అభివృద్ధికి ఆరోప్రాణం

  • 85 Views
  • 0Likes
  • Like
  • Article Share

నూతనంగా వెలువడుతున్న శాస్త్ర, సాంకేతిక, పరిశోధన పదజాలాన్ని సమర్థంగా అమ్మభాషలోకి తర్జుమా చేసుకుంటే విశ్వవిద్యాలయ స్థాయి వరకు మాతృభాషా మాధ్యమంలోనే విద్యాబోధన చేయవచ్చు. ఈ విషయాన్నే అనేక దేశాలు రుజువు చేస్తున్నాయి. ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు అన్ని కోర్సుల్ని అమ్మభాషలోనే అందిస్తూ అభివృద్ధిలో అవి మేటిగా దూసుకుపోతున్నాయి. ప్రపంచం మొత్తమ్మీద తలసరి ఆదాయం(జీడీపీ)లో ముందువరసలో ఉన్న దేశాలన్నీ మాతృభాషలో చదువుకే ప్రాధాన్యమిస్తుండటం గమనార్హం. ఆయా దేశాల విద్యావ్యవస్థలు, వాటిలో అమ్మభాషలకు దక్కుతున్న అగ్రతాంబూలాల పరిచయమిది.  
ఫ్రాన్స్‌- 99% అక్షరాస్యులు
ఇక్కడ పాఠశాల నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకూ అమ్మభాష ఫ్రెంచ్‌లో చదువుకునే అవకాశం ఉంది. ఎనభై శాతం పాఠశాలల్లో బోధన ఫ్రెంచ్‌లోనే ఉంటుంది. సొంత భాష అయినా విద్యార్థులు ఫ్రెంచ్‌ను శ్రద్ధగా అభ్యసిస్తారు. ఫ్రాన్స్‌లో 16 ఏళ్లు వచ్చేదాకా నిర్బంధ విద్య అమలవుతుంది. ఈ ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. ఇక్కడ ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత స్థాయిల్లో విద్య ఉంటుంది. ఎనభై శాతానికి పైగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుతారు. విద్యకు సంబంధించిన కీలక నిర్ణయాల్ని కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుంది. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పాఠ్యాంశాలు ఒకేలా ఉంటాయి. దేశప్రజల్లో 99 శాతం మంది అక్షరాస్యులు.  
ఫ్రెంచ్‌ భాషను 30 దేశాల్లో 30 కోట్లకు పైగా ప్రజలు మాట్లాడుతున్నారు. ప్రపంచంలో ఆంగ్లం తర్వాత ఎక్కువ మంది నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్న భాష ఫ్రెంచే. విదేశాల నుంచి వచ్చిన వారికి తమ భాషను త్వరగా నేర్పేందుకు ఫ్రాన్స్‌లో చాలా ప్రైవేటు సంస్థలు పనిచేస్తున్నాయి. నూతన శాస్త్ర, సాంకేతిక పదజాలాన్ని తమ భాషలోకి అర్థవంతంగా అనువదించుకునే వ్యవస్థ కూడా ఫ్రాన్స్‌లో బలంగా ఉంది. అందుకే వృత్తివిద్యా కోర్సుల్లో కూడా మాతృభాషను మాధ్యమంగా వాడుతున్నారు. విశ్వవిద్యాలయాల్లో 70 శాతానికి పైగా ఫ్రెంచ్‌ మాధ్యమంలోనే బోధన, పరిశోధనలు జరుగుతుంటాయి. కొన్నిచోట్లే ఆంగ్లం, జర్మన్‌ లాంటి భాషలు మాధ్యమంగా ఉన్నాయి. 


చైనా- మాండరిన్‌ మహత్తు
జనాభా పరంగా మొదటి స్థానంలో ఉన్న చైనాలో నర్సరీ మూడేళ్లు, ప్రాథమిక, సెకండరీ విద్య ఆరేళ్ల చొప్పున ఉంటాయి. సెకండరీ విద్యను జూనియర్, సీనియర్‌గా విభజించారు. వైద్య విద్యతో సహా అన్ని శాస్త్రాలను దాదాపుగా మాండరిన్‌లోనే బోధిస్తారు. దీనికోసం దేశంలో బలమైన అనువాద వ్యవస్థ ఉంది. చైనాలో మంగోలియన్‌ లాంటి మైనారిటీ భాషల్లో కూడా విద్యనభ్యసించే వారున్నారు. కానీ, వారి సంఖ్య చాలా తక్కువ. 
క్రీస్తు శకం ఏడో శతాబ్దం నుంచే ఇతర భాషల్లోని గ్రంథాలను చైనీస్‌లోకి అనువదించడం మొదలైంది. కమ్యూనిస్ట్‌ పార్టీ ఆవిర్భవించాక విజ్ఞానశా్రú్తం, సాంకేతిక గ్రంథాలను తమ భాషలోకి విరివిగా అనువదించుకున్నారు. 1982లో ఇక్కడి ప్రభుత్వం ‘చైనా అనువాద సంస్థ’ను ఏర్పాటు చేసింది. దీనికి ప్రభుత్వమే నిధులు అందిస్తుంది. ప్రపంచ దేశాల్లో జరుగుతున్న పరిశోధనల తాలూకూ పదాలను మాండరిన్, ఇతర మైనారిటీ భాషల్లోకి అనువదించడం, అలాగే చైనాలోని ఆవిష్కరణల నేపథ్యంగా వస్తున్న కొత్త పదాలను ప్రపంచానికి అందజేయడం, అనువాదకులకు శిక్షణ ఇవ్వడం ఈ సంస్థ విధులు. ఇది 1987 నుంచి ‘అంతర్జాతీయ అనువాదకుల సమాఖ్య’ (ఎఫ్‌టీఐ)తో కలిసి పనిచేస్తోంది. ఆసియా అనువాదకుల సంస్థలో కూడా దీనికి వ్యవస్థీకృత సభ్యత్వం ఉంది. సాంస్కృతిక, విద్యాపరమైన చాలా కార్యక్రమాలను ఈ సంస్థ నిర్వహిస్తుంటుంది. 


జపాన్‌- అన్నీ అమ్మభాషలోనే!
రెండో ప్రపంచ యుద్ధంలో అణుబాంబుల ధాటికి కకావికలమైన ఈ దేశం అనతి కాలంలోనే ప్రపంచ దేశాల అంచనాలకు మించి అభివృద్ధి సాధించడానికి కారణం ఇక్కడి విద్యావ్యవస్థే! మాతృభాషకు ప్రాధాన్యమిచ్చే జపాన్‌లో విశ్వవిద్యాలయ విద్య వరకు జపనీస్‌ మాధ్యమంలో అందుబాటులో ఉంది. 2018 లెక్కల ప్రకారం జపాన్‌ అక్షరాస్యత 99 శాతం. ఇక్కడ ప్రాథమిక విద్య ఆరేళ్లు, జూనియర్, సీనియర్‌ సెకండరీ విద్య మూడేళ్ల చొప్పున, ఉన్నత విద్య నాలుగేళ్లు ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో జపనీస్‌ మాధ్యమంలోనే విద్యాబోధన జరుగుతుంది. ప్రాథమిక విద్య నుంచే ఆంగ్లాన్ని ఒక పాఠ్యాంశంగా నేర్పుతారు. అలాగే చైనీస్, కొరియన్‌ లాంటి వాటినీ నేర్చుకునే వీలుంటుంది. విదేశీ విద్యార్థులు అంతర్జాతీయ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో చదువుకోవచ్చు. స్థిరమైన అనువాద వ్యవస్థ ఉండటంతో ఈ దేశంలో సాంకేతిక, వృత్తి విద్యను సైతం మాతృభాషలోనే బోధిస్తున్నారు. ఇక్కడ ‘జపాన్‌ అనువాదకుల సంస్థ, జపాన్‌ అనువాదకుల సమాఖ్య’ లాంటివి ఉన్నాయి. ఇవి వివిధ దేశాల్లో వెలువడుతున్న శాస్త్ర, పరిశోధన, సాహిత్యాంశాలను తమ భాషలోకి అనువదించుకోవడంతో పాటు తమ దేశంలో అభివృద్ధి చెందుతున్న శాస్త్ర, సాంకేతిక అంశాలను ఇతర భాషలకి అందిస్తాయి. వీటికి ప్రభుత్వం నుంచే నిధులు అందుతాయి. 
      సొంత భాషలోనే విద్య అభ్యసిస్తున్న జపాన్‌ విద్యార్థులు అంతర్జాతీయ వేదికల మీద సత్తా చాటుకుంటున్నారు. ప్రపంచంలో ఉత్తమ విద్యను అందిస్తున్న దేశాల జాబితాలో జపాన్‌ది నాలుగో స్థానం. ఉన్నత విద్యలో విదేశాల నుంచి వచ్చే విద్యార్థులకోసం కొన్ని విశ్వవిద్యాలయాల్లో ఆంగ్లం, చైనీస్, ఫ్రెంచ్‌ లాంటి భాషలనూ బోధనా మాధ్యమాలుగా ఉపయోగిస్తున్నారు. 


దక్షిణ కొరియా- 70% పట్టభద్రులు
జపాన్‌ ఆక్రమణ కాలంలో ఈ దేశం మీద బలవంతంగా జపనీస్‌ను రుద్దినా, కొరియన్లు తమ భాషా సంస్కృతులను నిలుపుకున్నారు. దక్షిణ కొరియాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నింటిలో విద్యాబోధన కొరియన్‌ మాధ్యమంలో సాగుతుంది. కొన్ని ప్రత్యేక ఉన్నత పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ఉంటుంది. పదిహేనేళ్ల వరకు నిర్బంధ విద్య అమలవుతుంది. ఇక్కడ ప్రాథమిక విద్య ఆరేళ్లు, మాధ్యమిక, ఉన్నత విద్య మూడేళ్ల చొప్పున ఉంటాయి. విశ్వవిద్యాలయాల్లో కూడా బోధన అధిక శాతం కొరియన్‌లోనే సాగుతుంది. ఈ దేశంలో కళాశాల లేదా విశ్వవిద్యాలయ విద్యను పూర్తిచేసుకున్న వారు 70 శాతం మంది ఉండటం మరో విశేషం. ఇంత శాతం పట్టభద్రత మరే దేశంలో కనిపించదు. విశ్వవిద్యాలయాల్లో సింహభాగం మాతృభాషలోనే బోధన సాగుతుంది. సాంకేతిక, వృత్తి విద్యల్లో కూడా అధిక భాగం అమ్మభాషలోనే బోధిస్తారు. మాతృభాషలో విద్యాబోధనతో అద్భుత విజయాలు సాధిస్తున్న దక్షిణ కొరియాని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా గతంలో కొనియాడారు. ఈ దేశం తన జీడీపీలో 5.4 శాతం నిధులను విద్య కోసం కేటాయిస్తోంది. 
      విద్యాభ్యాసం కోసం విదేశాల నుంచి వచ్చేవారు రెండో భాషగా కొరియన్‌నే ఎంచుకునేలా ఇక్కడ చట్టాలున్నాయి. వారికి కొరియన్‌ నేర్పేందుకు అనేక సంస్థలు పనిచేస్తున్నాయి. కొత్తగా పుట్టుకొస్తున్న శాస్త్ర, సాంకేతిక పదాలను కొరియన్‌లోకి తీసుకెళ్లేందుకు ‘కొరియన్‌ అనువాదకుల సంఘం’ నిరంతరం కృషిచేస్తోంది. ఈ సంస్థకు ప్రభుత్వమే నిధులు కేటాయిస్తోంది. 


జర్మనీ- పడిలేచిన కెరటం
ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ లాంటి శాస్త్రవేత్తలు, ఫ్రెడ్రిక్‌ నీషే, గోథే వంటి తత్వవేత్తలు పుట్టిన దేశమిది. రెండో ప్రపంచ యుద్ధంలో ఓటమి తర్వాత కూడా జర్మనీ అభివృద్ధిలో ముందుండటానికి ప్రధాన కారణం ఇక్కడి విద్యావ్యవస్థే. జర్మనీలో విద్యా సంబంధ నిర్ణయాల్ని రాష్ట్ర ప్రభుత్వాలే తీసుకుంటాయి. మూడేళ్లు ప్రీస్కూల్‌ విద్య ఉంటుంది. ఆరేళ్ల నుంచి పదిహేనేళ్ల వయసు వరకు నిర్బంధ విద్య అమలవుతుంది. ఇక్కడ సెకండరీ విద్య నుంచే వృత్తి విద్యా కోర్సులు ప్రారంభమవుతాయి. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన మాతృభాషలోనే జరుగుతుంది. ప్రభుత్వ, ప్రైవేటు బళ్లలో పాఠ్యాంశాలు ఒకేలా ఉంటాయి. విదేశీ విద్యార్థుల కోసం అంతర్జాతీయ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అందుబాటులో ఉంటుంది. సాంకేతిక, వృత్తి విద్యను కూడా ఇక్కడ మాతృభాషలోనే చదువుకుంటారు. విశ్వవిద్యాలయాల్లో కూడా అన్ని కోర్సులు జర్మన్‌లోనే బోధిస్తారు. విదేశీ విద్యార్థుల కోసం ఆంగ్లంలో కూడా కొన్ని కోర్సులు అందుబాటులోకి తెచ్చారు. యంత్రాలు. వాహన తయారీ రంగంలో అగ్రస్థానంలో నిలిచే జర్మనీ ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా తన భాష, సంస్కృతులను కాపాడుకుంటూ అభివృద్ధికి విదేశీ భాషలు అవసరం లేదని నిరూపిస్తోంది. పలు అనువాద సంస్థలు నూతన పదాలను జర్మన్‌లోకి తెస్తూ భాషాభివృద్ధికి తోడ్పడుతున్నాయి.


స్వీడన్‌- సాటిలేని విధానం
ప్రపంచంలో అత్యుత్తమ విద్యావిధానం ఉన్న దేశాల్లో స్వీడన్‌ మొదటి వరుసలో ఉంటుంది. అక్షరాస్యత 99 శాతం. కేంద్రమే విద్యా సంబంధిత కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. బడ్జెట్‌లో దాదాపు 72 బిలియన్ల స్వీడిష్‌ క్రోనాల్ని విద్య కోసం కేటాయిస్తారు. మూడేళ్ల చొప్పున ప్రాథమిక, మాధ్యమిక, జూనియర్‌ సెకండరీ విద్య కలిపి తొమ్మిదేళ్లు నిర్బంధ విద్య అమలవుతుంది. తర్వాత సీనియర్‌ సెకండరీ, ఉన్నత విద్య ప్రారంభమవుతాయి. ఇక్కడ ప్రభుత్వ బడులన్నింట్లో స్వీడిష్‌ భాషలోనే విద్యా బోధన ఉంటుంది. అంతర్జాతీయ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో చదువుకోవచ్చు. ఇతర దేశాల నుంచి అనేక రంగాల వారు ఇక్కడ స్థిరపడుతున్నా ఆ విదేశీ భాషల ప్రభావానికి గురికాకుండా ఇక్కడి ప్రభుత్వం మాతృభాషా పరిరక్షణకు అనేక చట్టాలు అమలు చేస్తోంది. విశ్వవిద్యాలయాల్లోనూ అన్ని రకాల కోర్సులు మాతృభాషలోనే చదువుకోవచ్చు. శక్తిమంతమైన అనువాద వ్యవస్థల వల్ల విదేశీ భాషల మీద ఆధారపడకుండా శాస్త్ర, సాంకేతిక, వృత్తి విద్యలను ఇక్కడి విద్యార్థులు అమ్మభాషలో చదువుకోగలుగుతున్నారు. 


ఇటలీ- మాతృభాషకే ఓటు
అందమైన కట్టడాలకు నిలయమైన ఈ దేశంలో నర్సరీ, ప్రాథమిక, దిగువ, ఎగువ సెకండరీ, ఉన్నత విద్య ఇలా అయిదు స్థాయిల్లో విద్యాబోధన ఉంటుంది. పదహారేళ్ల వరకు నిర్బంధ విద్య అమలవుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో దేశ విదేశ పిల్లలందరికీ చదువు ఉచితం. అన్నింట్లో ఇటాలియన్‌ భాషే బోధనా మాధ్యమం. ప్రాథమిక విద్య నుంచే ఆంగ్లం, ఫ్రెంచ్‌ లాంటి భాషలను పాఠ్యాంశాలుగా బోధిస్తారు. కొన్ని ప్రైవేటు, అంతర్జాతీయ పాఠశాలల్లో ఆంగ్లం, ఇతర విదేశీ మాధ్యమాల్లో బోధిస్తారు. 
ఇటలీ అక్షరాస్యత 99.2 శాతం. విశ్వవిద్యాలయాల్లో అన్ని కోర్సులు ఇటాలియన్‌తో పాటు ఆంగ్ల మాధ్యమంలో కూడా బోధిస్తారు. అయితే అమ్మభాషా మాధ్యమంలో చదువుకునేవారే ఎక్కువ. ఇరవయ్యో శతాబ్దం చివరి నాటికి పాఠశాల విద్య, పత్రికా రంగం ద్వారా ఈ దేశం తన మాతృభాష ఉనికిని పటిష్టం చేసుకుంది. తర్వాత వచ్చిన అనేక చట్టాలు భాషా పరిరక్షణకు తోడ్పడ్డాయి. ఇక్కడ అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య పరమైన లావాదేవీల్లో ఇటాలియన్‌నే వాడతారు. 


స్పెయిన్‌- సమస్తం స్పానిష్‌లోనే
ఇక్కడ ఆరు నుంచి పదహారేళ్ల వయసు వరకు నిర్భంధ విద్య అమలవుతోంది. అక్షరాస్యత 98.25 శాతం. ఇక్కడి ప్రభుత్వ పాఠశాలల్లో దేశ, విదేశ విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తారు. దేశవ్యాప్త విద్యార్థుల్లో 68 శాతం మంది ఈ బళ్లలోనే చదువుకుంటున్నారు. ప్రభుత్వ నిధులతో నడిచే ప్రైవేటు పాఠశాలల్లో 26 శాతం మంది విద్యను అభ్యసిస్తున్నారు. అన్ని బళ్లలో స్పానిష్‌ లేదా ఆ రాష్ట్రంలోని ప్రాంతీయ భాషామాధ్యమంలో విద్యాబోధన జరుగుతుంది. స్పెయిన్‌ అధికార భాష స్పానిష్‌తో సమానంగా ప్రాంతీయ భాషల్ని ప్రభుత్వం గౌరవిస్తుంది. స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రైవేటు బళ్లలో రెండు మూడు మాధ్యమాలుంటాయి. వీటిలో చదివేవారు ఆరు శాతమే. విద్యార్థులు వృత్తి లేదా శాస్త్రీయ విద్యా కోర్సును ఎంచుకునే అవకాశం సెకండరీ విద్యతోనే ప్రారంభమవుతుంది. రెండేళ్ల ఎగువ సెకండరీ విద్య పూర్తయిన తర్వాత విద్యార్థులు ఉన్నత విద్యకు అర్హత సాధిస్తారు. విశ్వవిద్యాలయాల్లో కూడా అధికశాతం స్పానిష్‌ మాధ్యమంలోనే బోధన ఉంటుంది. విదేశీ విద్యార్థుల కోసం కొన్ని ఉన్నత విద్యా కోర్సులను ఆంగ్లంలో ప్రవేశపెట్టారు. స్పెయిన్‌లో పేరుపొందిన అనువాదకుల సంఘాలు పది ఉన్నాయి. భాషను పటిష్టం చేయడంలో ఇవి నిరంతరం కృషి చేస్తుంటాయి. ‘స్పానిష్‌ అనువాదకులు, కాపీ ఎడిటర్లు, వ్యాఖ్యాతల సంస్థ’కు ఎఫ్‌ఐటీలో సభ్యత్వం ఉంది. అనేక విదేశీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇది మాతృభాషాభివృద్ధికి కృషి చేస్తుంటుంది. 


నెదర్లాండ్స్‌- అత్యున్నత వృత్తి, సాంకేతిక విద్యారంగం 
ఐరోపాలో అత్యధిక జనసాంద్రత కలిగిన దేశం నెదర్లాండ్స్‌. ఈ దేశ మాతృభాష డచ్‌. 16 ఏళ్ల వయసు వరకు నిర్బంధ విద్య అమలవుతుంది. ప్రాథమిక విద్య ఎనిమిదేళ్లు ఉంటుంది. తర్వాత సెకండరీ విద్యలోనే విద్యార్థులు తమ ఆసక్తి మేరకు పాఠ్యాంశాలు ఎంచుకోవచ్చు. ప్రభుత్వ పాఠశాలల్లో డచ్‌ మాధ్యమంలోనే బోధన ఉంటుంది. ప్రైవేటు బళ్లలో డచ్, ఆంగ్లమాధ్యమాల్లో బోధిస్తారు. ప్రపంచంలో అత్యున్నత విద్యావిధానం అమలవుతున్న దేశాల్లో నెదర్లాండ్స్‌ది ఏడో స్థానం. అత్యున్నత వృత్తి, సాంకేతిక విద్యనందిస్తున్న దేశాల్లో తొలి వరుసలో నిలుస్తుంది. వృత్తి, సాంకేతిక విద్యలను సైతం డచ్‌ భాషలో అభ్యసించే అవకాశం ఉంది. ఇక్కడ ప్రభుత్వ నిధులతో నడిచే 17 విశ్వవిద్యాలయాల్లో బోధన అధిక శాతం డచ్‌ మాధ్యమంలోనే ఉంటుంది. ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో కూడా అన్ని కోర్సులు డచ్‌ మాధ్యమంలోనే ఉంటాయి. ఆంగ్లాన్ని ఒక పాఠ్యాంశంగా ప్రాథమిక విద్య నుంచే నేర్పిస్తారు. జర్మన్, స్పానిస్‌ భాషల్లో కూడా కొన్ని అంతర్జాతీయ పాఠశాలల్లో విద్యాబోధన జరుగుతోంది. ప్రభుత్వ కార్యాలయాలు, విశ్వవిద్యాలయాల దరఖాస్తులు, న్యాయస్థాన పత్రాలు అన్నీ డచ్‌ భాషలోనే ఉంటాయి. ఈ దేశంలో అయిదు అనువాదకుల సంఘాలున్నాయి. కొత్త పదజాలాన్ని తమ భాషలోకి అనువదించడం, ఇతర దేశాలకు అందించడంతో పాటు భవిష్యత్‌ అనువాదకుల్ని తయారుచెయ్యడంలో కూడా ఇవి కృషిచేస్తుంటాయి. 


రష్యా- రష్యన్‌ మెరుపులు
అంతరిక్షంలోకి తొలిసారి రాకెట్‌ను పంపిన ఈ దేశం రష్యన్‌ మాధ్యమంలోనే విద్యనందిస్తోంది. అక్షరాస్యత 99.7 శాతం. ఇక్కడ ప్రాథమిక విద్య నాలుగేళ్లు, మాధ్యమిక విద్య అయిదేళ్లు, సెకండరీ విద్య రెండేళ్లు ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలలన్నింటిలో విద్యా బోధన రష్యన్‌ మాధ్యమంలోనే ఉంటుంది. అంతర్జాతీయ పాఠశాలల్లో ఆంగ్లం, జర్మన్, ఫ్రెంచ్‌ మాధ్యమాల్లో బోధిస్తారు. ఆరు శాతం మంది మైనారిటీ భాషా మాధ్యమాల్లో కూడా చదువుకుంటున్నారు. విదేశీ విద్యార్థులు అధికంగా చదువుకుంటున్న దేశాల్లో రష్యాది ఆరో స్థానం. ఇక్కడి విశ్వవిద్యాలయాల్లో అన్ని కోర్సులు రష్యన్‌ మాధ్యమంలో అందుబాటులో ఉంటాయి. మైనారిటీ భాష టటార్‌ మాధ్యమంగా కూడా కొన్ని విశ్వవిద్యాలయాలు బోధిస్తున్నాయి. వృత్తి, సాంకేతిక, వైద్య విద్యా కోర్సులను రష్యన్లు తమ అమ్మభాషలో చదువుకోడానికే ఆసక్తి చూపిస్తున్నారు. ఇక్కడ రష్యా అనువాదకుల సంఘం, జాతీయ అనువాదకుల సమితి అనే వ్యవస్థలున్నాయి. భాషాభివృద్ధికి కృషిచేస్తూ భావితరాలకు అనువాదకులను అందించడంలో వీటి పాత్ర కీలకం.


టర్కీ- టర్కిష్‌ మాత్రమే
మధ్య ప్రాచ్య దేశమైన టర్కీలో అధికార భాష టర్కిష్‌. ఇక్కడ హిబ్రూ, అరబ్బీ లాంటి భాషలు కూడా మాట్లాడతారు. టర్కీలో విద్యకు సంబంధించిన అన్ని కీలక నిర్ణయాల్ని కేంద్ర విద్యాశాఖ తీసుకుంటుంది. ఈ దేశ రాజ్యాంగంలోని అధికరణ 42 ప్రకారం ఏ విద్యాసంస్థలోనూ మొదటిభాషగా టర్కిష్‌ తప్ప వేరే దాన్ని బోధించకూడదు. ప్రభుత్వ పాఠశాలల్లో టర్కిష్‌ మాధ్యమంలోనే బోధన ఉంటుంది. ప్రైవేటు పాఠశాలల్లోనూ అధికశాతం టర్కిష్‌లోనే బోధిస్తారు. ఆంగ్ల మాధ్యమంలో బోధించే అంతర్జాతీయ పాఠశాలలున్నా, వాటిలో కూడా మొదటి భాషగా టర్కిష్‌నే చదువుకోవాలి. ఇక్కడ పన్నెండేళ్ల వరకు నిర్బంధ విద్య అమలవుతుంది. ప్రాథమిక, మాధ్యమిక, సెకండరీ విద్య నాలుగేళ్ల చొప్పున ఉంటాయి. సెకండరీ స్థాయి నుంచే వృత్తి విద్యను నేర్చుకోవచ్చు. టర్కీలోని విశ్వవిద్యాలయాల్లో 70 శాతం టర్కిష్‌ భాషలోనే బోధన ఉంటుంది. కొన్నింట్లో ఆంగ్లం, జర్మన్, ఫ్రెంచ్‌ భాషల్లో కోర్సులు అందుబాటులోకి తెచ్చారు. ప్రాథమిక విద్య నుంచే విదేశీ భాషలతో పాటు తమ దేశంలోని మైనారిటీ భాషలైన హిబ్రూ, అరబ్బీలను ఎంచుకునే అవకాశం ఉంటుంది. దేశ అక్షరాస్యత 96.15 శాతం. టర్కీలో నాలుగు ప్రముఖ అనువాద సంఘాలున్నాయి. ఇవి విదేశీ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు అనువాదకులకు శిక్షణ ఇస్తుంటాయి.


హిబ్రూ - యూదుల పట్టుదల
ఇజ్రాయిల్‌ తన బడ్జెట్‌లో 7.1 శాతం విద్య కోసం కేటయిస్తోంది. విద్య ద్వారానే సాంకేతిక రంగంలో అభివృద్ధిని సాధించింది. ఇజ్రాయిల్‌ అక్షరాస్యత 97.8 శాతం. ఈ దేశంలో పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయాల వరకు విద్యాబోధన తమ అధికార భాష అయిన హిబ్రూలోనే ఉంటుంది. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సెకండరీవిద్య వరకు మైనారిటీ భాష అయిన అరబిక్‌ మాధ్యమంలో బోధిస్తారు. విద్యావిధానాలకు సంబంధించి కేంద్ర విద్యాశాఖ నిర్ణయాలు తీసుకుంటుంది. 
ఇజ్రాయిల్‌లో నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఉచిత నిర్భంద విద్య అమల్లో ఉంది. అధికశాతం విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యను అభ్యసిస్తున్నారు. ఈ దేశం వృత్తి, సాంకేతిక శిక్షణలో ఉన్నత స్థానంలో ఉంది. ఈ కోర్సులను కూడా అధికశాతం తమ అమ్మభాషలోనే అందిస్తోంది. వైద్య కోర్సుల్లో సైతం హిబ్రూభాషా మాధ్యమంలోనే బోధన సాగుతుంది. ప్రాథమిక విద్యలో ఆంగ్లం, ఫ్రెంచ్, అరబిక్‌ భాషల్లో ఏదో ఒక దాన్ని ఒక సబ్జెక్ట్‌గావిద్యార్థులు ఎంచుకునే వెసులుబాటు ఉంది. ప్రైవేటు పాఠశాలల్లోనూ హిబ్రూని తప్పక బోధించాలి. అలాగే.. వ్యాపార, వాణిజ్య రంగాలతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో హిబ్రూనే వాడతారు. వార్తపత్రికలు, పరిశోధన పత్రాలు సింహభాగం హిబ్రూభాషలోనే ప్రచురితమవుతాయి. ఈ దేశ విద్యావిధానం, నాణ్యత, విద్యార్థులు సాధిస్తున్న విజయాలు, సాంకేతిక అభివృద్ధిని మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ లాంటి వారు కొనియాడారు. 
      ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనమిక్‌ కోపరేషన్‌ డెవలప్‌మెంట్‌ నివేదిక ప్రకారం విద్యకు అధిక మొత్తంలో ఖర్చుచేస్తున్న దేశాల్లో ఇజ్రాయిల్‌ అయిదో స్థానంలో ఉంది. అభివృద్ధికి మాతృభాష అడ్డుకాదని నిరూపిస్తూ.. విద్యావిధానంలో ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ అభివృద్ధి చెందిన దేశంగా ఇజ్రాయిల్‌ ఎదిగింది. దాదాపు అంతర్థాన దశకు చేరిపోయిన హిబ్రూ భాషను అసలు యూదులు పునరుద్దరించుకోవడమే ఓ గొప్ప స్ఫూర్తిదాయక చరిత్ర. (దీనిపై సమగ్ర వ్యాసాన్ని నవంబరు 2012 తెలుగువెలుగు సంచికలో చూడవచ్చు)  
      ఇజ్రాయిల్‌లో అనువాద రంగంలో కృషి చేస్తున్న సంస్థ.. ఐటీఏ. (ఇజ్రాయిల్‌ ట్రాన్సిలేటర్స్‌ అసోషియేషన్‌) శిక్షణ ఇచ్చి అనువాదకులను తయారుచేయడంతో పాటు 173 భాషల్లోని అన్ని రకాల శాస్త్రాల్లోని పరిశోధనలు, కొత్త పదాలను ఎప్పటికప్పుడు హిబ్రూలోని అనువాదం చేయిస్తూ మాతృభాషాభివృద్ధికి కృషిచేస్తోంది.


 


వెనక్కి ...

మీ అభిప్రాయం