అమ్మభాషలో చదువు ప్రాథమిక హక్కు!

  • 285 Views
  • 0Likes
  • Like
  • Article Share

    మాడభూషి శ్రీధర్‌

  • కేంద్ర మాజీ సమాచార కమిషనర్, న్యాయ విద్యావేత్త
  • హైదరాబాదు
  • 8447651505
మాడభూషి శ్రీధర్‌

అమ్మభాషలో విద్యాబోధన, మానవ సమాజ వికాసానికి జీవనాడి. అయినా సరే, తెలుగునాట ఆంగ్లంలో విద్యాబోధనకే పాలకులు ఉవ్విళ్లూరుతున్నారు. ఆమేరకు ఆదేశాలూ ఇచ్చేస్తున్నారు. మాతృభాషలో విద్యాబోధనను నిరాకరించే అధికారం అసలు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందా? ఈ విషయంలో రాజ్యాంగ నిబంధనలు ఎలా ఉన్నాయి? న్యాయస్థానాలు తీర్పులు ఏం చెబుతున్నాయి?

నూతన జాతీయ విధానం ప్రాథమిక విద్యాబోధన మాతృభాషలో సాగించాలని సూచించింది. ఇది పాత సంగతే కానీ కొత్త విధానంలో కూడా ఉండటం సంతోషం. కానీ ఇది కేవలం సూచన మాత్రమే. రాష్ట్రాల మీద ఏదీ రుద్దడానికి వీలుండదు. మన సంవిధానంలో విద్య రాష్ట్రాల అధికార పరిధిలో ఉంది. కేంద్రంలో లేదని కాదు. ఉమ్మడి పరిధిలో కూడా ఉంది. కాబట్టి జాతీయ విద్యావిధానం, అందులో మాతృభాషకు ప్రోత్సాహం చాలా అవసరమైన మంచి అంశం. కాదనలేం. 
      తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, కొత్త విధానాలూ నిషేధాల   వల్ల, మనం తొలిచదువులను తెలుగులో చదువుకోవడం ఇప్పుడు చర్చనీయాంశ మైంది. తెలుగు భాష కవితలకు, కావ్యాలకు, కథలకు, నవలలకు మాత్రమే కాకుండా దైనందిన జీవనవిధానంలో సంభాషణా సాధనంగా, జీవన సమాచార ప్రసార వాహికగా ఉపయోగపడుతున్నద నడంలో ఎవరూ సందేహించనక్కర్లేదు. అయితే అక్కడికే పరిమితం చేయడం తప్పు. భాష ఒక ప్రాంత జీవనానికి సంకేతం. అందులో ఒక సంస్కృతి, ఒక జ్ఞాన సంపద, ఒక సాహితీ భాండాగారం, జీవన విధానం, చరిత్ర, భాషా సంస్కారాలు ఉంటాయి. తెలుగు రాకపోతే అవన్నీ అర్థంకావు. మన వంశంలోని పూర్వికుల గురించి కూడా అర్థం కాదు. భాష ఒక వ్యక్తిత్వం. స్వామి వివేకానంద శరీరానికి నెత్తురు ఎలాంటిదో మెదడుకు మాతృభాష అలాంటిది అన్నారు. ఆ భాష పోయినా, లేదా రాకపోయినా, ఇవన్నీ పోయినట్టే. నాకు తెలుగు రాదు అని ఎవరైనా ఇంగ్లీషులో అంటే ఏ భాషలో నవ్వాలో ఏ యాసలో ఏడవాలో తెలియదు.  
ప్రజల ఉమ్మడి ఆస్తి
ఇప్పుడు తెలుగు భాష విద్యాబోధనా మాధ్యమం కావాలా వద్దా అనేది రాజకీయమైపోయింది. సామాజికవర్గాల మధ్య వివాదంగా మారింది, చాలా ఆశ్చర్యకరంగా. ఇట్లా అవుతుందని ఎవరూ అనుకోలేదు. కానీ అయ్యింది. దానికి కారణం కూడా తెలుగువారే. మనం పిల్లలను అమెరికా పంపడం కోసం, లేదా పెద్ద ఉద్యోగాలు చేయడం కోసం ఆంగ్లమాధ్యమంలో చేర్చుతున్నాం. అక్కడినుంచి తెలుగును వదులుకోవడం ఆరంభమైంది. ఉత్తరాదిన హిందీని ప్రోత్సహించట్లేదనే విమర్శ ఉంది. మన రాష్ట్రాల్లో తెలుగును ప్రోత్సహించట్లేదు. అధికార భాషా సంఘాల్ని పని చేయనీయట్లేదు. వారి సూచనలు విన ట్లేదు. కొన్ని సందర్భాల్లో అవి లాంఛన మైన పదవులుగా మారిపోయాయి కూడా. 
      నందివెలుగు ముక్తేశ్వరరావు విశ్రాంత ఐఏఎస్‌ అధికారి. తెలుగంటే అభిమానించే హృదయం ఉన్న వ్యక్తి. ఆయన భాష ప్రజల ఉమ్మడి ఆస్తి అన్నారు. చాలా నిఖార్సయిన మాట. అనేకానేక బీఎడ్‌ కళాశాలలు, డైట్లు ఉన్నాయి- మన రాష్ట్రాల్లో ఉపాధ్యాయ విద్యను బోధిస్తున్నాయి. తెలుగు గురించి ఏం చెప్పమని చెబుతున్నాయి అవి? తెలుగు బోధన, తెలుగులో బోధన గురించి ఇక్కడ సరైన బీజాలు పడాల్సి ఉంది.
జీవన భాష కావాలి
మాతృభాషలో మాత్రమే పిల్లలు తొందరగా పెద్ద విషయాలు కూడా సులువుగా తెలుసుకోగలగుతారని 2020 జాతీయ విద్యావిధానంలో పేర్కొన్నారు. వారికి అర్థం కాని భాషలో విషయ జ్ఞానం బోధించడం మొదలుపెడతే మొదట్లోనే తమకు అర్థమయ్యే శక్తి లేదని నిరాశతో కొనసాగే ప్రమాదం ఏర్పడుతుంది. తమపై తాము విశ్వాసం కోల్పోతారు. గిరిజనులకు వారి భాషలో చెప్పాలి గాని మన గ్రాంథిక తెలుగు వారికి మాతృభాష కాబోదు. మాతృభాష అంటే అక్కడ వాడే మాటలు, అక్కడి యాస, అక్కడి పదజాలాలు. ఉదాహరణకు తెలంగాణలో పిల్లలు చెల్లించే ఫీజును ఫీజు అనే అంటారు. విశాఖ ప్రాంతంలో జీతం అంటారు. ‘ఒరేయ్‌ జీతం కట్టావా’ అంటే హైదరాబాదులో అర్థం కాదు.
      తెలుగును పాలనా భాషగా వాడాలని అంటున్నాం. అంటే పాలకులు జీవోలను చట్టాలను తెలుగులో అనువదించడం కాదు. నేను జీవన భాష అంటాను. మనకు జీవన భాష తెలుగేనా? కాకపోతే మరే భాషలో మనం బతకగలం? కనుక బడిభాష, జీవన భాష, పాలన భాష, న్యాయ భాష తెలుగైతే అందరికీ ఉపయోగం. దరఖాస్తులు పెట్టుకోవడం నుంచి, ఫిర్యాదులు విని పరిష్కరించే దాకా, న్యాయార్థి దావానుంచి తుది తీర్పు దాకా, రేషన్‌ పదార్థాలు కావాల్సిన వ్యక్తి రేషన్‌ కార్డు కోసం దరఖాస్తు పెట్టుకోవడం నుంచి దస్త్రం నడపడం, తుది ఉత్తర్వు దాకా తెలుగును వినియోగిస్తే అనుకున్న పని అవుతోందో లేదో తెలుసుకోవడం సులువు అవుతుంది. ఎక్కడ ఏది సులువుగా అర్థం కాదో అక్కడ లంచగొండితనం ఉంటుంది. అంటే తెలిసిన వాణ్ని అడిగాలి. అతను ప్రతిఫలం ఆశిస్తాడు. రెవెన్యూ భూమికి సంబంధించిన రికార్డులు ఎవరికీ అర్థం కావు. అక్కడ అవినీతి ఎక్కువ. చట్టం అర్థం కాదు. పూర్తిగా లాయర్ల మీద ఆధారపడతారు. వారిలో కొందరు దోచుకోవడానికి వీలవుతుంది. డాక్టర్లు కూడా అంతే. మనకేమీ తెలియదు. మోసపోవడానికి ఆస్కారం ఎక్కువ. కనుక కనీస జీవన అంశాలను తెలియజేసే విద్య ఒకటి తెలుగులో ఉండాలి. నయీ తాలిమ్‌... బేసిక్‌ విద్య అని గాంధీ అనేవారు. మా వరంగల్లులో టంకశాల నరసింహారావు (ఈనాడు తదితర పత్రికల్లో పనిచేసిన సీనియర్‌ పాత్రికేయులు టంకశాల అశోక్‌ తండ్రిగారు) ఎప్పుడు అవకాశం వచ్చినా అందరికీ బేసిక్‌ విద్య నేర్పాలి.. నయీ తాలిమ్‌ అనేవారు. సభలు, సమావేశాలు, జిల్లాపరిషత్‌ సమావేశాల చర్చలు, నిర్ణయాలు, కింది కోర్టు విచారణలు, పోలీసు పత్రాలు తెలుగులో ఉండాలి. ఇవాళ తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్‌లో కానీ తెలుగువాడు ఇంగ్లీషు వస్తే తప్ప బతకలేడు. ఇంటర్మీడియట్‌ నుంచి పై చదువులన్నీ ఆంగ్ల మాధ్యమంలోనే. నా చిన్నప్పుడు బీఎస్సీ తెలుగు మీడియం ఉండేది. పాఠ్య పుస్తకాలు తెలుగులో చాలా బాగుండేవి. ఇంగ్లీషు మీడియం వారు (నేను) కూడా సబ్జెక్ట్‌ కోసం తెలుగు మీడియం పుస్తకాలు చదివేవారు. మనల్ని మెకాలే పాడుచేశాడని తిట్టుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఎవరిని నిందించాలి?
అది చాలా తప్పు!
శబ్దాలు వినడం ప్రారంభమైనప్పటి నుంచి పాప, తల్లి వాడే భాషతో ఆ శబ్దాల అర్థాలను తెలుసుకుంటూ ఉంటుంది. తన భావాలను తల్లి వాడిన భాషలోనే తెలియజేస్తూ ఉంటుంది. ఆమె, ఆ అమ్మ ఏ దేశంలోనైనా ఏ రాష్ట్రంలోనైనా చెప్పే భాషే మాతృ భాష. మనకు తెలుగు. 
      బడిలో చాలామంది పిల్లలు మాట్లాడకపోవడానికి కారణం పాఠాలు చెప్పే భాష సరిగా రాకపోవడమే. అందువల్ల బెత్తం దెబ్బలు తింటారు, తిట్లుకూడా తింటారు. నిరాశ ఆత్మన్యూనతకు అవే కారణాలు. అమ్మతో అనుబంధం పెంచిన భాష టీచర్‌తో అనుబంధం పెంచకపోగా తుంచుతుంది. అదే భాషయితే పెరుగుతుంది. 
      ఇంగ్లీషు అవసరం. తెలుగు జీవితం. రెండూ ఉండాలి. అంటే తెలుగు బడులు, ఇంగ్లీషు బడులు విడివిడిగా ఉండాలని కాదు. ఒక బడిలో రెండూ ఉండాలని. అంటే తెలుగు ఇంగ్లీషు మీడియం క్లాసులు ఉండాలని కాదు. ఒకే తరగతిలో ప్రతి పిల్లాడూ రెండు భాషలు నేర్చుకునే అవకాశం ఉండాలని. రసాయన శాస్త్రం చదివిన వాడు, బడి స్థాయి దాటిన తర్వాత కెమిస్ట్రీలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేయాలి. అప్పుడు ఇంగ్లీషు వస్తుంది. దాంతోపాటు అతనికి అంతవరకు తెలుగు కూడా వచ్చి ఉంటుంది. తెలుగు పదివేల పదాలు నేర్పండి, ఇంగ్లీషు పదిహేను వేల పదాలు నేర్పండి. ఇంగ్లీషులో ప్రావీణ్యం వస్తుంది. తెలుగులో పట్టు ఉంటుంది. అతనికి ఆసక్తి ఉంటే తెలుగు పదాలు కూడా పెంచండి. కవి, రచయిత అవుతాడు. మంచిదే కదా. ఇంగ్లీషులో రాయడం చదవడం వచ్చి తీరాలి. ఇంగ్లీషు గట్టిగా నేర్పడం చాలా అవసరం. ఇంగ్లీషు మీడియంలో చదువు చెప్పే లక్ష్యం కేవలం ఇంగ్లీషులో ప్రావీణ్యం కోసమే అంటే అది చాలా తప్పు. ఇంగ్లీషులో మాట్లాడించేందుకు, చర్చలు సాగించేందుకు, తప్పుల్లేకుండా రాసేందుకు కావాల్సినని కోర్సులు పెట్టుకోవచ్చు. కానీ కేవలం ఇంగ్లీషులో నిష్ణాతులు కావడం కోసం ఇంగ్లీషు మీడియం అవసరం అనీ, తెలుగు మీడియం రద్దు చేయాలనీ అనుకోవడం ఎంతవరకు న్యాయం? ఒక భాషలో నిష్ణాతుడైతే అతడికి మరొక భాషలో అగ్రస్థాయి సాధించడం సులువు. తెలుగు పరిపూర్ణంగా నేర్పండి, ఇంగ్లీషు సులువుగా వస్తుంది. అయితే తెలుగు అనే చోట స్థానిక భాష అనే పదం పెట్టుకుని ఈ అంశాలు పరిశీలించాలి. 
ఆక్స్‌ఫర్డ్‌దీ అదే మాట
జీవన భాషనుంచి తెలుగును బయటికి తోసేస్తున్నాం. అందులో కొన్ని దశలు మనం ఇదివరకే సాధించాం. ఒకటి పాలనా వ్యవహారాల నుంచి నిష్క్రమించాం. తర్వాత బోధనా మాధ్యమం ఎందుకోయ్‌ అన్నాం. భాషా రక్షణ అనేది ఏడాదిలో ఒక దినం పెట్టడం వంటి వార్షిక తంతుగా మార్చేశాం. తెలుగు సభలు నిర్వహించి చేతులు దులుపుకుంటాం. రోజువారీ జీవితంలో తెలుగు మాట్లాడం. ఇక భాష అస్తమించక ఏమవుతుంది. ఇవన్నీ భాష అస్తమించే దశలని పెద్దలు ముక్తేశ్వరరావు చెప్పారు. 
      పదోతరగతి తర్వాత మనకు ఇంగ్లీషుతో తెలుగుతో పనిలేదు. ఇంజినీ రింగ్, మెడిసిన్‌ సీటు కావాలి. అంతే. దానికి వెంపర్లాటలు. ఇంగ్లీషు ఎందుకు కావాలంటే విదేశాలకు వెళ్లడానికి. అది ఇంకో పిచ్చి. ఎందుకు ఎగబడుతున్నాం? నూతన విద్యా విధానం రూపొందించే వారు ఈ అంశాన్ని పరిశీలించారు. ఇంగ్లీషు వస్తేనే విద్యావంతులు అనే అభిప్రాయం ఒకటి స్థిరపడింది. ఎలైట్‌ క్లాస్‌ అని ఒకటి తయారైంది. వారు ఇంగ్లీషు ధారాళంగా మాట్లాడతారు. వారు దేశంలో 15 శాతం మంది మాత్రమే ఉన్నారు. ఈ వర్గంలో చేరడానికి పోరాటం. వారికోసమా ఇంగ్లీషు మీడియం?
      మధ్య అమెరికాలో ఒక చిన్న దేశం గ్వాటెమలా. పాఠశాల విద్య మాతృభాషలో జరగాలని ప్రత్యేకంగా అనేక కార్యక్రమాలను చేపట్టింది. విద్యాబోధనకు అంతకుముందు కన్నా తక్కువ కేటాయింపులతో విజయం సాధించింది. బడి ఎగ్గొట్టే వారి సంఖ్య తగ్గి బడిలో చేరాలనే ఆసక్తి పెరిగేట్టు చేశారు. అదే విధంగా పశ్చిమాఫ్రికాలోని మాలిలో విద్య మాతృభాషలో రాణిస్తుందని, విద్యార్థులలో సృజనాత్మకత పెరుగుతుందని నిరూపించారు.
      మొదటి భాష అంటే అమ్మభాష, ఇంగ్లీషు మాధ్యమాల్లో చదువుకున్నవారు కేవలం ఇంగ్లీషులో మాత్రమే చదువుకున్నవారి కన్నా విద్యారంగంలో మెరుగ్గా రాణిస్తున్నారని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం ఓ పరిశోధనలో తేల్చి మాతృభాష అవసరాన్ని నొక్కి చెప్పింది. కేవలం ఆంగ్లంలోనే చెప్పాలని విధానాలు రూపొందించే వారికి రెండు భాషల్లో సమంగా నేర్పడానికి పథకాలు రచించాలని,  ఆంగ్లంలో మాత్రమే బోధించాలనే విధా నంలో పస లేదనీ, తొలిభాషలో బోధనను సమర్థించాలని ఆక్స్‌ఫర్డ్‌ సిఫార్సు చేసింది.  
చైనాను చూసైనా..
యునెస్కో 30వ సర్వసభ్య సమావేశంలో (1999) కనీసం మూడు భాషల్లో అంటే ప్రాంతీయభాష (మాతృభాష), జాతీయ భాష, అంతర్జాతీయ భాషల్లో బోధన జరగాలని సభ్యదేశాలన్నీ తీర్మానించాయి. ఆక్స్‌ఫర్డ్‌ పరిశోధనను ఆధారం చేసుకుని యునెస్కో తన నివేదిక ప్రాథమిక పాఠశాలల్లో ఉత్తమ ప్రమాణాల విద్య మాతృభాషా మాధ్యమంతోనేనని తేల్చింది. ఫిలిప్పీన్స్‌ కూడా ఈ విధంగా విద్యావిజయాలు సాధించింది. ఇథియోపియాలో 1994 విధానం ప్రకారం ప్రాథమిక పాఠశాలలో ఆదివాసీలకు మాతృభాషా మాధ్యమం తప్పనిసరి. దాంతో వారి చదివే శక్తి 40 శాతం పెరిగింది. ప్రాథమిక విద్య పూర్తిగా నేర్చుకునే శక్తి 5 శాతం పెరిగిందని రాజేశ్‌ రామచంద్రన్‌ అనే పరిశోధకుడు తేల్చారు. అధికార భాషలో విద్యాబోధన- స్థానికుల సొంత భాషలో బోధనను పోల్చి రామచంద్రన్, డేవిడ్‌ డి లైటిన్‌ కలిసి ఒక పరిశోధనా పత్రం రాశారు. సొంత భాషలో చదువుకున్నవారి కాగ్నిటివ్‌ టెస్ట్‌ మార్కులు, ఆయుష్షు, తలసరి స్థూల స్వదేశీ ఉత్పత్తి పెరిగాయని లెక్కలు కట్టి మరీ చెప్పారు. ఇంగ్లీషులో చదువుకున్నవారి సంపాదన ఎక్కువ అనే మాటను కూడా అధ్యయనం చేశారు. సంపన్న కుటుంబాల నుంచి వచ్చిన  వారు ఇంగ్లీషు మీడియంలో చదువుతారు. తర్వాత వారి సంపాదన పెరగడానికి కారణం ఆ కుటుంబాల వనరులే కాని   ఆ ఘనత అంతా ఇంగ్లీషుకు చెందదు  అని తేల్చారు. 
      మొత్తం చదువును కేవలం ఇంగ్లీషు మీడియంలోకి మార్చడం ప్రపంచం అంతటా జరుగుతున్నదనుకోవడం సరి కాదు. దక్షిణ కొరియా నుంచి యూరోప్‌ అంతా సైన్స్‌ చదువులు కూడా మాతృ భాషలోనే. ఉన్నత విద్య, స్నాతకోన్నత విద్యకూడా అమ్మభాషలోనే సాగుతున్నాయి. భారత్‌లో ఇదెందుకు సాధ్యం కాదు? ముందు ఉపాధ్యాయులను అడగాలి. రోజూ పిల్లలకు చదువులు చెప్పడంలో జీవితం అంతా గడిపే టీచర్లకు తెలుసు వారికి ఏ మీడియం చదువు సులువుగా మెదడుకెక్కుతుందో. ఉన్నత విద్య కూడా మాతృభాషలో సాగించడం కోసం ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రామాణిక ఆంగ్ల వైజ్ఞానిక గ్రంథాలను తెలుగులోకి అనువదించాలని అనేకమంది రచయితలు సూచించారు. చదువులు నిజంగా నేర్పాలనే చిత్తశుద్ధి ఉంటే సాధ్యం కానిదేదీ లేదు. 
      ముఖ్యంగా భాష విషయంలో మనం చైనా ఉదాహరణను ఎందుకు గమనించడం లేదు? చైనీయులు అన్నింటిని తమ భాషలోకి అనువదించుకుని చైనీస్‌ భాషలోనే నేర్చుకుని ప్రపంచంలోనే అగ్రగామి రాజ్యంగా వెలుగుతున్నారా లేదా? దాంతోపాటు ఇంగ్లీషు కూడా నేర్చుకుంటున్నారా లేదా? రెండు భాషలు వచ్చిన దుబాసీలతో ఏ లోటూ లేకుండా విదేశీ వ్యవహారాలను కూడా సాగిస్తున్నారు. జపాన్‌ కూడా ఈ విధంగానే కృషిచేస్తూ పెద్ద ఎత్తున స్వభాషను నిలబెట్టుకుంటోంది.
రాజ్యాంగాన్ని పట్టించుకోరా?
మన సంవిధానం ఆర్టికల్‌ 350 ఏ ప్రాంతీయ భాషల్లో ముఖ్యంగా స్థానిక భాషల్లో విద్యా బోధన జరగాలని పేర్కొంది. ఆర్టికల్‌ 21ఏ విద్యాహక్కు ప్రాథమిక హక్కులో భాగమంది. దానికి అనుగుణంగా విద్యా చట్టం చేశారు. అయిదో అధ్యాయం మాతృభాషలో విద్యాబోధన సౌలభ్యాన్ని వివరించింది. పాఠాలన్నీ రాజ్యాంగ విలువలకు అనుగుణంగా ఉండాలని, దానికి అనేక సంస్థలు కృషి చేయాలని సూచించింది. ఆర్టికిల్‌ 30 కింద మైనారిటీ వర్గాలు విద్యాసంస్థలను నిర్వహించుకునే  అధికారం ఉంది. 
      ప్రాథమిక హక్కుల్లోకెల్లా గొప్పది భావవ్యక్తీకరణ స్వాతంత్య్రం. మొత్తం తెలుగుమాధ్యమం లేకుండా చేయడం ఆ హక్కుపైన ఒక అసమంజసమైన పరిమితి అవుతుంది. తెలుగులో బడులు నడిపే వారు మైనారిటీగా మారిపోయారు. ఆ మైనారిటీలకు 19(1)(జీ) కింద తెలుగుబడులు నడుపుకునే హక్కుకు కూడా ఇంగ్లీషు మీడియంలోకి మారాలనడం భంగకరం అవుతుంది. ఆర్టికల్‌ 29 కింద కూడా తెలుగును త్యజించే అధికారం ప్రభుత్వానికి లేదు. 2009 విద్యాచట్ట నియమాలకు కూడా పూర్తి వ్యతిరేకం. 
      భారతీయత నెత్తురు రంగు అనుకుంటే రుచి ఇంగ్లీషు ఉండాలనే ఉద్దేశంతో ఆంగ్ల బోధనను ఈస్ట్‌ ఇండియా కంపెనీ ప్రవేశ పెట్టింది. మెకాలే ఆంగ్ల బోధనను ప్రోత్సహించి తద్వారా కొందరు అగ్రవర్గాలను మాత్రమే విద్యావంతులను చేసి అంతరాలు కల్పించాలని సంకల్పించాడు. 1854లో ఆంగ్ల భాషను దేశమంతా వ్యాపింపజేయడానికి పథకం రచించాడు. ఆయన కూడా ప్రాథమిక స్థాయిలో ప్రాంతీయ భాషల్లో బోధన, ఇంగ్లీషు హైస్కూళ్లు, తర్వాత ప్రెసిడెన్సీ కళాశాలల్లో ఇంగ్లీషు ఉన్నత విద్య నేర్పాలన్నాడు. 
      కస్తూరి రంగన్‌ కమిటీ రూపొందించిన నూతన విద్యావిధానంలో చాలా స్పష్టంగా ఎనిమిదో గ్రేడ్‌ వరకు స్థానిక భాషలో చదువు చెప్పాలని, వీలైనంత మేరకు స్థానిక లేదా ఇంటి భాష అంటే అమ్మభాషలో బోధన చేస్తూ పైకి వెళ్లాలని సూచించింది. అమ్మభాషలో విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన వాటితో సహా ఉత్తమప్రమాణాల పుస్తకాలను ప్రచురించాలని సూచించింది. ఇండియన్‌ ట్రాన్స్‌లేషన్‌ అండ్‌ ఇంటర్‌ప్రిటేషన్‌ మిషన్‌ రూపొందించాలన్నారు. భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాలకు కూడా తమ భాషలలో వీలైనన్ని ఎక్కువ బడులు నడుపుకునే అవకాశాలు పెంచాలన్నారు.
      భాష చదువు నేర్చుకునే పరికరం, తర్వాత డబ్బుసాధించే సాధనం అనే లక్ష్యాలకే పరిమితం కావడం న్యాయం కాదు. భాష సంస్కృతి నాగరికతల పునర్వికాసానికి సాధనం. విజ్ఞాన నిధిని, ఒక సమాజ జీవనాన్ని అర్థం చేసుకునే మార్గం, మాధ్యమం భాష. ఒక్క నూతన విద్యావిధానమే కాదు, ప్రపంచమంతటా అన్ని దేశాలలో ఉన్న వారు మాతృభాషలో విద్యా నేర్పాలని అంటున్నారు. యునెస్కో సిఫార్సు కూడా అదే. అనేక విద్యా సంస్కరణల కమిటీలన్నీ ఈ మాట చెబుతున్నాయి. మహాత్మా గాంధీ, టాగోర్,  జె.బి.కృపలాని, ఎం.సి.చాగ్లా, మౌలానా అబుల్‌ కలాం ఆజాద్, పీవీ నరసింహారావు లాంటి నాయకులు చాలామంది కూడా ఇదే అభిప్రాయం చెప్పారు. మనకు పనికి రాదు అంటే సరిపోతుందా? నిషేధిస్తే సమంజసం అవుతుందా? ఆంగ్ల మీడియంలో బోధన అంటే తెలుగు మీడియం నిషేధమని అర్థమైతే అది న్యాయబద్ధమా?  
న్యాయస్థానాలు ఏమంటున్నాయి?
సొంతభాషలో వ్యక్తీకరణ చాలా సులభంగా ఒక ప్రవాహంలా సాగుతుంది. దాన్ని మాధ్యమాల నిషేధ జీవోలతో కట్టడి చేయడం వ్యక్తీకరణ స్వేచ్ఛను భంగపరచడమే అవుతుందని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు 2020లో చరిత్రాత్మకమైన తీర్పు చెప్పింది. తెలుగు మీడియంలో పాఠశాలలు నడుపుకునే స్వేచ్ఛ ఆర్టికల్‌ 19(1)(జీ)లో ఉంది. వాటిని నిషేధించడం ఈ హక్కును భంగపరచడమే. విద్యాసంస్థలు నడుపుకోవడం ప్రాథమిక హక్కు అనీ, 19(6) కింద మాత్రమే ఆ హక్కుపై పరిమితి విధించవచ్చుననీ సుప్రీంకోర్టు టి.ఎం.ఎ పాయ్‌ కేసు(ఏఐఆర్‌ 2003 సుప్రీంకోర్టు 355)లో తీర్పుచెప్పింది. జీవించే హక్కులో విద్యాహక్కు ఉందని మోహినీ జైన్‌ కేసు (1992 ఎస్‌సీఆర్‌(3) 658)లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీని తర్వాత 2002లో రాజ్యాంగాన్ని సవరించి 21ఎ విద్యాహక్కును చేర్చారు. 
      విద్య ఉమ్మడి జాబితాలో, రాష్ట్రాల జాబితాలో కూడా ఉంది. 2009లో విద్యా చట్టంలో సెక్షన్‌ 29(ఎఫ్‌)లో సాధ్యమైనంత వరకు బోధనా మాధ్యమం విద్యార్థి అమ్మభాషలోనే ఉండాలని నిర్ధరించారు. సెక్షన్‌ 7(3)లో లక్ష్యాలను వివరిస్తూ మొదటి లక్ష్యంగా అమ్మభాషలో తిరుగులేని అక్షరాస్యత, వాక్చాతుర్యం నేర్పాలని  పేర్కొన్నారు. సెక్షన్‌ (4)(బి)లో అమ్మభాష, ప్రాంతీయ భాషల్లో భాషా నైపుణ్యం, సాహిత్య రసాస్వాదన పెంపొందించడానికి పని చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించారు. అయితే, ఇంగ్లీషులో ప్రతిభ పెంచడానికి ప్రభుత్వ పాఠశాలలను ఇంగ్లీషు మీడియం బడులుగా మార్చాలని 7(3)(సి) సవరణను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఉమ్మడి జాబితాలోని అంశంపై ఒక రాష్ట్రం ఏకపక్షంగా ఇలా సవరించడం చట్టబద్ధం కాదని హైకోర్టు పేర్కొంది. 
      అమ్మభాష అంటే తెలుగు మాత్రమే కాదు, మైనారిటీ వర్గాల భాషలు, ఇతర స్థానిక భాషలు కూడా వస్తాయి. ఏది అమ్మభాషో తల్లిదండ్రులు, పోషకులు నిర్ణయిస్తారు. విద్యార్థి ఏ భాషలో సానుకూలంగా ఉన్నాడో అది అమ్మభాష అని సుప్రీంకోర్టు కర్ణాటక కేసులో తీర్పు చెప్పింది. ఒక్క కలంపోటుతో తెలుగు భాషా మాధ్యమ బడులన్నింటినీ ఇంగ్లీషు మీడియం స్కూళ్లుగా మార్చడం అంటే ప్రజలు తమకు కావాల్సిన మాధ్యమాన్ని ఎన్నుకునే స్వేచ్ఛను హరించడమే అవుతుంది, అంటే ఆర్టికల్‌ 19(1(ఎ) ప్రాథమిక హక్కు భంగకరమవుతుందని హైకోర్టు వివరించింది. రాష్ట్రంలోని అన్ని తెలుగు బడులను ఇంగ్లీషు బడులుగా మార్చాలని ఆదేశించడం, ఆ పాఠశాలలు నడుపుతున్న ప్రభుత్వేతర సంఘాలు వ్యక్తుల ప్రాథమిక స్వేచ్ఛ 19(1)(జీ)కు భంగకరమని, ఆర్టికల్‌ 21 కింద జీవించే హక్కును, 21ఏ కింద విద్యాహక్కును కూడా ఆమేరకు భంగపరచడమే అని నిర్ధరించింది. ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యాంశంపైన రాష్ట్రం చేసే చట్టం కేంద్ర శాసనంతో విభేదిస్తే చెల్లదు. రాష్ట్రపతి ఆమోదం ఉంటేనే రాష్ట్రశాసనం చెల్లుతుందని హైకోర్టు వివరించింది.
      ఉపనిషత్తులు పరిపూర్ణ మానవ వ్యక్తిత్వం అయిదుకోశాలతో నిర్మాణం అవుతుందని ఉద్బోధిస్తున్నాయి. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలవి. అన్నమయకోశం అన్నంతో, ప్రాణమయ కోశం ప్రాణవాయువుతో, మనోమయ కోశం విద్యతో, విజ్ఞానమయ కోశం అహంకారంతో, ఆనందమయ కోశం భావావేశాలతో పోషణపొందుతాయి. వ్యక్తిత్వం సమష్టిగా వృద్ధి చెందుతుంది, విడిగా ఒక్క కోశం మాత్రమే పోషణ పొందదు. బాల్యదశలో నేర్చుకున్న విద్య ఆ వ్యక్తి భావి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుంది అని హైకోర్టు వివరించింది.
      ఒక భాష, ఆ భాష మాట్లాడే  సమాజ సంస్కారాన్ని సంస్కృతిని మోసుకుపోయే శక్తి కలిగి ఉంటుంది. అమ్మభాషను కాదనుకోవడం,  నిషేధించడం, నిరాదరించడం అంటే మన ఉనికిని, చరిత్రను, అద్యతన భావిలో పౌరుల వ్యక్తిత్వాన్ని కాదనుకోవడమే అవుతుంది. 

* * *

‘‘గుమ్మం దగ్గరే నీ భాష, సంస్కృతిని వదిలేసి తరగతిలోకి రా అంటూ ఆదేశిస్తే, పిల్లాడు తన సొంత అస్తిత్వాన్ని, గుర్తింపును కూడా వదిలేసి వస్తాడు. ఈ తిరస్కార భావానికి లోనైన పసివాడు తరగతి గది కార్యకలాపాల్లో ఆత్మవిశ్వాసంతో పాల్గొనలేడు’’
- జిమ్‌ కమిన్స్, టొరొంటో (కెనడా) విశ్వవిద్యాలయ ఆచార్యులు


‘‘అన్యభాషా మాధ్యమంలోని విద్యార్థులు పాఠాన్ని చదవగలరు. బట్టీ కొట్టగలరు. కానీ, దాన్ని సొంతగా అర్థం చేసుకో లేరు. ఉపాధ్యాయులు చెబితే తప్ప విషయం బుర్రకెక్కదు. అదే బోధనా మధ్యమంగా మాతృభాషను వాడితే అర్థాన్ని ఊహించుకుంటూ చదువుతారు. నేర్చుకునే క్రమంలో ఇదే కీలకం’’
- కరోల్‌ బెన్సన్, స్టాక్‌హోం (స్వీడన్‌) విశ్వవిద్యాలయ ఆచార్యులు   


వెనక్కి ...

మీ అభిప్రాయం