పథం మారాలి!

  • 34 Views
  • 0Likes
  • Like
  • Article Share

రాబోయే తరాలకు చదువులు ఏ భాష ద్వారా నేర్పాలి?
మన లాంటి దేశంలో తప్ప మరే సర్వ స్వతంత్ర, ప్రజాస్వామిక దేశంలోనూ ఈ అంశాన్ని తలలు బద్దలు కొట్టుకునే సమస్యలాగా ఇంతగా చర్చనీయాంశం చేసుకోరేమో!
      తెలిసిన విషయ పరిజ్ఞానం ద్వారా తెలియని విషయాలను తెలుసుకోవటమనే పద్ధతి అన్ని కాలాల్లోనూ, అన్ని దేశాల్లోనూ అమలవుతూ ఉన్న సంగతేనని అందరికీ తెలిసిందే! అయినప్పటికీ, శతాబ్దాలు దొర్లిపోతున్నా  మనం ఈ అంశాన్ని ఇంకా చర్చించుకుంటూనే ఉన్నాం.
      ఆంధ్ర విశ్వవిద్యాలయపు తొలి సంచాలకులు కట్టమంచి రామలింగారెడ్డిని ఆంగ్ల భాషా పరిజ్ఞానంలో ఆ కాలంలో చాలా దిట్టగా భావించేవారు. ఆయన ‘పరభాషా మూలకమయినది విద్యయా?’ అన్న వ్యాసంలో ఇలా ఆవేదన చెందారు.. ‘‘మాతృభాషయందు విద్య గరుపుటయే మిక్కిలి సహజమయిన మార్గము. మన ప్రస్తుత విద్యా విధానమునందు అనేక లోపములు గలవు. అందులో మొదటిది, మన బాలురు (ఆ కాలంలో బాలికల విద్య చాలాతక్కువ) విషయ పరిజ్ఞానము లేకయే తమ పాఠములను గుడ్డితనముగా వల్లించి మెదడులోనికి యెక్కించుకొనుట!  ఈ పాఠములు పర భాషలోనుండుట వలన బాలురు వాటిని జ్ఞాపకముంచుకొనుటకే యత్నించుచున్నారు. దీని వలన వారి గ్రహణ శక్తి నశించి పోవుచున్నది. జ్ఞానమును అభివృద్ధి చెందించని విద్య నిజమైన విద్య కానేరదు. అటువంటి విద్యా విధానము ఖండనార్హము. సుమారు 80 సంవత్సరములనుండీ మనము ఆంగ్ల భాష నభ్యసించుచుంటిమి. దాని వలన మనకేమయిననూ ప్రయోజనము కలిగినదా? మనలో నెవరయిననూ పండితులనదగినవారు గలరా? మనలో పెక్కుమంది మాటలను నేర్చుకొనుచున్నారు గానీ విషయ జ్ఞానమును సంపాదించుట లేదు. కాబట్టి మన ప్రస్తుత విద్యావిధానము మన పురోభివృద్ధికి భంగకరముగా నున్నది’’.  
      కొత్త జాతీయ విద్యా విధానం పత్రాన్ని కేంద్ర కేబినెట్‌ ఆమోదించిన సందర్భంగా దాన్ని విడుదల చేసిన (ఇస్రో మాజీ ఛైర్మన్‌) కస్తూరి రంగన్‌ కూడా ఇదే విషయాన్ని చెబుతూ ‘‘కనీసం ఎనిమిదవ తరగతి వరకైనా మాతృభాషా మాధ్యమంలోనే కొత్త తరాల చదువులు ఉండాలి’’ అన్నారు. నిరుద్యోగ సమస్యకు విద్యా విధానమే కారణమని ఆయన చెప్పటం అసంబద్ధమైనదైనా, ప్రాథమిక విద్యలో బోధనా మాధ్యమం గురించి ఆయన అభిప్రాయం సరైందే! అయితే, ఈ ఒక్క అంశం కొన్ని పరిమితులకు లోబడి సరిగా ఉన్నప్పటికీ జాతీయ విద్యా విధానంలో మాతృభాషా మాధ్యమ నిర్ణయం ‘నూరు దోషాల్లో ఒక సుగుణం’లా భావించవచ్చు!
ఎప్పటి మాట ఇది!
గడచిన ఏడు దశాబ్దాలకు పైబడిన కాలంలో ఎన్నో విద్యా కమిషన్లు తమ నివేదికలను సమర్పించాయి. వాటిని సక్రమంగా అమలు జరపకుండానే, విద్యా వ్యవస్థలోని లోటుపాట్లను సరిదిద్దకుండానే మరికొంత కాలానికి మరొక విద్యా కమిషన్‌ను నియమించటం, ఇక నుంచి విద్యా వ్యవస్థ ప్రక్షాళన జరగనున్నదని చెప్పటం అనేక పర్యాయాలుగా జరుగుతూ వస్తోంది. అలా అమలుకు నోచుకోని వాటిలో 1966 నాటి కొఠారి కమిషన్‌ నివేదిక ముఖ్యమైంది. అది ముచ్చటగా మూడు అంశాలను ప్రతిపాదించింది. అవి.. అందరికీ ఒకే విద్య, ప్రభుత్వ నిర్వహణలోనే విద్య, ఉన్నత పాఠశాల వరకూ మాతృభాషా మాధ్యమంలో విద్య. ఈ సూచనలను నాటి నుంచి అమలు పరచి వుంటే ఇవాళ మనకీ చర్చ ఉండేది కాదు.
      అలాగే భాషా సమస్యలో అత్యంత కీలకమైనవి రెండే అంశాలు.. పరాయి భాషను నేర్పటం ఎలా?, భాషకూ జాతీయ సంస్కృతికీ ఉన్న విడదీయలేని బంధం. ఈ రెండో అంశాన్ని మరొక సారి చర్చించుకుందాం కానీ ఇక్కడ ‘జాతీయ’ అనే పదాన్ని ‘భారతీయ’ అన్న భావనలో అర్థం చేసుకోకూడదు. ‘తెలుగు జాతీయ’ అని మాత్రమేనని గ్రహించాలి!
      తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ‘మాతృభాషను కళ్లతోనూ, పరాయి భాషను కళ్లద్దాలతోనూ’ పోల్చినట్లు చెప్పుకునేవారు. ఇది చాలా వరకు సరైందే కానీ పూర్తిగా కాదు. మాతృభాషను రాగి బిందెతోనూ, పరాయి భాషను మట్టి కుండతోనూ పోల్చటం ఎక్కువ సరైంది. ఇంకొక మంచి పోలిక చెప్పుకోవాలంటే ప్రకృతి సహజంగా లభించే జలాశయాల నీళ్లతోనూ, ఎత్తయిన వాటరు ట్యాంకులోకి ఎక్కించి నిలువ ఉంచుకునే నీళ్లతోనూ పోల్చుకోవచ్చు.
అమ్మభాషే సహజ వారధి
ఏ మనిషికైనా పుట్టుకతో భాష రాదు. తమ పుట్టుకకు ముందే సమాజంలో తరతరాల తమ పూర్వీకుల ద్వారా రూపొంది, తమ చుట్టూ ఆవరించుకుని ఉండే భాషను, తల్లిదండ్రులూ, కుటుంబమూ-  సమాజాల ద్వారా ఉగ్గుపాలు జీర్ణించుకున్నట్లు పిల్లలు నేర్చుకుంటారు. నిరక్షరాస్యులంటే, అక్షరాలు రాయటం రాని వారే కానీ, వాటిని పలకటం రాని, మాటలు రాని వారు కాదు. ఒకనాటి మన జానపద సాహితీ సృజనకారులందరూ గొప్ప సామాజిక, సాహిత్య, భాషా పరిజ్ఞానవంతులే! రెండు మూడు సంవత్సరాల కిందట ఒడిశాలోని కోసల భాషకు చెందిన రాయటం రాని జానపద వాగ్గేయకారునికి ‘పద్మశ్రీ’ పురస్కారం లభించింది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. బడికి వెళ్లడానికి మునుపే, నాలుగైదేళ్ల వయసుకే, పిల్లలకు తమదైన మాతృభాషలో అక్షరాలు, పదాలు, వాక్యాలు నోటికి వచ్చేసి ఉంటాయి. వాటిలోని ఉచ్చారణ లోపాలను, వ్యాకరణ దోషాలను సాటి సామాజికుల సహజ సహకారంతో సరిదిద్దుకుంటూ ఉంటారు.  కనుకనే ఎవరూ ‘‘మా నాన్న రేపు  వచ్చింది’’ అని అనరు. తెలియక పొరపాటుగా పలికే మాటలను, వాక్యాలను సరిదిద్దే వాతావరణం ఉంటుంది. దాన్ని ‘భాషావరణం’ (Linguistic Flux) అనవచ్చు. అది అత్యంత సహజంగా మాతృభాషావరణమై ఉంటుంది. ఒక భాషాజాతి జనులందరి ఉమ్మడి భాషా సాంస్కృతిక సంపదకు, ఆ సమూహంలోని సరికొత్త మానవులందరూ వారసులే!! దీన్నే మన వారసత్వపు సహజ మాతృభాషా  జలరాశి అనుకోవచ్చు. 
      దీనికి భిన్నమైంది పరాయి భాష. అది కూడా ఆకాశం నుండి ఊడిపడింది కాదు. వేరొక జాతి జనులు వేరే ప్రాంతంలో సృజించుకున్న జలరాశే! కనుక దాన్ని ఎత్తిపోతల ద్వారా ఎత్తున ఉండే నీళ్ల తొట్టెలో నిల్వ చేసుకున్నట్లుగా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. దానర్థం ఏంటి? ఒక ఇంజను లేక మోటారు ద్వారా, ఒక అదనపు శక్తిని తప్పని సరిగా ఉపయోగిస్తూ, నిత్యం వాడుకోవాల్సి వస్తుంది. ఆ నీళ్లు సర్వ సాధారణంగా బడిలో మాత్రమే లభిస్తాయి. ఇంటి వద్ద, వీధిలో, ఇతర సామాజిక కార్య కలాపాలల్లో తన పరాయి భాషా దోషాలను సరిదిద్దే వారు, పరిజ్ఞానాన్ని మెరుగుపరచే వారు ఉండరు. అది దాహం తీరని, తెలియని దప్పికలాగా ఉంటుంది. అందుకే నిత్యం ఆంగ్ల వ్యాకరణ సమస్య వెన్నాడుతూ ఉంటుంది. పదాల కోసమే కాదు- కర్త, కర్మ, క్రియ, కాలాల, క్రియా వాచకాల వాడకానికి కూడా నిత్యం తడుములాడుకుంటూ ఉండాల్సి వస్తుంది. భావ వ్యక్తీకరణకు పరిమితి వస్తుంది. అంతే కాక అతి ముఖ్యమైన జ్ఞాన సముపార్జనకు అది అవరోధంగా మారుతుంది. దాని ఫలితంగా భట్టీయం చదువుకు అలవాటు పడటంతో పిల్లల మనోవికాసం కుంటుపడుతుంది. 17-18 సంవత్సరాలు ఆంగ్ల మాధ్యమంలో చదువుకుని కూడా ఇంకా స్పోకెన్‌ ఇంగ్లీషు పాఠాలకు వెతుకులాడటానికి కారణమిదే! 
      నూటికి నూరు మందికీ ఇలాగే ఉంటుందని కాదుగానీ కనీసం తొంభై మంది పరిస్థితి అలాగే ఉంటుంది. అదే పిల్లలకు సహజంగా వచ్చే మాతృభాష ద్వారా పరాయి భాషను నేర్పే ప్రక్రియ చేపడితే సులువుగా హాయిగా రెండో భాషను కూడా నేర్చుకోగలుగుతారు. 
ఇంకో ఉదాహరణ.. 
మనం గ్యాస్‌ పొయ్యి మీద నీళ్లు కాచుకోవాలంటే పూర్వ కాలంలోలా, కట్టెల పొయ్యిల మీద మట్టి కుండలకు బదులు ఇప్పుడు స్టీలు పాత్రలనో రాగి బిందెలనో వాడుతున్నాం. ఎందుకు? మట్టి కుండతో అయితే గ్యాసు ఎక్కువ ఖర్చవుతుంది కనుక! రాగి పాత్ర ద్వారా, వేగంగా సులువుగా ఖర్చు తక్కువతో ఉష్ణం ప్రసరించి నీటిని బాగా వేడి చేసినట్లే, మాతృభాష ద్వారా జ్ఞానాన్ని సులువుగా బాగా వేగంగా సముపార్జించుకోగలుగుతాం. 
      మరోలా చెప్పాలంటే- మాతృభాష బ్యాంకులో మూలధనం(ఫిక్సెడ్‌ డిపాజిట్‌) లాంటిదైతే, పరాయి భాష దానిపై లభించే వడ్డీ లాంటిది. ఈ వడ్డీ ఎలాంటిదంటే అది సేవింగ్స్‌ ఖాతాలో ఉంటూ కూడా మూలధనంలోకి వచ్చి చేరే స్వభావం కలది. దానర్థమేమంటే పరాయిభాషద్వారా మనం ఎంత జ్ఞానం పొందినా అది మాతృభాషలో కూడా నిల్వవుంటుంది. చాలా సార్లు మనం పరాయి భాషలో వ్యక్తం చేసేదంతా మాతృభాష నుంచి తర్జుమా అయ్యి వెలుపలికొచ్చేదే! 
      మన ఆలోచనలను, అభిప్రాయాలను పరాయి భాషలో బాగా వ్యక్తం చేయటానికి కావాల్సింది ఈ తర్జుమా ప్రక్రియలో నైపుణ్యం. కాబట్టి మన మాతృభాషలో ఎంత ఎక్కువ జ్ఞాన సంపదను (మూల ధనాన్ని) నిలువ చేసుకోగలిగితే అంత బాగా పరాయి భాష మీద పట్టు  సాధించడం సులువవుతుంది. అదిలేకే ఇప్పుడు అటు తెలుగూ రాని ఇటు ఆంగ్లమూ రాని కొత్త తరాలను మనం చూస్తున్నాం. 
ఆలోచనలు మారాలి
భవిష్యత్తరాలకు ఆంగ్లం బాగా రావాలనే దానిలో ఎవరికీ భిన్నాభిప్రాయం ఉండనక్కర్లేదు. కానీ అది, అంటే పరాయి భాష, పరాయి భాష ద్వారా బాగా రాదు. మాతృభాష ద్వారానే సులువుగా బాగా వస్తుంది.
      మన పిల్లలకు ఆంగ్లం నేర్పే విధానంలోనే తీవ్ర మార్పులు చేసుకోవాలి. చిన్నతనం నుంచీ మాతృభాష ద్వారా పరాయి భాషను నేర్పే సులువు పద్ధతులను రూపొందించుకోవాలి. అందుకు ఉపాధ్యాయుల్లోని బోధనా నైపుణ్యాలను ఒక చోటుకి చేర్చాలి. కనీసం ఇంటర్మీడియట్‌ (+2) దాకా, ఆంగ్లంతో సహా మాతృభాషలో నేర్పటాన్ని అమలులోకి తెస్తూ, 10+11+12 తరగతుల్లో తెలుగు వ్యాకరణం ద్వారా ఆంగ్ల వ్యాకరణం నేర్పటాన్ని కొత్త పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలి. గడచిన 40 ఏళ్లుగా ఆంగ్ల మాధ్యమంలో చదువుకున్న మన తెలుగు పిల్లలే కోటిన్నర మంది దాకా ఉన్నారు. వారికి నిజంగా ఎంత ఆంగ్లం వచ్చిందో ఇసుమంత పరిశోధన, అధ్యయనమూ లేకుండానే పసి వయసుల నుంచీ ఆంగ్ల బోధనకు ఆలోచన చేయటమంటే భవిష్యత్తు తరాల జీవితాలతో జూదమాడటమే. 
      జాతీయ విద్యా విధానంలోని మాతృభాషలో ప్రాథమిక విద్యను ప్రైవేటు బడుల్లోనూ తప్పనిసరి చేయాలి. విద్యను ప్రభుత్వమే నిర్వహించాలనే కొఠారి నివేదికను ఇప్పటికైనా అమలు చేయాలనే ఒత్తిడి పెరగాలి. విద్యావ్యాపారాన్ని అరికట్టాలనే ఆలోచన చేయని పాలకులు, ప్రజలకు అన్యాయం చేస్తున్నారని భావించక తప్పదు.


వెనక్కి ...

మీ అభిప్రాయం