ఆత్మగౌరవ పతాకలు

  • 73 Views
  • 0Likes
  • Like
  • Article Share

    మందరపు హైమవతి

  • విజయవాడ.
  • 9441062732
మందరపు హైమవతి

‘‘తెలుగులో నవ్యరీతులకు, నూతన ప్రమాణాలకు ప్రయత్నించిన మొదటి కవిని నేనే. నా కావ్యకళ నవీనం. కావ్య ఇతివృత్తాలు భారతీయం’’ అని గురజాడ తన గురించి చెప్పుకున్నారు. అంతకు ముందు వరకూ కావ్యాల్లో రాజులే నాయకులు. గురజాడ ఆ సంప్రదాయాన్ని చెరిపేసి సమకాలీన సమాజంలోని సామాన్య ప్రజలనే తన కావ్యనాయకులుగా ప్రతిష్ఠించారు. ‘కన్యక’లో కన్యక, ‘పుత్తడిబొమ్మ పూర్ణమ్మ’లో పూర్ణమ్మలు మామూలు స్త్రీలే. గురజాడ జయంతి (సెప్టెంబరు 21) సందర్భంగా ఈ రెండు పాత్రల విశిష్టతలేంటో చూద్దాం!
‘‘బ్రతికి
చచ్చియు ప్రజలకెవ్వడు ప్రీతి గూర్చునొ వాడెధన్యుడు’’ అన్నట్లుగా గురజాడ గతించి దశాబ్దాలెన్నో గడచినా ఆ మహాకవిని తలచుకుంటూనే ఉన్నాం. రచనలను ఇప్పటికీ ఇష్టంగా చదువుకొంటూనే ఉన్నాం. ఆధునికతకు, అభ్యుదయానికీ అసలైన నిర్వచనం గురజాడ. ఆయనకు ముందు కవుల దృష్టిలో స్త్రీలంటే శరీరాలే. ప్రబంధ కవులందరూ పోటీపడి తరుణుల అంగాంగ వర్ణనలు చేశారు. గురజాడ తర్వాత వచ్చిన భావకవులు వనితలను కలల ప్రేయసులుగా, ఊహా ఊర్వశులుగా భావించారు. దేవతలుగా పూజించారు. 
      గురజాడ తాను జీవించిన కాలంకంటే చాలా ముందున్న కవి. పితృస్వామ్యం ఉక్కుపిడికిలిలో ఊపిరాడక గిలగిలలాడుతున్న స్త్రీలను చూసి కలత చెంది కలంపట్టారు. ఒకప్పుడు పతియే ప్రత్యక్ష దైవమని పాతివ్రత్య భావాలు నూరిపోసి మహిళలను మనుషుల్లా కాకుండా ప్రాణం లేని బొమ్మలుగా చూశారు. అలాంటి సమయంలో ‘ఆధునిక మహిళలు మానవ చరిత్రను తిరిగ రాస్తారు’ అని స్త్రీలలో ఆత్మ గౌరవాన్ని కలిగించిన అభ్యుదయ కవి గురజాడ. 
పాపం పూర్ణమ్మ!
గురజాడ కాలంలో స్త్రీలను పట్టి పీడించిన దురాచారం కన్యాశుల్కం. ఈ సమస్య మీద ఆయన రాసిన ‘కన్యాశుల్కం’ నాటకం తెలుగు పాఠకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది. ఈ కన్యాశుల్కం ఇతివృత్తంతో గురజాడ రచించిన కథాకావ్యం ‘పుత్తడిబొమ్మ పూర్ణమ్మ’. 
      కథాకథన నిర్మాణం తెలిసిన కవి గురజాడ. ఆడపిల్లలకు చెందిన ఈ కథను ఆడవారికే చెబుతారు. ‘‘మేలిమి బంగరు మెలతల్లారా! కలువల కన్నుల కన్నెల్లారా! విన్నారమ్మా! యీ కథను’’ అని మొదలుపెడతారు. ‘‘పూజారింటను పుట్టెను చిన్నది! పుత్తడిబొమ్మ పూర్ణమ్మా’’ అంటూ ఆమె కొండ మీది దుర్గాదేవి భక్తురాలని పరిచయం చేస్తారు. ‘‘ఏయే ఋతువుల పండే పళ్లను ఆయా ఋతువుల అందించి బంగరు దుర్గను భక్తితో కొలిచెను’’ అని పూర్ణమ్మ జీవన విధానాన్ని వర్ణిస్తారు. కొన్నాళ్లకు పూర్ణమ్మకు తండ్రి పెళ్లి చేస్తాడు. ‘‘కాసుకులోనై తల్లీ తండ్రి/ నెనరూ న్యాయం విడనాడి/ పుత్తడి బొమ్మను పూర్ణమ్మను నొక/ ముదుసలి మొగుడుకు ముడి వేస్రీ’’ అని పూర్ణమ్మ తండ్రి ధనదాహాన్ని చెబుతారు. 
      ఆనాటి ఆచారం ప్రకారం కన్యాశుల్కం తీసుకుని ఒక ముసలి వాడికిచ్చి పూర్ణమ్మ జీవితాన్ని నాశనం చేస్తాడు తండ్రి. తోటి పిల్లలతో ఆటలాడుకునే పసిప్రాయం పూర్ణమ్మది. పూల మీద రాలే తూనీగలను పట్టుకోవాలనే కుతూహలంతో వాటి వెనక పరిగెత్తే ఏమీ తెలియని బాల్యం తనది. ఎప్పుడైతే పెళ్లై భర్త ముఖం చూసిందో ఆనాడే ఆమె ఆనందం ఆవిరైంది. కళ్ల కొలనులో కన్నీటి కలువలు పూచాయి. ఆటలాడుకునేటప్పుడు తోటి పిల్లలు ‘మొగుడు తాత’ అంటూ ఎగతాళి చేస్తుంటే దుర్గ దగ్గరకు వెళ్లి దుఃఖించేది. 
కొన్నాళ్లకు అత్తగారింటికి తీసుకెళ్దామని భర్త వస్తాడు. పెద్దవాళ్లందరకూ నమస్కారం చేస్తుంది పూర్ణమ్మ. వాళ్లు దీవిస్తారు. దీవెన విని ఫక్కున నవ్విందని అంటారు కవి. దీవెన వింటూ నవ్వడమేంటని సందేహం కలుగుతుంది. పెద్దలు ‘శతమానం భవతి’ అని దీవిస్తారు కదా! తానెలాగూ ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోవాలని నిర్ణయించుకొంది. కాబట్టి నవ్వుతుంది. 
చిన్న కవితా ఖండికే కానీ,
పూర్ణమ్మ ‘‘నలుగురు కూచుని నవ్వే వేళల/ నా పేరొక పరి తలవండి/ మీ మీ కన్నబిడ్డల నొకతెకు ప్రేమను నా పేరివ్వండి’’ అంటుంది. ఎవరైనా చనిపోతేనే కదా వాళ్ల పేర్లు పెట్టుకునేది! అంటే తాను మరణించబోతోందనే సూచనను ఇలా చెప్పీ చెప్పనట్లు చెబుతుంది. ఆమె అత్తగారింటికి వెళ్తుంటే వదినెలు, తముళ్లు, తల్లి ఏడుస్తారు. కానీ తండ్రి మాత్రం డబ్బులిచ్చే అల్లుణ్ని తలచుకుని ఆనందిస్తాడు. పూర్ణమ్మ తన తమ్ముళ్లకు బుద్ధులు చెబుతుంది. తల్లిదండ్రుల్ని బాగా చూసుకొమ్మంటుంది. రోజూ గుడికి వెళ్తున్నట్లే ఆ రోజూ ఆమె దుర్గ గుడికి వెళ్తుంది. ఆవులు పెయ్యలు ఇంటికి వస్తాయి. పిట్టలు గూళ్లకు చేరుకొంటాయి. ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తాయి. కానీ పూర్ణమ్మ ఇంటికి రాదు. ‘‘కన్నుల కాంతులు కలువల చేరెను/ మేలిమి జేరెను మేని పసల్‌/ హంసల జేరెను నడకల బెడుగులు/ దుర్గను జేరెను పూర్ణమ్మ’’ అనే చివరి పాదాలు చదివేసరికి కఠినాత్ముల గుండెలైనా కన్నీటితో చెమర్చక మానవు. ఆమె ఇక లేదనే విషయాన్ని ఎంతో కవితాత్మకంగా, వ్యంగ్యంగా చెబుతారు గురజాడ. పూర్ణమ్మ చిన్న కవితా ఖండికే అయినప్పటికీ వస్తువును బట్టి, ఆ వస్తువును నిర్వహించిన తీరును బట్టి ఓ కావ్యం చదివిన అనుభూతి కలుగుతుంది. ప్రకృతిలో ప్రకృతై, అమాయకంగా ఆటలాడుకునే అమ్మాయి పెళ్లి ఊబిలో పడి ఉసురు కోల్పోవడంలోని విషాదం పాఠకులను చిరకాలం వెంటాడుతుంది. బాల్య వివాహాలు, కన్యాశుల్కం ఇప్పుడు అంతరించినా, పెళ్లిలో ఉన్న యజమాని- బానిస సంబంధాలు ఇప్పటికీ ‘పూర్ణమ్మ’ను చదివింపజేేస్తాయి. విద్యాలయాల వార్షికోత్సవాల్లో ఈనాటికీ ఇది ప్రదర్శితమవుతూ ప్రేక్షకాదరణ పొందుతూనే ఉంది. 
రాజు అయితే ఏంటి?
గురజాడ సృష్టించిన మరో కావ్యం కన్యక. ఈమె సెట్టి కూతురు. ఒకరోజు ఆమె దుర్గాదేవి పూజకోసం ఆలయానికి బయల్దేరుతుంది. అటువైపు వచ్చిన రాజు ఆమె అందాన్ని చూసి మోహించి ఆమెను బలవంతంగా పొందడానికి ప్రయత్నిస్తాడు. అగ్నిసాక్షిగా పెళ్లిచేసుకుంటే మంచిదని ఆమె తండ్రి రాజును కోరతాడు. కానీ రాజునన్న అహంకారంతో ఆమెను చెరపట్టడానికి గుడి దగ్గరికి వస్తాడు. కన్యక అతణ్ని ఎదిరించి అగ్నిగుండంలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. ఇది నిజంగా జరిగిన కథ అని, వాసవీ కన్యకా పరమేశ్వరి కథ అని అంటారు. 
నట్టనడి వీధిలో తనను పట్టుకోవడానికి రాజు వచ్చినప్పుడు ‘‘ఆడుబిడ్డల కాచుకొనుటకు ఆశ లేదొక్కొ..’’ అని తన చుట్టూ చేరిన ప్రజలను ప్రశ్నిస్తుంది. పందొమ్మిదో శతాబ్దంలో ప్రశ్నించిన ఈ ప్రశ్నకు ఇరవై ఒకటో శతాబ్దంలోనూ జవాబులేదు. ఈనాడూ నిర్భయలకు, ఆసిఫాలకు అంతే లేదు. 
వీధిలో తనను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న రాజు చర్యను ఖండిస్తూ తన చుట్టూ ఉన్న వారిని ‘రాజు పట్నాన్ని ఏలితే రాజును ఏలే దైవముండడా! మీకెందుకు పౌరుషం లేదు. ఒక ఆడపిల్లను నిర్బంధిస్తుంటే చూస్తూ ఊరుకొంటారేంటి? కేవలం డబ్బుంటే చాలని అనుకొంటున్నారు. మీకు చదువు లేదు. అందుకే మీలో బుద్ధి నశించింది. మీరు వివేకాన్ని కోల్పోతున్నారు. పోగొట్టుకుంటోంది నన్ను మాత్రమే కాదని గ్రహించండి. ఇప్పటికైనా బుద్ధిబలాన్ని, బాహుబలాన్ని పెంచుకొని ధైర్యంగా బతకండి’ అని వారిలో పౌరుషాగ్నిని రగిలిస్తుంది. 
      రాజును చూసి ‘పట్ట పగలే నడివీధిలో నన్ను బంధించాలని చూస్తున్నావు. జారులు, చోరులు ఇలాగే ప్రవర్తిస్తారు. వాళ్లలాగా నువ్వూ నన్ను చెరపట్టాలని చూస్తున్నావు. ఈ పట్నాన్నేలే రాజువని గర్విస్తున్నావు కదా! నీకు చేతనైతే ఇప్పుడు నన్ను పట్టుకో’ అని సవాలు విసిరి అగ్నిగుండంలో దూకి రాజుకు అందకుండా పోతుంది. 
కూలిన రాజ్యం!
గురజాడ ప్రతిభావంతుడైన కవి. కవితా నిర్మాణ రహస్యం తెలిసినవారు. ‘‘ఆకులందున అణగిమణగి కవిత కోయిల పలుక వలెనోయ్‌’’ అంటారు కదా. ఎక్కడ ఎంత వరకు చెప్పాలో అంతవరకే చెప్పాలి. ప్రతిదాన్నీ విప్పి చెప్పకూడదు. క్లుప్తత, గుప్తత మంచి కవితకు లక్షణాలు. రాజు వీధిలోకి వచ్చినపుడు అతని అహంకారాన్ని వెల్లడిస్తూ ‘‘పట్టవలెరా దీని బలిమిని/ కొట్టవలెరా మరుని రాజ్యం/ కట్టవలెరా గండ పెండెరం/ రసిక మండలిలో’’ అని ద్విరుక్తటకార పదాలతో అతని ధాటిని వర్ణిస్తారు.
      ‘కన్యక’ చివరలో ‘‘పట్టమేలే రాజుగర్వం/ మట్టి గలిసెను, కోట పేటలు/ కూలి, నక్కల కాటపట్టయి/ అమరె’’ అంటారు గురజాడ. కోట ఎలా కూలిపోయిందో చెప్పరు. శత్రురాజులు దండయాత్ర చేశారో, ప్రజలే తిరుగుబాటు చేశారో వివరించరు. ఒక ఆడపిల్ల పట్ల అన్యాయంగా ప్రవర్తించాడు కాబట్టి ఇలా రాజ్యం నాశనమైందని సూచిస్తారు. ‘‘పట్టమేలే రాజు పోయెను/ మట్టి కలిసెను కోట పేటలు/ పదం పద్యం పట్టి నిలిచెను/ కీర్తులపకీర్తుల్‌’’ అనడంతో రాజు అంతరించాడని, కన్యకకు కీర్తి మిగిలిందని భావం.
ధిక్కార స్వరాలు
పూర్ణమ్మ, కన్యక ఇద్దరూ ఎలాంటి అసహాయస్థితిలోనైనా రాజీపడలేదు. ముసలి మగడి వెంట కాపురానికి వెళ్లలేదు పూర్ణమ్మ. దుర్గమ్మలో ఐక్యమైంది. రాజు కోరిక ధిక్కరిస్తే పుట్టగతులుండవని భయపడలేదు కన్యక. పాలకుణ్నే ఎదిరించి తన ఆత్మగౌరవాన్ని నిలుపుకొంది. పూర్ణమ్మ మౌనంగానే తండ్రి చేసిన పెళ్లిని ధిక్కరిస్తే, కన్యక రాజు కండకావరాన్ని ప్రశ్నించి, ధైర్యంగా ఎదిరించింది. గురజాడ ఇద్దరినీ ఆత్మగౌరవ ప్రతీకలుగా తీర్చిదిద్ది మహిళల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించారు.
      పూర్ణమ్మ, కన్యక ఈ రెండు కథలూ వివాహ వ్యవస్థకు సంబంధించినవే. పితృస్వామ్య వ్యవస్థలో పతి దేవుడన్నారు. ఈ పతియే ప్రత్యక్ష దైవమన్నారు. ఆలాంటి సమయంలో ‘‘మగడు వేల్పన పాతమాటది/ ప్రాణ మిత్రుడు నీకు’’ అని 19వ శతాబ్దిలోనే చెప్పిన మహనీయుడు గురజాడ. ఆధునిక యుగంలోను భర్తని ‘సహచరుడు’ అంటున్నారే కానీ ‘ప్రాణమిత్రుడు’ అని ఏ భార్యా అనడం లేదు. కట్నం తక్కువ తెచ్చిందని, అడిగిందల్లా ఇవ్వలేదని, అనుమానం జబ్బుతోను ఎంతమంది భర్తలు తమ భార్యల ప్రాణాలు తీయడం లేదు.. ఆగర్భశత్రువు కాకుండా ఉంటే చాలు ప్రాణమిత్రుడైనంత గొప్ప.
      పూర్ణమ్మ, కన్యక ఇద్దరూ వివాహ వ్యవస్థకు బలమైన వాళ్లే. పూర్ణమ్మ తండ్రి కూతురికి ముసలి మొగుడి సంబంధం తెచ్చినప్పుడు నీకిష్టమేనా అని అడగలేదు. రాజు కన్యకను ‘నన్ను పెళ్లి చేసుకోవడం నీకిష్టమేనా?’ అని తన అభిప్రాయాన్ని తెలుసుకోలేదు. 
      కాలం మారి స్త్రీలు చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నా అత్యాచార ఘటనల్లో వారిని వస్తువులుగా చూసే విధానం మారలేదు. వారు ప్రధానులు కావచ్చు, మంత్రులు కావచ్చు, కానీ వారు భోగవస్తువులే. ఈ 21వ శతాబ్దంలోనూ ఇంటిపనులు, వంటపనులు ఆడవాళ్లవే అనే అభిప్రాయం పోలేదు. ఇప్పటికీ అంట్లు తోమే ప్రకటనల్లో స్త్రీలే ఉంటారు. పురుషాహంకారం కోరల్లో నలిగిపోతున్న స్త్రీలను చూసి ఆనాడే గురజాడ బాధపడ్డారు. ‘‘వంట చేయడాన్ని నిషేధించి పారేయాలి. ప్రతి వీధికీ ఒక దుకాణం ఉండాలి. కుటుంబం అక్కడికి వెళ్లి భోంచేస్తుంది’’ అని అన్నారు. స్త్రీ పురుషుల మధ్య ప్రేమ ఉండాలని కోరుకున్నారు. ‘‘ప్రేమనిచ్చిన ప్రేమ వచ్చును’’ అన్నారు. కామం మోహం పదాలే తెలిసిన సాహిత్యానికి ప్రేమ అనే మాట పరిచయం చేసిన కవి గురజాడ. 
సరళి శైలి.. నిసర్గ సౌందర్యం
గురజాడ వస్తురూపాల్లో నవ్యత సాధించారు. అప్పటిదాకా ఉన్న పద్యాన్ని తిరస్కరించారు. దేశీయ ఛందస్సులో రాశారు. ముత్యాలసరం అనే కొత్త ఛందస్సును కనుక్కొన్నారు. తన గేయాలన్నింటినీ ముత్యాల సరంలోనే రాశారు. గురజాడ కాలంలో గ్రాంథిక భాష ఉండేది. కొక్కొండ వెంటరత్నం పంతులు లాంటి వారు బిచ్చగాళ్లతో కూడా ‘‘కండులంబులు నిండుకున్నాయి’’ అని మాట్లాడే వారట. అలాంటి కాలంలో మాట్లాడుకునే భాషలోనే కావ్యాలు రాయాలని వ్యావహారిక భాషకు పట్టం కట్టారు గురజాడ. 
      కవిత్వమంటే ఎవరికీ అర్థంకాని భాష కాదని, ఎక్కడో ఆకాశంలో దూరంగా వెలిగే అందని చందమామ కాదని, సామాన్య జనాలకి కూడా అర్థమయ్యే భాషలోనే రాయాలని చెప్పడమే కాదు చేసి చూపించారు గురజాడ. తేట తెలుగు మాటలతో తేనెలొలుకు పదాలతో సరళ శైలితో రచనలు చేశారు. నిరలంకారమైన నిసర్గ సుందరమైన భాషతో, ముగ్ధ మోహనమైన ముత్యాలసరాలతో తెలుగు కవితకు ప్రాణం పోశారు. 
      గురజాడ సృష్టించిన పూర్ణమ్మ, కన్యకలు తెలుగు సాహిత్యం ఉన్నంత వరకూ, పితృస్వామ్యం ఉన్నంత వరకూ నిలచిపోతారు. అయితే, వారు ఆత్మహత్య చేసుకున్నారని పిరికివాళ్లుగా భావించకూడదు. ఆ కాలంలో వాళ్ల సమస్యలకు పరిష్కారంగా, అప్పటి ఆ వ్యవస్థ మీద ధిక్కారంగా ఆ జవాబునే ఎంచుకున్నారు. రాబోయే కాలంలో స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ పురుషాహంకారానికి లొంగిపోకూడదని ధైర్యంగా నిలిచి ఎదిరించాలని ఉద్బోధించారు. ప్రతి స్త్రీ ఈ సమాజంలో ఆత్మస్థైర్య పతాకాన్ని ఎగరేయాలని సందేశమిచ్చారు. ఈ సందేశాన్ని మహిళలందరూ తమ హృదయాల్లో నిలుపుకుని దురన్యాయాలను ఎదిరిస్తూ సాహసోపేతంగా ముందుకు సాగిపోవాలి. మానవ సమాజంలో ఆధునిక చరిత్ర సృష్టించాలి.


వెనక్కి ...

మీ అభిప్రాయం