మనభాష మనకుండాలి!

  • 75 Views
  • 0Likes
  • Like
  • Article Share

భారతీయుల సామూహిక అభివృద్ధి భారతీయ భాషల ద్వారానే జరుగుతుంది. విదేశీ భాషల ద్వారా కాదు. బ్రిటిష్‌ ఇండియాలో దురదృష్టవశాత్తూ ఓ కొత్త కులం పుట్టుకువచ్చింది. అదే... ఆంగ్లం తెలిసిన వర్గం. నాటి పరిస్థితుల్లో విద్య కొందరికే పరిమితమైంది. విద్యావ్యాప్తి విస్తృతమవుతున్న ఈ దశలో ఆంగ్లం ఇంకెంత మాత్రమూ బోధనా మాధ్యమంగా ఉండబోదు. కచ్చితంగా హిందీ/ ప్రాంతీయ భాషలే మాధ్యమాలవుతాయి. అలా ఎదిగి వచ్చిన తరాలతోనే సమతులాభివృద్ధి సాధ్యమవుతుంది. అయితే మన శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధికి మాత్రం ఆంగ్లం లేదా ఏదైనా విదేశీ భాషా పరిజ్ఞానం అవసరం. 
      ఆంగ్లం విషయంలో నెహ్రూకు స్పష్టమైన ఆలోచనలు ఉండేవి. ఆ భాషను పూర్తిగా విస్మరించమని ఆయన ఏనాడూ సూచించలేదు. ‘‘ఆంగ్లాన్ని పాఠశాలల్లో రెండో, మూడో భాషగా నేర్పాలి. ఆ భాషను నేర్చుకోవడంలో రెండు పద్ధతులు ఉన్నాయి. పూర్తిస్థాయి జ్ఞానాన్ని సంపాదించడం. ఆ భాషలోని విజ్ఞానాన్ని అందిపుచ్చుకోగల నైపుణ్యాలను సొంతం చేసుకోవడం. అంటే ఆంగ్ల భాషలోని పుస్తకాలు, పత్రికలను సొంతంగా చదివి అర్థం చేసుకునే స్థాయి చాలు... అనర్గళంగా మాట్లాడటం రాకపోయినా ఫర్వాలేదు. పాఠశాలలో ఆంగ్ల ప్రాథమిక పరిజ్ఞానం నేర్పితే చాలు, ఆ భాషా పుస్తకాలను చదివి అర్థం చేసుకోవడానికి. తర్వాత ఇష్టం ఉన్నవాళ్లు ఆంగ్లాన్ని పూర్తిస్థాయిలో నేర్చుకుంటార’’ని ఓ సందర్భంలో చెప్పారు. పాఠశాలల్లో విజ్ఞాన శాస్త్ర బోధన కూడా హిందీ/ ప్రాంతీయ భాషల్లోనే జరగాలన్నది ఆయన అభిమతం. ‘‘కావాలంటే కళాశాల స్థాయిలో ఆంగ్లంలో బోధించవచ్చు... నిజానికి అప్పుడు కూడా ఆంగ్లం అవసరం పెద్దగా ఉండదు. విజ్ఞానశాస్త్ర సాహిత్యంతో విస్తృత అనుబంధాన్ని ఏర్పరుచుకోవాలనుకునే వారికి మాత్రమే అది అవసరం’’ అన్నది నెహ్రూ విశ్వాసం. ఇది వాస్తవం కూడా! 
      మనం ఎలాంటి దేశాన్ని, సమాజాన్ని నిర్మించాలని ఆశిస్తున్నామో దానికి అనుగుణంగానే విద్యను అందించాలి. మనవాళ్లను ఆ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుకోవాలి. నిజమైన విద్య... విద్యార్థి పుట్టిపెరిగిన వాతావరణం మీద ఆధారపడి ఉండాలి. ఇక వ్యక్తిత్వ నిర్మాణంలో సాంస్కృతిక విద్యదీ కీలకపాత్రే. కాబట్టి చదువులో సాహిత్యం, కళలు, సామాజిక శాస్త్రాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. విద్యాప్రణాళికలు విజయవంతం కావాలంటే ప్రాంతీయ భాషలను బోధన మాధ్యమాలుగా వినియోగించాలి.
      మహాత్ముడు మాకు నేర్పిన విషయం ఒకటే. ఆంగ్ల భాష గొప్పదైతే కావచ్చు... కానీ, విదేశీ భాషా పునాదుల మీద ఏ దేశమూ సమున్నతంగా ఎదగలేదు. విదేశీ భాష ఎప్పటికీ మన ప్రజలభాష కాలేదు. కానీ, అది మనలోనే... ఆ విదేశీ భాషలోనే ఆలోచిస్తూ అందులోనే బతికేవాళ్లు, దానితో సంబంధం లేకుండా మరో ప్రపంచంలో జీవించే వాళ్లనే రెండు వర్గాలుగా మనల్ని విభజిస్తుంది. కాబట్టి, కచ్చితంగా మనం సొంతభాషలోనే ఇంకా ఎక్కువగా పనిచేయాలని, కార్యకలాపాలు నిర్వహించుకోవాలని గాంధీజీ చెప్పేవారు. ఆయన చెప్పిన ఇంకో విషయం... ప్రభుత్వ భాష కచ్చితంగా ప్రజల భాష అయి ఉండాలి తప్ప ఏ కొద్దిమంది మేధావి వర్గానికో పరిమితమైంది కాకూడదు. చివరగా... భారతదేశ మిశ్రమ సంస్కృతికి అద్దంపట్టే భాషే మనకు కావాలి. ఆక్రమణదారుల భాష అయినందువల్లే ఆంగ్లం మన దగ్గరికి వచ్చింది తప్ప, అదేదో చాలా ముఖ్యమైన భాష కాబట్టి దానికి మనం దగ్గరవలేదు. ఆంగ్లం మంచిది, అవసరమైందన్న వాదనలను పక్కనపెడితే... మన సమాజంలో ఆంగ్లం తెలిసిన వర్గాలు ఒకవైపు, ఆ భాష రాని కోట్లాది సామాన్యులు ఒకవైపు అన్న విభజనను ఇక మనమెంత మాత్రమూ సహించలేం. మన భాష మనకు ఉండాల్సిందే.  

- ప్రథమ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ వివిధ సందర్భాల్లో చెప్పిన విషయాలివి.. 


వెనక్కి ...

మీ అభిప్రాయం