పరిశోధనా ప్రకాశం

  • 91 Views
  • 0Likes
  • Like
  • Article Share

చరిత్ర, సాహిత్య పరిశోధకుడిగా విశేష అక్షర సేవ చేసిన ప్రతిభామూర్తి రాపాక ఏకంబరాచార్యులు. తూర్పు గోదావరి జిల్లా కాజులూరు మండలం పల్లిపాలెంలో 1949 సెప్టెంబరు 9న రామస్వామి, గున్నమ్మ దంపతులకు ఆయన జన్మించారు. కోలంక ఉన్నత పాఠశాలలో పదో తరగతి పూర్తిచేశాక ఓలేటి సూర్యనారాయణ శాస్త్రి వద్ద సంస్కృత సాహిత్యాన్ని అధ్యయనం చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎమ్మే పూర్తి చేశారు. విజయవాడ ఎస్‌.ఆర్‌.ఆర్, సి.వి.ఆర్‌. ప్రభుత్వ కళాశాలలో చరిత్ర అధ్యాపకులుగా పనిచేశారు. తర్వాత కాకినాడ. కర్నూలు, రాజమహేంద్రవరం ప్రభుత్వ కళాశాలల్లో అధ్యాపకులుగా విధులు నిర్వర్తించారు. అనంతరం సహకార శాఖలో డిప్యూటీ రిజిస్ట్రార్‌గా వివిధ ప్రాంతాల్లో పనిచేశారు. జాయింట్‌ డైరెక్టర్‌గా ఉద్యోగ విరమణ పొందారు. 
      ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూనే చరిత్ర, సాహిత్యాంశాలపై పరిశోధన వ్యాసాలు వెలువరించారు రాపాక. గ్రంథ సమీక్షలూ చేశారు. ఆయా అంశాల మీద రేడియో, దూరదర్శన్‌లలో ప్రసంగించారు. ‘భువన విజయం’ రూపకంలో శ్రీకృష్ణదేవరాయల పాత్ర పోషించి ప్రేక్షకుల మెప్పు పొందారు. సుప్రసిద్ధ మహా కవులకు నీరాజనం పేరిట చారిత్రక అంశాలను వెలికితీశారు. 182 మంది అవధానుల జీవితాలను విశ్లేషిస్తూ ‘అవధాన విద్యా సర్వస్వం’ వెలువరించారు. ‘విశ్వ బ్రాహ్మణ సర్వస్వం, గణిత బ్రహ్మ, ప్రసంగ తరంగిణి, చరిత్ర, శాసన పరిశోధన, కొప్పరపు సోదర కవులు, మల్లంపల్లి సోమశేఖర శర్మ, వ్యాస కేదారం, భారతదేశ చరిత్ర’ వీరి ఇతర రచనలు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి ఉగాది పురస్కారంతో పాటు ఇతర అనేక సత్కారాలు అందుకున్నారు. కాకినాడ సాహిత్యలహరికి కార్యదర్శిగా, సి.వి.సుబ్బన్న శతావధానుల కళాపీఠానికి అధ్యక్షులుగా కూడా సేవలందించిన రాపాక ఆగస్టు 16న హైదరాబాదులో తుదిశ్వాస విడిచారు.


వెనక్కి ...

మీ అభిప్రాయం