పండగరోజు కావడంతో ముందే లేచి స్నానం చేసి పూజ కోసం ఫలహారాలు సిద్ధం చేసే పనిలో పడ్డాను.
పనంతా అయిన తర్వాత పిల్లలను నిద్రలేపి తలస్నానం చేయించి పూజ చేసుకోవడానికి కూర్చున్నాను. దేవుడికి ప్రసాదం పెట్టే సమయానికి నా చిన్న కూతురు పూజామందిరంలోకి వచ్చింది.
‘‘అమ్మా! నేనొకటి అడుగుతాను చెప్తావా’’ అని అడిగింది.
చెప్పక తప్పుతుందా అన్నట్లు ‘ఊ’ అన్నాను.
‘‘ఎందుకు ఇవన్నీ ఇక్కడ పెడుతున్నావు’’ అని ప్రసాదాలను చూపిస్తూ అడిగింది.
‘‘దేవుడికి’’ అన్నాను.
‘‘మరి దేవుడు ఇవన్నీ తింటాడా?’’
ఏం చెప్పాలో తెలియక ‘ఊ’ అన్నాను.
‘‘నేను కూడా తెచ్చి పెట్టనా’’ అంది.
‘‘సరే పెట్టు’’ అని నేను అక్కడి నుంచి బయటికి వచ్చేశాను. తను వంటగదిలోకి పరిగెత్తుకుంటూ వెళ్లి ఏవో ప్లేట్లు వెతుకుతున్న శబ్దం వినిపించింది. ‘ఏదైనా చేయాలనుకుంటే చేసి తీరుతుంది కదా’ అనుకున్నాను.
మరి కొద్ది సేపటికి ‘‘అమ్మా’’ అంటూ వచ్చింది. మళ్లీ ఏం గుర్తొచ్చిందో అనుకుంటూ ‘‘చెప్పమ్మా’’ అన్నాను. ‘‘మరి మన ఇంట్లో 12 చిన్న గ్లాసులు ఉన్నాయా?’’ అని అడిగింది.
‘‘లేదమ్మా ఆరే ఉన్నాయి అయినా అన్ని గ్లాసులెందుకే..!’’
‘‘ఇప్పుడెలాగా! అమ్మా, నీ పని అయ్యిందా?’’
‘‘లేదమ్మా ఇంకా కొంచెం ఉంది’’
‘‘తర్వాత చేసుకుందువుగాని, మనం బయటికి వెళ్దామా?’’
‘‘ఇప్పుడు బయటికి ఎందుకు?’’
‘‘మన ఇంట్లో ఎక్కువ గ్లాసులు లేవు కదా.. అందుకే’’
‘‘అన్ని గ్లాసులతో మనకేం అవసరం?’’
‘‘ఏం లేదమ్మా దేవుడికి టిఫిన్ పెట్టాం కదా.. మంచినీళ్లు ఇవ్వాలిగా, పాపం కారం అవుతుందేమో’’
‘‘కారం అవ్వడం ఏంటే.. ఏం మాట్లాడుతున్నావు’’
‘‘నువ్వు దేవుడికి గారెలు పెట్టావు కదా.. నేను చట్నీ వేశాను’’
నాకంతా అయోమయంగా ఉండి, అసలు తను ఏం చేసిందోనని పూజా మందిరం దగ్గరికి వెళ్లి చూశాను. నవ్వు ఆగలేదు.
పూజా మందిరంలో ఉన్న ప్రతి దేవుడి ప్రతిమ ముందు చిన్న ప్లేటు.. అందులో రెండు గారెలు, చట్నీ, కొంచెం పులిహోరా, చిన్న గ్లాసుతో నీళ్లు ఉన్నాయి.
ఇప్పుడు తనకి నేను ఏం చెప్పాలి?
దేవుడు తినడు అంటే నువ్వు ఎందుకు పెట్టావు అని అడుగుతుందేమో అని అక్కణ్నుంచి బయటికి వచ్చేశాను.