కథల కొలనులో స్వర్ణ కమలం

  • 65 Views
  • 0Likes
  • Like
  • Article Share

ప్రముఖ రచయిత, గేయకర్త కలువకొలను సదానంద 1939 ఫిబ్రవరి 22న చిత్తూరు జిల్లా పాకాల గ్రామంలో కృష్ణయ్య, నాగమ్మ దంపతులకు జన్మించారు. పద్దెనిమిదో ఏటనే తొలి కథ వెలువరించారు. ముప్పయి ఆరేళ్ల పాటు ఉపాధ్యాయునిగా సేవలందించారు. పాఠాలు చెబుతూనే బాల సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. రెండు వందలకి పైగా కథలు, వందకు పైగా గేయాలు రాశారు. ఎనిమిది కథా సంపుటాలు వెలువరించారు. పిల్లలను ఆకట్టుకునేలా రచన చేయడం సదానంద ప్రత్యేకత. కథ, నవల, గేయం, కవిత్వం లాంటి విభిన్న ప్రక్రియల్లో రచనలు చేశారు. ఈనాడు ‘హాయ్‌బుజ్జీ’ పేజీలో సదానంద కథలు ఎక్కువ ప్రచురితమయ్యాయి. తెలుగు కథా సాహిత్యంలో ‘వంద ఆణిముత్యాలు’ పేరిట వెలువడిన కథా సంకలనంలో ఈయన ‘తాతయ్య దిగిపోయిన బండి’ చోటు దక్కించుకుంది. ‘పరాగ భూమి, శివానందలహరి, అడవి తల్లి, రాణి గారి కాసుల పేరు, కుందేళ్ల మహాసభ, విందు భోజనం, సాంబయ్య గుర్రం, గాడిద బతుకులు, రంగురంగుల చీకటి, నీతి కథా మంజరి’ తదితరాలు సదానంద ఇతర రచనలు. పిల్లల కథలతో పాటూ సమకాలీన సమస్యలకు స్పందిస్తూ కథలు రాశారు. ‘రక్త యజ్ఞం, గందరగోళం, గాడిద బతుకులు’ లాంటి నవలలు రచించారు. మధ్య తరగతి ప్రజల జీవిత రేఖలను దృశ్యమానం చేస్తూ సదానంద రాసిన ‘పట్టెడు మెతుకులు, గాంధీ దర్శన్, అక్షర సత్యాలు’ లాంటి కథలు ‘కథా స్రవంతి’ పేరిట సంకలనంగా వెలువడ్డాయి. 1966లో ‘బంగారు నడిచిన బాట’కు రాష్ట్రపతి పురస్కారం, ‘నవ్వే పెదవులు- ఏడ్చే కళ్లు’ కథల సంపుటికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం హంస బహుమతి అందుకున్నారు. తెలుగు విశ్వవిద్యాలయం ధర్మనిధి పురస్కారాన్నీ స్వీకరించారు. ప్రగతిశీల భావాలతో.. సరికొత్త ఆలోచనా స్రవంతికి పాదుకొల్పుతూ, జీవితంలో సుదీర్ఘకాలం సాహితీ సృజనలోనే గడిపిన సదానంద ఈనెల 24న పాకాలలో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.


వెనక్కి ...

మీ అభిప్రాయం