తెలుగులో తమిళ పదాలు

  • 317 Views
  • 0Likes
  • Like
  • Article Share

తెలుగులో తమిళ పదాలు
తిరు అనేది శ్రీ నుంచి పుట్టింది. తెలుగులో శ్రీ... సిరి అయ్యింది. తమిళంలో తిరుగా మారింది. వైష్ణవ సంప్రదాయంలో ప్రతి పనికీ, వస్తువుకూ ఈ పదం చేర్చడం పరిపాటి అయ్యింది. తిరు- ఆరాధన.. తిరువారాధన (దేవపూజ). తిరు- అధ్యయనం.. తిరువధ్యయనం (తద్దినం), తిరు- మడప్పళ్లి - దేవాలయ పాకశాల. తళిగ... తళిగై వికృతి. మళిగ... మళిగై వికృతి. తిరు- మాళిగ.. పెద్ద ఇల్లు- మిద్దె, క్రమంగా గది, దుకాణాల అరలు అనే అర్థాలు ఏర్పడ్డాయి. నంబి- దేవాలయాన్నే నమ్మినవాడు- పూజారి. తంబళ్ల- శివాలయ పూజారి. తంబళ్ల తమిళ పద వికృతి. తంబి అంటే తమ్ముడు. ఆళావరు- ఆళ్వారు.... అంటే భక్తుడు. వైష్ణవ భక్తులలో పన్నెండు మంది ఆళ్వారులున్నారు. జియ్యరు.. జియ్యంగారు- అంటే సన్యాసి. నాంచారు - దేవి.. నాచ్చియార్‌.. వికృతి. ఆండాళ్‌.... ఇది గోదాదేవికి రూఢమయ్యింది. తిరునాళ్లు... - జాతర. తిరు.. శ్రేష్టమైన. నాళ్లు- దినాలు. పవిత్ర దినాలు. తాయి... అంటే తల్లి. తాయ్‌కి వికృతి. 
కైంకర్యం సంస్కృత పదం అయినా.. తమిళ సంప్రదాయం ద్వారా వచ్చింది గనక.. తమిళ పదంగానే గ్రహించాలి. దీనికి అర్థం భగవంతునికి కింకర భావంతో భక్తి నెరపడం. ఆళ్వారుల్లో ఒకరైన తిరుమంగైయాళ్వారు వైష్ణవుల సమారాధనల కోసం దొంగతనాలు కూడా చేసేవారనే కట్టుకథల వల్ల కైంకర్యం అంటే దొంగతనం అనే అర్థం వ్యాప్తిలోకొచ్చింది. తైరు అంటే పెరుగు. ఒకరిని మెప్పించడానికి వాడే ‘తైరుకొట్టడం’ ఈ తైరు నుంచి వచ్చింది కాదు. టహర్‌ నా - ఒకరి వద్ద వేచి ఉండటం.. పడిగాపులుకాయడం.. అనే అర్థమిచ్చే పదం ఇది. సంబళం- జీతం. సాంబారు- ముక్కలు వేసిన పప్పు పులుసు. దీనికి సంస్కృత సంభార పదం మూలమైనా తమిళం ద్వారానే వచ్చింది.


శర్కర - పంచదార 
శర్కర అనే పదానికీ, రుచికీ సంబంధం లేదు. శర్కర అంటే గరుకుగా ఉండేది అని అర్థం. బెల్లాన్ని శుద్ధి చేసేటప్పుడు పలుకులుగా, ఇసుకలాగా అవ్వడం వల్ల శర్కర అయ్యింది. తమిళంలో శక్కరై, కన్నడంలో సక్కరె అని వ్యవహారం. శర్కర నుంచే షుగర్‌ అనే మాట పుట్టింది. చక్కెరకు ఉన్న మరో పదం పంచదార. దీనికి మూలం పంచదారా. అయిదు సార్లు బెల్లాన్ని వడపోసి శుద్ధి చేస్తారు కాబట్టి పంచదారా అయ్యింది. మలయాళంలో పంచసార అంటారు.


బుర్రకథ
బుర్రకథను జంగం కథ, తందాన కథ, తంబూర కథ అని వ్యవహరిస్తారు. అసలీ పదం ప్రధాన కథకుడు శ్రుతి చేసే తంబూర బుర్ర నుంచి వచ్చింది. సిరిజంగాలు శివభక్తి ప్రచారంలో భాగంగా దీన్ని వృత్తిగా స్వీకరించారు. తెలుగు బుర్రకథతో పోలిక లేకపోయినా అలాంటి కళారూపాలు మహారాష్ట్ర పవాడా, కన్నడ లావణీలు. పవాడా అంటే వీర చరిత్రలని వర్ణించే జానపద కవితా విశేషం. మన భజన గోష్ఠిని పోలి ఉంటుంది. వంత పాటగా వెనుక దీదీ అంటూ రాగాలు తీస్తారు. 
కన్నడంలో 16వ శతాబ్దం నుంచి లావణి కనిపిస్తుంది. జానపద గాథలను తెలిపే ఛందో విశేషమిది. రైతుల జీవిత గాథలు, ప్రకృతి సౌందర్యం ఈ పాటల్లో ప్రధాన ఇతివృత్తం. వంత పాట ఉండదు. మహారాష్ట్ర కీర్తన పద్ధతి నుంచి బుర్రకథ వచ్చి ఉండొచ్చని పరిశోధకుల ఊహ. శ్రీనాథుని కాలం నుంచే జోడు గుమ్మెటల.. చేడియల జంతర వైభవంతో విలసిల్లిన ఈ బుర్రకథ తెలుగు జానపదుల జీవధార.


పరకామణి
పరీక్ష అనే పదం ‘పరీక్ఖ- పరాక్ఖా- పారఖ- పారఖూ’గా మార్పు చెందింది. ఈ పరఖా, పరకా పదాల భావార్థకం ‘పరకావన లేదా పరఖావన’. అదే ‘పరకామణి’ అయ్యింది. అంటే పరీక్షించడం, పరిశీలించడం అని అర్థం. శ్రీవేంకటేశ్వరుడికి భక్తులు తమకు తోచిన వాటిని కానుకగా హుండీలో వేస్తారు. వాటిలో నాణేలు, నగలు ఇలా ఎన్నో ఉంటాయి. వాటిని విడదీసి, పరిశీలించి, వేరు చేసిన మీదట డబ్బు అయితే లెక్కకడతారు. బంగారు వస్తువులైతే తూస్తారు. రత్నాలను పరీక్షిస్తారు. దీన్నే పరకామణి అంటారు.


రావు
ఒకనాటి వెలమ దొరల పట్టణం పేరు. ప్రస్తుతం ప్రజల పేరు చివరన చేరింది. రావుసింగ మహీపాలు ధీవిశాలు., రావుసింగ జనపాలునకే... లాంటి ప్రయోగాలు శ్రీనాథుడి చాటువుల్లో కొల్లలుగా కనిపిస్తాయి. మరాఠీలో ‘రా ఓ.. రావో...’ అంటే ప్రభువు అని అర్థం. ప్రాకృతంలోని రాయ శబ్దం సంస్కృతంలో రాజు అయినట్లుగా.. రావు అనేది రాజు అనే అర్థంతో పాటూ అశ్వారోహకుడనే అర్థాన్నీ సూచిస్తుంది.


ఆలవట్టం
వస్త్రంతో గుండ్రంగా చేసిన విసనకర్ర. రాజులకు ఎండ తగలకుండా పట్టే ఒక సాధనం. గుడ్డ గొడుగు. ఆలవట్టాలవారు అంటే విసనకర్రలతో విసరేవారని అర్థం. ‘‘అంగన నిట్టూరుపులే యాలవట్టములు నీకును’’ అని అన్నమయ్య ప్రయోగం.


బరాబరి
ప్రభువు దర్శనం కోసం గుమిగూడిన ప్రజలకు హెచ్చరిక చేయడం. ‘‘పటువేత్రకుల్‌ బరాబరి లోనరించి’’ అని పల్నాటి వీర చరిత్రలో ఒక ప్రయోగం ఉంది. బరోబర అనే మరాఠీ పదం సదృశం, సమానం అనే అర్థాన్ని సూచిస్తోంది. ‘బర్‌ ఆ బర్‌’ అనే పార్సీ మాటకి స్పర్ధ, సమత్వం అనే అర్థాలున్నాయి. 


చెరుకు రస న్యాయాలు
ఇక్షువికార న్యాయం: చెరుకును గానుగాడించి, ఆ రసాన్ని సరైన పాకంలో వండి, అలా వచ్చిన బెల్లం ద్వారా మధుర పదార్థాలు తయారవుతాయి. ఇలా ఉత్తరోత్తరా ఉత్తమ లాభాలు పొందడాన్ని ఈ న్యాయం సూచిస్తుంది. 
ఇక్షురస న్యాయం: చెరుకును గానుగలో పెట్టి నొక్కితే గానీ రసం రాదు. రోకళ్లతో దంచితే గానీ బియ్యం సిద్ధం కావు. దేనికైనా చాలా కృషి చేయాలని ఈ న్యాయం సూచిస్తుంది. 
గుడ జిహ్వికా న్యాయం: బెల్లం నాలుకపై ఉన్నంతసేపే తీపి. గొంతులోకి జారిపోయాక ఏమీ ఉండదు. సుఖం నిత్యం కాదనీ.. అంతా అనిత్యమని ఈ న్యాయం చెబుతుంది. 
గుడోపల న్యాయం: బెల్లం కొట్టిన రాయిలా ఉన్నావు అంటారు. అంటే బెల్లం కొట్టిన రాయి కదలదు. బెల్లం జిగురుగా ఉంటుంది గనుక కదలనివ్వదు. ఏ మాత్రం చురుకుదనం లేనివారికి ఈ న్యాయం వర్తిస్తుంది. 
ఇక్షుదండ న్యాయం: చెరుకు గడలోని కణుపులు ఒకదానికంటే మరొకటి రుచిగా ఉంటాయి. జరిగిన కొద్దీ మంచి కలిగినప్పుడు ఈ న్యాయం వాడతారు. సజ్జనులతో మైత్రి కాలం గడిచే కొద్దీ సుదృఢమవుతుంది. 
గుడశ్లేష్మ న్యాయం: శ్లేష్మరోగి బెల్లం తింటే శ్లేష్మం ప్రకోపించి ముందు తిన్నదానితో సహా అంతా కక్కుకుంటాడు. ఒక పనివల్ల ముందు చేసిన పనులన్నీ పాడయినప్పుడు ఈ న్యాయం వాడతారు.

- తిరుమల రామచంద్ర 
‘మనవి మాటలు’ నుంచి


వెనక్కి ...

మీ అభిప్రాయం