జనభాషే మన భాష వివేకవాణి

  • 96 Views
  • 0Likes
  • Like
  • Article Share

    తెలుగు వెలుగు బృందం

వివేకానందస్వామి రచనలను క్షుణ్నంగా ఆధ్యయనం చేశాను... ఆయన రచనలను మననం చేసుకున్న ఫలితంగానే నా దేశమంటే నాకున్న ప్రేమ సహస్రాధికంగా వృద్ధి చెందిందన్నారు జాతిపిత. 
సామాన్యుల నుంచి అసామాన్యుల వరకూ అందరినీ తన బోధనలతో ప్రభావితం చేసిన వివేకానందుడు భారతీయ ఆత్మకు ప్రతీక. ఆయన బోధలు సార్వకాలికాలు. అనుసరణీయాలు. ఆచరణీయాలు. తన జీవితాన్నే ఓ వ్యక్తిత్వ వికాసపాఠంగా మార్చిన వివేకానందుడి జయంతి జనవరి 12. అది జాతీయ యువజన దినోత్సవం. మాతృభూమి, మాతృభాష, మహిళలు, యువత గురించి వివిధ సందర్భాల్లో వివేకానందుడి సందేశాల సారం ఇదీ...

      ఓ ధీరుడా! తలవంచకు. ధైర్యం వహించు. నువ్వు భారతీయుడవని గర్వించు. నేను భారతీయుణ్ని. ప్రతి భారతీయుడూ నా సోదరుడని గర్వంగా ప్రకటించు. భారతీయుడు నా ప్రాణం. భారతసంఘం నా శైశవ ఊయల. నా యౌవన క్రీడావనం. నా వార్ధక్యపు వారణాసి అని సగర్వంగా ఎలుగెత్తి చాటు. సోదరా! భారతభూమే నా అత్యున్నత స్వర్గం. భారతదేశ శ్రేయస్సే నా శ్రేయం అని భావించు. పగలూ రేయీ ఈ ప్రార్థనను స్మరించు.
      మీ సోదర మానవులపై మీకు ప్రేమ ఉందా? భగవంతుణ్ని చూడాలనుకున్నవారు ఎక్కడికి పోవాలి? పేదల, నిర్భాగ్యుల, దుర్బలుల రూపంలో మీకు భగవంతుడు కనిపించట్లేదా? మొదటగా వీరిని ఎందుకు ఆరాధించకూడదు? ప్రేమ సర్వశక్తిమంతమని నమ్మాలి. పేరుప్రతిష్ఠలనే క్షణభంగురమైన ఆడంబరం ఎవరికి కావాలి? మీకు ప్రేమ ఉంటే, మీరే సర్వశక్తిసంపన్నులు. మీలో స్వార్థం లేశమైనా లేదంటే, మీ శక్తి నిర్నిరోధం. శీలమే సర్వదా శుభప్రదం. ఓర్వలేనితనం, దురహంకారం విడనాడాలి. ఐకమత్యంతో అందరితో కలిసి లోకసేవ చేయడం నేర్చుకోవాలి. ఓర్పు కలిగి, మరణపర్యంతం విశ్వాసపాత్రులై మెలగాలి. మీలో మీరు కలహించుకోవద్దు. ధనం విషయంలో నిష్కల్మషులై ఉండాలి. శ్రద్ధ, నీతి, లక్ష్యం, నిష్ఠలు మీకున్నంతకాలం సర్వం వర్ధిల్లుతుంది. మీలో మీకు భేదభావాలు కలగనంత కాలం, భగవత్కృపవల్ల మీకేవిధమైన అపాయం కలగదనీ దృఢంగా చెప్పగలను.
      మీ బలిష్ఠమైన వేళ్ళకు విలువైన ఉంగరాలున్నాయి. మీ పూర్వులు అందించిన సంపత్తు ఉంది. అదంతా ఇప్పటిదాకా దానం చేయలేదు. దాన్ని మీ తర్వాతి తరాలకు అందించండి. వారిలో మీరు అదృశ్యమవండి. మీ స్థానంలో నవీనభాగం ఉదయిస్తుంది. నాగలి ధరించే కృషీవలుల గుడిసెల నుంచి, మత్స్యకారుల, చర్మకారుల, శబరుల పాకల నుంచి నవీన భారతం ఉద్భవిస్తుంది. వర్తకుల కొట్ల నుంచి, కర్మాగారాల నుంచి, విపణి వీధుల నుంచి, వనాల నుంచి, గుట్టల నుంచి, పర్వతాల నుంచి పుడుతుంది నవభారతం.
      దీనుల గురించి ఎవరి మనసు క్షోభిస్తుందో వాడే మహాత్ముడు. క్షోభించలేదో వాడు దురాత్ముడే. కోట్లమంది ప్రజలు విద్యావిహీనులై, క్షుధార్తులై రోజులు గడుపుతూంటే, వారికేసి చూడకపోగా, వారి కష్టార్జితంతో విద్యావంతులైన వారంతా దేశద్రోహులే. మానవసేవే మాధవసేవ- జీవులసేవే దైవసేవ. నా దేశంలో ఓ కుక్క పస్తు ఉన్నా దానికి ఆహారమిచ్చి రక్షించడమే నా పరమధర్మం. ఇదే నా మతం. దానికి భిన్నమైందంతా అధర్మం, కృత్రిమం.
పుట్టకతో వచ్చిన దాన్ని వదిలేస్తామా?
మన దేశంలో పురాతన కాలంనుంచి విజ్ఞానం సంస్కృతంలోనే ఉండటం వల్ల సామాన్యజనానికి, పండితులకు మధ్య పెద్ద అంతరం ఏర్పడింది. బుద్ధుడినుంచి చైతన్య, రామకృష్ణులదాకా లోకోద్ధరణకు పుట్టినవారంతా జనుల భాషలోనే బోధనలు చేశారు. పాండిత్యం సంపాదించడం గొప్ప విషయమే, అయితే దాన్ని కఠినమైన, క్లిష్టమైన, అస్వాభావికమైన, కృత్రిమమైన భాషలోకంటే మరో భాషలో సంపాదించుకోవటానికి¨ వీల్లేదా? ప్రజలు మాట్లాడే భాషలో కళకు తావులేదా? పుట్టుకతో వచ్చిన భాషను వదిలిపెట్టి, కృత్రిమమైన భాషను ఆశ్రయించడంలో ప్రయోజనం ఏముంది? ఇంట్లో ఉపయోగించే భాష ద్వారా విజ్ఞాన పరిశోధన కొనసాగించుకోలేమా? పుస్తక రచనలో కొరుకుడుపడని, క్లిష్టమైన భాషను ఎందుకు వాడాలి? మన మనసులో తర్కించుకొనే సహజమైన భాష విజ్ఞాన సముపార్జనకు పనికిరాదా? అది పనికిరాకపోతే, ఆయా అంశాలను గురించి ఆ భాషలో తర్కించుకోవటంగాని, చర్చించుకోవటంగాని, ఎలా సంభవం? 
      మన అభిప్రాయాలను ప్రకటించడానికి వీలైన భాష - మన కోప, దుఃఖ, ప్రేమాది భావాలను వ్యక్తం చేయడానికి వీలైన భాషకంటె యోగ్యమైన భాష మరోటి ఉండదు. ఆ భావాన్ని అదే విధంగా చెప్పాలంటే ఆ చెప్పే వైఖరి, శైలి అన్నీ వాటంతట అవి ఒకదానికొకటి తులతూగినట్లుండాలంటే ఆ భాషలో తప్ప పరాయిభాషలో కుదురుతుందా? కృత్రిమభాషకు ఆ శక్తి, సంగ్రహం, వ్యంగ్యం ఇష్టంవచ్చిన పద్ధతిలో చెప్పటానికి ఒదిగి ఉండే లక్షణముంటుందా? నిత్యం వాడే మన సొంతభాషకే ఆ గుణం ఉంటుంది. దాన్ని నువ్వు ఇష్టంవచ్చిన పనిముట్టుగా మలచుకో. దాని స్వచ్ఛతకు భంగం కలిగించవద్దు. అప్పుడది ఒక్క దెబ్బతో కొండశిఖరాన్నైనా రెండుగా చీలుస్తుంది. 
      భాష జాతి అభ్యుదయానికి ముఖ్య సూచిక. మన భాష సంస్కృత భాషలోని అలంకారికశైలిని అవలంబించటంవల్ల కృత్రిమంగా తయారవుతుంది. ఏ భాష సంస్కృతానికి దగ్గరగా ఉందా అని కాదు మనం చూడాల్సింది. ఏ భాష, తక్కిన మాండలికాలను తోసుకొని వ్యాపిస్తోందో చూడాలి. భాష అంతటా వ్యాపించిందని మనకు తెలిసినప్పుడు మాట్లాడటానికి, రాయటానికి రెంటికీ ఒకటే భాష ఉండాలని, ఆ ఒక్కటే అందరికీ తెలిసిందిగా ఉండాలని మనం అంగీకరిస్తున్నాం. ఆ భాషనే మనం ప్రామాణికంగా చేసుకోవాలి. .      
      భాష భావప్రకటనకు ప్రధాన సాధనం. భావాలు ప్రధానాలైతే, తర్వాత గణనీయమైంది భాష. గుర్రాన్ని బాగా అలంకరించి దానిమీద ఒక కోతి నెక్కిస్తే ఎలా ఉంటుంది? మనిషి బతికున్నప్పుడు భాషను ఎలా మాట్లాడతాడు. చనిపోయాక చచ్చిన భాషను మాట్లాడతాడు. చావు సమీపించేకొద్దీ స్వతంత్రాలోచన మందగిస్తుంది. ఏదో బూజుపట్టిన, పుచ్చిపోయిన ఒకటి రెండు భావాలను బుట్టెడు పువ్వుల్లో అత్తరుచల్లి, వాటి లోపల పాతిపెట్టడానికి కొందరు ప్రయత్నిస్తారు. ఓ దేవుడా! వారెంత కసరత్తు చేస్తారో చూశావా? పుటకు ఒక్కటే సమాసం. అబ్బో! విశేషణాలు, సమాసాలు! శ్లేషలు! శరపరంపర! ఇవన్నీ మరణ చిహ్నాలు!  దేశం పతనోన్ముఖమైనప్పుడే ఈ లక్షణాల్నీ అభివ్యక్తాలవుతాయి. ఇది ఒక్క భాషా విషయంలోనే కాదు తక్కిన సమస్త విద్యలు- శిల్పాల విషయంలోనూ ఈ లక్షణాలే గోచరిస్తాయి. ఒక భావసౌందర్యంగాని, ఒక శైలిగాని ఏమీ ఉండదు. స్తంభాలన్నీ ఒకే మూసలో పోతపోసినట్లుంటాయి. వాటిలో జీవం ఉండదు. కొందరు మనుషులు నగలు ధరించే విధానాన్ని పరిశీలించండి. ముక్కులనిండా, మెడనిండా ఏమేమో పెట్టుకొని ఒక పెద్ద దెయ్యం మాదిరి కనిపిస్తారు. ఇక వాటిలో లతలు, తీగలు రకరకాలుగా చెక్కివుంటాయి. ఇక సంగీతం గతి! పాడుతున్నారో, ఏడుస్తున్నారో లేక అరుస్తున్నారో తెలియదు. ఆ సంగీతంలోని ఆర్థం, అభిప్రాయం, అసలదేమిటో మనకు తెలియదు సరికదా, నాట్యశాస్త్ర రచయిత  భరతముని కూడా చెప్పలేడు. ఆ సంగీతంలో ఎన్ని వంకలు, గిలిగింతలు, ఎంత గందరగోళం! తల పగిలిపోతుంది. అన్నిటికంటే పళ్లను బిగపట్టి ముక్కుతో పాడటానికి ప్రయత్నించే ఆ దిక్కుమాలిన ధోరణి ఘోరాతిఘోరమనే చెప్పాలి. వర్తమాన కాలంలో ఈ లక్షణాలను సవరించే ప్రయత్నం జరుగుతోంది. భావహీనమైన, ప్రాణరహితమైన భాష, ఆ తీరు సంగీతం, కళ, విద్య - ఇవన్నీ నిరర్థకాలని ప్రజలు క్రమంగా గ్రహిస్తారు. జాతీయ జీవనానికి బలం కలిగే కొద్దీ భాషకు, విద్యకు, సంగీతానికి కూడా స్వాభావికంగానే భావం, ప్రాణం కలుగుతాయని ప్రజలు గ్రహిస్తున్నారు. నిత్యం వాడుకలో ఉండే ఒకటి రెండు మాటలు ప్రకటించే భావపుష్టిని గ్రంథాలయం నుంచి అరువు తెచ్చుకొన్న కొన్ని వేల పదాలు కూడా కల్పించలేవు. జాతి ప్రాణవంతమైనప్పుడు ప్రతి దైవవిగ్రహమూ భక్తినుద్దీపిస్తుంది. నగలు ధరించిన ప్రతి బాలికా దేవతలా కనిపిస్తుంది. ప్రతి ఇల్లు, ప్రతి గది, ప్రతి పీట, కుర్చీ, మంచం - సమస్తం ప్రాణవంతాలై వెలుస్తాయి. కావలసింది భావపుష్టి.
వీరనారులు కావాలి
భారతీయ ఆధ్యాత్మిక పునరుజ్జీవనోద్యమంలో సమాజంలోని ప్రధాన వర్గాలు భాగస్వామ్యం వహించకపోతే, ఆ లక్ష్యసాధన సఫలీకృతం కాదు. ఆత్మకు లింగభేదం లేదు. సర్వభూతాల్లోనూ ఒకే ఆత్మ ఉందని వేదాంతం ఘోషిస్తోంటే, ఈ దేశంలో ఇంతగా స్త్రీ పురుష వ్యత్యాసం ఎందుకుందో అర్థం కాదు. స్త్రీని స్త్రీగా కాక మానవజాతిలో భాగంగా చూడగలిగినప్పుడే వారి అభివృద్ధి సాధ్యం. మన లక్ష్యం సాధించుకోవాలంటే స్త్రీ పురుషులిద్దరూ అవసరం. వేదాంత సందేశాన్ని వాడవాడలా వ్యాపింపచేయడానికి వేలాదిగా పురుషులు, మహిళలు అవసరం. ఇందుకు ముందుగా మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించాలి.
      దేశం, సమాజం అభివృద్ధి చెందాలంటే జనబాహుళ్యానికి, మహిళలకు విద్య అవసరం. ఒక పక్షి ఆకాశంలో ఎత్తుగా ఎగరాలంటే దాని రెండు రెక్కలు పటిష్టంగా ఉండాలి. ఒంటి రెక్కతో అది పైకెగరలేదు. సమాజం ముందుకు నడవాలంటే స్త్రీ పురుషులిద్దరికీ సమాన విద్యావకాశాలు ఉండాలి. కానీ, ఈ దేశంలో మహిళలకు విద్యనందించడానికి గట్టి ప్రయత్నాలు జరగడం లేదు. మీ సుఖదు:ఖాలతో పాలుపంచుకొని, పెద్దలకు సేవాశుశ్రూషలు చేస్తూ, మీకోసం తమ ప్రాణాలను సైతం వదులుకొవడానికి సిద్ధంగా ఉన్న మీ ఇంటి స్త్రీలకోసం మీరేం చేస్తున్నారు?
      వేదాంత సత్యాలను కనుగొన్నవారే రుషులు. వారిలో కొందరు మహిళలు కూడా ఉన్నారనే విషయం ఎంతో సంతోషాన్నిస్తోంది. గార్గి, మైత్రేయివంటి బ్రహ్మవాదినులు రుషిపీఠాలనలంకరించారు. ఈ దేశం అలాంటి స్త్రీలను మళ్లీ సిద్ధం చేయగలగాలి. చరిత్ర పునరావృతం అవుతూనే ఉంటుంది, కావలసిందే.
      మనోస్థైర్యంగల స్త్రీలు తమ సమస్యలకు తామే పరిష్కారాలు వెదకగలరు. వారి సమస్యలను పూరించడానికి మీరెవరు? వారికి అనుకూలమైన పరిస్థితులు కల్పించటమే మన బాధ్యత.
      భారతీయ సంస్కృతి, సంప్రదాయం, ఆధ్యాత్మిక జ్ఞానంలో నమ్మకాన్ని సడలించే విద్య నిరర్థకమే కాదు, హానికరం కూడా. సనాతనకాలంనాటి ధ్యాన, తపోమయ జీవితాన్ని ఆచరించని భావి భారత నారీమణిని ఊహించలేను. స్త్రీలు ఆధునిక విజ్ఞానశాస్త్రాన్ని నేర్చుకోవలసిందే. కాని, అందుకోసం సనాతన ధర్మాన్ని విస్మరించరాదు. ఆదర్శప్రాయమైన విద్య సమాజాన్ని అతలాకుతలం చేయకుండా, నెమ్మదిగా మార్పులు తీసుకువస్తుంది. ప్రాచీన భారతీయ మహిళల మహోజ్జ్వల చరిత్రను తిరిగి పుణికిపుచ్చుకోడానికి దోహదం చేసేదే అసలైన విద్య.
      మనోస్థైర్యాలను పెంచి, మేధను వికసింపజేసే విద్య లభించిననాడు భారతీయ మహిళ యావత్ప్రపంచానికి ఆదర్శమవుతుంది. ఆదర్శ వనిత తన సంతానాన్ని చక్కగా తీర్చిదిద్దుకోగలదు. ఆమె సంతానం ఉదాత్త గుణాలు కలిగి దేశానికి ఎనలేని కీర్తి తేగలగినప్పుడే జాతి సంస్కృతి, శక్తి ఉజ్జ్వలంగా ప్రకాశిస్తాయి.
      మహిళలకు ఇచ్చే స్థానాన్నిబట్టి ఒక దేశం, సమాజం అభివృద్ధిని అంచనా వేయవచ్చు. స్త్రీలకు సముచిత గౌరవాన్ని ఇచ్చే దేశాలే గొప్పవవుతాయి. మన జాతి ఇంతగా దిగజారిపోవడానికి కారణం, శక్తిస్వరూపిణులు అయిన స్త్రీలను గౌరవించకపోవటమే. శక్తి తత్త్వాన్ని అర్థం చేసుకొని, స్త్రీలను పరాశక్తి ప్రతీకలుగా గౌరవించే దేశమే అభివృద్ధి చెందుతుంది. స్త్రీలను కించపరచే, అవమానించే జాతి ఎన్నటికీ పురోగమించదు. 
      స్త్రీలు ధైర్యసాహసాలు కలిగి, అన్ని పరిస్థితులను ఎదుర్కోగలగాలి. వారిలో అపారమైన శక్తి ఉందని బాల్యం నుంచే నూరిపోయాలి. మహిళలు తమలో అంతర్నిహితమైన శక్తిని వెలికితీసి, దానిని సమాజ కల్యాణానికి వినియోగించాలి. ధైర్యసాహసాల్లో స్త్రీ పురుషునికి ఏమాత్రం తీసిపోదు. వీధిలో కుక్కను చూసి భయపడే స్త్రీ, తన బిడ్డపైకి పులి ఉరికితే, ఆ బిడ్డకు పులికి మధ్య తాను నిలుస్తుంది. ఆమెలోని మాతృశక్తి ఆ సాహసానికి కారణం. ఝాన్సీలక్ష్మీబాయి, రాజపుత్ర నారీమణుల వీరగాథలు భారతీయులకు ఆదర్శప్రాయం.
      భారతదేశంలో మాతృస్థానం అన్నిటికన్న ఉత్తమమేకాక, అమ్మతనం స్త్రీత్వానికి ఆదర్శం.
ఇనుప కండరాలు... ఉక్కు నరాలు
భారతీయ యువతా మేలుకో. లేచి నిలబడు, ధైర్యంగా బలిష్ఠంగా ఉండు, మొత్తం బాధ్యతనంతా నీ భుజస్కంధాల మీదనే  వేసుకో. నీ భవిష్యత్తుకు నీవే బాధ్యుడవని తెలుసుకో. నీకు కావలసిన బలం, శక్తి ... అన్నీ నీలోనే ఉన్నాయి. నెమ్మదైన మంచితనం, సహనం, సత్ప్రవర్తన - ఇవే విజయప్రతీకలు. ఇదే భారతదేశ సందేశం. సమస్త శక్తి నీలోనే ఉంది. నువ్వు ఏ పనైనా చేయగలవు. లేచి నిలబడి నీలోని దైవత్వాన్ని ప్రదర్శించు... లే, మేలుకో, నిద్రావస్థను వదిలేయ్‌! మీలో ప్రతి ఒక్కరిలో అన్ని అవసరాలను తీర్చే, అన్ని కష్టాలను తొలగించే శక్తి దాగి ఉంది. దీన్ని విశ్వసించండి. ఆ శక్తి అంతా మీలోనే ప్రత్యక్షమౌతుంది. బలమే జీవనం, బలహీనతే మరణం.
      బలహీనులుగా ఉండి భగవద్గీత పారాయణం చేయడం కన్నా, ఫుట్‌బాల్‌ ఆడి బలాన్ని పొందడం మూలంగా భగవద్గీతను ఇంకా బాగా అర్థం చేసుకోవచ్చు. బాహ్య ప్రపంచాన్ని జయించడం ఘనకార్యమే. కానీ అంత:ప్రపంచాన్ని వశం చేసుకోవడం వీరోచితమైన పని. సౌశీల్యాన్ని నిర్మించేదీ, మానసిక బలాన్ని పెంపొందించేదీ, బుద్ధిని వికసింపచేసేదీ, ఒక వ్యక్తిని తన కాళ్లమీద తాను నిలబడేటట్లు చేసే విద్యే అసలైన విద్య!
      ప్రతి వ్యక్తికీ ఒక లక్షణముంటుంది. ప్రతి దేశానికీ ఒక లక్ష్యముంటుంది. తాను వెలువరించవలసిన సందేశముంటుంది. మన జాతీయ జీవనం ధర్మాన్ని ఆశ్రయించి ఉంది. ఓ నవయువకులారా! ఏనాడైతే మనం ధర్మం విడిచిపెడతామో, మనకు మృత్యువే శరణ్యమౌతుంది.
      భౌతిక సుఖాలనే ఇసుక పునాదులపై ఆధారపడిన జాతులన్నీ స్వల్పకాలానికే నాశనమైపోయాయి. వేల ఏళ్లుగా మన ధర్మం చెక్కుచెదరకుండా నిలిచింది. ఆ ధర్మాన్ని శాశ్వతంగా కాపాడటం యువకుల కర్తవ్యం. 
      సోదరా! పవిత్రంగా ఉండటం, ఇతరులకు మంచి చేయడం - ఇదే పూజలన్నిటికీ సారాంశం. రోగుల్లో, బలహీనుల్లో దేవుణ్ని చూసేవారు యథార్థంగా భక్తులే. అందరికీ మరణం తప్పదు. అలాంటప్పుడు మంచిపనికోసం మరణించడం మంచిది. మీలోని పాశవిక ప్రవృత్తిని నిర్మూలించి మీరు మానవులు కావాలి. అంటే ప్రేమశీలురూ, దానశీలురూ కావాలి. బలహీనత కలిగించే దేన్నైనా సరే, మీ కాలిగోటితోనైనా తాకవద్దు.
      మీ ఇంటిపక్క పేదలు ఎందరో ఉన్నారు. కష్టాల మధ్య అల్లాడుతున్నారు. శ్రద్ధతో, ఉత్సాహంతో వారికి సేవచేయండి. రోగులైన వారికి మందులివ్వండి. శ్రద్ధగా పరిచర్యలు చేయండి. ఆకలితో అలమటించే వారికి అన్నం పెట్టండి. అజ్ఞానులు, దరిద్రులు, నిరక్షరాస్యులు, చెప్పులు కుట్టేవారు, వీధులూడ్చేవారు - వీరందరికీ రక్తమాంసాలున్నాయి. ఓ యువకులారా! కదలిరండి, వారిని సేవించండి, తరించండి. సేవ, త్యాగం భారతీయుల ఆదర్శాలు. త్యాగభావంతో ప్రపంచాన్ని సేవించడానికి ప్రయత్నించాలి. పనిని దైవంగా భావించాలి. విద్యుక్తధర్మాన్ని ఆరాధనగా భావించి కృషి చేయాలి. నేడు మనకు కావలసింది ద్వేషం కాదు, ప్రేమ. సంఘర్షణ కాదు, సమన్వయం.


తెలుగు నేలతో అనుబంధం
వివేకానందుడు చికాగో ప్రయాణానికి ముందుగానే 1893 ఫిబ్రవరి 10-17 తేదీల్లో జరిపిన హైదరాబాద్‌ యాత్ర నగర చరిత్రలో విశేషఘట్టం. మద్రాస్‌లో ఉన్న నరేంద్రుడు హైదరాబాద్‌ ప్రజల కోరికపై ఇక్కడ వచ్చి, ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. చార్మినార్, ఫలక్‌నుమా, నిజాం నివాసం తదితర ప్రధాన ప్రదేశాలను సందర్శించి తిరిగి మద్రాస్‌ చేరుకున్నాడు. 13వ తేదీ సాయంత్రం సికింద్రాబాద్‌లోని మహబూబ్‌ కళాశాల ప్రాంగణంలో బహిరంగ సభలో ‘మై మిషన్‌ టూ వెస్ట్‌’ అన్న అంశంపై ఆంగ్ల భాషలో అనర్గళంగా ప్రసంగించి, శ్రోతలను మంత్రముగ్ధుల్ని చేశాడు. కొందరు ఐరోపావాసులతోపాటు వెయ్యిమందికి పైగా వచ్చిన ఈ ప్రవచనం వివేకానందుడి మొదటి ప్రజోపన్యాసంగా ప్రస్తావిస్తారు.


వెనక్కి ...

మీ అభిప్రాయం