గురువే బ్రహ్మమూ... సర్వమూ!

  • 19 Views
  • 0Likes
  • Like
  • Article Share

గురు భావన, గురుస్తుతి భౌతికమైనది కాదు. అది అనిర్వచననీయ భావప్రసరణ. కొలవలేనిది. వెలకట్టలేనిది. గురుముఖత నేర్చుకున్న చదువుకి రాణింపు ఉంటుంది. అది మనిషి జీవితంలో ఉత్తరోత్తరా బలవత్తరమై మానవ మనుగడకు ఒక ఆలంబన అవుతుంది. కాలమెంత మారుతున్నా జీవన విలువలకీ, నైపుణ్యాలకి పెట్టనికోటలా ప్రకాశించే గురువుల ప్రభావానికి కాలం శిరసొంచుతుంది. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జాతికొక సుస్థిరతనీ, పుష్టిని కలిగించే ఉపాధ్యాయుల ఉన్నతిని మననం చేసుకుందాం!
గ్రాసమింతలేక కడు గష్టపడుచున్న
విద్యయేల నిలుచు వీలుగాక
పచ్చికుండనీళ్లు పట్టిన నిలుచునా

సకల విద్యలూ కూటికొరకే అని చెప్పడమే కాదు.. తిండి పెట్టలేని విద్యను విడిచిపెట్టాల్సిందే అన్నాడు వేమన. జీవనాధారానికి మూలమైన విద్యలో రాణించాలంటే నిపుణుడైన గురువు కూడా అవసరమే. ఏ కాలమైనా గురుమార్గం చెప్పేదొక్కటే. ప్రయత్నలోపం లేకుండా కష్టపడమని. మెరుపులు జడిపించనీ, ఉరుములు ప్రకోపించనీ.. సాధించాల్సిన పనిలో నెగ్గుకురావల్సిందే. ‘‘లెక్కకు రానీడు కార్యసాధకుడు సుఖమున్‌ దుఃఖమున్‌ మదిన్‌’’ అన్న ఏనుగు లక్ష్మణ కవి మాట చైతన్యస్ఫోరకం. సాధనతోనే పనులు సమకూరతాయనీ, విజయానికి దగ్గర దారులంటూ లేవు అని చెప్పిన భారతీయ గురు పరంపరకి ఉన్న శక్తి అపారమైంది. 
      గురు శుశ్రూషలో తరిస్తూ నేర్చుకున్నవి నాలుగక్షరాలైనా నాలుగు కాలాలు నిలబడతాయి. ఆ ఆశతోనే ఒక రైతు తన కుమారుణ్ని గురుకులానికి పంపించాడు. ఎంత చెప్పినా ఆ కుర్రాడు చదువు మీద దృష్టిపెట్టలేకపోయాడు. సంగతి గ్రహించిన గురువు ‘‘నాయనా! ఎందుకో ఎంత ప్రయత్నించినా నీ బుర్రకి చదువెక్కడం లేదు. ఇక్కడుంటే ధన వ్యయమూ, కాలవ్యయమూ తప్ప మరేం ఉపయోగం లేదు. ఇంటికి పోయి నీ తండ్రి పొలం పనులకి సాయపడు’’ అని పంపించేశాడు. పిల్లాడికి చదువుకోవాలని కుతూహలం ఉంది. కోరిక బలంగా ఉంది. బాధతోనే ఇంటి మార్గం పట్టాడు. చాలా దూరం నడిచాడు. మార్గమధ్యంలో దాహం వేసింది. నూతి దగ్గరకి వెళ్లాడు. దాని చుట్టూ ఉన్న రాతి పొరను చూశాడు. అదంతా నాచుతో నిండి ఉంది. నీళ్లు చేదుకునే వైపు మాత్రం నునుపుగా ఉంది. చేదగా చేదగా నీళ్లు తేటతేరడం ఒక్కటే కాదు... చేదినప్పుడు తాడు రాపిడి వల్ల రాయి కూడా నునుపుదేరింది. ‘చాలా తీవ్ర ప్రయత్నం చేస్తేగాని ఇది సాధ్యం కాదు. నేను రాతి కంటే కఠినుణ్ని కాదు. బండబారిన నా హృదయాన్ని స్వయం శక్తితో నునుపు చేసుకుంటాను. ఏ రాపిడీ లేకుండా శిల శిల్పం కాదు.. ఏ రాపిడీ లేకుండా కేవలం రాతి ముక్క వజ్రంగా రూపదాల్చలేదు. నేను ఇప్పుడు ఇంటికి వెళ్లడం కన్నా గురుకులానికి వెళ్లడమే సరైంది!’ అనుకున్నాడు. ఇదో కథ.. అయితేనేం, మంచి వ్యక్తిత్వ వికాస పాఠం. విద్యార్జన చేసే పిల్లల దృష్టి ఎలా ఉండాలో చెప్పే   గొప్ప గాథ. 
చదువంటే ఏంటంటే..
సమాజంలో మనకంటూ ఓ స్థానం కల్పించుకోవాలంటే చదువుకోవాల్సిందే. కానీ, ఆ చదువు ఎలా ఉండాలి? వీపున రుద్దినట్టు.. గోడనేసి కొట్టినట్టు, నెత్తిన మొట్టినట్టుగా కాకుండా మనసును తట్టినట్టుగా ఉండాలి. బడిలో ఉన్నా, గుడిలో ఉన్నా, వరి మడిలో ఉన్నా చదువు మది చుట్టూ చక్కర్లు కొట్టాలి. చదువైనా సాహిత్యమైనా జీర్ణమై తృప్తినివ్వాలని భావించి.. మీద పడుతున్న వయసును అట్టే విసరికొట్టి సరికొత్త ఉషస్సునీ, ఆలోచనల్లో యవ్వనాన్ని చూడగలిగిన నరసప్ప లాంటి గురువులు లోకంలో చాలా అరుదుగా కనిపిస్తారు అంటారు మధురాంతకం రాజారాం ‘హాలికులు కుశలమా!’ కథలో. ఆయన పాఠాన్ని పాఠంలా కాకుండా పురాణంలా చెబుతాడు. ఏదో పాండిత్యం మట్టుకు ముక్కున పట్టాడు కానీ బడిలో చదువుకున్నవాడు కాదనీ, ఇంగ్లీషులో సంతకం పెట్టడం రాని పాతకాలం బడిపంతులని లోకులు చిన్నచూపు చూస్తారు. చూస్తే చూశారు కానీ, ఈ మాస్టారులో ఎన్ని జీవన రహస్యాలు నిబిడీకృతమై ఉన్నాయో ఎవరూ తెలుసుకోలేకపోయారంటారు రచయిత. ‘‘జీవశక్తిలో ఎక్కువ భాగాన్ని నేనా సాహిత్యానికే ధారపోశానో, ఈ పొలాలకే ధారపోశానో ఆ భగవంతుడికే ఎరుక. రాతిలో భగవంతుణ్ని చూడగాలేనిదీ స్థావర జగత్తులో సాహిత్య జగత్తును చూడటం అసాధ్యం కాద’’నిపిస్తారు మాస్టారుతో! నిజమే కదా. 
      విద్యార్జన అనేది స్వయం ప్రేరణతో సాధించాల్సింది. చదవాలి. ఎదగాలి. కఠోర శ్రమ చెయ్యాలి! నువ్విప్పుడు కష్టపడకపోతే ఎందుకూ పనికిరావు అని చెబితే అలవడేది కాదు. ప్రకృతితో సమంగా సరికొత్త జీవన వికాసాన్ని అలవరచుకుంటూ సాగే ఈ క్రమాన్ని పిల్లలకి నేర్పే పద్ధతికి నాటి గురుకులాలు ఆలవాలంగా నిలిచాయి. పచ్చటి మొక్కల మధ్య బడి పెట్టడం కాదు, చెప్పే పాఠాల్లో ప్రాకృతిక స్పృహ కలిగించాలంటే దానికి చాలా చెయ్యాలి. కొత్త భావ స్రవంతిని పెట్టుబడిగా పెట్టి మూస పద్ధతులకూ, బట్టీ చదువులకూ స్వస్తి చెప్పాలి. ఇవేం లేకుండా చేతులకు పుస్తకం అంటుకుపోయేటట్టుగా నూరిపోస్తే పిల్లలకు నీరసం వస్తుంది తప్ప జ్ఞానం అబ్బదు. 
గురువు మాట..
పిల్లలు ఇంటి పని చెయ్యలేదంటే.. ఎందుకు చెయ్యలేదూ అని కారణాలేవీ అడగకుండానే, ఎలాంటి విచారణ లేకుండానే శిక్షించే గురువులున్నారు. దండిస్తే భయంతోనే చెప్పిన పని చేస్తారు కాని, బాధ్యత అలవడదు కదా! పద్యాలు, ఎక్కాలు, గుణింతాలు.. ఇలా అనేక విషయాలను సాధన చేసి తనకుతానుగా తర్ఫీదు పొందాలని పిల్లాడికి దండనతో చెప్పకూడదంటారు సత్యం శంకరమంచి తన ‘అరుగరుగో సుబ్బయ్య మేష్టారు’ కథలో. హృదయపరివర్తనతో అది సాధ్యమేనంటారాయన.  
      సుబ్బరాజు అనే కుర్రాడు ఇంటిపని చెయ్యనందుకు శిక్షగా తన గోవుకు పచ్చిగడ్డి కోసుకురమ్మని పంపిస్తారు. ఆ పిల్లాడు ఆ పని కాస్తా ముగించి చేతులు కట్టుకుని నిలబడితే మాస్టారు రెండే రెండు మాటలతో అతనిలో మార్పు తీసుకొస్తారు. ‘‘ఆ గేదె ఉంది చూశావా! దానికి గడ్డి వేస్తే పాలిస్తుంది. మీ నాన్న నీకు అన్నం పెట్టి, గుడ్డలిచ్చి ప్రేమగా చూసుకుంటున్నాడు. నువ్వాయనకు పాలూ ఇవ్వక్కర్లేదు. మీగడా పెట్టక్కర్లేదు. నీ చదువు నువ్వు చూసుకోకపోతే ఈ గేదె కంటే హీనమే కదా!’’ అంటారు. గురువు మాటలు గురి తప్పలేదు. పరివర్తనదిశగా ఆ పిలాణ్ని నడిపించాయి.
భావిజీవితాలకు మార్గదర్శి
బడి చదువులప్పుడే పిల్లల్లో సృజనాత్మక శక్తికి అంటు కట్టాలి. ఏదో ఒక అంశం మీద మాట్లాడించాలి. ఆలోచనలను పుస్తకం మీద పెట్టే శక్తిని, ఉత్సాహాన్ని గురువులే పిల్లలకు అందించాలి. ఓ మాస్టారు తరగతి గదిలోకి వచ్చీరాగానే ఓ పిల్లాణ్ని లేపి అమ్మ మీద వ్యాసం చెప్పమనేవాడట. అలా అందరి సమక్షంలో పిల్లల్ని మాట్లాడించడం కూడా వారి ఎదుగుదలకి అవసరమే అని భావించిన ఆ మాస్టారు నామిని సుబ్రహ్మణ్యం నాయుడు ‘సిన్నబ్బ కథల్లో’ కనిపిస్తారు. ‘‘నాయండాలా! ఆ మకా తల్లులు కన్నోడి అగచాట్లన్నీ పడి, తెల్లారి నిద్దరలేచి.. మీ కేరీర్లల్లో అంత వొండి పెట్టి అంపిస్తా ఉంటే గదా! మీరొచ్చి ఈ చెట్టు కింద కూర్చోని చదవతా ఉండేది! లేకుంటే ఈ పాటికి గొడ్లు కాసుకుంటా ఉండరా! అటువంటి మకలచ్చుముల మీద ఒక చిన్న వ్యాసం అన్నా చెప్పలేరంట్రా!’’ అని ఆప్యాయంగా పిల్లలని తడిమే ‘గెడ్డం అయ్యోరు’ చాలా గొప్పసారు అంటారు నామిని. 
      నా పని అక్షరాలు నేర్పేంతవరకే! పరీక్షలో నెగ్గించేంత వరకే అనుకుని ‘బరువు’ దించుకునే వ్యవస్థ వేళ్లూనుకుంది ప్రస్తుతం! కానీ, గురువు చదువుతో పాటూ నాలుగు రోడ్ల మధ్య నిలబడగలిగే... నలుగురితో మాట కలపగలిగే.. నలుగురి మధ్య నెగ్గుకురాగలిగే స్థైర్యాన్ని పిల్లలకు అందివ్వాలి. కానీ.. రోగం దారి రోగానిదీ, మందులు దారి మందులదీ అన్న చందంగా తయారయ్యాయి నేటి చదువులు. కేవలం పాఠాలు చెప్పి పరీక్షలు పెట్టి, పేపర్లు దిద్ది మార్కులేయడం తప్ప బతుకు మార్గం చూపడంలో అక్కరకురాని గురువుకు పిల్లల జీవితంలో అంతగా ప్రాముఖ్యత ఉండదు! చిన్నారుల పూర్తి శక్తి సామర్థ్యాలను వినియోగంలోకి తెచ్చి తనంతవానిగా దిద్దితీర్చి, నైపుణ్య భారతాన్ని నిర్మించేందుకు గురువే ఆలంబన. ‘నా బతుకు నేను బతగ్గలను’ అనే ఆశను, ఆశయాన్ని పిల్లలకు గురువు అందివ్వాలి. లక్షణంగా బతకాలనే సలక్షణ చదువులకు శైశవ దశలోనే అంటుకడితే.. భావి జీవితంతో అది మొగ్గ తొడిగి గొడుగు పడుతుంది. అవసానంలోనూ.. అసహనంలోనూ అదే కరదీపమవుతుంది.


‘‘అన్యభాషీయులు ఆంగ్లాన్ని చేరుకునే వారధి వారి మాతృభాషే. దాన్ని పెద్ద వనరుగా ఉపయోగించుకుంటేనే ఆంగ్లాన్ని త్వరగా నేర్చుకోవచ్చు’’ 

- బ్రిటిష్‌ కౌన్సిల్‌  


వెనక్కి ...

మీ అభిప్రాయం