‘ఘన’తంత్రం ఎప్పుడో?

  • 214 Views
  • 0Likes
  • Like
  • Article Share

    తెలుగు వెలుగు బృందం

తెల్లదొరల నుంచి సాధించుకున్న స్వాతంత్య్రానికి పరిపూర్ణత సిద్ధించిన రోజు... కుల, మత, ఆర్థిక భేదాలకతీతంగా భారతీయులందరికీ హక్కులు దఖలుపడ్డ రోజు... దేశ నవీన చరిత్ర ప్రారంభమైన రోజు... జనవరి 26, 1950. అదే గణతంత్ర దినోత్సవం. రాజ్యాంగం ఇచ్చిన దన్నుతో ‘మనిషి మనిషిగా బతికే రోజు... గాంధీ మహాత్ముడు కలగన్న రోజు’ రాబోతోందని భారతీయుల గుండెలు ఆనందపడ్డ క్షణాలవి. కానీ... ఆ ‘రోజు’ ఇంకా రాలేదు. ఇప్పటికీ పేదవాడి హక్కులకు హామీ లేదు. మధ్యతరగతి జీవుల బతుకులకు భద్రత లేదు. మహిళల మానప్రాణాలకు రక్షణ అసలే లేదు. ఈ దుస్థితిపై ఎప్పటికప్పుడు తమ అక్షర శరాలను ఎక్కుపెడుతూ ప్రజలను జాగృతం చేయడానికి ప్రయత్నించారు మన తెలుగు సినీ కవులు. 
      స్వాతంత్య్రం వచ్చి పట్టుమని పద్నాలుగేళ్లు గడిచాయో లేదో దేశంలో అరాచకం ప్రబలింది. సామాన్యుడి బతుకు దుర్భరమైంది. ఆనాటి పరిస్థితిని తెలుసుకోవాలంటే ‘వెలుగునీడలు’ చిత్రంలోని (1961) ‘పాడవోయి భారతీయుడా’ పాటలో శ్రీశ్రీ మాటలను గమనించాలి. ‘ఆకాశం అందుకునే ధరలొకవైపు... అదుపులేని నిరుద్యోగమింకొక వైపు... అవినీతి బంధుప్రీతి చీకటి బజారూ... అలుముకున్న ఈ దేశం ఎటు దిగజారు’ అంటూ ఆందోళన వ్యక్తం చేశారు మహాకవి. ‘కాంచవోయి నేటి దుస్థితి... ఎదురించవోయి ఈ పరిస్థితీ’ అని బాధ్యత గుర్తుచేస్తారు. స్వాతంత్య్రం వచ్చిందని సంబరపడిపోతే సరిపోదని, సాధించిన దానికి సంతృప్తిపడి అదే విజయమనుకుంటే పొరపాటని హెచ్చరిస్తారు.
      పదేళ్లు తిరిగేసరికి ఆయన హెచ్చరిక నిజమైంది. పరిస్థితులు మరీ దిగజారాయి. సమ్మెలు, ఘెరావులు, దొమ్మీలు, బస్సుల దహనాలు, లూటీలతో హింసా ద్వేషాలు హెచ్చాయి. 1971 నాటి ‘పవిత్రబంధం’లోని ఓ గీతంలో ఈ విషయాల గురించే చెబుతూ ‘గాంధి పుట్టిన దేశమా ఇది’ అని నిగ్గదీశారు ఆరుద్ర. ‘సిఫార్సు లేనిదే శ్మశానమందు దొరకదు రవ్వంత చోటు.... పేరుకి ప్రజలది రాజ్యం పెత్తందార్లదే భోజ్యం’ అని సమాజ స్థితిగతులను అక్షరబద్ధం చేశారు. 
      ఏళ్లు గడచిపోతున్నాయి. దొంగలు పెరిగారు. 1976 నాటి ‘నేరం నాది కాదు ఆకలిది’ చిత్రంలో బాలు గానం చేసిన ‘మంచిని సమాధి చేస్తారా’ గీతం ప్రఖ్యాతం. అందులోని రెండు వాక్యాలను గమనిస్తే ఆనాటి తేనెపూసిన కత్తుల పదును తెలుస్తుంది. ‘గుడిలో లింగాలను మెక్కే బడా భక్తులు కొందరు... ముసుగులో మోసాలు చేసే మహా వ్యక్తులు కొందరు’ అంటూ ఆనాటి పెద్దమనుషుల చిల్లర బుద్ధులను ఎండగట్టారు కవి.
      ఎనభైలొచ్చేశాయి. నిరుద్యోగ భూతం విశ్వరూపం చూపిస్తోంది. పట్టాలు చేతపట్టుకుని కనిపించిన కార్యాలయాన్నింటికీ వెళ్తూ, ఛీత్కారాలను ఎదుర్కొంటూ యువత నీరుగారిపోతోంది. నిరాశ, నిస్పృహలతో ఓ తరం తరమంతా నిర్వీర్యమైపోతోంది. అప్పటి ఆ ఆవేదనాభరితమైన వాతావరణాన్ని ఉన్నది ఉన్నట్లుగా తన అక్షరాల్లోకి అనువదించారు ఆచార్య ఆత్రేయ.  ‘ఆకలిరాజ్యం’ (1980) కోసం ఆయన రాసిన ‘సాపాటు ఎటూ లేదు...’ గీతంలో అక్షరమక్షరం నాటి యువత వెతలకు ప్రతిరూపం. ‘చదివెయ్య సీటులేదు చదివొస్తే పని లేదు... అన్నమో రామచంద్ర అంటే పెట్టే దిక్కేలేదు’ అని పాడే కథానాయకుడిలో తమను తాము చూసుకున్న ఆనాటి దురదృష్టవంతులెందరో. 
      ఆ రోజుల్లోనే రాబందుల రెక్కలు విప్పారాయి. యథేచ్ఛగా జనం మీద పడి బతికుండగానే పొడుచుకుతింటున్నాయి. ఆ దారుణాలను ప్రభావవంతంగా అక్షరీకరించిన పాట... ‘నాంపల్లి టేషనుకాడి రాజాలింగో’. రాబందుల గోళ్లకు చిక్కి నరకయాతన పడుతున్న బీదల కళ్ల నుంచి జాలువారుతున్న కన్నీరే ప్రభు కలంలోకి ప్రవహించి ఈ గీతమైంది. ‘ఎర్రమల్లెలు’(1981)లోని ఈ పాట అప్పట్లో ఓ సంచలనం. ‘తిందామంటే తిండి లేదు... ఉందామంటే ఇల్లే లేదు... చేద్దామంటే కొలువు లేదు... పోదామంటే నెలవు లేదు’ అంటూ సాగే అక్షరాలు నాటి సమాజానికి ప్రతిబింబాలు. ‘గుక్కెడు గంజి కరువైపాయే... బక్కటి ప్రాణం బరువైపోయే...’ననే కవి మాటలు నగ్నసత్యాలు.
      ఆడపడుచులను కాల్చుకుతినే కీచక సంతతి కూడా అప్పట్లో రొమ్ము విరుచుకుంటోంది. క్షణక్షణం భయం భయంగా గడుపుతున్న అమ్మాయిల ఆక్రందనలను చూసి వేటూరి కలం చలించింది. కామాంధుల కుత్తుకలను కత్తిరించే తెగువ మగువ సొంతమవ్వాలని ఆశించిన ‘ప్రతిఘటన’ (1986) చలనచిత్రం సాక్షిగా నాటి దౌర్భాగ్య పరిస్థితులను కడిగిపారేసింది. ‘ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో... రక్తాశ్రువులు చిందిస్తూ రాస్తున్నా శోకంతో... మరో మహాభారతం... ఆరవ వేదం... మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం’ అంటూ తన అక్షరాలతో గాయపడ్డ అక్కాచెల్లెళ్ల గొంతును వినిపించారు వేటూరి. ‘ఏమైపోతోంది సభ్యసమాజం... ఏమైపోతోంది మానవధర్మం... ఏమైపోతోంది ఈ భారత దేశం... మన భారతదేశం’ అని ప్రశ్నించారు. 
      బదులు పలికిన నాథుడు లేడు. కాలచక్రం ఆగదు కదా. తొంభైలు పరిగెత్తుకొచ్చాయి. అంతా స్తబ్దత. జనం జనంలానే బతికేస్తున్నారు. వారిని కదిలించి, వారి పెనునిద్దురలను వదిలించే బాధ్యత తీసుకున్నారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. ‘నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని... అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని’ అంటూ ‘గాయం’ (1993) చిత్రంలో అక్షర ఫిరంగులను పేల్చారు. ‘గాలివాటు గమనానికి కాలిబాట దేనికి... గొర్రెచాటు మందకు నీ జ్ఞానబోధ దేనికి’ అని కొంచెం ఘాటుగానే ఎత్తిపొడిచారు. ‘పాత రాతి గుహలు పాలరాతి గృహాలైనా’ బలవంతులే బతకాలనే సూక్తి మాత్రం మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 
      స్వతంత్ర భారతావని స్వర్ణోత్సవాలు చేసుకుంటున్న వేళ... ఇప్పటి వరకూ ఏం సాధించామని చంకలెగరేసుకుంటున్నామని నిష్ఠుర సత్యం పలికింది సిరివెన్నెల కలం. ‘సింధూరం’ (1997) చిత్రంలో ‘అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వాతంత్య్రమందామా! స్వర్ణోత్సవాలు చేద్దామా!... ఆత్మవినాశపు అరాచకాన్ని స్వరాజ్యమందామా! దానికి సలాము చేద్దామా’ అంటూ ఉన్నది ఉన్నట్లుగా నిజం మాట్లాడారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. ‘కులాల కోసం గుంపులు కడుతూ, మతాల కోసం మంటలు పెడుతూ... ఎక్కడ లేని తెగువను చూపి తగువుకు లేస్తారే, జనాలు తలలర్పిస్తారే... సమూహ క్షేమం పట్టని స్వార్థపు ఇరుకుతనములో ముడుచుకుపోతూ... మొత్తం దేశం తగలడుతోందని నిజం తెలుసుకోరే’మిటని ప్రశ్నిస్తారు. ‘తెలుసుకుని భుజం కలిపి రారే’మి టంటారు. పాపం... ఆయనకు ఇప్పటికీ ఎలాంటి సమాధానమూ దొరకలేదు.
      కొత్త శతాబ్దం వచ్చింది. రాజకీయ ఊసరవెల్లులు మోరలాడించడం మొదలెట్టాయి. ఎవరో వచ్చి ఏదో చేసి బతుకులను బాగు చేస్తారని ఆశించడమే తప్ప గట్టుతెగిన గోదారిలా ఉరికి అక్రమార్కుల అంతుతేల్చుదామన్న స్పృహ తగ్గిపోతోంది. గాంధీ మళ్లీ పుడితే తప్ప దేశం బాగుపడదన్న నిరాశ ఆవరించింది మన కవులకు. దీనికి నిదర్శనం 2007 నాటి ‘శంకర్‌దాదా జిందాబాద్‌’లోని ఈ పాట.
వందేమాతరం, గాంధీ ఓంకారం
వందేమాతరం, గాంధీ ఓంకారం
ఓ బాపూ నువ్వే రావాలి, 
నీ సాయం మళ్లీ కావాలి ।।వందే।।
జరిగే దుర్మార్గం ఆపాలి, 
నువ్వే ఓ మార్గం చూపాలి

      మనకు అహింసా పద్ధతుల్లో పోరాడే స్ఫూర్తిని అలవరిచిన బాపూజీ మళ్లీ పుడితే తప్ప దేశం బాగుపడదా? అలా అనుకుంటూ చేతులు ముడుచుకుంటూ కూర్చోలేం కదా. ఎవరో ఒకరు ఎపుడో అపుడు ముందుకు నడిస్తేనే కదా జాతి జాగృతమయ్యేది. మొదటి చినుకు సూటిగా దూకిరానిదే నేల దారికి వాన ధార రాదు కదా. (‘అంకురం’ చిత్రంలో ఇదే ఉద్బోధ చేశారు సిరివెన్నెల) అప్పట్లో గాంధీ మహాత్ముడు ముందడుగేశాడు. ఆయనే ఆదర్శంగా ఇప్పుడు మనలో ప్రతి ఒక్కరూ ఆ పని చేయాలి. నీతివంతమైన సమాజ నిర్మాణానికి మనవంతు ఇటుకలను అందించాలి. 
      చివరిగా మన లక్ష్యాన్ని గుర్తుచేసే అక్షరాలు... ‘గాంధీ పుట్టిన దేశం’ చిత్రం నుంచి...
భేదాలన్నీ మరచి - మోసం ద్వేషం విడచి
మనిషి మనిషిగా బతకాలి - ఏనాడూ నీతికి నిలవాలి
బాపూ... ఈ కమ్మని వరమే మాకివ్వు
అవినీతిని గెలిచే బలమివ్వు
ప్రజలకు శాంతీ సౌఖ్యం కలిగించే దేశమె దేశం
బానిస భావం విడనాడి - ఏ జాతి నిలుచునో అదే జాతి
బాపూ... నీ చల్లని దీవెన మాకివ్వు
నీ బాటను నడిచే బలమివ్వు.


వెనక్కి ...

మీ అభిప్రాయం