అమ్మభాషలో చదువే అత్యుత్తమం

  • 340 Views
  • 6Likes
  • Like
  • Article Share

అమ్మభాషలో చదువే భవితకు వెలుగుబాట అని కె.కస్తూరి రంగన్‌ కమిటీ మరోసారి విస్పష్టం చేసింది. జాతీయ విద్యా విధానం మీద కేంద్ర ప్రభుత్వం నియమించిన ఈ కమిటీ ఈ మధ్యనే తన నివేదికను సమర్పించింది. అయితే, విద్యకు సంబంధించి గతంలో నియమించిన చాలా కమిటీలు మాతృభాషలో విద్యాబోధన ప్రాధాన్యాన్ని తెలియజెప్పాయి. 
మనిషి ప్రాథమిక జ్ఞానం సాధారణంగా అమ్మభాష భూమికగానే అందుతుంది. చిన్ననాటి నుంచి ఒళ్లో కూర్చోబెట్టుకుని అమ్మచెప్పే కథలు, వినిపించే పాటలు, ఇంట్లో పెద్దల మాటల్ని శిశువు జాగ్రత్తగా గమనిస్తూ పెరుగుతుంది. ఈ క్రమంలో ఏ విషయాన్ని అయినా సమగ్రంగా అవగాహన చేసుకోవడానికి అమ్మభాషే ఆలంబనగా నిలుస్తుంది. అందుకే మాతృభాషలోనే విద్యాబోధన సాగితే పిల్లలు అన్ని అంశాల్నీ సులువుగా అర్థం చేసుకోడానికి అవకాశం ఉంటుందని మానసిక నిపుణులు, భాషా శాస్త్రవేత్తలు మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. దీన్ని గుర్తిస్తూ గతంలో విద్యావిధానాలకి సంబంధించి నియమించిన చాలా కమిటీలు అమ్మభాషలోనే చదువు సాగాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పాయి. కేవలం పాఠశాల స్థాయిలోనే కాకుండా విశ్వవిద్యాలయ స్థాయికి మాతృభాషను తీసుకెళ్లాని సూచించాయి. 
మేటి అవగాహనా శక్తి
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నుంచి విద్యకు సంబంధించి పదిహేనుకు పైగా కమిటీలను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో మేధావి, తర్వాత కాలంలో రాష్ట్రపతి అయిన డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ నేతృత్వంలో ‘విశ్వవిద్యాలయ విద్యా కమిటీ’ని నియమించారు. 1948 డిసెంబరులో ఏర్పాటైన ఈ కమిటీ, 1949 ఆగస్టులో నివేదిక సమర్పించింది. విద్యా విధానంలో ప్రాంతీయ భాషాసాహిత్యాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని, భాష మనిషిలో అవగాహన నైపుణ్యాల్ని పెంచుతుందని ఈ కమిటీ సూచించింది.
       అమ్మభాషలో విద్య ఆవశ్యతకను రాధాకృష్ణన్‌ కమిటీ విశ్లేషణాత్మకంగా వివరించింది. జాతీయ సర్వీసులు, రాజకీయాల్లోకి అడుగుపెట్టడానికి కొంత మంది యువతకు ఉన్నత విద్య ప్రధాన ద్వారం. కానీ, చదువుకున్న చాలా మంది తమ ప్రాంతాల్లోనే ఏదో ఒక ఉపాధిలో చేరిపోతారు. అందువల్ల విద్య, ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణ కోణాల్లో చూస్తే చదువు ఆయా మాతృభాషల్లో ఉండటం అత్యావశ్యకమని ఈ కమిటీ పేర్కొంది. ప్రాంతీయ భాషా మాధ్యమంలో చదువుకోవడం వల్ల తమ సాహిత్యాన్ని సుసంపన్నం చేసుకోవడానికి, సాంస్కృతికి అభివృద్ధికి ఆస్కారం ఉంటుందని చెప్పింది. అమ్మభాషలో చదువుకున్న వారి అవగాహనా శక్తి ఉత్తమంగా ఉంటుందని, వారు తమ జ్ఞాన పరిధుల్ని దాటి పరిశోధనలు లాంటి వాటిలో రాణించే అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. అలాగే మాధ్యమిక విద్యలో సంస్కరణల కోసం మద్రాసు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు డాక్టర్‌ ఎ.లక్ష్మణస్వామి మొదలియార్‌ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ‘మాధ్యమిక విద్యా కమిషన్‌’ కూడా అమ్మభాషలో చదువు ప్రాధాన్యాన్ని తెలియజెప్పింది. 1952లో ఏర్పాటు చేయగా 53లో నివేదిక సమర్పించిన ఈ కమిషన్‌ సాధారణంగా మాధ్యమిక విద్య మొత్తం మాతృ లేదా ప్రాంతీయ భాషలో ఉండాలని, దీనికి సంబంధించి భాషాపరంగా మైనారిటీలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని సూచించింది. 
ఐఐటీ ప్రవేశ పరీక్షలూ... 
‘‘కేవలం విద్యా పరంగానే కాకుండా సాంస్కృతిక వికాసానికీ భారతీయ భాషలు, సాహిత్య అభివృద్ధి చాలా కీలకం. ఇది జరగకుంటే ప్రజల సృజనాత్మక శక్తులు వెలుగులోకి రావు. విద్యా ప్రమాణాలు అభివృద్ధి చెందవు, విజ్ఞానం ప్రజలందరికీ చేరదు. ఫలితంగా మేధావర్గం, జనసామాన్యం మధ్య అంతరం అలాగే ఉండిపోతుంది’’ అని చెబుతూ విద్యా విధానంలో భారీ మార్పులు సూచించింది కొఠారీ కమిషన్‌. విద్యకు సంబంధించి ఏర్పాటు చేసిన వాటిలో ఇదే చాలా ప్రధానమైంది. అన్ని స్థాయిల్లో విద్యా సంస్కరణల కోసం 1964లో విశ్వవిద్యాలయ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) అధ్యక్షుడు డాక్టర్‌ దౌలత్‌ సింగ్‌ కొఠారీ అధ్యక్షతన ఈ కమిషన్‌ ఏర్పాటు చేశారు. అన్ని స్థాయిల్లో మాతృభాషలో విద్యాబోధన జరగాలని చెప్పిన ఈ కమిషన్‌ 1966 జూన్‌లో తన నివేదికను సమర్పించింది. దీని సిఫారసులకు అనుగుణంగా 1968లో మొదటి జాతీయ విద్యా విధానం అమల్లోకి వచ్చింది. అమ్మభాషలో చదువుని పాఠశాల, కళాశాలల స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయికి తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకోవాలని కొఠారీ కమిషన్‌ సూచించింది. విదేశీ భాషల్లో విద్యాబోధన పిల్లల్ని బట్టీపట్టడం వైపు నడిపిస్తుందని పేర్కొంది. కేవలం పాఠశాల స్థాయిలోనే కాకుండా యూనివర్సిటీ స్థాయిలో ప్రాంతీయ భాషల్లో పుస్తకాలు తెచ్చేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించింది.
     విద్యార్థులు ఎంచుకున్న బోధనా మాధ్యమం వారు సులభంగా జ్ఞానం ఆర్జించేలా ఉండాలని; స్పష్టంగా, శక్తిమంతంగా ఆలోచించేలా చెయ్యగలగాలని... ఈ కోణాల్లో చూస్తే అమ్మభాషల ప్రాధాన్యం అత్యుత్తమమైందని కొఠారీ కమిషన్‌ స్పష్టం చేసింది. దేశాభివృద్ధికి, విద్యలో నాణ్యత పెంచడానికి ప్రాంతీయ భాషల అభివృద్ధి చాలా అవసరమని అభిప్రాయపడింది. అయితే దీని ఉద్దేశం ఆంగ్లంతో పాటు ఇతర ప్రపంచ భాషల పట్ల విముఖత కాదని, మన విద్యా విధానం మరింత ప్రభావశీలంగా మారినప్పుడు ప్రపంచ భాషల వల్ల మనకి మరింత లాభం చేకూరుతుందని వ్యాఖ్యానించింది. ముఖ్యంగా అమ్మభాషలో చదువుకున్నవారు ఉన్నత కొలువులకి దూరం కాకుండా ఉండేలా, వీలైనంత త్వరగా ఆయా ప్రాంతీయ భాషల్ని స్థానిక అధికారిక భాషలుగా చెయ్యడం అత్యవసరమంది. మొత్తంగా చూస్తే పాఠశాలలు, కళాశాలల స్థాయిలో మాతృభాషల్లో విద్యాబోధన అత్యుత్తమమైందని, అన్ని స్థాయిల్లో విద్యాబోధన ఒకే మాధ్యమంలో ఉండాలని, ఆ నేపథ్యంలో ఉన్నత విద్యలో కూడా అమ్మభాషలోనే విద్యాబోధన సాగాలని తెలిపింది. అమ్మభాషను విశ్వవిద్యాలయ స్థాయికి తీసుకెళ్లేందుకు యూజీసీ, విశ్వవిద్యాలయాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించింది. ప్రాంతీయ భాషల్లో పాఠ్య పుస్తకాలు, సాహిత్యం, ముఖ్యంగా శాస్త్ర, సాంకేతిక గ్రంథాలు వెలువరించడానికి గట్టి చర్యలు తీసుకోవాలంది. అలాగే గిరిజన ప్రాంతాల్లో పనిచేసే ఉపాధ్యాయులకు గిరిజన భాషలు, ఆ సంస్కృతిని మీద శిక్షణ ఇవ్వాలని, అత్యధిక గిరిజన జనాభా ఉన్న రాష్ట్రాల్లో గిరిజన ప్రాంతాల్లో పనిచేసే ఉపాధ్యాయులకు ఓరియంటేషన్‌ కోర్సులు నిర్వహించేందుకు ప్రత్యేక సంస్థలు ఏర్పాటు చేయాలని సూచించింది. ఐఐటీల్లో ప్రవేశ పరీక్షల్ని ఆంగ్లంతో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించాలని కొఠారీ కమిషన్‌ పేర్కొంది. 
అవి ఆవశ్యకం
కొఠారీ కమిషన్‌ తర్వాత ఇంటర్‌ స్థాయిలో వృత్తివిద్యా కోర్సులకు సంబంధించి 1978లో మద్రాసు విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు డాక్టర్‌ మాల్కం ఆదిశేషయ్య నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. విద్యా బోధన ప్రాంతీయ భాషల్లోనే ఉండాలని సూచిస్తూ అదే ఏడాది ఈ కమిటీ నివేదిక సమర్పించింది. అనంతరం విద్యకు సంబంధించి ప్రధానంగా చెప్పుకోవాల్సింది జాతీయ విద్యా విధానం 1986. తెలుగు తేజం పీవీ నరసింహారావు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రాజీవ్‌ గాంధీ హయంలో 1986 ఏప్రిల్‌లో కేంద్రం దీన్ని ఆమోదించింది. ఆ తర్వాత దీన్ని సమీక్షించేందుకు 1990లో ఆచార్య రామ్మూర్తి కమిటీని, 1992లో ఎన్‌.జనార్దన్‌రెడ్డి కమిటీని ఏర్పాటు చేశారు. వాటి సిఫారసుల ఆధారంగా 1986 జాతీయ విద్యా విధానానికి తగిన మార్పులు చేసి 1992లో సవరించిన కార్యాచరణ పథకాన్ని అమల్లోకి తెచ్చారు. ఈ విధానమే ఇప్పటి వరకూ అమల్లో ఉంది. 
     అయిదో తరగతి వరకు మాతృ లేదా ప్రాంతీయ భాషల్లో విద్యా బోధన ఉండాలని జాతీయ విద్యా విధానం 1986 సూచించింది. పాఠశాల స్థాయిలో ఇప్పటికే ప్రాంతీయ భాషలు బోధనా మాధ్యమంగా ఉన్నందున, విశ్వవిద్యాలయ స్థాయికి దీన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అన్ని స్థాయిల్లో, అన్ని సబ్జెక్టుల బోధనకు ప్రాంతీయ భాషల్ని మాధ్యమంగా ఎంచుకోవాలని, దీని కోసం రాష్ట్ర ప్రభుత్వాలు, యూనివర్సిటీల్ని సంప్రదించి చర్యలు తీసుకోవాలని సూచించింది. రానురాను విద్యార్థుల్లో భాషా నైపుణ్యాలు తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తంజేసిన ఈ విధానం, మేధా అభివృద్ధికి, సమగ్రంగా నేర్చుకోడానికి భాషా నైపుణ్యం చాలా అవసరమని చెప్పింది.
     నేషనల్‌ ఫ్రంట్‌ హయాంలో 1990లో రామ్మూర్తి కమిటీని ఏర్పాటు చేశారు. ఇది తన నివేదికను 1991 జనవరిలో సమర్పించింది. ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో విద్యాబోధనని సార్వజనీనం చెయ్యాలని, మాధ్యమిక స్థాయిలో ప్రాంతీయ భాషల్లో బోధనని ప్రోత్సహించాలని ఈ కమిటీ సూచించింది. నిర్ణీత కాలాన్ని నిర్దేశించుకుని ఉన్నత స్థాయితో సహా అన్ని స్థాయిల్లో మాతృభాషలో విద్యాబోధనను క్రమక్రమంగా విస్తరించాలని, భాషా ఉపాధ్యాయుల శిక్షణను పటిష్టం చెయ్యాలని పేర్కొంది. అమ్మభాషలో చదువు చెప్పని పాఠశాలలకు రాష్ట్ర సాయాన్ని నిలిపేయాలని సూచించింది. ఆ తర్వాత ఎన్‌.జనార్దన్‌ రెడ్డి కమిటీ రామ్మూర్తి కమిటీకి సంబంధించి చాలా అంశాలతో ఏకీభవించింది. పదేళ్లలోపు దశలవారీగా విశ్వవిద్యాలయ స్థాయిలో ప్రాంతీయ భాషల్లో బోధనని ప్రవేశపెట్టాలని సూచించింది. 
అమ్మభాషతోనే మేలు
కస్తూరి రంగన్‌ కమిటీకి ముందు నూతన విద్యా విధానానికి సంబంధించి టీఎస్‌ఆర్‌ సుబ్రమణియన్‌ నేతృత్వంలో జాతీయ విద్యా విధానం 2016 కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. రాజ్యాంగంలోని అధికరణం 29(1) ప్రకారం మాతృభాష అధ్యయనం, పరిరక్షణ వ్యక్తి ప్రాథమిక హక్కు అని ఈ కమిటీ గుర్తుచేసింది. భాషకు సంబంధించిన ప్రాథమిక భావనలు, మౌలిక గణితాన్ని విద్యార్థి ప్రాథమిక తరగతుల్లోనే నేర్చుకుంటాడు. ఒకవేళ ఈ దశలో సరిగా నేర్చుకోకుంటే తర్వాత విద్యార్థి మీద ఒత్తిడి, ఆందోళన పెరుగుతాయి. దాని వల్ల పిల్లాడు పాఠశాలను ద్వేషించే అవకాశమూ లేకపోలేదు, మరోవైపు తెలివైన విద్యార్థులకు కూడా ఇది ప్రతిబంధకమే. ఇది మొత్తం తరగతి మీద ప్రభావం చూపిస్తుందని కమిటీ పేర్కొంది. ఈ నేపథ్యంలో పాఠశాల చదువు మొత్తం అమ్మభాషలో ఉంటే మేలని, కనీసం అయిదో తరగతి వరకు ప్రాంతీయ భాషలో విద్యాబోధన ఉండాలని తేల్చి చెప్పింది. అలాగే అందరికీ నాణ్యమైన విద్యను అందించడం ద్వారా మన దేశాన్ని సుస్థిర, శక్తిమంతమైన జ్ఞాన సమాజంగా మార్చేలా జాతీయ విద్యా విధానాన్ని రూపొందించడానికి ఇస్రో మాజీ అధ్యక్షులు కె.కస్తూరి రంగన్‌ ఆధ్వర్యంలో 2019లో కమిటీని నియమించారు. అయిదో తరగతి వరకు ప్రాథమిక విద్యను మాతృభాషలోనే బోధించాలని, వీలైతే ఎనిమిది, ఆపై తరగతుల్లో కూడా అమ్మభాషలోనే బోధన ఉండటం ఉత్తమమని ఈ కమిటీ చెప్పింది. ఇంకా ఉన్నత విద్యలో కూడా మాతృ, భారతీయ భాషలను ప్రోత్సహించాలని సూచించింది. ఏ భాషనూ విద్యార్థి మీద బలవంతంగా రుద్దకూడదని సూచించింది. 
     నాటి నుంచి స్వయంగా ప్రభుత్వాలే నియమించిన కమిటీలు, ఎందరో మేధావులు అమ్మభాష ప్రాధాన్యాన్ని వివరించి చెబుతున్నా పాలకులకు చొరవ కరువవుతూనే ఉంది. ఫలితంగా, చదువుల్లో మాతృభాష నిర్లక్ష్యానికి గురవుతూ వస్తోంది. ఇక మీదట అయినా వారు వాస్తవాలు గుర్తించి విద్యలో అమ్మపలుకుకి పట్టం కట్టాలి. అప్పుడే మన విద్యా వ్యవస్థ పటిష్టమవుతుంది. విజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతుంది.


స్వాతంత్య్రం వచ్చిన తర్వాతి నుంచి ఏర్పాటు చేసిన ప్రధాన విద్యా కమిటీలు, కమిషన్లు
* రాధాకృష్ణన్‌ కమిషన్‌ (విశ్వవిద్యాలయ కమిషన్‌) - 1948 - 49
* మొదలియార్‌ కమిషన్‌ (సెకండరీ విద్యా కమిషన్‌) - 1952 - 53
* కొఠారి కమిషన్‌ - 1964 - 66
* జాతీయ విద్యావిధానం 1986
* ఆచార్య రామ్మూర్తి కమిటీ 1990
* ఎన్‌.జనార్దన్‌రెడ్డి కమిటీ - 1992
* టీఎస్‌ఆర్‌ సుబ్రమణియన్‌ కమిటీ (జాతీయ విద్యావిధానం 2016)
* కస్తూరి రంగన్‌ కమిటీ (జాతీయ విద్యావిధానం 2019)


‘‘విదేశీభాషలను నేర్చుకోవాలంటే ముందు నీ మాతృభాషను స్పష్టంగా నేర్చుకునుండాలి’’ - గోథే


వెనక్కి ...

మీ అభిప్రాయం