సినీ  సం‘గీత’ క్రాంతి

  • 132 Views
  • 0Likes
  • Like
  • Article Share

    జ్యోతి వ‌ల‌బోజు

  • ప్ర‌ముఖ బ్లాగ‌రు
  • హైద‌రాబాదు
  • 8096310140
జ్యోతి వ‌ల‌బోజు

జీవితం చిత్రమైంది . కష్టసుఖాలు, సుఖదుఃఖాలు. లాభనష్టాలు. ప్రేమలు, వైఫల్యాలు... ఇలా ఎన్నో ఆటుపోట్లు సంఘర్షణలతో రంగుల హరివిల్లులా సాగిపోతూంటుంది. మనసు, శరీరం, ఆత్మ కూడా సంగీతానికి, పాటకు స్పందిస్తాయంటారు. చిన్నపాటి సంతోషానికి మనసు తనలో తాను సన్నగా పాట పాడుకోవాలని ఆరాటపడుతుంది. కొందరు గొంతెత్తి పాడితే కొందరు గొంతు కలుపుతారు. సంతోషమే కాదు దుఃఖం, వేదన, సంఘర్షణల సమయంలో కూడా మనసు స్పందిస్తుంది. ఆ స్పందనకు అక్షర రూపమిచ్చినంత సులువుగా గానాన్ని జతచేయడం కాస్త కష్టమే. అయినా మన జీవితంలో ప్రతీ సందర్భానికీ ఒక పాటను అన్వయించుకోవచ్చు. రాసుకోవచ్చు. పాడుకోవచ్చు కూడా. 
ఈ పాటలు జానపదాలైనా, పల్లె రాగాలైనా, సంప్రదాయ సంగీతమైనా... ఒక్కోటి ఒక్కో భావన, సందర్భం, స్పందనని తెలియజేస్తాయనడంలో అతిశయోక్తి లేదు. ఇలాంటివే మన సినిమాల్లోని పాటలు కూడా. చాలా ఏళ్లుగా విడుదలైన తెలుగు సినిమాల్లో సామాన్యంగా ప్రేమగీతాలు, పిల్లల పాటలు, లాలిపాటలు, శృంగార గీతాలు, విషాదగీతాలు వంటివి ఉండేవే. కానీ మనవైన పండుగలను, వాటి సంబరాలను ఎన్నో అందమైన, శ్రావ్యమైన, జనరంజకాలైన పాటలుగా అందించారు చిత్ర నిర్మాతలు, దర్శకులు, సంగీత దర్శకులు. ఈ పాటలు ఆ సినిమా వరకే కాకుండా ఆయా పండుగల వేళలో రేడియో, టీవీల ద్వారా మనకు పండుగ వాతావరణాన్ని సృష్టించి ఆనందోల్లాసాలు కలిగిస్తాయి.
      మన భారతీయ సంస్కృతిలో పండుగలు ఎంతో ప్రాముఖ్యం కలిగి ఉన్నాయి. రుతువుల కనుగుణంగా సంవత్సరం పొడవునా వేర్వేరు పండుగలు జరుపుకోవడం హిందువుల ఆచారం. ప్రతీ పండుగకు ఒక ప్రత్యేకత, దానికి సంబంధించిన నమ్మకాలు, ఆచార వ్యవహారాలు ఉంటాయి. ఏడాది పొడవునా ఎన్ని పండుగలున్నా తెలుగు వారికి, అన్నదాతలైన రైతులకు, వ్యవసాయదారులకు అత్యంత ప్రాముఖ్యమైన,  ప్రీతికరమైన పండుగ సంక్రాంతి. రైతులు వారి శ్రమకు తగ్గ ఫలసాయం లభించగానే సంతోషంగా జరుపుకునే అసలైన పండుగ ఇది. రాత్రింబవళ్లూ కష్టపడి తన కష్టానికి ప్రతిఫలాన్ని గర్వంగా అందుకుని కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో తన సంతోషాన్ని పంచుకోవడానికి సంబరాలు చేసుకుంటాడు రైతన్న. అంతేకాక ఈ సంబరాల సంక్రాంతికి, తెలుగు వారికి అవినాభావ సంబంధముంది. సంక్రాంతి నాటికి పల్లెల్లో పంటలు చేతికి వస్తాయి. నూతన సంవత్సరంలో వచ్చే ఈ మొదటి పండుగకు పుట్టింటికి వచ్చిన కూతుళ్లు, అల్లుళ్లు, పిల్లలు, బంధుమిత్రులతో సంబరాలు చేసుకుంటూ కాలక్షేపం చేస్తారు.
      మన తెలుగు చలనచిత్రాల్లో కూడా ఈ సంక్రాంతి పండుగకు పెద్దపీటే వేశారని చెప్పవచ్చు. సంవత్సరంలో తొలి పండుగసంక్రాంతికి ఎంతోమంది తెలుగు సినీ నటులు, నిర్మాతలు, దర్శకులు తమ సినిమాలు విడుదల చేయాలని ఆరాటపడుతుంటారు. మన తెలుగు సినీ దర్శక, నిర్మాతలు సంక్రాంతి అనే శీర్షికతో సినిమాలు తీయడమే కాకుండా తమ చిత్రాల్లో అవకాశం ఉన్న మేరకు సంక్రాంతి సంబరాల సన్నివేశాలకు, పాటలకు చోటిచ్చారు. ఆయా సందర్భాలకు అనుగుణంగా తెలుగు సినీకవులు సంక్రాంతి ఉత్సాహాన్ని తమ పాటల్లో నింపారు. సంక్రాంతి సినిమా పాటల్లో కొన్ని పూర్తిగా ఆ వేడుకలకు అద్దం పట్టేవయితే - మరికొన్ని పల్లవులకో ఒకటి రెండు చరణాలకో పరిమితమయ్యేవిగా ఉన్నాయి. తెలుగు సినిమాల్లో సంక్రాంతికి సంబంధించిన తొలిపాట ‘రక్షరేఖ’ (1949) చిత్రంలో పెట్టారు. బలిజేపల్లి లక్ష్మీకాంతం రాసిన ఈ పాట ‘పండుగపొంగళ్లు గంగమ్మా! పాలవెల్లి పొంగళ్లు, కమ్మ పాయసాలు పొంగే ఆరగింపు గంగమ్మ తల్లి’ అనే పల్లవితో ఉంటుంది. ‘సంక్రాంతి’ (1952) చిత్రానికి బలిజేపల్లి రాసిన ‘జేజేలమ్మా జేజేలు - సంక్రాంతి లక్ష్మికి జేజేలు’ అనే పాట అప్పట్లో వీక్షకులకు కన్నుల పండుగ చేసింది. ఆ తరువాత టి.ప్రకాశరావు దర్శకత్వంలో పీపుల్స్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ నిర్మించిన ‘పల్లెటూరు’ (1952) చిత్రంలో ఘంటసాల, ఎం.ఎస్‌.రామారావు పాడిన ‘ఆ సంక్రాంతికి ఈ సంక్రాంతికి’ పాటను  మరువలేం. కానీ ఈ పాటలో సంక్రాంతి ప్రస్తావన తప్ప పండుగవిశేషాలు ఎక్కువగా లేవు. ఇంకో చిత్రం నాగయ్య దర్శకత్వంలో అవరిండియా నిర్మించిన ‘నా యిల్లు’ (1953)లో దేవులపల్లి కృష్ణశాస్త్రి కలం నుంచి వెలువడిన గీతం ‘గొబ్బిళ్లో గొబ్బిళ్లో వచ్చేనమ్మా సంక్రాంతి’ అంటూ సంక్రాంతి అందాలను ఎంతో రమ్యంగా వర్ణించారు. చిత్తూరు వి.నాగయ్య, అద్దేపల్లి రామారావు సంగీత దర్శకత్వంలో ఒలియో ఒలియో అంటూ ఎన్‌.ఎల్‌.గానసరస్వతి బృందం ముగ్గులు, గొబ్బిళ్లు, భోగిపళ్లు, డూడూ బసవన్నల గురించి చెప్తూ పండుగశోభను మన కళ్ల ముందుకు తీసుకువచ్చారు. 
      ఇక ప్రతీ సంవత్సరం సంక్రాంతి పండుగ అనగానే మనందరికీ తప్పకుండా గుర్తుకువచ్చే మొదటిపాట ‘ఉండమ్మా బొట్టు పెడతా’ చిత్రంలోని ‘రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా’ అనేది. స్వరబ్రహ్మ కె.వి.మహదేవన్‌ స్వరపరచగా బాలసుబ్రహ్మణం, సుశీల గానం చేశారు. పౌష్యలక్ష్మి రూపంలో ఉన్న మహాలక్ష్మిని తమ ఇంటికి రమ్మని ఆహ్వానిస్తూ మొదలవుతుంది. ఇందులో సంక్రాంతి పండుగకి సంబంధించిన అన్ని విశిష్టతలతో, తెలుగింటి సంక్రాంతి ఎలా ఉంటుందో తేట తెలుగు పదాల్లో రమణీయంగా మన కళ్లకు కట్టినట్టు చూపించారు దేవులపల్లి కృష్ణశాస్త్రి. ఈ పాట విన్నవారందరికీ కూడా సంక్రాంతి లక్ష్మిని తమ ఇంటికి ఆహ్వానిస్తున్న భావన కలుగుతుంది. 
      సంక్రాంతి పండుగనాడు హరిదాసు ప్రతీ ఇంటి నుంచి బియ్యం దానంగా తీసుకుని ఆ ఇంట కొలువై, వారందరినీ చల్లగా చూడమని ఆ కలుముల రాణిని ఆహ్వానిస్తాడు. ఈ పాట వింటుంటేనే గ్రామీణ వాతావరణం మన కళ్లముందు సాక్షాత్కరిస్తుంది. ‘కడివెడు నీళ్లూ కల్లాపు చల్లీ గొబ్బిళ్లోయ్‌ గొబ్బిళ్లూ’ అని గొబ్బిళ్లు తట్టుతూ పాటలు పాడుతూ ‘పాడిచ్చే గోవులకూ పుసుపూ కుంకం, పనిచేసే బసవనికీ ప్రతి పుష్పం అని తమ ఇంటి గోసంపదను పూజిస్తారు అమ్మాయిలు. ‘గాదెల్లో ధాన్యం, కావిళ్ల భాగ్యం... కష్టించే కాపులకూ కలకాలం సౌఖ్యం’ అంటూ ఎన్ని రకాలుగా, ఎంత వేడుకగా జరుపుకున్నా అన్నదాతలైన రైతుల గాదెలన్నీ ధాన్యంతో నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. అచ్చతెలుగు గ్రామీణ వాతావరణాన్ని అడుగడుగునా ప్రతిబింబించేలా చిత్రీకరించిన ఈ పాటలో మధురమైన సంగీతం, సాహిత్యం కలిసి, మన మనసుకు హత్తుకునే ఈ పాట ఎప్పటికీ మరపురాని ఆణిముత్యం.
       ‘మంచిరోజులు వచ్చాయి’ చిత్రంలో ‘ఈ నాటి సంక్రాంతి అసలైన పండగా’ పాట సంక్రాంతి పండుగవిశేషాలని కాకుండా కష్టజీవులకి, రైతులకి అది ఎంత ముఖ్యమైందో చెప్తుంది. కొసరాజు రచించిన ఈ పాట మొత్తం సోషలిస్టు భావాలతో రాసినట్టుగా కనిపిస్తుంది. కష్టజీవులకి మంచి రోజులు రావాలనీ, అవి తప్పకుండా వస్తాయని చెప్తూనే పెత్తందార్ల ఆటలు, వారి అధికారం సాగక కుక్కిన పేనల్లే మొహాలు చెల్లక దాక్కుంటారని ఎద్దేవా చేస్తూ నడుస్తుంది ఈ పాటలోని సాహిత్యం. సంక్రాంతి పండుగంటే ఉత్త సంబరాలే కాక కష్టపడేవారందరి పండుగఅన్న భావాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ పాట టి.చలపతిరావు స్వరకల్పనలో, ఘంటసాల, బృందం కలిసి ఆలపించారు. 
      ఇక ఈ సంక్రాంతి అనగానే తప్పనిసరిగా గుర్తు చేసుకునే పాట ‘భోగిమంటలు’ సినిమాలోని ‘భోగుల్లో భోగుల్లో’  పాట. పల్లవిలో భోగి గురించి విశేషాలతో మొదలవుతుంది. ఆచార్య ఆత్రేయ సాహిత్యంలో రమేష్‌ నాయుడు స్వరపరిచారు. సంక్రాంతి అనగానే మూడు రోజులపాటు జరిగే ఎన్నో సంబరాలు. భోగి, సంక్రాంతి, కనుమ. ఒక్కోరోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ‘తెల్లారకుండానే పల్లె పల్లెంతాను ఎర్రని కాంతుల భోగుల్లో’ అంటారు. భోగిమంటల ఎర్రని కాంతులు ఉదయాద్రిని నిద్రలేస్తున్న సూర్యుని కిరణాలతో పోటీ పడుతూ పైకెగస్తున్నాయని ఎంతందంగా చెప్పారు ఆత్రేయ. గుమ్మడిపూలు పెట్టుకున్న గొబ్బెమ్మలనీ, హరిదాసు పలికే ‘హరిలో రంగ హరి’ అంటూ పలికిస్తూ సంక్రాంతి సంప్రదాయాలని పరిచయం చేస్తుందీ పాట. ఇందులోని పాత్రలు సరదాగా ఒకరినొకరు ఆట పట్టించుకోవడం, బావా మరదళ్ల సరాగాలతో సరదాగా నడుస్తుంది. ఈ పాటలో పల్లెల్లోని సంక్రాంతి సందడంతా కనుల (వీనుల) విందుగా చిత్రీకరించారు.
      కొద్దికాలం కింద తెలుగు సినిమాలను గ్రామీణ వాతావరణంలో ఎక్కువగా చిత్రీకరించేవారు. వాటిలో సంక్రాంతి పాట తప్పకుండా చేర్చేవారు. ఏడాదికో పండుగ, బతుకంతా తొలి పండుగఅంటుంది ‘ఊరంతా సంక్రాంతి’లోని దాసరి పాట. ఈ పాటలో సంక్రాంతి రైతులకే కాదు తెలుగు వారందరికీ తొలి పండుగ. ఊరంతా కలిసి ఆడిపాడి సంబరాలు జరుపుకునే పండుగఅని చెప్తుంది ‘సంబరాల సంకురాత్రి’ అనే పాట. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుశీల, జానకి స్వరాలలో పండుగవిశేషాలను, ఆటపాటలు హుషారుగా అందించారు.
      ‘ముత్యాల ముగ్గుల్లో... రతనాల గొబ్బిళ్లూ’ అంటూ మొదలై ‘ముద్దబంతులూ, మువ్వ మోతలూ, నట్టింట కాలుపెట్టు పాడిపంటలూ...’ అంటూ సాగి సంక్రాంతి విశేషాన్ని చాటి చెప్తుంది ‘పండుగ’ చిత్రంలోని పాట. పండుగలనగానే ఎక్కడెక్కడో ఉన్న కుటుంబ సభ్యులు, అక్కాచెల్లెళ్లు ఒకచోట చేరి సంబరాలు జరుపుకుంటారు. అందునా సంక్రాంతి అనగానే ఆడపడుచులు, అల్లుళ్లను మరింత అపురూపంగా చూసుకునే పుట్టింటి వారికి ముఖ్యమైన పండుగ. కనీసం ఈ వంకతోనైనా అందరూ సంతోషంగా ఒక్కచోట కలిస్తే ఉండే ఆనందం ఈ పాటలో కనిపిస్తుంది. ‘వెండి ముగ్గులూ, పైడి కాంతులూ, పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు. కలబోసి, విరబోసి బహుదండిగా మది నిండగా చలి పండుగే సంక్రాంతి’ అంటూ సాగుతుంది ఈ పాట.. పండక్కి వచ్చిన బావ దగ్గరనించీ, పసిపిల్లల వరకూ రకరకాల బంధుత్వాలకు సంక్రాంతి పండుగసంబరాలకి గల దగ్గరి పోలిక చూపుతూ చక్కని ప్రయోగం చేశారు గీత రచయిత చంద్రబోస్‌. అంతేకాక ఈ బంధాలన్నీ కలబోసి, తెరతీసి మనకందిన సిరి సంపదే సంక్రాంతి అంటారు. సినిమా పాటలు కాలక్షేపానికి మాత్రమే కాదు మానవ కుటుంబ విలువలను ప్రతిబింబించి వాటిని మరువనీయకుండా చేసేవి కూడా ఉన్నాయి. అలాంటిదే ఈ పాట కూడా. ‘మనవాళ్లు నలుగురు ఉంటే దినమూ కనుమే కాదా, మనసును చూసే కన్నులుంటే పగలే వెన్నెలే రాదా’ అంటూ కుటుంబం అంతా కలిసినప్పుడు జరిగేదే నిజమైన పండుగఅన్న భావన ఎంతో హృద్యంగా పలికించారు. మనం అనే మాట మరచి నువ్వు, నేను అనే భావనలు పెరిగిపోయిన ఈనాటి తరానికి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు, మమకారాలతో ఉమ్మడి కుటుంబ ప్రాముఖ్యతని తెలిపే చక్కటి చిత్రీకరణ. ఈ మధ్య కాలంలో పండుగల గురించి వచ్చిన పాటల్లో ఇది ఎన్నదగిన పాట. కీరవాణి సంగీతం కూర్చిన ఈ పాటని మనో, చిత్ర ఆలపించారు. 
      ‘సింధూరం’ చిత్రంలోని ‘ఏడుమల్లెలెత్తు సుకుమారికీ’ అనే పాటలో కూడా సంక్రాంతి సంబరాలని చాలా అందంగా, ఉత్సాహంగా జరుపుకున్నట్టు చూపిస్తూ,  సాహిత్యంలోనూ పండుగకి సంబంధించిన ఎన్నో మంచి పదాలు వినిపించారు. దీనికి ‘భోగి పళ్లు పోయాలి రోయ్‌ ఏమి దిష్టి తగిలిందో, హరిలో రంగా హరీ, సువ్వి సువ్వి గొబ్బెళ్ళు‘ పాటలు నిదర్శనాలు. ఇందులో చాలా ప్రస్ఫుటంగా పండుగమీదే సాహిత్యం అంతా నడుస్తుంది. ఈ పాటకి శ్రీ సంగీతం సమకూర్చగా, కృష్ణంరాజు, మాధవపెద్ది సత్యం మరియు బృందం ఆలపించారు. ‘కుంకుడు స్నానాలూ, బూరెలూ, గంగిరెద్దు ఇంటికొచ్చేరో, గంగడోలు దువ్వి పంపరో’ అని... పాట చిత్రీకరణలో కూడా ఎటు చూసినా సంక్రాంతి పండుగసరదాలూ, అంబరాలనంటే సంబరాలు ఎంతో కమనీయంగా సాగుతాయి. ఈ పాట చూసేవారికి ఎప్పుడెప్పుడు తమ పల్లెకు, తమ వారింటికి వెళ్లిపోదామా అన్న ఉత్సాహాన్ని కలిగిస్తుంది. పాట మొత్తం సంగీతంలోనూ, సాహిత్యంలోనూ కూడా ఒక విధమైన హుషారు, చిలిపితనమూ కలబోసుకుని ఎంతో వైవిధ్యంగా ఉంటుంది.
      ‘సంక్రాంతి’ సినిమాలో ‘డోలీ... డోలీ... డోలీ రే’ అంటూ మొదలై కుటుంబం అంతా కలిసి ఆనందంగా ‘సంక్రాంతి పండుగచేద్దామా’ అనే పాట... సినిమాలో సన్నివేశం కూడా సంక్రాంతి కావడం వల్ల. ఈ పాట ప్రారంభంలో సంక్రాంతి ప్రస్తావన వచ్చినా, మిగతా సాహిత్యంలో పండుగవిశేషాలకంటే ఎక్కువగా పాట అంతా ఉమ్మడి కుటుంబంలోని ఆనందాన్నీ, ఆత్మీయతని, అన్నదమ్ముల మధ్య కలగలసిన అనురాగాల సంబరాలనీ చూపిస్తూ సాగుతుంది. ఎస్‌.ఏ.రాజ్‌కుమార్‌ సంగీతాన్ని సమకూర్చిన ఈ పాటని ఇ.ఎస్‌.మూర్తి రాశారు. శంకర్‌ మహదేవన్, చిత్ర బృందం ఆలపించారు.
      సంక్రాంతి పండుగంటేనే ముంగిట ముత్యాల ముగ్గులు, రతనాల గొబ్బిళ్లు. అన్నమయ్య కృష్ణుడికీ, కొండలరాయనికీ అభేదం పాటిస్తూ రాసిన కొలనిదోపరికి గొబ్బిళ్లు కీర్తన తెలియనిదెవరికి. మార్గశిర మాసం. బాలికలు గుమ్మాల ముందు గొబ్బిళ్లు పెట్టి వాటి చుట్టూ గుండ్రంగా తిరుగుతూ చప్పట్లు కొడుతూ నాట్య భంగిమలో పాడే ఈ పాట అతి మనోహరమైంది. ఇదే కొలను దోపరికి గొబ్బిళ్లో... అంటూ ‘ఇండియన్‌ బ్యూటీ’ అనే సినిమాలో  సి.నా.రె రాసిన పాటలో సంక్రాంతి వైభవాన్ని గురించి ఎంతో అందంగా చెప్పారు. ‘సంక్రాంతి పండుగంట హో లాలా... సంబరాలు అంబరాలనంటే వేళా’ అంటూ ఆహ్లాదంగా సాగుతుంది. మధ్యలో ‘రామా రఘురామా’ అంటూ హరిదాసు వస్తాడు. ఈ పాటలో భోగి మంటలు, గాలిపటాలు, డూడూ బసవన్నల గురించీ ప్రస్తావించారు రచయిత. అనితాకృష్ణ, బాలాజీ బృందం పాడిన ఈ పాటకు జోయ్‌ కాల్విన్‌ సంగీతం సమకూర్చారు.
      సంక్రాంతికి, ఇంటి అల్లుళ్లకు అవినాభావ సంబంధం ఉంది. కొత్త అల్లుళ్లయితే మరికాస్త ఎక్కువ సంబరం. పండుగనాడు కొత్తల్లుడిని ఆహ్వానించి మర్యాదలు చేయడం తెలుగింట సర్వసాధారణం. కానీ సంక్రాంతి పండుగపూట ‘రాధమ్మ పెళ్లి’ సినిమాలో ‘సంకురాతిరి అల్లుడూ... ముడుచుకూని కూసున్నడు... మూతి ముడుచుకూని’’ అంటూ అల్లరి చేస్తున్నారు మరదలి వరసైన అమ్మాయిలు. ఇంకోపాట ‘‘సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు తెచ్చిందే’’ అంటూ ‘సోగ్గాడి పెళ్లాం’ చిత్రంలోనిది... సంక్రాంతి పండుగ గురించిన విశేషాలు, పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ అక్కడి వేడుకలు, పల్లెవాసుల ఆత్మీయతానురాగాలు, కల్మషాలు లేని వారి ప్రేమల గురించి చెప్తుంది. అందమైన రంగురంగుల రంగవల్లులు, గొబ్బిళ్లు, కొత్త ధాన్యాలు, కోడిపందేలతో ఉల్లాసంగా ఉన్న ఊరి గురించి చెప్తున్నారు గీత రచయిత భువనచంద్ర.
      సంక్రాంతి మీద చిత్రీకరించిన మరోపాట ‘వారసుడొచ్చాడు’ చిత్రంలోని ‘ఏలాద్రి ఎంకన్న’ పాట. ఇందులో పండుగకంటే వేడుకలు, సరసాలు, సరదాలు ఎక్కువగా కనిపిస్తాయి. సంక్రాంతి శోభలన్నీ పల్లెలకే సొంతమేమో అనిపిస్తుంది. ‘రాముడొచ్చాడు’ సినిమాలోని ‘మా పల్లె రేపల్లెంట’ పాటలో. సంక్రాంతి పండుగ గురించి ప్రత్యేకంగా చెప్పకున్నా వేటూరి మరోసారి అద్భుతంగా... ‘మా పల్లె రేపల్లెంట - ఈ పిల్లే రాధమ్మంట రేగుతుంటే భోగిమంట - రేగుపళ్ల విందులంట... ... మంచమేస్తే సంకురాత్రి తిరునాళ్లలో పల్లె పచ్చగా పిల్ల వెచ్చగా ఉండే పండుగ’ అంటూ సాగుతుంది బాలసుబ్రహ్మణ్యం, చిత్ర స్వరంలో.. ‘గోగులు పూచే గోగులు పూచే’ అంటూ మొదలయ్యే మురారి సినిమాలోని పాట తర్వాత రూపు మారిపోతుంది. సంక్రాంతి గురించి ప్రస్తావన వచ్చిన మరోపాట ‘ముగ్గురుమిత్రులు’ చిత్రంలో వేటూరి రచించిన ‘సంబరాలు సంబరాలు సంకురాత్రి సంబరాలు కోలో కోలో కోలాటము - కోకా రైకా చెలగాటము చిన్నా పెద్దా శ్రీమంతము - గుళ్లో గంటల సంగీతము మా లచ్చిమొస్తుంటే పేరంటము మాగాణి చేలల్లో పేరంటము’ సంక్రాంతి పండుగ రోజుల్లోనే ముగ్గులు, గడపకు పసుపులు, గోపూజ వంటివి చేయాలని కాకుండా నిత్యం సంక్రాంతి శోభలు ఉండాలని చెప్తున్నాయి ఈ పాటలు. ‘గోగులు పూచే గోగులు కాచే ఓ లచ్చా గుమ్మడి, గోగులు దులిపే వారెవరమ్మా ఓ లచ్చా గుమ్మడీ, ముంగిట వేసిన ముగ్గులు చూడు, ముత్యాల ముగ్గులు చూడు’ అంటూ సి.నారాయణరెడ్డి, ‘ముత్యమంతా పసుపు ముఖమంత ఛాయ, ముత్తయిదు కుంకుమ బ్రతుకంత ఛాయ. ఆర నైదో తనము ఏ చోట నుండు, అరుగులలికే వారి అరచేత నుండు, తీరైన సంపద ఎవరింట నుండు, దినదినము ముగ్గున్న లోగిళ్లనుండు..., గోవు మాలక్ష్మికి కోటి దండాలు, కోరినంతా పాడి నిండు కలువల్లు, మొగుడు మెచ్చిన చాలు కాపురంలోన’ అంటూ ఆరుద్ర ‘ముత్యాలముగ్గు’ కోసం రాసిన పాటల్లో సంక్రాంతి వైభవం చూపించేశారు.
      ఇలా సంక్రాంతి నాటి ప్రతీ వివరాన్ని, విశేషాన్ని అక్షరాలుగా మార్చి తమ పాటల్లో పొదిగిన గీత రచయితలెందరో... పండుగఅనే కాకుండా మన భావాలు, భావనలు, స్పందనలు, ఆవేశాలోచనలు అందమైన పదాల నగిషీ చెక్కి, సంగీతపు మెరుపును అద్ది మనకందించారు తెలుగు సినీ నిర్మాతలు, దర్శకులు, నటులు కూడా... ఎన్నో పాటలు సందర్భోచితంగా రచించి, చిత్రీకరించడం వల్ల అవి కలకాలం సంగీత, సాహిత్య ప్రేమికుల గుండెల్లో ఎప్పటికీ గుర్తుండిపోయాయి. సంవత్సరంలో వచ్చే తొలి తెలుగు పండుగ. పుష్యమాసపు చలిలో గిలిగింతలు పెడుతూ మన జీవితంలో అడుగుపెట్టే తెలుగు వారందరికీ ముఖ్యమైన పెద్ద పండుగ సంక్రాంతి. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇలాంటి సంక్రాంతి శోభ మన ముంగిళ్లలో పసిడి కాంతులు విరజిమ్మాలని, ఆటపాటల ఆనందాల కోలాహలాలతో పాటల పండుగగా నిలవాలని మనసారా కోరుకుందాం.


వెనక్కి ...

మీ అభిప్రాయం