పరభాషలో బోధన పంటి కింది రాయి!

  • 270 Views
  • 3Likes
  • Like
  • Article Share

‘‘తెలియని భాషలో పాఠశాల విద్యను ప్రారంభించే వారికంటే మాతృభాషలో చదువుకు నాంది పలికే పిల్లలు విద్యా నైపుణ్యాలను ఒడిసిపట్టడంలో ముందుంటారు. చదువు పూర్తయ్యే వరకూ ఆ స్థాయిలోనే కొనసాగుతార’’ని ఘంటాపథంగా చెబుతోంది యునెస్కో. అభివృద్ధి చెందిన దేశాల్లో జరిగిన 150కి పైగా అధ్యయనాలు యునెస్కో మాటలకు ఆధారాలను అందిస్తున్నాయి. అలాగే, మాతృభాషలో చదువుకుంటున్న పిల్లలు బడి మానేయట్లేదని అభివృద్ధి చెందుతున్న 22 దేశాల్లో 160 భాషా సమూహాలపై చేసిన పరిశోధనల్లో వెల్లడైంది.
అమెరికాలో దాదాపు 40 లక్షల మంది చిన్నారులకు ఆంగ్లం సరిగా రాదు. కారణం... వలస రాజ్యమైన ఆ దేశంలో మూడు వేల భాషలను మాట్లాడే ప్రజలున్నారు. కానీ, పాఠశాలల్లో ఆంగ్లంలోనే చదువు చెప్పేవారు. దీంతో ఇతర భాషల పిల్లలందరూ పరీక్షల్లో వెనుకబడేవారు. దీనిపై 1980వ దశకం నుంచి పాఠశాల వర్గాల్లో ఆలోచన మొదలైంది. స్పానిష్, కొరియన్, ఫ్రెంచ్, కాంటొనీస్, జపనీస్, అరబిక్, పోర్చుగీస్, రష్యన్, మాండరిన్‌ భాషల చిన్నారులకు ఒకటి నుంచి మూడో తరగతి వరకూ పూర్తిగా మాతృభాషల్లో చదువు చెప్పడం ప్రారంభించారు. ఆ తర్వాత రెండు మూడేళ్ల పాటు 50% అమ్మభాషలో బోధించి క్రమంగా ఆంగ్ల మాధ్యమం వైపు తీసుకెళ్లారు. తర్వాత వారికి ఆంగ్లంలో పరీక్షలు పెడితే... ఆంగ్లం మాతృభాషగా ఉన్న విద్యార్థులకంటే ఎక్కువ మార్కులు వచ్చాయి. దాంతో ద్విభాషా మాధ్యమంలో బోధించే పాఠశాలలు ఏర్పాటయ్యాయి. టెక్సాస్, న్యూమెక్సికో, న్యూయార్క్, కాలిఫోర్నియా, వాషింగ్టన్, ఇల్లినాయిలలో ఇవి విస్తృతంగా ఉన్నాయి.


వియత్నాంలో పదహారేళ్ల కిందటి వరకూ వియత్నామీస్‌ భాషలోనే బోధన జరిగేది. లావోకాయ్, గియాలాయ్, ట్రావిన్హ్‌ ప్రావిన్సుల్లోని మోంగ్, జ్రామ్, ఖ్మైర్‌ భాషలకు చెందిన పిల్లలు దీని వల్ల చాలా ఇబ్బంది పడేవాళ్లు. ఆ నేపథ్యంలోే 2006-07 విద్యా సం।।లో అయిదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులను ప్రభుత్వం ప్రత్యేకంగా పరీక్షించింది. తీరా చూస్తే, లెక్కల్లో 49.22% మంది ప్రమాణాలను అందుకోలేకపోయారు. 36.5% మందికి కనీసస్థాయి వియత్నామీస్‌ కూడా అబ్బలేదు. దాంతో ఆ ప్రావిన్సుల్లో వియత్నాం విద్యాశాఖ, యూనిసెఫ్‌ ఆధ్వర్యంలో కిండర్‌గార్టెన్‌ నుంచి రెండో తరగతి వరకు పిల్లల మాతృభాషల్లో చదువు చెబుతూనే వియత్నామీ స్‌ను ఒక సబ్జెక్టుగా బోధించారు. 3- 5 తరగతుల్లో రెండు భాషల్లో విద్యా బోధన చేశారు. 2009- 10 విద్యా సం।। తర్వాత ఈ విద్యార్థులకు పరీక్షలు పెడితే... లెక్కల్లో 68% మంది 86 - 100 మార్కులు సాధించారు. 25% మందికి 66 - 85 మార్కులు వచ్చాయి. వియత్నామీస్‌ భాషా పరీక్షలో కూడా ఆ విద్యార్థులందరూ 85 శాతం మార్కులు పొందారు.  


మాతృభాషా మాధ్యమ విద్య వల్ల ఒనగూరిన ప్రయోజనాలను జార్జ్‌ మాసన్‌ విశ్వవిద్యాలయ ఆచార్యులు వర్జీనియా పి.కొలియర్, వేన్‌ పి.థామస్‌ వెలుగులోకి తెచ్చారు. 1982 - 99 మధ్యలో చదువుకున్న 20 లక్షల మంది విద్యార్థుల రికార్డులను పరిశోధించారు. 11వ తరగతిని పూర్తి చేసిన విద్యార్థులు అంతిమ పరీక్షల్లో సాధించిన ఫలితాలకూ, ప్రాథమిక స్థాయిలో వారు మాతృభాషలో చదువుకోవడానికి వెచ్చించిన సమయానికి సంబంధం ఉన్నట్లు తెలుసుకున్నారు. కనీసం ఆరేళ్ల పాటు మాతృభాషలో నాణ్యమైన బోధన అందిస్తే దీర్ఘకాలంలో పిల్లలు మంచి నైపుణ్యాలను అందిపుచ్చుకుంటున్నారని వారు నిర్ధరించారు. 


థాయిలాండ్‌లో సాధారణంగా థాయి భాషలోనే పాఠశాలలు నడుస్తుంటాయి. అయితే, యూనిసెఫ్‌తో కలిసి ఆ దేశ విద్యాశాఖ ఓ ప్రయోగం చేసింది. 21 స్థానిక పాఠశాలల్లో పట్టని మలాయ్, మోన్, ప్యూకలెన్, హ్మోంగ్‌ భాషల్లో విద్యా బోధన చేయించింది. ఆ తర్వాత థాయి పాఠశాలల విద్యార్థులతో ఈ భాషా మాధ్యమ విద్యార్థుల ప్రతిభను పోల్చింది. థాయి బడులలోని వారి కన్నా పట్టని మలాయ్‌లో చదివే వారు అన్ని పాఠ్యాంశాల్లో 40 - 60% మార్కులు ఎక్కువగా సాధించినట్లు గుర్తించింది. దాంతో అల్పసంఖ్యాక వర్గాల చిన్నారులకు అమ్మభాషల్లోనే పూర్తిస్థాయి విద్యను అందించేందుకు ప్రయత్నిస్తోంది. 


ఆంగ్లాధిపత్యం వల్ల దక్షిణాఫ్రికా విద్యావ్యవస్థ చాలా దెబ్బతింది. దీంతో కళ్లు తెరచిన పాలకులు చిన్నారులకు మొదటి మూడేళ్లు మాతృభాషల్లోనే చదువు చెప్పించాలని నిర్ణయించారు. అయితే, తుది నిర్ణయాన్ని పాఠశాలలకే వదిలేశారు. 60% పాఠశాలలు మాతృభాషల వైపు మొగ్గుచూపాయి. 2007 - 13లో ఈ విధానంలో చదువు చెప్పిన 9 వేల పాఠశాలలపై ప్రాథమిక విద్యాశాఖాధికారి డాక్టర్‌ సీఫెన్‌ టేలర్, స్టెల్లెన్పొస్చ్‌ విశ్వవిద్యాలయ ఆచార్యులు మరిసా కోయిట్జి పరిశోధన చేశారు. ఆంగ్ల మాధ్యమ విద్యార్థుల కంటే మాతృభాషల్లో విద్యాభ్యాసం చేస్తున్న చిన్నారులకే అన్ని పాఠ్యాంశాల్లో ఎక్కువ మార్కులు వచ్చాయి. పిల్లల్లో నైపుణ్యం వృద్ధికి బోధనా మాధ్యమం ప్రధాన వనరుగా పని చేస్తుందని స్టీఫెన్, మరిసా ససాక్ష్యంగా ప్రకటించారు. 


బ్రెజిల్‌లోని ఆదిమ జాతుల పిల్లలపై చేసిన అధ్యయనాల్లో తేలిందేంటంటే... మాతృభాషల్లో చదువు చెబితే అక్షరాస్యత పెరిగింది. జాతీయ భాష(పోర్చుగీసు)లో నైపుణ్యం వృద్ధి చెందింది. ఫిలిప్పీన్స్‌లో అన్ని పాఠ్యాంశాల్లో ప్రమాణాలను అందుకున్న ఆంగ్ల మాధ్యమ విద్యార్థుల సంఖ్య 49.5% ఉంటే ఫిలప్పీనోలో చదివిన వారిలో 76.2% మంది ఆ స్థాయిలో ఉన్నారు. ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో ఉన్న ప్రాథమిక పాఠశాలలన్నింటిలోనూ 20 ఏళ్ల నుంచి మాతృభాషల్లోనే విద్యాబోధన చేస్తున్నారు. మొత్తం 41 భాషల్లో చదువు చెబుతున్నారు. పాపువా న్యుగినియాలో 380 భాషల్ని బోధనలో వాడుతున్నారు.


సామ్రాజ్యవాదం వల్ల ఆఫ్రికా మట్టి భాషలు మట్టిగొట్టుకుపోయాయి. స్థానికంగా రెండు వేలకు పైగా భాషలు చెలామణిలో ఉన్నా ఆంగ్లం, ఫ్రెంచిలో మాత్రమే విద్యా బోధన జరిగే పరిస్థితి! ఈ నేపథ్యంలో ఆ దేశాల్లోని విద్యావ్యవస్థలపై యునెస్కో పరిశోధన చేపట్టింది. అన్యభాషా మాధ్యమంలో చదవడం వల్ల పిల్లల నైపుణ్యాలు చాలా తక్కువ స్థాయిలో ఉన్నట్లు తేల్చింది. నైజీరియాలో ఆంగ్ల మాధ్యమం అమల్లో ఉంది. ఇక్కడ నాలుగో తరగతి పిల్లల్లో లెక్కల్లో 32%, ఆంగ్లంలో 25%, జీవన నైపుణ్యాల్లో 33% మందే ప్రమాణాలను అందుకున్నారు. ఆంగ్లంలో అయిదు వాక్యాల పేరాను ఇచ్చి తిరిగి రాయమంటే సరిగ్గా రాసిన వాళ్లు 8% మందే. సెనెగల్‌లో ఫ్రెంచ్‌ మాధ్యమంలో చదువుకుంటున్న చిన్నారులూ ఇదే స్థాయిలో కనిపించారు. మరో దేశం మాలిలో పై తరగతులకు వెళ్లడానికి అవసరమైన నైపుణ్యాల్లేక 50% మంది పిల్లలు ఒకే తరగతిని మళ్లీ మళ్లీ చదువుతున్నారని తెలిసింది. దీంతో కొన్ని దేశాల పాలకుల్లో మార్పు వచ్చింది. కామెరూన్, టాంజానియా, ఎరిత్రియా, మడగాస్కర్, నైజీరియా, కెన్యా, ఉగండా, కాంగో, బోట్సువానా, మాలిల్లో ప్రాథమిక విద్యను మాతృభాషల్లో అందిస్తున్నారు. కామెరూన్‌లో ఒకటి, రెండు తరగతులను స్థానిక భాష (కోమ్‌)లో నిర్వహిస్తూ ఆంగ్లాన్ని ఓ పాఠ్యాంశంగా బోధించారు. ఆ తర్వాత 2011లో పరీక్షలు పెడితే ఆంగ్ల మాధ్యమంలోని మిగిలిన పిల్లల కంటే కోమ్‌లో చదువుకున్న చిన్నారులకు ఆంగ్లంలో 125% ఎక్కువ మార్కులు వచ్చాయి. మాలిలో కూడా స్థానిక భాషా మాధ్యమం నుంచి క్రమంగా ఫ్రెంచిలోకి వెళ్లిన విద్యార్థులు.. నేరుగా ఫ్రెంచ్‌లోనే చదివిన విద్యార్థుల కంటే 32% ఎక్కువగా ఉత్తీర్ణులైనట్లు మరో అధ్యయనంలో వెల్లడైంది. 


ప్రాథమిక సైన్స్‌ పాఠాలను ఆంగ్లంలో బోధిస్తే మంచిదా? మాతృభాష(హాసా)లో చెబితే మేలా అని తెలుసుకోవడానికి నైజీరియాలోని ఐఫె విశ్వవిద్యాలయ ఆచార్యులు ఓ ప్రయోగం చేశారు. మూడు పాఠశాలలకు చెందిన 3, 4, 5 తరగతుల విద్యార్థులు 630 మందికి రెండు భాషల్లోనూ పాఠాలు చెప్పారు. మొదట ఆంగ్లంలో కొన్ని పాఠాలను బోధించిన తర్వాత పరీక్ష పెట్టారు. తర్వాత మరికొన్ని పాఠాలను మాతృభాషలో చెప్పి పరీక్షించారు. ఆంగ్లంలో సాధారణ రాత పరీక్షలో 38 శాతం మందికే వందకు అరవైకి పైగా మార్కులొ చ్చాయి. అదే హాసాలోనైతే,  80 శాతం మంది ఆ మార్కులను తెచ్చుకున్నారు. సబ్జెక్టుపై చర్చలో చురుగ్గా పాల్గొనడం, ప్రశ్నలు అడగడం, సాటివారితో సబ్జెక్టు గురించి మాట్లాడటం, ఆలోచనలు పంచుకోవడం, పాఠాల్లోని అంతర్గత అంశాలను గుర్తించడం, కొత్త ఆలోచనలు చేయడం వంటి గీటురాళ్లలో ఆంగ్లంలో ఎవరికీ 40 శాతానికి మించి మార్కులు రాలేదు. అదే హాసాలో 60- 100 శాతం మార్కులు తెచ్చుకున్నారు. 


ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ న్యూరాలజీ మాజీ అధ్యక్షులైన పద్మశ్రీ డా।।అశోక్‌ పంగారియా... మాతృభాషలో ప్రాథమిక విద్యాభ్యాసం ఆవశ్యకతపై నాడీశాస్త్ర సంబంధిత పరిశోధనలు చేశారు. చిన్నారుల వ్యక్తిత్వానికి సంబంధించి మేధోపరమైన, నైతిక, శారీరక లక్షణాలను అభివృద్ధి చేయడంలో మాతృభాష కీలక పాత్ర పోషిస్తుందని ఆధారసహితంగా నిరూపించారు. ‘ఇంట్లో, సమాజంలో, పిల్లాడికి చుట్టుపక్కల ఎక్కువగా మాట్లాడే భాషకు సంబంధించిన దృశ్య, శ్రవణ సంకేతాలను మెదడులోని మిర్రర్‌ న్యూరాన్స్‌ గ్రహిస్తాయి. వాటిని అనుకరించడానికి ప్రయత్నిస్తాయి. మాతృభాషలో పూర్తి పట్టు వచ్చేదాకా ఈ అనుకరణ కొనసాగుతుంది. చిన్నారిపై అన్యభాషను రుద్ది ఆ ప్రక్రియకు అడ్డుపడితే చిక్కులు తప్పవు. ఒక్కసారి అమ్మభాష బాగా వచ్చేస్తే, మరో భాషను నేర్చుకోవడానికి మెదడు మెరుగైన సన్నద్ధతతో ఉంటుంద’ని ఘంటాపథంగా చెబుతారాయన.  


ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులు... విజ్ఞానశాస్త్రం, గణితం, ఆంగ్లాలలో మౌలికాంశాలను ఏమేరకు అర్థం చేసుకుంటున్నారో తెలుసుకోవడానికి 2006లో విప్రో, ఎడ్యుకేషనల్‌ ఇనీషియేటివ్స్‌ సంస్థలు ఓ ప్రయత్నం చేశాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కతా, చెన్నైలోని 142 ప్రముఖ ఆంగ్ల మాధ్యమ ప్రైవేటు పాఠశాలల్లోని 32 వేల మంది నాలుగు, ఎనిమిదో తరగతుల విద్యార్థులకు పరీక్షలు పెట్టాయి. వారి నైపుణ్యాలను 43 దేశాల పిల్లలతో పోల్చాయి. తేలిందేంటంటే... అంతర్జాతీయ నైపుణ్యాల స్థాయికి మనవాళ్లు చాలా కింద ఉన్నారు! మౌలికాంశాలను విశ్లేషించడం, వివరించడంలో తేలిపోయారు. తరగతి గదిలో నేర్చుకున్న అంశాలను నిజజీవిత సమస్యలకు అన్వయించడానికి సంబంధించిన ప్రశ్నలకు జవాబుల్లో బాగా వెనకబడ్డారు. బట్టీ వల్ల సాధారణ పరీక్షల్లో మార్కులు బాగా వస్తున్నా, జ్ఞానం మాత్రం అబ్బట్లేదని రుజువైంది. ప్రసిద్ధ తెలుగు భాషావేత్త భద్రిరాజు కృష్ణమూర్తి అప్పట్లో దీనిపై స్పందిస్తూ... ‘అత్యుత్తమ ఆంగ్ల పాఠశాలల పరిస్థితే ఇలా ఉంటే, పుట్టగొడుగుల్లా ఏర్పడ్డ వేలకొద్దీ బడుల సంగతేంటి’ అని ప్రశ్నించారు. 


ఉపాధ్యాయులు తరగతిగదిలో తెలుగు మాట్లాడవద్దు అంటే పిల్లలు మౌనంగా ఉండిపోతారు తప్ప ఆంగ్లం మాట్లాడరు. తెలుగు మాట్లాడటం ఆపేస్తే ఆంగ్లం రాదు. ఆంగ్ల తరగతిలో తెలుగును ఉపయోగిస్తే రెండు భాషల మధ్య ఉండే పోలికలు, తేడాలు తొందరగా అర్థమవుతాయి. కొత్తభాషలో తమను తాము సరికొత్తగా ఆవిష్కరించుకోవడానికి మాతృభాష ఉపయోగపడుతుంది. ఆంగ్లం మాత్రమే వినియోగిస్తే, తమకేం కావాలో, పాఠం ఎంత అర్థమైందో, ఏ విషయాలు అర్థం కాలేదో విద్యార్థులు చెప్పలేరు. కాబట్టే, ఆసియా అంతటా ‘ఆంగ్లంలో ఆంగ్లం బోధన పద్ధతి’ మంచి ఫలితాలు ఇవ్వట్లేదని చాలా పరిశోధనల్లో తేలింది.


ఇవీ లాభాలు
బోధనామాధ్యమంగా విద్యార్థి మాతృభాషను ఉపయోగించడం వల్ల ఒనగూరే ప్రయోజనాలెన్నింటినో పరిశోధకులు పట్టిచూపారు. వాటిలో ముఖ్యమైనవి...
-    మాతృభాషా మాధ్యమం విద్యార్థుల ఆలోచనా సామర్థ్యాలను, విద్యా నైపుణ్యాలను అభివృద్ధి చేస్తుంది.
-    పిల్లలకు అర్థమయ్యే భాష బోధనా మాధ్యమంగా ఉంటే... ఉపాధ్యాయులు ప్రభావవంతమైన బోధనా పద్ధతులను ఎక్కువ  సంఖ్యలో ఉపయోగించగలరు.
-    స్థానిక భాషల్ని బోధనలో భాగంగా చేయడం వల్ల సిలబస్‌లో స్థానికత పెరుగుతుంది. తల్లిదండ్రులు, సమాజాన్ని తరగతి గది వనరులుగా ఉపయోగించుకోవచ్చు.
-    తరగతి గదిని ఆహ్లాదభరితంగా ఉంచాలంటే మాతృభాషే మార్గం. 
-    అయిదు/ ఆరో తరగతి వరకూ మాతృభాషలో మౌలికాంశాలను నేర్చుకుని, అన్యభాషలో వాటి పదజాలాన్ని ఒంటబట్టించుకుని... అన్యభాషా మాధ్యమంలోకి మారితే మేలు. నేరుగా అన్యభాషా మాధ్యమంలో చేరితే తేలిపోతారు. 
-    దాదాపు ముప్ఫై శాతం తక్కువ ఖర్చుతో (ట్యూషన్లు, ఎక్కువ పుస్తకాలు అవసరముండవు) చదువు పూర్తవుతుంది. 
-    మాతృభాషలో విద్యాబోధనలోనూ నాణ్యత ముఖ్యం. సొంత సమాజానికి చెందిన సాహిత్యాన్ని పిల్లలతో చదివించాలి. సృజనాత్మక రచనలు చేసేలా ప్రోత్సహించాలి.


వెనక్కి ...

మీ అభిప్రాయం