పరభాషతో ప్రమాదమే!

  • 295 Views
  • 3Likes
  • Like
  • Article Share

ఆంగ్ల మాధ్యమంలో చదువుల వల్ల అంతా మేలే అని చెప్పేవాళ్లు చాలామంది ఉన్నారు! పరభాషలోనైనా సరే, పసివాళ్లు ఏ ఇబ్బందీ లేకుండా చదువుకుంటారని వాళ్లు నమ్మబలుకుతున్నారు. వారి వాదనల్లో వాస్తవముందా అంటే లేదు అంటున్నారు అపార అనుభవజ్ఞులైన ఛైల్డ్‌ సైకాలజిస్ట్‌ డా।। చిట్టి విష్ణుప్రియ. పరాయిభాషలో విద్యాబోధన వల్ల చిన్నారుల సహజ నైపుణ్యాలు దెబ్బతింటాయంటూ ఈ విషయానికి సంబంధించి ఆవిడ ‘తెలుగువెలుగు’తో పంచుకున్న అభిప్రాయాలివి..
గర్భస్థ
శిశువుగా ఉన్నప్పుడే మానసికంగా బిడ్డకు అమ్మభాషతో అనుబంధం ఏర్పడుతుంది. బిడ్డ పొత్తిళ్లలోకి చేరగానే తన చుట్టూ ఉండే వాతావరణంలో మాట్లాడే భాషను వింటూనే ఎదుగుతాడు. రోజువారి క్రమంలో నేర్చుకునే అలవాట్లు, వ్యక్తిత్వం పిల్లలకు అమ్మభాషనుంచే అందుతాయి. దాంతో వారు మాతృభాషకు స్పందించడం మొదలుపెడతారు. ఎదుటి వ్యక్తి భావోద్వేగాలను కూడా అమ్మభాష సాయంతోనే అర్థంచేసుకోవడం నేర్చుకుం టారు. అయితే మన దేశంలో తల్లిదండ్రు లకు ఆంగ్లం మీద ఉన్న మోజుతో పిల్లల బుద్ధి పూర్తిగా వికసించక ముందే ఆంగ్లమాధ్యమ పాఠశాలల్లో చేరుస్తున్నారు. ఇది ఎలాంటిదంటే విత్తు నుంచి అప్పుడే మొలకెత్తిన మొక్కను తవ్వితీసి మరోచోట పాతడంలాంటిది. ఇలా చేస్తే దాని ఎదుగుదల కుంటుపడుతుంది.
      ఆంగ్లమాధ్యమంలో పిల్లల జ్ఞాన సముపార్జన అటుంచి ఉపాధ్యాయుడికి, విద్యార్థులకు మధ్య సమన్వయం లోపిస్తుంది. విద్యార్థి పాఠంలోని తన సందేహాలను నివృత్తి చేసుకోవడాన్ని పక్కనపెట్టి ఆ కొత్తభాషలో ప్రశ్నించడానికే ఇబ్బందిపడతాడు. దీని వల్ల వారిలో ప్రశ్నించే గుణం తగ్గుతుంది. అర్థంకాని విషయాలను నివృత్తి చేసే తల్లితండ్రులు లేని పక్షంలో పిల్లలు ఇక పాఠాలను కంఠస్థం చేస్తారు. అలా చేయలేని విద్యార్థులకు విద్య మీద ఆసక్తి తగ్గిపోయి చదువులో వెనకపడుతుం టారు. ఇలాంటి విద్యార్థులు.. పాఠాలు అర్థం కాకపోవడం తమలోని లోపమనుకుని అపరాధభావానికి లోనవుతారు. దాంతో 12- 13 ఏళ్ల వయసులోపు వారిలో జరగాల్సిన మానసిక అభివృద్ధి దెబ్బతింటుంది.
      మన దేశంలో ఆంగ్లం మీద పూర్తి పట్టు ఉన్న ఉపాధ్యాయులు చాలా తక్కువ. వచ్చీరాని ఆంగ్లంలో బోధిస్తూ వారు పిల్లలకు న్యాయం చేయలేక పోతు న్నారు. ఈ ఉపాధ్యాయులు పాఠాలకు తగిన కథలను ఉదహరిస్తూ చక్కగా అర్థమయ్యేలా పాఠం చెప్పే అవకాశం చాలా తక్కువ. దీంతో పిల్లల్లో నైతిక, సాంఘిక అభివృద్ధి లోపిస్తుంది. దాని కారణంగా పిల్లల్లో నేరప్రవృత్తి పెరుగు తుంది. విద్యార్థులు తాము ఇంట్లో మాట్లాడే భాషలో విద్యను అభ్యసించిన ప్పుడు పాఠాలను త్వరగా, స్పష్టంగా నేర్చుకుంటారు. పిల్లలు తోటి విద్యార్థులతో మాట్లాడుకోవటం ద్వారానే కనీసం ముప్పై శాతం విద్యనభ్యసిస్తారు. కానీ మాధ్యమం ఆంగ్లం కావడంతో ఆ మార్గంలో రావాల్సిన జ్ఞానాన్ని వారు అందుకోలేరు. ఇలా తన చుట్టూ ఉండే వనరులను విద్యార్థి పూర్తిగా వినియోగించుకోలేకపోతాడు. పైగా మన సమాజంలో పిల్లలకు ఆంగ్ల విద్యలో సందేహాలు తీర్చగల తల్లిదండ్రులు చాలా తక్కువ. అలా చిన్నారులకు ఏవిధంగానూ సరైన విద్య అందట్లేదు.
చాలా బాధేసింది!
ఒక పాఠశాలలో విద్యార్థులను కలిసినప్పుడు ఓ చిన్న పరిశోధన చేశాను. మనం మామూలుగా చెప్పుకునే ‘పుణ్యకోటి’ కథను రెండు తరగతుల్లో తెలుగు, ఆంగ్ల భాషల్లో చెప్పాను. విన్న విద్యార్థుల్లో ప్రతిస్పందనలు చాలా భిన్నంగా ఉండి ఆశ్చర్యానికి గురిచేశాయి. తెలుగు మాధ్యమం విద్యార్థులు స్పందించినట్టుగా ఆంగ్లమాధ్యమం పిల్లలు స్పందించలేకపోయారు. కథకు శీర్షిక పెట్టమన్నప్పడు తెలుగు మాధ్యమం విద్యార్థులు పోటీపడి మరీ ఎంతో చక్కటి కవితాత్మక శీర్షికలు పెట్టారు. ఆంగ్లమాధ్యమంలో చదువుతున్న వాళ్లలో చాలామందికి కథ సరిగ్గా అర్థకాక సందేహాలు అడిగారు. వారు పెట్టిన శీర్షికల్లో సృజనాత్మకత లోపించింది. ఇదే కథ మీద బొమ్మలు గీయమన్నప్పుడు కూడా అవే ఫలితాలు వచ్చాయి. కథకు సంబంధించిన ప్రశ్నలు వేసినప్పుడు ఆంగ్ల మాధ్యమంలోని పిల్లలు చాలామంది తలదించుకోవడం చాలా బాధకు గురి చేసింది. వాళ్లలో అందరూ తెలివైన పిల్లలే కానీ భాష అర్థంకాకపోవ డంతో సమాధానం చెప్పలేకపోయారు. పిల్లలపై బలవంతంగా విదేశీ భాష రుద్ది, వారు ఆత్మన్యూనత, అపరాధభావా లకు లోనయ్యే పరిస్థితి కల్పిస్తోంది మనమే! తల్లితండ్రులూ మార్కులు రాలేదని, ఆంగ్లం రాలేదని పిల్లలని కసురుకుంటుంటారు కానీ విషయం అర్థం చేసుకోరు. సున్నితమైన వయసులో కలిగే ఇలాంటి అవమానాలు వారిని జీవితాంతం వెంటాడతాయి.
నైపుణ్యాలు అలవడతాయి
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త జాతీయ విద్యావిధానంలో ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో విద్యాబోధనకు ప్రాధాన్యమివ్వడం ఆహ్వానించదగింది. ఎందుకంటే కనీసం పదేళ్ల వయసు వరకు పిల్లలు మాతృభాషలో విద్యాభ్యాసం చేస్తే అప్పటికి వారు అన్ని సబ్జెక్టుల్లో కనీస మూలాలు నేర్చుకుంటారు. అంతేకాకుండా ప్రశ్నించే గుణం, భావప్రకటన, చేసిన తప్పులను సరిదిద్దుకోగలిగే అవగాహన, నేర్చుకోవడానికి నేర్చుకోవలసిన నైపుణ్యాలు (లెర్న్‌ టు లెర్న్‌ స్కిల్స్‌.. డిక్షనరీ చూడటం, అంతర్జాలంలో సమాచారం కోసం అన్వేషించడం లాంటివి) అలవడతాయి. ముఖ్యంగా తెలిసిన విషయం గురించే చదువుతున్నాననే ధైర్యం వస్తుంది. రెక్కలు వచ్చిన తర్వాత పక్షి ఎంత దూరమైనా హాయిగా ఎగురుతూ పోయినట్టు వారు తర్వాత ఏ భాషలోనైనా చదువుకోవడానికి సిద్ధమవుతారు. అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలో కూడా విద్య మాతృభాషలోనే ఉంటుంది. ముఖ్యంగా మనం గొప్ప వక్తలను చూస్తే వారంతా కనీసం పాఠశాల విద్య వరకు అమ్మభాషలోనే చదువుకున్న వాళ్లే. మాతృ భాష చక్కగా వస్తే శబ్దాలను స్పష్టంగా పలకడం, మంచి పదాలను వాడగలిగే నైపుణ్యం అలవడతాయి. ఇప్పుడు ఏ రంగంలోనైనా విజయం సాధించడానికి ఈ భావప్రకటనా నైపుణ్యాలే కదా కీలకం. మనం మన పిల్లలకు అర్థంకాని భాషను ముందుపెట్టి వారి సొంత సామర్థ్యాలు బయటపడకుండా అడ్డుకుంటున్నాం. చిన్నారులు ఆడుతూ పాడుతూ హాయిగా విద్యాభ్యాసం చేయాలి. అప్పుడే వారిలో వ్యక్తిత్వ, సామాజిక, కుటుంబ వికాసాలు చక్కగా జరుగుతాయి. తెలివితేటలు ఇనుమడిస్తాయి. అప్పుడేవారి జీవితంలో ఎదురయ్యే సమస్యలను వారు ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. కాబట్టి మాతృభాషా మాధ్యమంలో విద్యనభ్యసించ డమే ఎప్పటికైనా ఉత్తమం.


డా।। చిట్టి విష్ణుప్రియ ‘నో యువర్‌ చైల్డ్‌’ అనే పుస్తకాన్ని ఆంగ్ల, తెలుగు, భాషల్లో రచించారు. వేలమంది తల్లితండ్రులకు, విద్యాభ్యాసంలో వెనబడిన పిల్లలకు కౌన్సిలింగ్‌ ఇచ్చారు. ఇరవై ఏళ్లుగా అనేక పాఠశాలలు, కళాశాలల్లో విద్యాబోధన మీద వర్క్‌షాపులు నిర్వహించారు. 

( డా।। విష్ణుప్రియ-  93987 62880)


వెనక్కి ...

మీ అభిప్రాయం