ఇప్పటికైనా పట్టించుకుంటారా?

  • 29 Views
  • 0Likes
  • Like
  • Article Share

    కత్తి నరసింహారెడ్డి

  • ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాసనమండలి సభ్యులు
  • 9440585031
కత్తి నరసింహారెడ్డి

తెలుగుభాష తియ్యదనం 
తెలుగుజాతి గొప్పతనం
తెలుసుకున్న వాళ్లకి 
తెలుగే ఒక మూలధనం
తల్లితండ్రి నేర్పినట్టి మాతృభాషరా
తెలుగు మరచిపోతే 
వాళ్లని నువ్వు మరచినట్టురా
ఇది మరవబోకురా...

పదిహేడేళ్ల కిందట విడుదలైన ఓ చలనచిత్రం కోసం సినీగేయ రచయిత చంద్రబోస్‌ రాసిన ఈ పాట నేటి తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేకించి ఆంధ్రకు మంచి సందేశం.
      ఆంగ్లమాధ్యమం మీద విద్యార్థుల తల్లిదండ్రుల్లో నెలకొన్న బలమైన ఆకాంక్ష.. ఆంగ్ల మాధ్యమానికి ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థలు ఇస్తున్న ప్రాధాన్యం, చేస్తున్న ప్రచారాలను ప్రభుత్వం నియంత్రించట్లేదు. పైగా ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయి నుంచే ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెట్టడానికి ఉత్తర్వులు జారీచేయడంతో మాతృభాష మనుగడ మీద భాషాభిమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. 
      2011 జనాభా గణాంకాల ప్రకారం మనదేశంలో అత్యధికులు మాట్లాడే భాషల్లో హిందీ తర్వాత తెలుగు రెండోస్థానంలో ఉంది. 7.4 కోట్ల జనాభాతో ప్రాంతీయ భాషల్లో మొదటిది. ప్రపంచంలో 15వ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం 9.3 కోట్ల మంది తెలుగు మాతృభాషీయులున్నారు. అయినా కూడా పాఠశాలల్లోంచి తెలుగు తొలగిపోయే పరిస్థితి రావడం దురదృష్టకరం!
      యాభై ఏళ్ల కిందట కేంద్ర ప్రభుత్వం నియమించిన కొఠారి కమిషన్‌ 12వ తరగతి వరకు మాతృభాషలో విద్య ఉండాలని, విశ్వవిద్యాలయాలకూ దాన్ని విస్తరింప చేయాలని సూచించింది. 1986 నుంచి అమల్లోకి వచ్చిన నూతన విద్యావిధానం కూడా దీన్నే ప్రతిపాదించింది. డా।। కస్తూరి రంగన్‌ నేతృత్వంలో వెలువడిన నూతన విద్యావిధానం- 2019 కనీసం ప్రాథమిక విద్య వరకైనా మాతృభాష లేదా స్థానిక భాషలో విద్యాబోధన చేయాలంది. దీన్ని ప్రాథమిక హక్కుగా కాకుండా ప్రాథమిక విధిగా చెప్పి ఆచరణలో సందిగ్ధతకు చోటు కల్పించింది. అందులోనూ ఏ భాషనూ నిర్బంధంగా అమలుచేయబోమన్న రంగన్‌ ప్రకటన సైతం భాషాభిమానులకు నిరాశ కలిగించేదే. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో మాతృభాష ఒక సబ్జెక్టుకే పరిమితం కావడం వాంఛనీయం కాదు.  
ఇవి చేయాలి
2012లో తిరుపతిలో ప్రపంచ తెలుగు మహాసభలను రాష్ట్రప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. 2013- 14 విద్యా సంవత్సరం నుంచి అన్ని యాజమాన్యాల్లోని విద్యాసంస్థల్లో పదో తరగతి వరకు తెలుగు తప్పనిసరి అని, అన్ని దుకాణాలు, ప్రకటనల్లో తెలుగు ఉండాలని, అధికార ఉత్తర, ప్రత్యుత్తరాలన్నీ తెలుగు భాషలోనే కొనసాగాలని.. ఇలా ఆనాడు పలు తీర్మానాలు చేశారు. అమల్లో మాత్రం అవి చాలావరకూ కాగితాలకే పరిమితమయ్యాయి.  
      మనిషి జీవితంలో మొదట నేర్చుకు నేది మాతృభాష. పిల్లలు ఏ విషయాన్ని అయినా అందులోనే సులువుగా నేర్చుకుం టారు. కొత్త విద్యావిధానం సిఫార్సు మేరకు అన్ని యాజమాన్యాల్లోని పాఠశాల ల్లోనూ కనీసం ప్రాథమిక స్థాయి వరకు మాతృభాషలో విద్యాబోధన తప్పనిసరి చేయాలి. ఇతర భాషలను ఒక సబ్జెక్టుగా నేర్పించాలి. అలాగే, ఆదర్శ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లోనూ భాషా ఉపాధ్యాయులను నియమించాలి. చరమాంకంలో ఉన్న శ్రీశైలం, రాజమహేంద్రవరం లోని తెలుగు విశ్వవిద్యాలయాల శాఖలను  పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలి. తెలుగుతో బాటు ఉర్దూ, తమిళం, కన్నడ, ఒరియా లాంటి అల్పసంఖ్యాకుల భాషల అభివృద్ధికీ ప్రోత్సాహం ఇవ్వాలి. భాషాభి వృద్ధికి గతంలో ప్రభుత్వమిచ్చిన ఉత్తర్వులు, హామీలు అమలయ్యేలా చూడాలి.
      మాతృభాషలో బోధనతో విద్యార్థులకు స్వతంత్రంగా ఆలోచించడం, భావప్రకటనా ప్రజ్ఞ, సమగ్ర వికాసం, నాయకత్వ లక్షణాలు తదితర నైపుణ్యాలబ్బుతాయి. నూతన జాతీయ విద్యావిధానం ప్రకారం కనీసం ప్రాథమిక స్థాయివరకైనా బోధనా మాధ్యమంగా తెలుగును ప్రభుత్వం కొనసాగిస్తుందని.. తద్వారా అమ్మభాష మనుగడకు చేయూతనందిస్తుందని ఆశిద్దాం.


వెనక్కి ...

మీ అభిప్రాయం