ప్రభుత్వ బడులా? మాధ్యమమా? ఏది అసలు సమస్య!

  • 122 Views
  • 11Likes
  • Like
  • Article Share

    నందివెలుగు ముక్తేశ్వరరావు

  • విశ్రాంత ఐఏఎస్‌ అధికారి
  • హైదరాబాదు
  • 9491428078
నందివెలుగు ముక్తేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జీవో ఎమ్మెస్‌ నం. 81, 85 ద్వారా రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించుకుంది. అదీ 2020- 21 విద్యా సంవత్సరం నుంచే అమలవ్వాలని హుకుం జారీ చేసింది. అసలు ఎలాంటి ప్రజాస్వామిక చర్చ, నిపుణుల అభిప్రాయ సేకరణ లాంటివి లేకుండా నెత్తిన పిడుగు పడ్డట్టు వచ్చిందీ వార్త. ఎందుకు ఇలాంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకోవాల్సి వచ్చింది? ఇందులో ఉన్న లాభనష్టాలేంటి? విద్యార్థులకు ఇది ఎంత వరకు ప్రయోజనం? భాషకు, మాధ్యమానికి సంబంధం ఏంటి? ఇలాంటి అన్నీ ప్రశ్నలకు ఉద్యోగమే పరమావధి, దానికి ఆంగ్లమే పునాది అన్నట్లు ప్రభుత్వం సమాధానం చెప్పింది. పైగా ఇప్పుడు తెలుగు మీడియం గురించి మాట్లాడుతున్న పెద్దమనుషుల పిల్లలందరూ ఏ మీడియంలో చదివారో చెప్పండి? అని తిరుగు ప్రశ్న! కానీ విద్య- బోధనా మాధ్యమం అన్న విషయం ప్రభుత్వ సొంత విషయంగానో, పొరుగు దేశాల అరువు కొలువుల కోసమో, పిల్లలు పలికే ఇంగ్లీషు చిలకపలుకులు చూసి మురిసిపోయే తల్లిదండ్రుల కోసమో చర్చించాల్సిన విషయం కాదు. 
      అదేంటి వీటికన్నా ఇంకేం కావాలి? నాలుగు రాళ్లు సంపాదించుకునే చదువు చదువుకుంటేనే కదా మనం బాగుపడేది అని మాత్రం అనుకోకండి. అసలు మనలో మనకు తెలియని అపోహలు చాలా ఉన్నాయి. వీటిని అర్థం చేసుకుంటే, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం చెప్పినట్లు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎంత అనాలోచితమైందో తెలుస్తుంది. 
గురు-శిష్యుల మధ్యన నడిచే గోష్ఠి విద్యకు మూలం.
ప్రస్తుత బడి విధానంలోనూ తరగతి గదిలో ఉపాధ్యాయుడు, పిల్లాడి మధ్యన జరిగే పరస్పర భావ ప్రసారమే (Classroom Transaction) విద్యకు పునాది.. నేర్చుకోవడం అనేది ఒక ప్రక్రియ. ఇది తరగతిలో అధ్యాపకుడు, పిల్లల మధ్య అత్యంత సహజంగా, సరళంగా, సులభంగా జరగాలి. అది కలగన్నంత తేలికగా, పూలు కోసినంత సులభంగా, గాలి వీచినంత సహజంగా జరగాలి. అది జరగాలి అంటే తరగతి గదిలో పరస్పర భావప్రసారం ఏ భాషలో ఉండాలి అన్నది కీలకం. ప్రపంచవ్యాప్తంగా యునెస్కోతో సహా అన్ని దేశాల్లోనూ, ప్రాథమిక స్థాయిలో మాతృభాషలోనే బోధన ఉంటే పిల్లలకు నేర్చుకోవడం పైన చెప్పినట్టు సహజంగా, సరళంగా జరుగుతుందని పేర్కొన్నారు.
      ఇక్కడే మాతృభాష చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. పాఠశాలకు వచ్చే మునుపే పిల్లాడు ఇంట్లో అమ్మానాన్నలతో, చుట్టాలతో, ఇరుగుపొరుగు వారితో మాట్లాడుతూ తనకు ఏం కావాలో తడబడకుండా చెప్పే స్థాయిలో మాతృభాషను నేర్చేసుకుంటాడు. పాఠశాలలో చేర్చగానే అక్కడ ఉపాధ్యాయుడు కూడా అదే భాషలో మాట్లాడితే చక్కగా తనకర్థమైన భాషలో వింటూ వింటూ, పాఠాల్లో లీనమవుతూ, అన్నీ తెలుసుకుంటాడు, నేర్చుకుంటాడు. కానీ అదే ఉపాధ్యాయుడు ఇంగ్లీషు మాట్లాడితే, ఈయన ఏం మాట్లాడుతున్నాడు అని అర్థం కాని పరిస్థితిలోకి వెళ్లిపోతాడు. పిల్లలకు గ్రహణ శక్తి చాలా ఎక్కువ, భాష విషయంలో ఇంకా ఎక్కువ. కానీ అంతమాత్రాన, బడిలో వేయగానే అన్నీ ఇంగ్లీషులోనే ఉంటే ఇంగ్లీషు వచ్చేయదు సరికదా, విషయజ్ఞానం ఒంటపట్టదు. చక్కగా తెలుగు మాట్లాడే తెలుగు రాష్ట్రాల్లోంచి మనల్ని ఉన్నపళంగా చైనాలోని గ్రామంలో వేసేస్తే, వాళ్లు కిం, చుం, చాం అంటూ ఏదో మాట్లాడితే మనకు ఎలా అనిపిస్తుందో, ఇంగ్లిష్‌ మాధ్యమ పాఠశాలలో పిల్లాడికి కూడా అలానే అనిపిస్తుంది. పెద్దలమైతే నాకు అవసరం లేదు అని చైనా నుంచి వచ్చేయొచ్చు, కానీ పాపం పిల్లల మాటలకు మనం ప్రాధాన్యత ఇవ్వం కాబట్టి, అలానే కొన్ని రోజులుంటే అదే వస్తుంది అనేసి ఆ కూపంలోకే నెట్టేస్తాం. ఉపాధ్యాయుడు చెప్పే విషయాల్లో సింహభాగం అర్థం కాక, అత్తెసరు జ్ఞానంతో, ముఖ్యమైన ప్రశ్నలను మాత్రమే బట్టీ కొడుతూ తరగతులు దాటేస్తుంటాడు. లేదంటే డుంకీలు కొడుతుంటాడు. మనం మాత్రం చదువు అబ్బలేదని, శ్రద్ధలేదని ఏవేవో సాకులు చెప్పుకుంటాం. ఇక్కడ ఇంకో విషయం ప్రస్తావించాల్సింది ఏంటంటే, మనం మాట్లాడుకునే ఇంగ్లీషు భాష నేర్చుకోవటం కోసం ఒకటో తరగతి నుంచీ ఇంగ్లీషు మాధ్యమం అవసరం లేదు. ఇది నిజమే అయితే, హిందీ భాష మాట్లాడే మనలో చాలా మంది హిందీ మాధ్యమంలోనే చదివారా? లేదు కదా. 
మన చట్టాలు ఏం చెబుతున్నాయి? జాతీయ విద్యావిధానం ఏమి చెప్తోంది?
అసలు చదువు ఎలా ఉండాలి? పాఠ్య ప్రణాళికలో ఏముండాలి? ఎలాంటి ప్రాంగణాల్లో చదువు చెప్పాలి? ఎలాంటి అధ్యాపకులను నియమించుకోవాలి? ఎలాంటి ప్రమాణాలు పాటించాలి? వీటి అన్నింటికీ సమాధానం మన జాతీయ విద్యా హక్కు చట్టం, ఆంధ్రప్రదేశ్‌ విద్యా చట్టాల్లో దొరుకుతుంది. ఇవి ఏదో ఆషామాషీగా చేసిన చట్టాలు కావు. జాతీయ విద్యావిధానం ప్రకారం, విద్యా ప్రణాళికా చట్రం ప్రకారం ప్రతి పదాన్ని, విషయాన్ని నిపుణుల సలహా సూచనలతో కూర్చి తయారు చేసిన చట్టాలు ఇవి. ఆంధ్రప్రదేశ్‌ విద్యా హక్కు చట్టం ప్రకారం చదువు చెప్పే ప్రాంగణాన్ని ‘బడి’ అనాలంటే, ఆ చట్టంలోని అన్ని అంశాలను పాటిస్తేనే, ప్రభుత్వం గుర్తింపునివ్వాలి. చట్ట ప్రకారం, ఎన్‌సీఈఆర్టీ, ఎస్‌సీఈఆర్టీ నిర్ణయించే పాఠ్య ప్రణాళిక ప్రకారమే చదువు చెప్పాలి. చట్ట పరంగానే ఆ ప్రాంగణాల్ని, వ్యవస్థను నడపాలి. ప్రైవేట్‌ పాఠశాలైనా, ప్రభుత్వ పాఠశాలలైనా ఇవే నిబంధనలు. ప్రభుత్వ పాఠశాలలకు మాతృ భాషా మాధ్యమం వర్తింపచేసి ప్రైవేటు పాఠశాలలకు వదిలెయ్యడం చట్ట రీత్యా చెల్లదు. 
      విద్యాహక్కు చట్టంలో సెక్షన్‌ 29, 2(ఎఫ్‌)లో పాఠ్య ప్రణాళికలు ఎలా ఉండాలి అని చెప్పే చోట, ‘వీలైనంతవరకు ప్రాథమిక దశలో మాతృ భాషలోనే బోధన జరగాలి’ అని పొందుపరిచారు. కరిక్యులం గురించి చెప్పే సెక్షన్లో మాధ్యమం గురించిన ప్రస్తావన చేసి, బోధనా మధ్యమంగా మాతృ భాష, పాఠ్యప్రణాళికకి ఎంత అవసరమో స్పష్టంగా పేర్కొన్నారు.
      నిర్బంధ ఉచిత విద్య కింద ఏ సంస్థ అయినా బడి అనిపించుకోవాలంటే అవి చట్టాన్ని, చట్టంలోని నిబంధనలను పాటించాలి. ఏదో మొహమాటానికో మర్యాదకో కాదు- అది వాళ్ల ప్రాథమిక విధి. మాతృభాషలోనే ప్రాథమిక విద్య నేర్పమని చట్టం ఘంటాపథంగా చెబుతుంటే దాన్ని ప్రభుత్వ బడులకు చక్కగా అన్వయించి, ప్రైవేటు బడులకు, మీ ఇష్టం పొండి!! ఇంగ్లీషే చెప్పండి!!! అంటూ ప్రభుత్వాలు ఒకరి తర్వాత ఒకరు పోటీపడి అనుమతి ఇచ్చాయి. ఇప్పుడున్న నిబంధన ప్రకారం ఈ విషయంలో ప్రభుత్వ యంత్రాంగం ఈ నిందను భరించక తప్పదు. 
ఇంగ్లీషు ఎంతవరకు అవసరం? 
అసలు ఈ ఇంగ్లీషు మాధ్యమం ఎక్కడ నుంచి వచ్చింది అంటే, ఆంగ్లేయులు పోయినా, ఆంగ్లాన్ని పట్టుకుని వేలాడే భావ దాస్య ప్రముఖుల వల్ల అందరి నెత్తిన వచ్చిపడింది. ఇంగ్లీషు మాధ్యమం ద్వారా, తక్కువ ఖర్చుతో, తమకు గుమస్తాలుగా పనిచేసే భారతీయుల్ని ఇంగ్లీషు వారు తయారుచేసుకోగలిగారు. వారు పోయినా, వారు నాటిన ఆ దాస్య భావన కాస్తా క్రమేపీ గొప్ప విషయంగా, ఇంగ్లీషు ఏదో సంపన్నులు, జ్ఞానవంతులు మాట్లాడే భాషగా కొంతమంది ఉన్నత వర్గాల వారు ఆంగ్లాన్ని నెత్తినెక్కించు కున్నారు. ఇది ఎందాక వచ్చిందంటే, కాకినాడ పక్కన గ్రామంలో ఒక రైతుకు విత్తనాలను అమ్మే కంపెనీ ఏజెంట్‌కు కూడా ఇంగ్లీషు రావాల్సిందే, రైతుతో మాట్లాడటానికి, విత్తనాల వివరాలు చెప్పటానికి తెలుగు సరిపోదా? లేదంటే ఇంగ్లీషులో ఏం చెప్పినా రైతు కొనేస్తాడన్న భావనా? ఇలా అనవసర ఉద్యోగాలకు కూడా ఆంగ్లాన్ని ముడేసేశారు.
      ఇంక ఇలా దావానలంగా మారిన ఈ ఇంగ్లిష్‌ పైత్యానికి తగినట్టు, ఇంగ్లిష్‌ మాధ్యమ చదువును ‘మార్కెట్లో దొరికే సరుకు’గా మార్చి ప్రైవేటు, కార్పొరేటు యాజమాన్యాలు బళ్లు తెరిచాయి. వాళ్లు ఆకర్షించాల్సింది తల్లిదండ్రుల జేబులో రూపాయిని. అది రాబట్టాలంటే తల్లిదండ్రులు మురిసిపోయేదిగా తన వస్తువును అందంగా చూపించటం అవసరం. దానికోసం పెద్ద భవనాలు, సొగసైన కుర్చీలు, ఖరీదైన హాస్టళ్లు, దేశ విదేశాల యాత్రలు, ‘స్పీక్‌ ఇన్‌ ఇంగ్లిష్‌’!! ఇలా బోలెడన్ని తళుకులు బెళుకులు. అసలు చదువుకోవడంలో ఉన్న ఆత్మసౌందర్యం, నేర్చుకోవడం అనే అనుభూతిని ఆస్వాదించటం పట్ల అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకి పట్టింపు లేకుండా వస్తువు ఆకర్షణీయత వెంటే మొత్తం సమాజం పరుగుపెడుతోంది. చదువుకునే వాళ్లకి మొత్తం ఇంగ్లిష్‌ మీడియంలో పాఠం చెప్పేస్తామని అద్భుతమైన ఆకర్షణ చూపిస్తూ అదే నాణ్యమైన, గొప్ప విద్యగా చెలామణి చేస్తున్నారు.
      ఈ సందర్భంలో రష్యా శాస్త్రవేత్త పావ్లోవ్‌ చేసిన ఒకానొక ప్రయోగం గుర్తుకొస్తోంది. ఇది నేర్చుకోవడానికి సంబంధించిన ప్రయోగం. ఒక యజమానికి ఒక కుక్క ఉంటుంది. రోజూ సరిగ్గా ఒక సమయానికి దానికి ఆహారం పెడుతూ ఉంటాడు. కానీ కొంత కాలం తర్వాత ఒక గంట దానికి వినపడేట్టు కొట్టి, ఆహారం పెడుతుంటాడు. కొన్నాళ్లు కాగానే ఆ కుక్క గంట కొట్టగానే అన్నం పెడతారని చూస్తుంది. గంట వినగానే దాని నోటి నుంచి లాలాజలం కరుగుతుంది. వాస్తవానికి గంట కొట్టడానికి ఆహారం పెట్టడానికి సంబంధం లేదు. యజమాని ఎప్పుడంటే అప్పుడు ఆహారం పెట్టొచ్చు. కానీ, కుక్క మాత్రం గంట కొట్టడానికి ఆహారం పెట్టడానికి సంబంధాన్ని కార్య కారణ సంబంధంగా అన్వయించుకుంది. అలానే, ఇంగ్లీషు మీడియం బడికి మంచి ప్రమాణాలు ఉన్న బడికి కార్యకారణ సంబంధం ఉందని చాలా మంది నమ్ముతున్నారు. ఇంగ్లీషు విద్య నాణ్యమైన విద్య అని ప్రచారం చేస్తున్నారు. దీంట్లో మాతృ భాషలో విద్య నేర్చుకోవడం నాణ్యమైన విద్య కాదు అనుకునే స్థితికి దిగజారిపోయాం. ఇది నిజమేనా? 
మాతృభాషా మాధ్యమం ఆదర్శం కాదు అవసరం, హక్కు.
సెక్షన్‌ 29 ప్రకారం ప్రాథమిక స్థాయిలో విద్యాబోధన మాతృ భాషలోనే జరగాలి. తరగతి గదిలో విద్యార్థి ఉపాధ్యాయుడి మధ్య పరస్పర భావ ప్రసారం మాతృ భాషలోనే ఉండాలి అని విద్యాహక్కు చట్టం చెబుతోంది. నూతన జాతీయ విద్యా విధానం నాలుగో అధ్యాయంలో 4.1.1 ప్రకారం పిల్లలకు ఇంటి భాషలోనే చదువు చెప్పాలని అంటోంది. ఇది అన్ని మాతృభాషల ప్రాధాన్యాన్ని వివరిస్తోంది. ఉదాహరణకు ఒక ప్రాంతంలో ఉన్న స్థానిక భాష కాని ఇతర భాషలు మాట్లాడేవాళ్లకి అంటే కోయ, గోండి, మొదలైన భాషలు మాట్లాడేవాళ్లకి కూడా వారి మాతృభాషలలోనే చెప్పమని- దాంతో పాటు స్థానిక, దేశీయ భాషని కూడా నేర్పమని జాతీయ విద్యావిధానం చెప్తోంది. ఇంటి భాషకు, స్థానిక భాషలకు ప్రాధాన్యం ఇచ్చే తీరులో నూతన విధానం ఉంది. ఇక్కడ ద్విభాషా విధానం అంటే ఇంటి భాష, స్థానిక భాష కలిసి పాటించవచ్చు. ఇంగ్లీషు అని కాదు. జాతీయ విద్యావిధానం ప్రకారం అయిదో తరగతి వరకు మాతృ భాష నూటికి నూరు శాతం తప్పనిసరి. ఎనిమిదవ తరగతి వరకు ప్రాధాన్యం ఇవ్వమంటోంది. ఇది ప్రైవేటు రంగంలో ఉన్న పాఠశాలలకూ వర్తిస్తుంది. 
      ఇంగ్లీషు మాట్లాడటమే విద్యా విజ్ఞానాలకు ధీటురాయిగా భావించే వారికి విద్య పైన అవగాహన కానీ, విద్యా చట్టాల గురించి కానీ, పిల్లల మనస్తత్వ వికాసం గురించి కానీ ఓనమాలు తెలియదు. ఒకవేళ వీరు చెప్పిందే నిజమైతే, యునెస్కో సైతం ప్రాథమిక విద్యను కచ్చితంగా మాతృభాష, స్థానిక భాషల్లోనే బోధించాలని ఎందుకు చెబుతుంది? ఎంతో మంది మేధావులు, విద్యావేత్తలు ఉన్నత విద్యను కూడా స్థానిక భాషల్లోకి తీసుకురమ్మని ఎందుకు సూచిస్తారు? ఇంతా కష్టపడి విద్యార్థి జీవితం మొత్తం ఇంగ్లిష్‌ మాధ్యమంలో చదివినా, పిల్లలు ఎందుకు అనర్గళంగా ఇంగ్లీషు మాట్లాడలేక పోతున్నారు? ఇది జగమెరిగిన సత్యం. అదే ప్రాథమిక విద్య నుంచీ ఉన్నత విద్య దాకా మనకు మన మాతృ భాషలోనే చదువుచెప్పే వనరులుంటే, మన భావ వ్యక్తీకరణకు, మేధస్సుకు, సృజనాత్మకతకు, సునిశిత బుద్ధి వికాసానికి మన భాష ఏ మాత్రం అడ్డంకి అవదు. మనకు కావల్సిన పుస్తకాలు మన భాషలో లభ్యమవుతూ, కంప్యూటర్లలోకూడా మన స్థానిక భాషలు వచ్చేస్తే, ఇక మనకు ఇంగ్లీషుతో పనేముంది.
      ఎనిమిది కోట్ల మంది ఉన్న జర్మనీ దేశంలో ఎల్‌కేజీ నుంచీ పీజీ దాకా, టూలెట్‌ బోర్డు నుంచి అధికార రాజపత్రాల దాకా ఒకే జర్మన్‌ భాష ఉన్నప్పుడు, రమారమి అదే జనాభా కలిగిన మన తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు తెలుగు మాధ్యమం కుదరదు? వారి భాషలోనే వారు పరిశోధనలు చేసుకుని, పరిశోధనా ఫలాల్ని కూడా వారి భాషలోనే నామకరణం చేసుకుంటారు జర్మన్లు. భూగోళ శాస్త్రంలో 'endrumpf, landschaftskunde' అంటూ వారి భాషలో నామకరణం చేసుకుంటే, ఆంగ్లంలో కూడా అదే వాడుతున్నారు. మన భాషలో మనం చదువుకుంటే, మనకు ఎంత సులువుగా విషయాలు తెలుస్తాయో ఇందాకే చెప్పుకున్నాం. అందువల్ల బోధనామాధ్యమంగా తెలుగు ఉండటం ఆదర్శం కాదు, సెంటిమెంట్‌ కూడా కాదు. అది శాస్త్రీయమైన ఓ అవసరం. 
అంటరానిది తెలుగు మాధ్యమమా? సర్కారీ బడులా?
చివరిగా ప్రభుత్వం వేసిన ప్రశ్ననే తీసుకుందాం. ‘మీ పిల్లలు ఏ మాధ్యమంలో చదువుతున్నారు?’ అని ప్రభుత్వం అడుగుతోంది. దాని బదులు అసలు ‘మీ పిల్లలు ఏ బడిలో చదువుతున్నారు?’ అనేది సరైన ప్రశ్న అవుతుందేమో అని ప్రజాభిప్రాయం. వెతుక్కుంటూ వెళ్తే ముఖ్యంగా గుమ్మడికాయల దొంగల పిల్లలు ఎవరూ ప్రభుత్వం పెట్టిన బళ్లలో చదవలేదు. కలెక్టర్, ఎస్పీ, సాంస్కృతిక శాఖ, విద్యా శాఖ మంత్రి, ముఖ్యమంత్రి, గవర్నర్‌ ఇలా ఎవరి పిల్లలూ ప్రభుత్వ బళ్లలో చదవట్లేదు. ఇది చూసి తహసీల్దారు, పోలీసు అధికారులు, ఎండీవోలు, వాళ్ల పిల్లలు ప్రభుత్వ బళ్లో చదవడం మానేశారు. అది చూసి ఆర్‌ఐలు, గుమాస్తాలు, పోలీసు సిబ్బంది పిల్లలు వేరే బళ్లలోకి వెళ్లిపోయారు. వాళ్లను చూసి మేము సైతం అంటూ డ్రైవర్లు, అటెండర్ల పిల్లలూ మారిపోయారు. ఆ తర్వాత రిక్షా వాళ్లు, ఆటో వాళ్లు కూడా ప్రైవేట్‌ బాట పట్టారు. ఇంకేముంది ఊళ్లో రైతులు పొలాలు పుట్రలు వదిలేసి, పిల్లల్ని ఊరి బడి మానిపించి పట్నాల మీద పడ్డారు బడి కోసం. అందరూ వెళ్లిపోయాక ఊళ్లో సర్కారీ బళ్లు ఖాళీ అయిపోతున్నాయి. ఆఖరికి టీచర్లు కూడా వాళ్ల పిల్లల ‘భవిష్యత్తు’ని దృష్టిలో పెట్టుకొని మరీ వేరే బళ్లకి వెళ్లిపోయారు. ఉట్టి పుణ్యానికి ఒళ్లో కూర్చోబెట్టుకుని పాఠం చెప్పిన బడిని, ఊరిలో అందర్నీ కాపాడే చదువులమ్మలా ఉన్న బడిని ఎందుకు వదిలి వెళ్లిపోయారు? కారణం ఏంటి? అందరికీ ఒక్కసారి పిచ్చి పట్టినట్టు, పూనకం వచ్చినట్లు రాత్రికి రాత్రి మారిపోరు కదా! అసలు ఏం జరిగింది?
      ఏం జరిగిందంటే, ఆటా పాటా, మాటా మంచి అన్నీ అందించే సామర్థ్యమున్న బడులు ప్రభుత్వం నుంచి వెళ్లిపోయాయి. బడి ఉంటేనే ఊరికి వచ్చి పోయే టీచర్లు, మార్కులు వచ్చేట్టు మాత్రమే చెప్పే చదువులు, సమాచారాన్ని నింపే పాఠ్య ప్రణాళికలు ఇవి మిగిలాయి. వీటన్నిటిలో- నేర్చుకునేది, నేర్పేది, బిడ్డ ఎదిగేది- తల్లిదండ్రులకు ఇవి కూడా కనుమరుగయ్యాయి. పిల్లలకు, వారి తల్లిదండ్రులకు జవాబుదారీగా ప్రభుత్వం, బడి విధానం తయారవ్వలేదు. కనీస సామర్థ్యాలు, కనీస నైపుణ్యాలు, రాయడం, చదవడం, భాగించడం లాంటివి పిల్లలకు అందకుండా ఉండిపోసాగాయి. అధికారులకైతే పైనుంచి కింద దాకా, పిల్లలంటే అందరూ శాతాలే! ఉత్తీర్ణత శాతం, మార్కుల శాతం, అటెండన్స్‌ శాతం, వగైరా.. కొంత కాలం అయ్యాక సర్కారీ బళ్ల మీద మనకే ఆశలు పోయాయి. అప్పుడే ఆరంభమైంది ఆ ప్రైవేట్‌ కథ. నామమాత్రపు ఫీజులతో, అత్యుత్తమ అధ్యాపకులు ఉన్న సర్కారీ బడులను వదిలేసి, డబ్బులు ధారపోసే ప్రైవేట్‌ బడులకు కేవలం ఇంగ్లీషు కోసమే వెళ్తున్నారు అని చెప్తే, అది ప్రభుత్వ వైఫల్యమే. మాతృభాషా మాధ్యమ సులువును వదిలి, కేవలం భాష నేర్చుకోవటం కోసం పిల్లలు ఇంగ్లీషు చుట్టూ ప్రదక్షిణ చేస్తుండటం, సులువైన విద్యను నాణ్యతగా అందించలేని ప్రభుత్వ వైఫల్యమే. ఇంగ్లీషు నేర్చుకోవటానికి మాధ్యమం అక్కర్లేదు. విషయ పరిజ్ఞానాన్ని, ఇంగ్లీషుని రెండింటినీ పిల్లలకు సరైన పద్ధతిలో అందిస్తాం అని చెప్పకపోవటం ప్రభుత్వ వైఫల్యమే. ఒక పిల్లాడు పదేళ్ల పాటు ఒక బడిలో చదువుకుని ఇంగ్లీషులో రాయడం, చదవడం, మాట్లాడటం, పట్టుమని పదివాక్యాలు కూడా చెప్పలేకపోతుంటే, అది ఇంగ్లీషు బోధనా వైఫల్యం కిందకు వస్తుంది కానీ, అది తెలుగు మాధ్యమం చేసిన పాపం కింద జమ చెయ్యడం అశాస్త్రీయం కదా. మనకి ఇంగ్లీషు రావాలంటే మన బడుల్లో ఇంగ్లీషు విభాగాలు మరింత శక్తిమంతం కావాలి. అంతే కానీ, మాధ్యమం మార్చితే ఇంగ్లీషు వస్తుంది అనుకోవడం సరైన పద్ధతి కాదు. దీని గురించి జాతీయ విద్యా విధానం ఏమంటోందంటేే, భాష నేర్పుతామని, భాష నేర్చుకోవడానికి మాధ్యమం సరైన పద్ధతి కాదు అని నొక్కి చెప్పింది. 
      కాబట్టి నాయకులారా.. మీ పిల్లలు ఏ మీడియంలో చదివారు? అని అడిగే ముందు ‘మీ పిల్లలు ప్రభుత్వ బడిలో చదివారా’ అనడగండి? సాధారణ ప్రజల్ని అటుంచితే కనీసం కొద్దిమంది అయినా మీ యంత్రాంగాలలో పనిచేసే వాళ్లలో, మంత్రాంగాల్లో పాల్గొనే వాళ్లలో కనీసం మచ్చుకైనా ఎందుకు లేరో! ప్రభుత్వ బడుల మీద అంత అపనమ్మకం ఎందుకు పెరుగుతూ వచ్చిందో, అందరూ మూకుమ్మడిగా సర్కారీ బడుల నుంచి ఎందుకు పారిపోయారో సమాధానాలు వెతికి పట్టుకోండి. నిజంగానే ఇంగ్లిష్‌ మాధ్యమమే సంజీవని అని మీరు అనుకుంటే, చివరిగా మీరు సమాంతరంగా ఇంగ్లిష్‌ మీడియం తెరిచినా పెద్దగా ప్రభుత్వ బళ్లలో మార్పు ఏమీ రాలేదన్నది గ్రహించండి. ఇంగ్లిష్‌ మాధ్యమం పేరుతో ప్రైవేట్‌ బడులు మాత్రం లాభపడ్డాయి. మరిన్ని బడులు పెట్టారు, రాబడులు పెంచుకున్నారు. లెక్కలు చూసుకోండి. నిజాయతీగా ఉంటే నికార్సయిన సమాధానం దొరక్కపోదు.
      తరగతి గదిలో చక్కగా పాఠం చెప్పగలిగినవాళ్లు, పిల్లలతో మమేకం కాగలిగిన వాళ్లు, పిల్లల సామాజిక నేపథ్యం లాంటి నేపథ్యం ఉన్న వాళ్లు చాలా మంది ఉపాధ్యాయులుగా ఉన్నారు. మన బడుల్లో విద్యా మిషన్లు ఏర్పాటైన తర్వాత బోధనా సామగ్రి, గ్రంథాలయం, విజ్ఞాన ప్రయోగశాలలు సమకూరాయి. ఇంత మంది మంచి ఉపాధ్యాయుల్ని పెట్టుకుని, వనరులని పెట్టుకుని అవి సరిగ్గా వినియోగం కాకపోతే వ్యవస్థ ఏమి చేస్తున్నట్టు? ఉన్న వనరులని, అవకాశాల్ని సరిగ్గా వినియోగించుకుని ఒక వ్యక్తి పురోగతి సాధిస్తే దాన్ని ‘సామర్థ్యం’ అంటారు. ఉన్న వనరులని, అవకాశాలని వ్యవస్థ కోసం వినియోగించి, వ్యవస్థలో ఆశించిన మార్పుని పొందితే దాన్ని ‘దక్షత’ అంటారు. ప్రభుత్వాలకు ఉండాల్సింది ఇది. లోపించిందీ ఇదే. అందువల్ల మన బడుల మీద విశ్వాసం పోయింది. ప్రజానీకం విశ్వాసం సన్నగిల్లడం వల్ల చాలా అపనమ్మకం ఏర్పడింది. ఈ మధ్య కాలంలో దీన్ని వివరించేందుకు చాలా మంది విద్యావేత్తలు దీన్ని ‘ట్రస్ట్‌ గాప్‌’ అని వర్ణిస్తున్నారు. దీన్ని సరి చెయ్యాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీదే ఉంది. 


‘‘పాఠశాల స్థాయిలో అయిదో తరగతి దాకా మాతృభాషలోనే అన్ని అంశాలూ చెప్పాలి; ఆరో తరగతి నుంచి ఒక పాఠ్యాంశంగా ఆంగ్లాన్ని నేర్పడం, ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి వరకూ ఏటా ఒక్కో సబ్జెక్టునూ ఆంగ్లంలో ప్రవేశపెట్టడం, ప్రధానంగా విజ్ఞానశాస్త్రాలు, సాంకేతిక విషయాలు; ఒకటి నుంచి పదో తరగతి వరకూ తెలుగు చదువుకున్న పిల్లలకు ఆంగ్లం నేర్చుకోవడం సులభం అవుతుంది. భావవ్యక్తీకరణలో సృజనాత్మకశక్తి దెబ్బతినకుండా ఉంటుంది; విజ్ఞానశాస్త్ర విషయాలను అంచెలంచెలుగా 8-10 తరగతుల్లో ఉభయభాషా విధానంలో నేర్పాలి. అప్పుడు అవగాహన బాగా పెరిగి పై తరగతులకు వెళ్లినప్పుడు ఉభయ మాధ్యమాలకు అలవాటు పడతారు’’ 

- భద్రిరాజు కృష్ణమూర్తి, విఖ్యాత భాషావేత్త


వెనక్కి ...

మీ అభిప్రాయం