మాతృభాషే జ్ఞానవారధి

  • 98 Views
  • 0Likes
  • Like
  • Article Share

‘‘మాతృభాషలో విద్యాబోధన చేసినప్పుడు పిల్లలకు త్వరగా ఆయా సబ్జెక్టుల మీద లోతైన అవగాహన ఏర్పడుతున్నట్టు మనోవిజ్ఞాన శాస్త్ర పరిశోధనలు గుర్తించాయి. దీన్ని కొంత లోతుగా అర్థం చేసుకోవాలంటే మనో విజ్ఞాన శాస్త్రవేత్తలు చెప్పిన కొన్ని అంశాలను పరిశీలించాలి. పిల్లల్లో జ్ఞాన సముపార్జన ఎలా జరుగుతుందనేది శాస్త్రీయంగా చూడాలి’’ అంటున్నారు ప్రముఖ ఎడ్యుకేషనల్‌ సైకాలజిస్ట్‌ డా।।దేశినేని వెంకటేశ్వర రావు. మాతృభాషలో విద్యాబోధన ఆవశ్యకతకు సంబంధించి ఆయన చెబుతున్న కీలక విషయాలివి!
మాతృభాషలో విద్యాబోధన అనేది భారత దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా దశాబ్దాల తరబడి బాగా చర్చనీయమైన అంశం. ఇటీవల విడుదలైన జాతీయ విద్యా విధానంలో అయిదో తరగతి వరకు, వీలైతే 8వ తరగతి వరకు కూడా మాతృభాషలో లేదా స్థానిక భాషలో విద్యనందించాలని ప్రతిపాదించారు. దీంతో ‘మాతృభాషలో విద్యాబోధన- దాని వల్ల పిల్లలకు జరిగే మేలు’ అనే అంశం మళ్లీ బలంగా తెరపైకి వచ్చింది. అనేక మంది విద్యావేత్తలు, నిపుణులు గుర్తించిన దాని ప్రకారం మాతృభాషలో లేదా స్థానిక భాషలో విద్యాబోధనతో చాలా ఉపయోగాలున్నాయి. పిల్లల మానసిక వికాసానికి, సంపూర్ణ మూర్తిమత్వ వికాసానికి మాతృభాషలో విద్యాబోధన చాలా అవసరమని ప్రపంచ వ్యాప్తంగా జరిగిన పలు పరిశోధనలు తేల్చాయి.
      పరిణామ మనో విజ్ఞాన శాస్త్రం ప్రకారం మనం నేర్చుకునే జ్ఞానం రెండు రకాలు. అందులో ఒకటి జానపద జ్ఞానం లేదా ప్రాథమిక జ్ఞానం, రెండోది శాస్త్రీయ జ్ఞానం లేదా ద్వితీయ జ్ఞానం. ప్రాథమిక జ్ఞానాన్ని ఎలాంటి బోధన అవసరం లేకుండా చాలా సునాయాసంగా నేర్చుకోగలం. ఉదాహరణకు మాతృభాషలో మాట్లాడటం అనే విషయాన్నే తీసుకుంటే పాఠశాలలు ఉపాధ్యాయులు అవసరం లేకుండానే నేర్చుకోవచ్చు. అదే రాయటం లేదా చదవటం దగ్గరికొచ్చే సరికి ప్రత్యేకంగా బోధిస్తే తప్పించి నేర్చుకోవడం సాధ్యం కాదు. ఒక భాష మాట్లాడే వ్యక్తుల మధ్య ఉంటే చాలు ఆ భాష మాట్లాడటం వస్తుంది, కానీ ఒక నిర్దిష్ట భాష చదివే వారి మధ్య లేదా రాసే వారి మధ్య ఉంటే చదవడం- రాయడం రావు రాదు. వీటిని ప్రత్యేకంగా బోధించి తీరాల్సిందే. పాఠశాలలు, ఉపాధ్యాయుల అవసరం ఇక్కడే ఏర్పడుతుంది. మరో ముఖ్య విషయమేమిటంటే మాతృభాషలో మాట్లాడటం నేర్చుకునే క్రమంలో ఏ శిశువూ కష్టపడిన దాఖలాలు లేవు! అవలీలగా నేర్చుకుంటారు. అదే చదవడం, రాయడం దగ్గరికి వచ్చే సరికి భారం, కష్టం రెండూ కనిపిస్తాయి. దీనికి కారణం... మానవ జాతికి మాట్లాడటం అనేది కనీసం లక్ష సంవత్సరాలుగా పరిచయం ఉన్న విషయం. రాయడం లేదా చదవటం కేవలం ఓ అయిదువేల సంవత్సరాల కిందట అలవాటైనవి. 
వీలైనంత సులువుగా ఉండాలి
మానవ పరిణామం ప్రకారం చూస్తే కొన్ని విషయాలను మనం అతి సులువుగా సొంతంగా నేర్చుకోగలితే, మరికొన్ని విషయాలు నేర్చుకునేటప్పుడు తప్పని సరిగా బోధన అవసరమవుతుంది. మరి పాఠశాలలు, కళాశాలల్లో పిల్లలు నేర్చుకునేది సింహభాగం ద్వితీయ జ్ఞానమే. చదవడం, రాయడం దగ్గర నుంచి.. గణిత శాస్త్ర సూత్రాలైనా, విజ్ఞాన శాస్త్ర విషయాలైనా ద్వితీయ జ్ఞానం కిందకే వస్తాయి. అందుకే వాటిని బోధించేటప్పుడు వీలైనంత నేరుగా, సులువుగా చెప్పాలని సూచిస్తారు. ఇలా బోధించాలంటే ఏం చేయాలి? దీనికి మనో విజ్ఞాన శాస్త్రవేత్తలతో పాటు పలు ఇతర విభాగాల శాస్త్రవేత్తలు (కాగ్నిటివ్‌ సైకాలజీ, న్యూరో సైకాలజీ తదితరాలు) మెదడు నిర్మాణం, పనితీరు ప్రకారం చెప్పేదేంటంటే.. పిల్లలకు తమ మాతృభాషలో మాట్లాడటం, చర్చించటం, అవగాహన చేసుకోవటం చాలా సులభంగా ఉంటుంది. ఒక విషయాన్ని మనం వారి మాతృభాషలో చెప్పినప్పుడు దాన్ని తమకు అన్వయించుకోవటం, తమ పరిసరాలకు అనువర్తనం చేసుకోవటం సులువుగా జరుగుతుంది. అదే ఇంగ్లీషు లాంటి పరభాషలో చెప్పినప్పుడు ఆ భాష మీద పట్టు రానంత వరకు విషయాన్ని అవగాహన చేసుకోవటానికి కష్టపడాల్సి వస్తుంది. దాంతో మాట్లాడటం, చర్చించటం అనే వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తారు. ఇది అవగాహనా సామర్థ్యాన్ని బాగా దెబ్బతీస్తుంది.
అడకత్తెరలో పోకచెక్కలు
పరభాషలో విద్యాబోధన జరిగేటప్పుడు పిల్లలు ఓ వైపు సబ్జెక్టు భారాన్ని మరోవైపు భాషాభారాన్ని మోయాల్సి వస్తుంది. ప్రత్యేకించి ప్రాథమిక దశలో ఆయా సబ్జెక్టుల్లో ప్రాథమిక విషయాలు నేర్చుకునేటప్పుడు ఇలా రెండింటితో కుస్తీ పట్టాల్సి రావడం వల్ల పిల్లల మెదడు మీద విపరీతమైన భారం పడుతుంది. ఆస్ట్రేలియాకు చెందిన జాన్‌ స్వేల్లెర్‌ లాంటి మనో విజ్ఞాన శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో గుర్తించిన విషయమేంటంటే మనం ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకునేటపుడు అది మన వర్కింగ్‌ మెమరీలో ప్రాసెస్‌ అవుతుంది. అయితే కొత్త విషయాలను ప్రాసెస్‌ చేసేటపుడు ఈ వర్కింగ్‌ మెమరీ సామర్థ్యం చాలా తక్కువగా ఉంటుంది. ఒకేసారి అనేక విషయాలను ప్రాసెస్‌ చేయాల్సి వచ్చినపుడు, వర్కింగ్‌ మెమరీ మొరాయిస్తుంది. అంటే నేర్చుకోవటంలో వైఫల్యం ఎదురవుతుంది. ఇలా తరచూ జరిగినపుడు పిల్లల్లో సబ్జెక్టు మీద పట్టు తప్పటమే గాక ఆత్మవిశ్వాసం కూడా దెబ్బతింటుంది. దీని వల్ల నామ మాత్రంగా చదువును కొనసాగిస్తూ ‘సీరియస్‌ లెర్నింగ్‌’కు దూరమవుతారు. తమ ఇంటిలో లేదా తమ పరిసరాల్లో మాట్లాడని భాషలో చదవాల్సి వచ్చినపుడు పిల్లలు ఇలాంటి వైఫల్య స్థితిలోకి అనివార్యంగా వెళ్లిపోతారు. దీని వల్ల పిల్లలు జ్ఞాన సముపార్జన అనే లక్ష్యం నుంచి దూరమై సమాచారాన్ని గుర్తుంచుకోవటం అనే ఊబిలోకి జారిపోతారు. అంటే విషయం అర్థం కాకపోయినా పరీక్షల కోసం బట్టీ పడతారు. ఈ బట్టీతో అవగాహన సామర్థ్యం పెరిగే అవకాశం లేనందున ఒక విషయం గురించి లోతుగా ఆలోచించడం, దాన్ని విశ్లేషించడం, ఒక కొత్త సన్నివేశానికి అనువర్తనం చేయడాల్లో బాగా వెనకబడతారు. అందుకే చాలామంది పిల్లలు పుస్తకంలో ఉన్నదున్నట్లుగా ప్రశ్నలిస్తే చాలా బాగా రాయగలరు. ప్రశ్నను ఏ మాత్రం మార్చి ఇచ్చినా, ప్రత్యేకించి అనుప్రయుక్త సామర్థ్యాన్ని పరీక్షించేలా ప్రశ్నలుంటే దారుణంగా విఫలమవుతారు.
      మొత్తమ్మీద పిల్లల మీద చదువుల భారం తగ్గాలన్నా, ఆయా సబ్జెక్టులను పిల్లలు బాగా నేర్చుకోవాలన్నా, వారిలో అవగాహన- ఆలోచన, అనుప్రయుక్త, సృజనాత్మక సామర్థ్యాలు వెల్లివిరియాలన్నా భాష చాలా కీలకంగా పనిచేస్తుంది. పరిచయం లేని భాషలో పిల్లలకు చదువు చెప్పడం స్థానే జాతీయ విద్యా విధానంలో సూచించినట్లుగా మాతృభాషలో లేదా స్థానిక భాషలో బోధించడంతో పాటు మనోవిజ్ఞాన శాస్త్ర పరిశోధనల ప్రకారం మెదడు పనితీరుకు తగ్గట్లుగా బోధన పద్ధతులనూ పునః సమీక్షించుకోవాలి. అప్పుడే పిల్లలను సమాచారాన్ని బుర్రల్లో ఎక్కించుకోవడం నుంచి జ్ఞాన సముపార్జన వైపు తీసుకెళ్లగలం. 


పిల్లలు ఎలా నేర్చుకుంటారు? అనే అంశం మీద డా।। దేశినేని వెంకటేశ్వరరావు పలు పరిశోధనలు చేశారు. పిల్లలపై చదువుల భారాన్ని తగ్గించడమెలా? పరిశోధనకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ పోస్ట్‌ డాక్టోరల్‌ ఫెలోషిప్‌ను అందు కున్నారు. తన పరిశోధనల ఆధారంగా ‘పిల్లలపై చదువుల భారాన్ని తగ్గించటం ఎలా?’, ‘పిల్లలకు చదువంటే ఎందుకు కష్టం?’ తదితర పుస్తకాలు రచించారు. (డా।। దేశినేని - 99123 80754)


వెనక్కి ...

మీ అభిప్రాయం