కవన మంజీరం

  • 15 Views
  • 0Likes
  • Like
  • Article Share

‘‘తెలంగాణ పల్లెల కన్రెప్పల మీద ఆవగింజంత కునుకు లేదు/ ఏ క్షణాన ఏ సవ్వడో? ఏ క్షణాన ఏమౌతుందో?/ అంతా మొగులైనట్టు మెదళ్లు మొద్దుబారిన దృశ్యం!/ తాట్లో తాగుతున్నట్టు పల్లె తాగుతున్న ప్రకంపనాలు’’ ఇలా ఒకప్పటి విప్లవ పోరాట సమయంలో నెలకొన్న నిర్బంధాన్ని కళ్లకు కట్టడంతో పాటు ఎప్పటికప్పుడు తెలంగాణ నేల ఆత్మకు కవితా రూపమిస్తూ సాగిన కవి ఏలేశ్వరం నాగభూషణాచార్య. ‘‘బాల్యం నా కళ్లముందు/ పరావర్తనం చెందినపుడు/ ఆకలే తల్లివేరై శాఖోపశాఖలుగా/ విస్తరించి అనంతమైన/ ఆలోచనల కెగబాకేది’’ అంటూ ఆర్ద్రమైన కవిత్వం అందించిన నాగభూషణాచార్య స్వస్థలం మెదక్‌ సమీపంలోని ర్యాలమడుగు. ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో తన గళాన్ని బలంగా వినిపించారు. ప్రాచీన కవిత్వం అంటే ఎనలేని మక్కువ ఉన్న ఆయన పద్యాలను రాగయుక్తంగా గానం చేసేవారు. తర్వాత వచన కవిత్వంలో తనదైన శైలితో కలం కదిలించారు. మంజీర రచయితల సంఘానికి వ్యవస్థాపక అధ్యక్షులుగా పనిచేశారు. రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. తెలంగాణ జన జీవనానికి అద్దం పడుతూ నాగభూషణాచార్య రాసిన కవితలను మంజీర రచయితల సంఘం ‘నేల తడవని వాన’గా ప్రచురించింది. ‘కదలిక’ అనే కవితా సంకలనానికి సంపాదకత్వం వహించారు. అటు స్వర్ణకార పనినీ, ఇటు ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తూనే కవిత్వం రాసేవారు. సాహిత్య సృజనతో పాటు, ఉపాధ్యాయ హక్కుల పరిరక్షణ ఉద్యమాల్లోనూ క్రియాశీలకంగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ అధికారిక మాసపత్రికకు సంపాదకవర్గ సభ్యుడిగానూ పనిచేసిన నాగభూషణాచార్య ఆగస్టు 16న కన్నుమూశారు. 


వెనక్కి ...

మీ అభిప్రాయం