ద్వారా జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి, మద్దాలి ఉమామహేశ్వరరావు లాంటి కవులెందరో సత్కారాలు స్వీకరించారు. ఈ సంఘం వ్యవస్థాపకుల గురించి కపిలవాయి లింగమూర్తి తన ‘మహబూబ్‌నగర్‌ జిల్లా సర్వస్వం’లో ‘‘రాయుడు ఎందరినో ప్రోత్సహించి, కృతులు రాయించి వాటిని ముద్రించినాడు. ఇది పాలమూరు జిల్లాలో మొదటి సాహిత్య సంస్థ. దీని ద్వారా రాయుడుగారు చేసిన కృషి ఎంతో గొప్పది’’ అన్నారు. ‘‘సంస్థానాల ద్వారా, కవితా గోష్ఠుల ద్వారా, గ్రంథ రచనల ద్వారా, పత్రికల ద్వారా, సాహితీ సంస్థల ద్వారా, అన్నిటికంటే మించి లేఖల ద్వారా రాసురాట్కవి సాగించిన సాహిత్యసేవ అమూల్యమైంది. నిరూపమానమైంది’’ అంటూ డా।। గొట్టుముక్కల నరసింహశర్మ  కైమోడ్పులర్పించారు. రామసుబ్బరాయకవి 1955లో ప్రభుత్వ ఉద్యోగిగా పదవీ విరమణ చేశారు. 1982లో పరమపదించారు. శిష్యులు పేరేశ్వర నారసింహకవులు ఆయన జీవితచరిత్రను రచించారు.  
      రామసుబ్బరాయకవి నాడు నమ్మిన సూత్రమొక్కటే! ‘స్నేహలతా కవితా సంఘం’ ద్వారా దానికోసమే ఆయన పరితపించారు. పరభాషా సంస్కృతుల వ్యామోహంలో మనవి అనుకున్న వాటన్నింటినీ మర్చిపోతున్న ఈ కాలంలో ఆ సూత్రాన్ని ఆచరించడం మరీ అవసరం. అదేంటంటే... 
తన భాషయు, తనదేశము
తన మాతయు, తన రుచులును తన ధర్మంబున్‌
తన కట్టు బొట్టు జుట్టును
తనకున్‌ తాజూచు కొనుటే- ధర్మము లక్ష్మీ!


వెనక్కి ...

మీ అభిప్రాయం