రంగుల ముఖచిత్రాలు, నాణ్యమైన కాగితంతో అందమైన అక్షరాల కూర్పుతో చూడచక్కని పుస్తకాలు మనలో చదవాలనే కాంక్షను, జ్ఞానతృష్ణనూ పెంచుతుంటాయి.
ప్రపంచ నాగరికతా పరిణామంలో అచ్చు అనేది కేవలం ఒక మార్పు మాత్రమే కాదు. అది ఒక జ్ఞాన ప్రసార విప్లవం. దేశం, కాలం, అవధి అనే వాటికి అది అతీతమైనది.
రాళ్లు, గుహల గోడలు, వస్త్రాలు, తాళ, భూర్జ పత్రాలపై లిఖిత రూపంలో తమ అనుభవాల్ని అందించే అలవాటు గతం నుంచే ఉంది. అయినా అచ్చు వరప్రసా దమైంది. దీంతో మేధావుల వద్ద పేరుకున్న జ్ఞానం జనం మార్గం పట్టింది. ఇలా పట్టడంలో ఎన్ని ప్రయోగాలు! ఎన్ని పరిశోధనలు! ఎంత వికాసం!
ముద్రణలోని మంచి చెడ్డలను బాగా పరిశీలించి కదలాడే అచ్చు అక్షరాలను ప్రవేశపెట్టిన మహావ్యక్తి జర్మన్ దేశీయుడైన జాన్గూటెన్బర్గ్ (కీ.శ 1400-1468) ఈయన అచ్చువేసిన ప్రథమ గ్రంథం బైబిలు. ప్రతి పుటలో 42 పంక్తులుండే ఈ బైబిలును జాన్గూటెన్ బర్గ్ బైబిలు అనీ, 42 పంక్తుల బైబిలు అనీ వ్యవహరించారు. ఇది లాటిన్ భాషలో అచ్చయింది.
భారతదేశంలో అచ్చుకు శ్రీకారం చుట్టింది స్పెయిన్ దేశీయుడు జావోది బుస్తామంతి. 1556లో గోవాలో అచ్చు మొదలైంది. 1557 సంవత్సరానికి ‘దౌతీ నాక్రిస్తా’ అనే పొత్తం వచ్చినట్లుగా చెబుతారు. అయితే అది దొరకలేదు.
ముద్రణా రంగంలో క్రైస్తవ మిషనరీల పాత్ర చరిత్రాత్మకం. చెన్నపట్టణంలో తొలి అచ్చు కూటమి క్రీ.శ 1711లో వచ్చింది. తంజావూరు సీమలోని తరంగంబాడిలోని విద్యావంతులైన క్రైస్తవులు తమిళ పుస్తకాలను అచ్చు వేయడం ఆరంభించారు.
మరి తెలుగులో ఈ అచ్చు పని ఎప్పుడు మొదలైంది? దీనికి ఆసక్తికరమైన సమాధానం ఏమంటే తెలుగులో తొలి అచ్చు ముచ్చట విదేశంలో ప్రారంభమైంది. ఇందుకు కారకుడు బెంజమిన్ షుల్జ్ (జర్మన్). ఆయన తొలి తెలుగు ప్రచురణకర్తగా చరిత్ర సృష్టించిన రచయిత. 1689లో పుట్టారు. డెన్మార్కు రాజు భారతదేశానికి పంపిన ప్రొటెస్టంట్ మతాచార్యుల రెండో జట్టులో ఒకరుగా 1719లో జులై 24న మద్రాసుకు వచ్చాడు. తమిళం, తెలుగులను అధ్యయనం చేశాడు. తమిళంలో బైబిల్ లేదనే కొరతను తీర్చాడు. ఆయన భారతీయుల్లాగానే వస్త్రధారణ చేసేవాడు. చెప్పుల్లేకుండా నడిచేవాడు. తాను పనిచేసే పాఠశాలలో తెలుగు విభాగాన్ని ఏర్పాటు చేశాడు .‘Grammatica Telugica అనే తెలుగు వ్యాకరణాన్ని రాశాడు. అందులో ‘కా’గుణింతం తెలుగులో ఆయన దస్తూరీలోనే ఉంటుంది. షుల్జ్ మన దేశంలో 23 ఏళ్లపాటు మతప్రచారం చేశాడు. పుస్తకాలు రాశాడు. పాఠశాలలు నడిపాడు. 1743లో స్వదేశం వెళ్లిపోయాడు. హాలే పట్టణంలో శేషజీవితం గడుపుతూ తెలుగు అచ్చుకు విశేషంగా కృషి చేశాడు.
జర్మన్ లూథరన్ తత్త్వవేత్త జోహన్ ఆర్నెడ్ (1555- 1621) రాసిన 4 పొత్తాలకు అనువాదాలు చేశాడు. తెలుగులో లిఖిత సాహిత్యం నన్నయ ఆంధ్రమహాభారత అనువాదంతో ఆరంభమైన వేళావిశేషమే మిటోగాని, తెలుగులో తొలి అచ్చుపుస్తకాలు సైతం అనువాద గ్రంథాలుగానే వచ్చాయి.
షుల్జ్ అనువదించిన 4 గ్రంథాలూ తొలి తెలుగు అచ్చు గ్రంథాలుగా చరిత్రలో నిలిచాయి. అవి...
1. సత్యమైన వేదంలో ఉండే జ్ఞాన ఉపదేశాల యొక్క సంక్షేపం. 24 పుటలు. 1746లో హాలేలో ముద్రణ.
2. మోక్షానికి కొంచ్చు పొయ్యెదొవ. 47 పుటలు. 1746లో హాలేలో ముద్రణ.
3. వక గురువు అఇదు బ్రాహ్మల యొక్క నడియను కూర్చుండి విండ్లతొను... ఆకాసమును భూమిని సృష్టించిన పెద్ద స్వామి మీద ప్రసంగించ్చిన తర్కమితె. 48 పుటలు. 1747లో హాలేలో ముద్రణ.
4. బుద్ధి కలిగిన తెలుగు వాండ్లలోపల వొకడొకడికి పుంణ్యపు దొవ చూపించ్చె నూరు జ్ఞాన వచనాల యొక్క చింన్న పుస్తకం ఇతి. 48 పుటలు. 1747లో హాలేలో ముద్రణ.
ఈ పుస్తకాలు క్రైస్తవ మతాంశాలు, నీతి విషయాలు తెలుసుకోవడానికే కాదు, ఆనాటి వాడుక వచనం, అనువాద పదాలు, కొన్ని ఉచ్చారణల వ్యవహార విశేషాలు, ఆనాటి అచ్చు శ్రమ, షుల్జ్ విశేషకృషిని తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి.
వీటి ప్రతులు లండన్ బ్రిటిషు ప్రదర్శనా గ్రంథాలయంలోనూ, కోపెన్ హెగన్లోని రాయల్ గ్రంథాలయంలోనూ ఉన్నాయని, కాగా భారతదేశంలో కలకత్తా సమీపంలోని సిరాంపూర్ మిషను గ్రంథాలయంలో పైవాటిలో రెండు పుస్తకాలున్నట్లు డా।। జె.మంగమ్మ, ఆరుద్ర, డా।। గుజ్జెర్లమూడి కృపాచారి గ్రంథాల ద్వారా తెలుస్తోంది.
నేను సిరాంపురం గ్రంథాలయానికెళ్లి ‘నూరు జ్ఞాన వచనాలు’ గ్రంథం నకళ్లను తెచ్చి 2006 మార్చిలో రాజమండ్రి సెంటర్ ఫర్ సోషల్ ఛేంజి ద్వారా పునర్ముద్రింప జేశాను. తక్కిన గ్రంథాల్ని ఎలాగైనా సంపాదించి పునర్ముద్రించి మన అచ్చుపరిణామ ప్రథమాధ్యాయాన్ని భావితరానికి తెలియజేయాలి.
గ్రంథాలు/ పత్రికల్ని అచ్చువేయడంలో తొలిపుటకు చారిత్రక ప్రాధాన్యం ఉంటుంది. గ్రంథముఖ పత్రం, అంతర్ముఖపత్రం పుస్తక సూక్ష్మ చరిత్రాంశాలకు అద్దంపడతాయి.
పుస్తకం పేరు, రచయిత, అచ్చుకూటం పేరు, సంవత్సరం, ధర, పుస్తకంపై హక్కులు, అనువాద గ్రంథమైతే మూలరచయిత, అనువాద రచయిత, ఏ భాష నుంచి ఏ భాషకు అనేవి ఉంటాయి.
పత్రిక ముఖపత్రాల్లో సంపుటం, సంచిక, సంపాదకుడు, కాలసూచి ప్రధానాలు.
‘అచ్చు’ అంశాలేకాక అచ్చు అనే తెలుగుమాటకు సంబంధించిన పదాలు అనేకార్థాలను కలిగినవీ ఉన్నాయి. అచ్చు అంటే మొదటి ఆకృతి, ప్రతిబింబం, ప్రతిరూపం, విధం, పద్ధతి, ముద్రవేసిన తూనిక రాయి. చిహ్నం, గురుతు, ఆదర్శం వంటి అర్థాలున్నాయి.
పనీపాటా లేకుండా తిరిగే వ్యక్తిని చూసి అచ్చోసిన ఆంబోతులా తిరుగుతున్నాడంటారు. అతనికి అచ్చుదల అయింది అంటే అంగీకారమైందనే అర్థం. ఈ ధనానికి అతను అచ్చు పడ్డాడు అంటే పూచీ పడ్డాడని భావం. దొంగ, దొర; మంచీ చెడు అనడానికి అచ్చుమచ్చు అనడం ఉంది. భూమిని మడులుగా కట్టడాన్ని అచ్చు కట్టడం అంటారు. ధనవంతుణ్ని అచ్చుకుప్ప అంటారు. అచ్చు పరచడం అంటే ప్రాప్తింపజేయడం అని భావం.
ముద్రణాలయం సంస్కృతం. దీనికి తెలుగు అచ్చుకూటమి. ‘అచ్చొత్తించడం’లో యాంత్రికమైన అంతరార్థం లేకపోలేదు. కలకత్తా సమీపాన సిరాంపూర్లో విలియం కేరీ కృషివల్ల తెలుగుతో సహా కొన్ని ద]క్షిణ భారతదేశ భాషలకూ అచ్చు పొరల యంత్రాలూ, కాగితం తయారు చేసే యంత్రాలూ తయారయ్యాయి. ఇందులో పంచానన, మనోహర అనే వ్యక్తుల పాత్రలు మరువలేనివి. 1811 నాటికి తెలుగు అచ్చు పనులు జరుగుతున్నాయి. మద్రాసులో సెంట్జార్జి కోటలో కళాశాల పెట్టడంతో దానికి అనుబంధంగా ఒక ప్రెస్సూ, ఒక డిపో 1812లో పెట్టారు.
1816లో ఎ.డి.కాంబెల్ ఇంగ్లిషు చేసిన తెలుగు వ్యాకరణం, 1819లో రావిపాటి గురుమూర్తి విక్రమార్కుని కథలు ఇక్కడ అచ్చయ్యాయి. ఇంకా 1838లో ఏనుగుల వీరాస్వామయ్య రాసిన కాశీయాత్రా చరిత్ర ఒక చారిత్రక గ్రంథం. దీన్ని పుదూరు నారాయణశాస్త్రి వేశారు.
అచ్చుకూటాలు చెన్నపురి, బళ్లారి, విశాఖపట్నం వంటి ప్రాంతాలకు విస్తరించాయి. గ్రంథ ప్రచురణలే కాదు పత్రిక ప్రచురణలూ పెరిగాయి.
సి.పి.బ్రౌను వల్ల తెలుగు భాషా సాహిత్యాలు మళ్లీ ఊపిరిపోసుకున్నాయి. ప్రామాణిక పుస్తకరంగంలో వావిళ్ల, చదలవాడ, వేదం, పురాణంలాంటి వారు చేసిన సాహిత్యసేవ అంతాఇంతాకాదు.
తొలినాళ్ల అచ్చుపుస్తకాల్లోని ముఖ పత్రాలను చూస్తే ఆనాటి తెలుగు పదాలు తెలుస్తాయి. ప్రింటెడ్ అండ్ పబ్లిష్డ్ అనేదానికి ‘ముద్రింపించి ప్రకటింపబడియె’ అని, పోస్టేజికి ‘తపాలా కూలి’ అని ఉండేది. అచ్చ తెనుగు పుస్తకాల్లో సర్వ హక్కులనే మిశ్రమ భాషా పదబంధానికి ‘ఎల్ల చనవులు నా యవియే’ అని వేసుకున్నవారూ ఉండేవారు. ‘చనవు’ అంటే హక్కు గదా! తెనుగు సీరిస్ అన్నదానికి ‘తెనుఁగు వరుస’ అని ఉండటం కూడా కద్దు. అక్షరాలు కంపోజ్ చేసి అచ్చు వేయడానికి ‘అచ్చు కూర్పింపబడెను’ అని వేసేవారు.
రకరకాల అందచందాల ముద్రణలతో తెలుగు గ్రంథాలు ఇప్పుడు ఎంతగానో వృద్ధి చెందడం రకరకాల పరిణామాల నేపథ్యాల వల్లనేకదా! ఏమైనా తొలినాటి తెలుగు అచ్చుముచ్చట్లు శ్రమైక సాధ్యాలే.