ఆత్మాభిమాన బావుటా.. ఫ్రెంచ్‌!

  • 71 Views
  • 0Likes
  • Like
  • Article Share

    అపర్ణ శంకర్‌

‘‘బ్రిటన్‌ వారు సంపదకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తే, ఫ్రాన్స్‌ దేశస్థులు తమ మాతృభాషకు గుండెల్లో సుస్థిర స్థానం కల్పించారు’’.. ఆంగ్లో ఫ్రెంచ్‌ రచయిత ఆండ్రూ గాల్లిక్స్‌ చెప్పిన ఈ మాటలు ఫ్రెంచ్‌వారి భాషాభిమానానికి నిదర్శనం. ఆంగ్లీకరణ అనే పెను విపత్తు తమ దేశంలోకి అడుగు పెట్టకుండా అమ్మభాషాభిమాన కంచె ఏర్పాటు చేసుకుని గట్టిగా ప్రతిఘటిస్తోంది ఫ్రాన్స్‌. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమ భాషను పటిష్టం చేసుకుంటూ, నూతన తరానికి సమర్థంగా దాన్ని చేరువ చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోందీ దేశం. 
లాటిన్‌
మాతృకగా ఉన్న రోమన్‌ భాషా కుటుంబంలోని అయిదు ప్రధాన భాషలు.. ఇటాలియన్, పోర్చుగీస్, రోమనియన్, స్పానిష్, ఫ్రెంచ్‌. వీటన్నింటిలో సొగసైన భాషగా ఫ్రెంచ్‌ కీర్తి పొందింది. ఆధునిక ఫ్రాన్స్, బెల్జియంలను సంయుక్తంగా పూర్వం ‘గౌల్‌’గా వ్యవహరించేవారు. క్రీ.పూ.2 లేదా ఒకటో శతాబ్దంలో ఈ ప్రాంతం రోమన్ల చేతికి చిక్కినప్పటి నుంచి ఇక్కడి భాష కూడా రోమన్‌ మూల లాటిన్‌లో కలిసి తన ఉనికిని కోల్పోయింది. జనాల నాలుకల మీద తాండవమాడిన ఒక పలుకు పరాయి భాషా ప్రభావానికి లోనై ఎలా నశించి పోతుందన్న దానికి గౌలిష్‌ ఒక ఉదాహరణ. చివరకు పరిస్థితి ఎక్కడి వరకూ వెళ్లిందంటే, లాటిన్‌లో గౌలిష్‌ భాషా పదాలు 150 కన్నా తక్కువే మిగిలాయి! అక్కడి నుంచి ఓ 70 పదాలు నేటి ఫ్రెంచ్‌ భాష పొందగలిగింది. అంతటి లాటిన్‌ భాష సైతం దేశాంతరాలు తిరిగి ఎన్నో భాషల పదాలను తనలో మిళితం చేసుకుని అసలు స్వరూపం కోల్పోయింది. ఇంతటి ఒత్తిళ్లలో జర్మన్, సెల్టిక్, లాటిన్‌ మూలాల నుంచి ఉత్పన్నమైన ఫ్రెంచ్‌ భాష తొమ్మిదో శతాబ్దం నుంచి స్వతంత్ర భాషగా అడుగు పెట్టింది.
అంతర్జాతీయ కృషి
పరిస్థితులకు అనుగుణంగా తన భాషను తీర్చిదిద్దుకునేందుకు, నూతన పదబంధాలను సృష్టించుకునేందుకు ఫ్రాన్స్, ప్రపంచం నలుచెరగులా పలు సంస్థలను నెలకొల్పింది. ముఖ్యంగా ఇటాలియన్‌ ప్రభావం నుంచి అమ్మ భాషను కాపాడుకోవటానికి 1635లో అకాడమీ ఫ్రాన్కైస్‌ అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఇది నేటికీ అంతే నిబద్ధతతో పని చేస్తోంది. ఫ్రాన్స్‌ చట్టాల ప్రకారం పౌరుల వ్యక్తిగత విషయాల్లో తమకు అనుకూలమైన భాషను ఎంచుకోవచ్చు. కానీ, వ్యాపార వ్యవహారాల్లో మాత్రం ఫ్రెంచ్‌నే వాడాలి. ఫ్రాన్స్‌ దేశ సరిహద్దు లోపలి ప్రజలంతా ఫ్రెంచ్‌నే మాట్లాడాలి. ఇదే ఫ్రాన్స్‌ ప్రతిష్ఠాత్మకంగా భావించే తౌబాన్‌ చట్టం. 1994లో ఫ్రాన్స్‌ విశ్వవిద్యాలయాల్లోని కొన్ని కోర్సులను ఆంగ్లంలో బోధించటానికి అనుమతినిస్తూ అప్పటి విద్యాశాఖ మంత్రి ఈ చట్టానికి తీసుకొచ్చిన సవరణ ఫ్రాన్స్‌లో పెద్ద కలకలాన్నే సృష్టించింది. తౌబాన్‌ చట్ట సవరణను అకాడమీ ఫ్రాన్కైస్, మాతృభాషా ద్రోహంగా వ్యాఖ్యానించింది. ఆంగ్లాన్ని దేశంలోకి అనుమతించటమంటే ఫ్రెంచ్‌ను సజీవ సమాధి చేయడమేనని ఎందరో భాషావేత్తలు ధ్వజమెత్తారు. దీని పట్ల సమాజంలోనూ వ్యతిరేకత మొదలైంది. ఎవరికివారు ఆంగ్లం తమ భాషలో మిళితం కాకుండా అప్రమత్తతతో వ్యవహరించసాగారు. అట్లాంటిక్‌ సముద్ర తీరం గుండా ఫ్రాన్సులోకి ప్రవేశించే అమెరికా పదజాలాన్ని యథాతథంగా వాడకుండా అధికార సంస్థలు సైతం ఆయా ఆంగ్ల పదాలకు సమానార్థకాలను ఫ్రెంచ్‌లోకి తేవటాన్ని ప్రోత్సహించాయి. అకాడమీ ఫ్రాన్కైస్‌ ‘పలకాల్సినవి, పలకకూడనివి’ అన్న శీర్షికతో కొన్ని ఆంగ్ల తత్సమ ఫ్రెంచ్‌ పదాలను ప్రచురించింది.
      ప్రపంచ వ్యాప్తంగా ఫ్రెంచ్‌ మాట్లాడేవారిని ఏక తాటి మీదకు తేవటమే లక్ష్యంగా మార్చ్‌ 1970లో నైగర్‌ సంస్థను ఏర్పాటు చేశారు. అదే ఇప్పటి అంతర్జాతీయ ఫ్రాంకోఫోన్‌ సంస్థకు మూలం. (ఫ్రెంచ్‌ భాష మాట్లాడేవారిని ఫ్రాంకోఫోన్‌ అంటారు. ఒనేసైమ్‌ రిక్లుస్‌ అనే ఫ్రెంచ్‌ భాషావేత్త ఈ పదాన్ని పరిచయం చేశారు) ఫ్రెంచ్‌ భాషా సంస్కృతుల వికాసం, వైవిధ్యాన్ని పరిరక్షించటం; శాంతి, ప్రజాస్వామ్యం, మానవ హక్కుల పరిరక్షణ; ఉన్నత విద్య, శాస్త్రీయ పరిశీలనలను ప్రోత్సహించటం; పరస్పర సహకారంతో ప్రగతిని సాధించటం దీని లక్ష్యాలు. ఈ సంస్థ 2020లో 50 ఏళ్లు పూర్తిచేసుకుంది. ఫ్రెంచ్‌ను తమ ప్రాథమిక భాషగా అమలుచేస్తున్న అన్ని దేశాలు పరస్పర సహకారంతో భాషను కాపాడుకోవాలన్నది ఈ సంస్థ ఏర్పాటులోని అంతస్సూత్రం. ఫ్రాంకోఫోన్‌ విశ్వవిద్యాలయ సంఘం, ఫ్రెంచ్‌ పౌరుల అసోసియేషన్, టీవీ 5 మాండే- ఫ్రెంచ్‌ అంతర్జాతీయ దూరదర్శిని లాంటి ఎన్నో సంస్థలూ ఈ దిశగా కృషిచేస్తున్నాయి.
ఆంగ్లానికి గట్టి పోటీ
ఫ్రెంచ్‌ పౌరులకు మాతృభాష పట్ల శ్రద్ధాసక్తులు చాలా ఎక్కువ. అమెరికా సంగీత సంప్రదాయాన్ని ఇష్టపడి అనుసరించే వాళ్లు పెరిగిపోతున్న తరుణంలో కూడా ఫ్రెంచ్‌ యువత సాంకేతిక పదజాలాన్ని తమ మాతృభాషలోకి అనువదించుకుని వాడుతోంది! సపోర్టర్‌ - ఎంకరేజర్‌; టాప్, మస్ట్, హైపర్‌ - ఇన్‌ కంపారబుల్‌; ఈమెయిల్‌ - కొరియెల్‌; హాట్‌ లైన్‌ - నుమేరో డి అర్జేన్స్‌; బ్రెయిన్‌ స్టార్మింగ్‌ - రెమ్యు మేనింజేస్‌; నెట్‌ వర్కింగ్‌ - ట్రావెల్‌ ఇన్‌ రెసేయు; కాస్టింగ్‌ - పాసేర్‌ యూ ఆడిషన్‌... ఇలా ఎన్నో ఆంగ్ల పదాలకు వాళ్లు ఫ్రెంచి సమానార్థకాలను సృష్టించుకున్నారు. 
      ఫ్రెంచ్‌ సాహితీవేత్త రొలాండ్‌ బార్తేస్‌ ప్రకారం భాష సమాజం పట్ల ఒక నియంత. పౌరుల మానసిక, మేధా సరళిని, ప్రవర్తనా తీరును క్రమబద్ధీకరించగలిగే సత్తా దానికుంది. కాబట్టే మనం ఎక్కువగా వాడే భాష ప్రతిబింబించే సంస్కృతీ సంప్రదాయాలను మనకు తెలియకుండానే అనుసరించగలుగుతాం. మాతృభాష పట్ల పౌరులకు ఉండాల్సిన కనీస బాధ్యతకు ప్రభుత్వ సహకారం తోడైంది కాబట్టే ఆంగ్లానికి గట్టి పోటీదారుగా నిలుస్తోంది ఫ్రెంచ్‌. వీలైనంత వాఙ్మయాన్ని సేకరించి ముద్రించటం; గ్రంథాలయాలు, ప్రదర్శనశాలల్లో పౌరులకు వాటిని అందుబాటులో ఉంచటం; భాషావేత్తలు, పండితులను సంప్రదించి భవిష్యత్‌ తరాల వారిని, ఆసక్తి ఉన్న వారిని భాషాభ్యసనానికి చేరువ చేయటం; ఈ క్రమంలో సాంకేతిక, సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకోవటానికి తగిన వనరులను ఏర్పాటు చేయటం; అవసరమైన పారిభాషిక పదజాలాన్ని రూపొందించి వాటిని వాడేలా యువతను జాగృత పరచటం; మాతృభాషలోనే సంభాషణ జరిపేలా పౌరులను ఉద్దీపితుల్ని చేయటం.. అమ్మభాషను పరిరక్షించుకోవడానికి ఫ్రాన్స్‌ పాలకులు అనుసరిస్తున్న ఈ మౌలిక సూత్రాలు ఏ ప్రభుత్వమైనా తప్పక అనుసరించాల్సినవి. మన రెండు రాష్ట్రాల ప్రభుత్వాలూ ఈ దిశగా గట్టి చర్యలు తీసుకుంటే తెలుగు పదికాలాల పాటు వైభవంగా వెలుగుతుంది. 


వెనక్కి ...

మీ అభిప్రాయం