ఫలితాలు ప్రశ్నార్థకమే!

  • 25 Views
  • 0Likes
  • Like
  • Article Share

    డా।। సామల రమేష్‌బాబు

  • జాతీయ అధ్యక్షులు, తెలుగు భాషోద్యమ సమాఖ్య
డా।। సామల రమేష్‌బాబు

ప్రాథమిక విద్యలో మాతృభాషను బోధనా మధ్యమంగా వినియోగించాలన్న కొత్త జాతీయ విద్యావిధానం సూచన మంచిదే. అయితే, భారత రాజ్యాంగం గుర్తించిన అధికార భాషలన్నింటికీ సమ ప్రాధాన్యం ఇవ్వడంలో ఈ విధానం విఫలమైందన్నది ఒక వాదన. దీనికి సంబంధించిన ఈ పరిశీలన.. నూతన విధానం మీద జరుగుతున్న విస్తృత చర్చలో ఓ భాగమే!
జులై
29న కేంద్ర మంత్రిమండలి ఆమోదించిన జాతీయ విద్యావిధానం మీద దేశవ్యాప్తంగా ఎంతో చర్చ జరుగుతోంది. విధానపత్రం విడుదలైనంత మాత్రాన ఇది వెంటనే అమలులోకి వస్తున్నట్లు కాదు. ఇది పార్లమెంటు ఆమోదం పొందాల్సి ఉంది. రాష్ట్రాలతో కూడిన సమాఖ్య వ్యవస్థలో ఉన్నాం కాబట్టి, ‘విద్య’ అనే అంశం రాజ్యాంగంలోని ఏడో షెడ్యూలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి జాబితాలో ఉండటంతో రాష్ట్రాల ఆమోదాన్నీ తీసుకోవాల్సి ఉంది. 
      రాష్ట్రాల ఆమోదంతోనే కొత్త విద్యావిధానం అమలులోకి రాగలుగుతుంది. అమలు కోసం తగిన విధంగా కొన్ని చట్టాలను చేయాల్సి ఉంది. ఇదంతా జరగడానికి కొన్ని నెలల సమయం పట్టవచ్చు. ఇప్పుడు దీనిలో భాషా విధానానికి సంబంధించిన అంశాల గురించి పరిశీలిద్దాం. 
      రాజ్యాంగం ఎనిమిదో షెడ్యూల్‌లోని జాబితా ప్రకారం 22 దేశీయభాషలను అధికార భాషలుగా గుర్తించారు. జాతీయభాషను నిర్ణయించడంలో మన రాజ్యాంగ నిర్మాణకర్తలు ఏకీభావం సాధించడంలో విఫలమై, నాగరలిపిలోని హిందూస్తానీ(హిందీ)ని అధికార అనుసంధానభాషగా అంగీకరించారు. అదే సమయంలో షెడ్యూల్‌లోని 22 భారతీయ భాషలనూ జాతీయ భాషలుగా గుర్తించాలనే అంశం నేటికీ ఒక రాజకీయ డిమాండుగా మిగిలిపోయిందేగాని, చట్టరూపంగా ఆమోదం పొందలేదు. అదే సమయంలో రాజ్యాంగం అమలులోకొచ్చిన 15 ఏళ్లలో జాతీయ అధికారభాషగా ఆంగ్లం స్థానంలో భారతీయ భాషను నిర్ణయించుకోవాలన్న అంశమూ ఆచరణలోకి రాలేదు. దాంతో ఆంగ్లభాష విద్యా పరిపాలనారంగాల్లో బలంగా చొచ్చుకుపోయింది. అయినా అది విదేశీ భాష అయినందున దానికి జాతీయ భాషగా గుర్తింపు వచ్చే ప్రసక్తి లేదు. దేశమంతటా విద్యాపాలనా రంగాల్లోని వాస్తవస్థితిని పరిగణించి, ఆంగ్లాన్ని కూడా షెడ్యూల్లో చేర్చాలనే డిమాండును కొన్ని బలమైన వర్గాలు ముందుకు తెస్తూనే ఉన్నాయి. అయితే, విద్యారంగంలో బోధనా మాధ్యమంగా ఆంగ్లమే ఉండాలనే డిమాండు క్రమంగా దేశవ్యాప్తంగా బలాన్ని సంతరించుకుంటోంది. ఈ పరిస్థితులు నలభై ఏళ్ల నాటి విద్యావిధానం నుంచీ క్రమంగా పుంజుకొని, గత 20-30 ఏళ్లలో మరింతగా బలపడ్డాయి.
మిగిలిన భాషల మాటేంటి?
ఇప్పుడు వెలుగుచూసిన కొత్త విద్యావిధానం చాలా తెలివిగా భాషాసమస్యలను పరిష్కరించాలని ప్రయత్నించినట్లు కనబడుతోంది. రాజీలేని జాతీయవాదాన్ని అన్నిరంగాల్లోను తీర్చిదిద్దాలనే నేటి కేంద్రప్రభుత్వ ఆశయానికి అనుగుణంగానే ఆ ప్రతిపాదనలు సాగాయి. ఆ తపనలో హిందీ, సంస్కృతం తప్ప తక్కిన అన్ని భాషల అభివృద్ధిని, ప్రజల ప్రయోజనాలను, ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకోకుండా కొత్త విద్యావిధానం చిన్నచూపు చూసింది. బోధనాభాషలుగా వాటి వినియోగం ప్రాథమిక విద్య వరకే లేదా మరి మూడేళ్లకు పరిమితమవుతుంది. వాటి పక్కనే త్రిభాషా సూత్రం ప్రకారం హిందీయేతర భాషలతోపాటు హిందీ, దానితోపాటు సంస్కృతమూ తప్పనిసరి అనకపోయినా అమలులోకి వస్తాయి. ఇంకా విశేషం ఏంటంటే ఇంగ్లీషు భాష ప్రాథమిక విద్య నుంచి ఎంత పైస్థాయి విద్యలోనైనా మాధ్యమంగా ఏదో ఒక రూపంలో తప్పనిసరై కూర్చుంటుంది. అంటే నేటి కేంద్ర పాలకుల దృష్టిలో జాతీయతకు, దేశ ఐక్యతకూ ప్రతిబింబంగా హిందీ, సంస్కృత భాషలు స్థిరపడి, భారతీయతకు ఆనవాళ్లుగా నిలుస్తాయి. భారతీయులను ప్రపంచ పౌరులుగా నిలబెట్టేందుకూ, కార్పొరేట్‌ రంగంలోని అన్నిస్థాయిల్లో సేవలందించగలవారిగా తీర్చిదిద్దడం కోసమూ- ఇంగ్లీషు మరింతగా స్థిరపడి, బలపడుతుంది!! మరి తక్కిన 20 భారతీయ భాషల వినిమయం, అభివృద్ధి ఎంతవరకు? నేటి పరిస్థితుల్లో విస్తారంగా అన్ని ఆధునిక అవసరాలకూ వినియోగించని భాషలు బతుకుతాయా? వాటికి ఆ సమర్థత లేదా? కోట్లాదిమంది మాట్లాడే అతి పెద్ద భారతీయ భాషల ఎదుగుదల కూడా అంతేనా? నేటి కంప్యూటర్‌ యుగంలో- సాంకేతికతను ఉపయోగించుకొని అవి ఎంతైనా ఎదగడానికి అవకాశం ఉంది కదా. అందుకు అడ్డుకట్టలు వేయడం సమంజసమేనా? అందరూ లోతుగా ఆలోచించాల్సిన అంశమిది.  
వాటిని విస్మరించారు!
నిజానికి రాజ్యాంగం గుర్తించిన అన్ని భాషలనూ జాతీయ భాషలుగా ప్రకటించాలి. ఏ భాష అయినా, అది చిన్నదైనా పెద్దదైనా అవకాశమిస్తే ఎంతకైనా ఎదగగలరని, అన్ని భాషలకూ మౌలికంగా ఆ శక్తి ఉంటుందన్న శాస్త్రీయ దృక్పథాన్ని ఈ విధానం విస్మరిస్తోంది. పాఠశాల విద్యను పూర్తిగా మాతృభాషా మాధ్యమంలోనే బోధించాలనే నిర్ణయాన్ని తీసుకోవడంలోనూ కొత్త జాతీయ విద్యావిధానం విఫలమైంది. 
      మరొక ప్రధానాంశం ఉంది. ఏ భాషలో మాట్లాడినా, రాసినా, ముద్రించినా దాన్ని వెంటనే మరొక భాషలోకి అనువాదం చేయగల సాంకేతికత ఇప్పుడు అందుబాటులో ఉంది. అందువల్ల ఇప్పుడు దేశం మొత్తాన్నీ ఒకటి రెండు భాషల ఆధిపత్యంలోకి తెద్దామనే ఆధిపత్య ధోరణులను పాలకులు మానుకోవాలి. ఈ విషయంలో ఒక విధానపరమైన నిర్ణయాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉందని పాలకులు గుర్తించాలి.
      భారతదేశం అనేక భాషాసమూహాలతో ఏర్పడిన సమాఖ్య. దాన్ని రాజ్యాంగం గుర్తించబట్టే భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడ్డాయి. రాజ్యాంగం ప్రకారం ఏ విధంగానూ అసమన్యాయం గానీ అన్యాయంగానీ ఎవరికీ జరగకూడదు.
      విద్యావిధానానికి సంబంధించి అనేక అంశాలున్నా, దీనికి ప్రాణం లాంటి భాషావిధానాల గురించే, దాని పరిణామాలను మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం. దీన్ని వివరంగా అర్థం చేసుకోవాలంటే కొత్త జాతీయ విద్యావిధానాన్ని సూక్ష్మంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ప్రపంచభాషలను నేర్చుకుని మన విద్యార్థులు అత్యంత ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించిన ఈ విధాన నిర్మాతలు - అందుకోసం మాతృభాషల్ని శక్తిమంతం చెయ్యాలన్న మౌలిక అంశాన్ని విస్మరించారు!
      భాషతోపాటు చర్చించాల్సిన అంశాలెన్నో జాతీయ విద్యావిధానంలో ఉన్నాయి. మనదేశంలోని సామాజిక అసమానతలు, చారిత్రక సమస్యలు, సాంస్కృతికతలోని వైవిధ్యాలు లాంటి అంశాల గురించి ఈ విద్యావిధానం మాట్లాడినా, వాటి విషయంలో చేపట్టదలచిన చర్యలన్నీ ఆ సమస్యల పరిష్కారానికీ, శక్తివంతమైన భారతీయ సమాజాన్ని నిర్మించే దిశగానూ ఏమాత్రం దోహదం చేయలేవు. పైగా ఈ సమాజాన్ని మరింతగా వైరుధ్యాలతో నిర్వీర్యం చేయడానికే పనికివస్తాయి. మొత్తంగా- ఈ విద్యావిధానం పెద్ద పెద్ద ఆలోచనలతో ఆశయాలతో నిండివున్నా, అందుకు అనుసరించదలచిన వ్యూహాలు, విధానాల కారణంగా విరుద్ధమైన ఫలితాలనిచ్చేదిగా ఉందని చెప్పక తప్పదు.


వెనక్కి ...

మీ అభిప్రాయం